కేసీఆర్‌ను గుత్తా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? పదవీ కోసమే లీకులా?
posted on Oct 4, 2021 @ 4:05PM
గుత్తా సుఖేందర్‌రెడ్డి. మూడుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, మరోసారి ఎమ్మెల్సీ. శాసన మండలి మాజీ ఛైర్మన్. గతమెంతో ఘనమైన ఆయన ప్రస్తుతం మాత్రం ఖాళీ. ఇన్నేళ్లూ పదవులు అనుభవించిన నేత కావడంతో.. ఇప్పుడు ఎలాంటి పదవీ లేకుండా ఉండటం ఆయన వల్ల కావడం లేదంటున్నారు. కేసీఆర్ తనను పక్కన పెట్టేశారని తెగ రగిలిపోతున్నారట. ఇంత సీనియర్ మోస్ట్ లీడర్‌నైన తనకు ఎలాంటి కుర్చీ వేయకుండా.. ఇలా ఖాళీగా కూర్చోబెడతారా అని ఆయన ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం ముగిసి చాలా రోజులైనా మళ్లీ పునర్నియామకంపై కేసీఆర్ నుంచి ఎలాంటి హామీ లేదు. ఇక, రెండు దశాబ్దాలుగా గుత్తా కుటుంబం చేతుల్లో ఉన్న నార్మాక్స్ డైయిరీకి కొత్త చైర్మెన్ ను నియమించడంతో ఆయన తీవ్ర స్థాయిలో కలత చెందారు. అందుకే, త్వరలోనే గుత్తా.. టీఆర్ఎస్‌ను వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నాయకుల కోసమే రెడీగా ఉండే బీజేపీ.. ఆయనతో టచ్‌లో ఉందని అంటున్నారు. రేపో-మాపో-ఎల్లుండో గుత్తా కాషాయం గూటికి చేరడం ఖాయమని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే చర్చ. గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ.
వరుస కథనాలతో లేటుగానైనా లేటెస్టుగా స్పందించారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అబద్ధమని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలెవరు తనతో చర్చలు జరపలేదన్నారు. పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. సరిగ్గా.. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్‌లో ఉనికి లేకుండా పోయిందనే భయంతో గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు.. తానే లీకులు ఇచ్చి, తానే ఖండించు కుంటున్నారని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా నల్గొండ జిల్లాలో పాల ఉత్పత్తి దారుల సంఘాన్ని, రైతులను నిలువునా ముంచి.. మదర్ డైరీని అప్పుల ఊబిలో దించిన గుత్తా సోదరులకు జిల్లాలో ఉనికి లేకుండా పోయిందని విమర్శించారు. గుత్తా సోదరుల అవినీతి, అక్రమాలకు విసిగిపోయి, ఎన్నికల్లో వారిని పక్కకు పెట్టారని.. ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో పాటు రాజకీయాల్లో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భవిష్యత్తులోనైనా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారో లేదో అనే భయంతోనే ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు గుత్తా దిగుతున్నారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ.