సీపీఎస్ ర‌ద్దు చేయాల్సిందే.. సీఎం జ‌గ‌న్‌కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం

అదిగో పీఆర్సీ. ఇదిగో పీఆర్సీ. ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం. ఇలా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌భుత్వ ఉద్యోగుల ఫోక‌స్ మొత్తం పీఆర్సీ చుట్టూనే తిరిగేలా చేస్తోంది. అయితే, స‌ర్కారు ట్రాప్‌కి ఉద్యోగ సంఘాలు అంత ఈజీగా చిక్కేలా లేవు. పీఆర్సీ ప్ర‌క‌టించినంత మాత్రాన స‌మ‌స్య‌ల‌న్నీ తీర్చేసిన‌ట్టు కాదంటున్నారు. త‌మ డిమాండ్లు అన్నిటినీ నెర‌వేర్చే వ‌ర‌కూ ఉద్య‌మాన్ని విర‌మించే ప్ర‌స‌క్తే లేదంటున్నారు. సీపీఎస్ ర‌ద్దు చేస్తాన‌నే హామీతో అంద‌ల‌మెక్కిన జ‌గ‌న్‌రెడ్డి.. ఇచ్చిన హామీని నెర‌వేర్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.  సీపీఎస్‌ రద్దు బాధ్యత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీపీఎస్‌ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదన్నారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావులు ఆ మేర‌కు ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.  "ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలి. పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్‌సీ ప్రకటించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు  జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి. పీఆర్‌సీతో పాటు నాన్‌ ఫైనాన్షియల్‌ డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా సీఎం జగన్‌ చొరవ తీసుకోవాలి." అంటూ ఉద్యోగ సంఘాలు త‌మ డిమాండ్లు మ‌రోసారి వినిపించాయి.  "పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదు. రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పటివకే ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతాం. సీఎంపై ఉన్న గౌరవంతో మూడేళ్లు ఎదురుచూశాం. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదు. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలి" అని పిలుపునిచ్చాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. 

చంద్ర‌బాబు ఓఎస్డీ ఇంట్లో సీఐడీ సోదాలు.. రిటైర్డ్ ఐఏఎస్‌పై ఓవ‌రాక్ష‌న్‌..

ఆప‌రేష‌న్ చంద్ర‌బాబు. వైసీపీ ప్ర‌భుత్వ మెయిన్ టార్గెట్ ఇదే. చంద్ర‌బాబుతో స‌హా ఆయ‌న వెన్నంటే ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిపై ఏదో ఒక‌ర‌కంగా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌ ఉంది. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ల వ‌ర‌కూ.. కీల‌క‌ టీడీపీ నేత‌లంద‌రినీ ఏదో ఒక కేసులో ఇరికించేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీ నేత‌ల‌తో పాటు.. చంద్ర‌బాబు హ‌యాం నాటి అధికారుల‌నూ వైసీపీ ప్ర‌భుత్వం వ‌ద‌ల‌డం లేదంటున్నారు. సీఐడీని ముందుంచి.. తెర వెనుక పొలిటిక‌ల్ గేమ్ న‌డిపిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.  గ‌తంలో అప్ప‌టి ఐబీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును బాగా ఇబ్బందుల పాలు చేసిన జ‌గ‌న్ స‌ర్కారు.. తాజాగా, చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా ప‌ని చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ‌పై ఫోక‌స్ పెట్టారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్‌ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయ‌న‌పై సీఐడీ కేసులు న‌మోదు చేసింది. హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంట్లో సోదాలు నిర్వ‌హించింది.  అయితే, త‌నిఖీల్లో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ ఇంటి ద‌గ్గ‌ర‌ ఏపీ సీఐడీ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా లక్ష్మీనారాయణ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో పని మనుషులతో దురుసుగా  ప్రవర్తించారు. నోటీస్ ఇవ్వకుండా సెర్చ్ ఎలా చేస్తారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలీసులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.  లక్ష్మీనారాయణకు మ‌ద్ద‌తుగా టీటీడీపీ నాయకులు త‌ర‌లివ‌చ్చారు. టీటీడీపీ నేత‌ల ఎంట్రీతో సీఐడీ అధికారులు వెనక్కి తగ్గారు. అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చేందుకు సీఐడీ పోలీసులు ప్రయత్నించారు. సోదాలు ముగించి పంచనామా ప్రక్రియ చేపట్టారు. సోదాల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మ‌రోవైపు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్నారు. 2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు. సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. సిమెన్స్‌ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్‌ మేనేజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ చెప్పార‌ని స‌మాచారం. సిమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని లక్ష్మీనారాయణ తెలిపారు. మ‌రోవైపు, సీఐడీ విచార‌ణ‌లో ల‌క్ష్మీనారాయ‌ణ క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. ఆయ‌న్ను ఆసుపత్రికి త‌ర‌లించేందుకు మొద‌ట సీఐడీ అధికారులు నిరాక‌రించారు. అయితే, ల‌క్ష్మీనారాయ‌ణ‌కు రెండు సార్లు స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని చెప్ప‌డంతో.. బీపీ కూడా మార‌డంతో.. సీఐడీ సిబ్బంది ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

వరి కాదు ఉరి.. మరో రైతు బలి..

తెలంగాణలో వరి పంట పుష్కలంగా పండిది. కానీ, ఇప్పుడు అదే రైతుల పాలిట ఉరి తాడుగా మారింది. పండిన పంటను కొనే నాధుడు లేక రైతు ఉరి స్తభం వైపు చూస్తున్నారు. ఓ వంక కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత వర్షకాలం పంట చివరి గింజ వరకు కొంటామని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, అదే అంటోంది. చివరి గింజ వరకు కొంటామని అంటోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలలో కాటా, కదలడం లేదు. ధాన్యం తరగడం లేదు. ఎండకు ఎండకు ఎండి వానకు తడిసి వడ్లు పాడై పోతోంది. మొలకెత్తుతోంది.   మరోవంక‌ రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఒకటి రెండు రోజులు కాదు, నెల రోజులకు పైగా  ఐకేసీ సెంటర్ల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. తీరా అక్కడ అమ్ముకున్నా తరుగు కింద కిలోల లెక్కన కోత. ఈ వరుస దెబ్బలతో వరి రైతు అల్లాడిపోతున్నాడు. పంట వేసిన పాపానికి కౌలు చెల్లించలేక.. అప్పులు పేరుకుపోయి అన్నదాత ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న కామారెడ్డి జిల్లాలో ఓ బీరయ్య.. నిన్న జగిత్యాల జిల్లాలో ఐలయ్య ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులు కాసి గుండెపగిలి చనిపోయారు. ఈరోజు మెదక్ జిల్లాలో మరో వరి రైతు నేలకొరిగాడు. పంట దిగుబడి రాక.. అమ్ముదామంటే గిట్టుబాటు ధరలేక ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యను ఆశ్రయించాడు. పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. నేనేమి చేయగలను సారు అంటూ అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. హవేలీ ఘన్‌పూర్ మండలం బోగడ భూపతిపూర్‌కి చెందిన రైతు రవికుమార్(50) ఆత్మహత్య చేసుకున్నారు. పంట దిగుబడి రాక.. గిట్టుబాటు ధరలేక అప్పుల బాధలో కూరుకుపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రవికుమార్ రాసిన సూసైడ్ లెటర్ కన్నీరు పెట్టిస్తోంది. రైతుల దీనస్థితిని కళ్లకు కడుతోంది. అన్నదాత ఆక్రందనను వర్ణిస్తోంది. సీఎం కేసీఆర్ గారికి అంటూ రవికుమార్ సూసైడ్ లెటర్‌ రాశారు. వర్షాకాలం సన్నరకం వేయమంటేనే వేశానని.. మొత్తం సన్నరకమే సాగుచేశానని రవికుమార్ లేఖలో తెలిపారు. దిగుబడి తక్కువ వచ్చిందని.. మొదలు ధర లేదని ఆయన వాపోయారు. నా పొలం మొత్తం వరిసాగే అవుతది నేనేం చేయగలను అంటూ రవికుమార్ రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది. 

రావ‌త్ హెలికాప్టర్‌ ప్రమాదంపై వాయుసేన ప్రకటన..

సైనిక హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిపోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందులోనూ, ఆ ప్ర‌మాదంలో సీడీఎస్ బిపిన్ రావ‌త్ చ‌నిపోవ‌డం మ‌రింత సంచ‌ల‌నం. పొగ‌మంచు వ‌ల్లే హెలికాప్ట‌ర్ క్రాష్ అయింద‌ని కొంద‌రు అంటున్నారు. ప్ర‌మాదంపై అనుమానం ఉంది.. సుప్రీంకోర్టు జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అంటున్నారు. ఇలా త‌మిళ‌నాడులో బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న‌ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై తాజాగా  భారత వైమానిక దళం స్పందించింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది.   ‘డిసెంబర్ 8, 2021న జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను శోధిస్తున్నాం. అందుకోసం వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్టు ఆఫ్ ఎక్వైరీ వేసింది. ఈ విచారణ త్వరితగతిన పూర్తవుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటివరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను కాపాడాలి. ఎటువంటి సమాచారం లేని ఊహానాగాలకు దూరంగా ఉండాలి’ అని వైమానిక దళం విజ్ఞప్తి చేసింది.   హెలికాఫ్టర్ ఘటనపై త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయని గురువారం పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొన‌సాగుతోంది. ఘటనా స్థలం నుంచి అధికారులు బ్లాక్‌ బాక్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌త్య‌క్ష సాక్షుల‌నూ ప్ర‌శ్నించ‌నున్నారు. సైన్యం త‌ర‌ఫున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ ఎలాంటి ఊహాగానాలు చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 

కుప్పం నుంచి ప్రక్షాళన.. చంద్రన్న యుద్ద తంత్రం..

యుద్ధంలో గెలుపు కాదు, ఓటమి ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. ఎక్కడ పోగుట్టుకున్నావో అక్కడే వెతుక్కోమంటుంది.ఆంధ్ర ప్రదేశ్’లో తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అదే పనిలో వుంది.రెండున్నరేళ్ళ క్రితం, 2019లో జరిగిన ఎన్నికల్లో, అనూహ్యంగా ఓడి పోయిన, టీడీపీ నాయకత్వం, ఇప్పుడు పడిలేచిన కెరటంలా పూర్వ వైభవం సాధించేదుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. సొంత ఇంటినిచాక్కదిద్దుకునే పనిలో పడింది.  గత ఎన్నికలలో నవరత్నాలను ముందు పెట్టి ఒక్క ఛాన్స్’ ఇస్తే అద్భుతాలు చేస్తామని నమ్మబలికి,అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం,ఇంకా సగంకాలం అయినా పూర్తి కాకముందే. కాడి తన్నేసింది. అరాచక పాలనతో, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసింది. ఓ వంక ప్పుల కుప్పలు మరో వంక పన్నుల మోతతో ఆర్థిక వ్యవస్థను అధః పాతాళానికి తీసుకుపోయింది.  మరో వంక, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ, నాయకులు కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా, కీలక నేతలు టార్గెట్’గా అన్ని రకాల దాడులకు పాల్పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికను కూల్చి వేయడం మొదలు, తెలుగు దేశం పార్టీ నాయకుల ఇళ్ళఫై, చివరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడుల వరకు, అసెంబ్లీలో చంద్రాబాబు, ఆయన సతీమణిపై దుర్భాషలాడడం వరకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసేపీ నాయకత్వం తెలుగు దేశం పార్టీ నైతిక స్థైర్యాన్ని దేబాబ్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ టార్గెట్’ గా రాజకీయ వ్యూహం నడిపిస్తోంది. ఇందులో భాగంగానే,అటు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూర్ జిల్లా కుప్పం, లోకేష్ పోటీ చేసి ఓడి పోయిన మంగళగిరి నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.   వైసీపీ నాయకత్వం అధికారాన్ని అడ్డు పట్టుకుని, అడ్డదారుల్లో కోవర్టులను పోగేసి కుప్పం మున్సిపల్  ఎన్నికలలో విజయం సాధించింది.చంద్రబాబు సొంత నియోజక వర్గంలో జెండా ఎగరేసి, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయచ్చని జగన్ రెడ్డి  భావించారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు,వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయరని ప్రచారం సాగించారు. అయితే, చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి కుతంత్రాన్ని ముందుగానే పసి గట్టి, పడి లేచిన కెరటంలా అక్కడి  నుంచే మళ్ళీ పోటీ చేయడమే కాదు, అక్కడ నివాసం కూడా ఏర్పటు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతి నెలలో కనీసం ఒక సారి  నియోజక వర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ అన్నిటినీ మించి, కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన మొదలుపెడతానని స్పష్టం చేశారు. కోవర్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టారు.   మరో వంక తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటి చేసిన లోకేష్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో అనుహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈ క్రమం‌లోనే ఆయన వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ నుండి గెలుపే ధ్యేయంగా లోకేష్ పని చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజానికి, గత ఎన్నికలలో వైసేపీ, తెలుగు దేశం పార్టీల మధ్య సీట్ల దూరం చాల ఉన్నా, ఓట్ల పది శాతం లోపే ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటే, ఇప్పిటికిప్పుడు ఎన్నికలు జరిగినా, వైసీపీ  ఓటమి తధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రావత్‌కు 17 గ‌న్ సెల్యూట్‌.. 800మందితో అరుదైన సైనిక లాంఛ‌నం..

దేశ తొలి సీడీఎస్ అంత్య‌క్రియ‌లంటే మాట‌లా. అత్యంత అరుదైన సైనిక లాంఛ‌నంతో బిపిన్ రావ‌త్‌కు అంతిమ వీడ్కోలు ప‌ల‌క‌నున్నారు. త్రివిధ ద‌ళాలకు చెందిన ముఖ్యులంతా ముందుండి న‌డ‌వ‌నున్నారు. సాయంత్రం ఢిల్లీలోని బ్రార్‌ స్క్వేర్‌ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.    అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది అధికారులు పాల్గొన‌నున్నారు. 33 మందితో ట్రైసర్వీస్‌ బ్యాండ్‌ ముందు వెళ్లనుంది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్‌ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించనుంది.  సీడీఎస్ బిపిన్ రావ‌త్‌ అంతిమ సంస్కారాల్లో మొత్తం 800 మంది డిఫెన్స్‌ సర్వీస్‌ సిబ్బంది పాల్గొంటారు. అంత్యక్రియల సమయంలో గౌరవసూచికంగా 17 గన్‌ సెల్యూట్ జ‌రుపుతారు. 

మాస్క్ లేక‌పోతే రూ.25వేలు ఫైన్‌.. వామ్మో జ‌గ‌న‌న్న బాదుడే బాదుడు..

మాస్క్ లేక‌పోతే ఫైన్‌. ఇది రొటీన్ న్యూస్‌. ఇప్ప‌టికే తెలంగాణ స‌ర్కారు మాస్క్ లేక‌పోతే రూ.1000 ఫైన్ విధించి సంచ‌ల‌నంగా నిలిచింది. కేసీఆరే వెయ్యి వేస్తే.. ఇక తాము మ‌రింత ఫైన్ వేయాల‌నుకున్నారో ఏమో.. సీఎం జ‌గ‌న్ ఓ రేంజ్‌లో జ‌రిమానా బాదేశారు. ఏకంగా రూ.25వేలు ఫైన్ విధించారు. అయితే, ఈ భారీ మొత్తం ప్ర‌జ‌ల‌పై కాకుండా.. తెలివిగా షాపుల‌కు ఫైన్ వేసేలా ఖ‌త‌ర్నాక్ రూల్ పెట్టారు. ప‌బ్లిక్‌కు మాత్రం వంద రూపాయ‌ల ఫైన్‌తో స‌రిపెట్టారు. జ‌గ‌న‌న్న నిర్ణ‌యం జ‌నాల‌కు, షాపు యాజ‌మాన్యాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా ఉందంటున్నారు.  ఏపీ ప్రభుత్వం మరోసారి కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ.100 జరిమానా విధించనుంది. మాస్క్‌ లేని వారిని దుకాణాలకు రానిస్తే.. ఆయా షాపులు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులకు రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసి వేయించనుంది.  మాస్క్‌ నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్ నెంబ‌ర్ 80109 68295 కు స‌మాచారం అందించాల‌ని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.

రామ్‌కీపై వేటు.. క‌డ‌ప ప్రాజెక్టుపై ప్ర‌పంచ బ్యాంకు యాక్ష‌న్‌.. జ‌గ‌న్‌కు షాక్‌!

రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌పై వేటు పడింది. ఆర్‌ఈఈఎల్‌ కంపెనీతో పాటు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ గౌతమ్‌రెడ్డి.. 20 నెలల పాటు తన నిధులతో చేపట్టే ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ నిషేధం విధించింది. భారత్‌లో పారిశ్రామిక కాలుష్య నిర్వహణ ప్రాజెక్టుల ఏర్పాటులో కంపెనీ అనుసరించిన మోసపూరిత విధానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది.  ఆర్‌ఈఈఎల్‌.. ప్రపంచ బ్యాంక్‌ నిధులతో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఉక్కాయపల్లిలో ఓ కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టును మ‌రో సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించే విషయాన్ని కంపెనీ బిడ్డింగ్‌ సమయంలో వెల్లడించలేదు. 2017లో ఈ పనుల్ని ఆ సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించేటప్పుడు ప్రపంచ బ్యాంక్‌ ఆమోదం తీసుకోలేదు. ప్రపంచ బ్యాంక్‌ కొనుగోళ్ల మార్గదర్శకాలకు ఇది విరుద్ధం. దీంతో బ్యాంక్‌ దీన్ని మోసపూరిత చర్యగా పరిగణించి ఆర్‌ఈఈఎల్‌తో పాటు  కంపెనీ ఎండీ గౌతమ్‌ రెడ్డిపై 20 నెలల పాటు నిషేధం వేటు వేసింది.  మామూలుగా అయితే ఇలాంటి మోస‌పూరిత‌ చర్యలకు పాల్పడిన కంపెనీల‌పై ప్రపంచ బ్యాంక్‌ మరింత ఎక్కువ కాలమే నిషేధం విధిస్తుంది. అయితే ఈ విషయంలో ఆర్‌ఈఈఎల్‌ తమ తప్పు ఒప్పుకోవడంతో పాటు, ప్రపంచ బ్యాంక్‌కు సహకరిస్తూ.. దిద్దుబాటు చర్యలకు అంగీకరించడంతో నిషేధాన్ని 20 నెలలకు పరిమితం చేసిందని తెలుస్తోంది. అయినా, వ‌ర‌ల్డ్ బ్యాంక్‌ నిర్ణ‌యంతో.. ప్రపంచ బ్యాంక్‌ దాని అనుబంధ సంస్థల నిధులతో చేపట్టే ఎలాంటి ప్రాజెక్టుల్లో ఆర్‌ఈఈఎల్‌ 20 నెలల పాటు పాల్గొన‌కూడ‌దు. దీంతో కంపెనీ ప్రతిష్ఠతో పాటు వ్యాపార అవకాశాలు కూడా దెబ్బతింటాయ‌ని అంటున్నారు. ఇంత‌కీ, రాంకీ గ్రూప్ ఎవ‌రిదో తెలుసుగా..? జ‌గ‌న్‌రెడ్డికి స‌న్నిహితుడైన‌ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిదే...

గుండెల‌పై త‌న్నిన జ‌గ‌న్‌, బాబు ఓస్డీపై సీ'ఐ'డీ, రామ్‌కీపై వేటు.. టాప్‌న్యూస్ @1pm

1. సీఎం జగన్ తీరుపై సొంతపార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రోశయ్య సంస్మరణ సభలో చిలకలూరిపేట వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రోశయ్య పార్ధివదేహాన్ని చూసేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదా? అంటూ ప్రశ్నించారు. వైసీపీలో తమ కులానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి.. గుండెలపై తన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  2. విశాఖ రైల్వే జోన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గందరగోళంగా సమాధానమిచ్చారు. రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల లేవనెత్తిన సందేహాలపై స్పష్టత ఇవ్వకుండా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒకింత గందరగోళం సృష్టించారు. రైల్వేజోన్‌పై స్పష్టత కోరితే విభజన హామీలన్నింటినీ నెరవేర్చుతామని మాత్రమే సమాధానం ఇచ్చారు. విశాఖ రైల్వేజోన్‌పై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కూడా చెప్పలేకపోయారు.  3. హైదరాబాద్‌లోని రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు చేపట్టారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా లక్ష్మీనారాయణ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా ఉన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్‌ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో లక్ష్మీనారాయణపై  ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు.  4. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినియోగదారుల పరిరక్షణ చట్ట సభ్యుల నియామకంపై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. వినియోగదారుల సభ్యుల నియామకంలో జోక్యం చేసుకోమంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై నెల్లూర్‌కు చెందిన కోలా ఉమామహేశ్వరరావు ధర్మాసనానికి అప్పీల్ చేశారు. వినియోగదారుల సభ్యుల నియామకం పూర్తిగా రాజకీయ సిఫార్సులతో జరిగిందని వాదించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయంటూ ధర్మాసనం అభిప్రాయపడింది.  5. రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై వేటు పడింది. ఆర్‌ఈఈఎల్‌ కంపెనీతో పాటు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ ఎం. గౌతమ్‌ రెడ్డి.. 20 నెలల పాటు తన నిధులతో చేపట్టే ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ నిషేధం విధించింది. భారత్‌లో పారిశ్రామిక కాలుష్య నిర్వహణ ప్రాజెక్టుల ఏర్పాటులో కంపెనీ అనుసరించిన మోసపూరిత విధానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. 6. గుంటూరు కలెక్టరేట్ ద‌గ్గ‌ర‌ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆందోళనకు దిగింది. ఖాళీ కంచాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు. ప్రభుత్వ పనుల బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్విర్యం అయిపోయిందన్నారు. సీఎం జగన్ తమ సమస్యను పరిష్కరించి.. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంట‌నే చెల్లించాలని డిమాండ్ చేశారు.  7. సీపీఎస్ రద్దుపై విజయవాడలో ఉద్యోగుల సింహగర్జన జరుగుతోంది. ‘మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు.. మీ హామీ మా హక్కు’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు బ్యానర్‌తో నిర‌స‌న తెలిపారు. ఆంద్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ తరపున కార్యక్రమం నిర్వహించారు. 8. దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని మృతిచెందిన ఆర్మీ సోల్జ‌ర్‌ సాయితేజ తండ్రి మోహన్ అన్నారు. ఇద్దరు కుమారులు సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషపడ్డానని.. సాయితేజ మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయామని అన్నారు. సాయితేజకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, అతని భార్య చదువుకుందని, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కుటుంబం నిలబడుతుందని మోహన్ అన్నారు. 9. కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్లు, బాతులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నిరోధించేందుకు అధికారులు కోళ్లు, బాతులను చంపేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. 10. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌న ద్రోణి ఏర్ప‌డింది. తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్ల‌డించింది. అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలో ప్ర‌భావం అధికంగా ఉండ‌నుంది.   

మూడు రోజుల పాటు వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాల‌కు హెచ్చ‌రిక‌..

వాన పేరెత్తితేనే తెలుగు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. వ‌ర‌ద గుర్తొస్తే.. కంపించిపోతున్నారు. ఇటీవ‌ల రాయ‌ల‌సీమ‌, నెల్లూరు జిల్లాల్లో వాన‌, వ‌ర‌ద సృష్టించిన బీభ‌త్సం అలాంటిది మ‌రి. ఇంకా ఆ పీడ‌క‌ల మ‌ర‌వ‌క‌ముందే.. వ‌ర‌ద బుర‌ద వ‌ద‌ల‌కుండానే.. మ‌రోసారి వాన ముప్పు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈసారి ఏపీతో పాటు తెలంగాణ‌కు కూడా భారీ వాన గండం ఉందంటున్నారు.  రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉంద‌నేది వెద‌ర్ రిపోర్ట్‌.  తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్ర‌క‌టించారు. ఉష్ణోగ్రతల్లో కూడా బాగా త‌గ్గుతాయ‌ని తెలిపారు.  ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్ల‌డించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సీడీఎస్‌తో న‌వ చ‌రిత్ర‌.. రక్షణ రంగంలో సంస్కర్త..

మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ రక్షణ రంగంలో అతి పెద్ద సంస్కర్తగా పేరు గడించారు. భారత రక్షణ రంగంలో ఆయన త్రివిధ దళాల మధ్య సయోధ్య సాధించడం.. రక్షణ రంగాన్ని ఆధునికీకరించే గురుతర బాధ్యత కూడా బిపిన్ రావత్ తీసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే దాకా ఆయన భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపైనే తీవ్రంగా కృషిచేశారు. దేశంలోని మూడు దళాలకు ఉన్న 17 కమాండ్లను ఒకే తాటిపైకి తెచ్చి ఇంటిగ్రేటెడ్ కమాండ్లుగా చేసే కృషిలో బిపిన్ రావత్ నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు ఆయా దళాలు దేనికదే అధికారాలు, హోదా అనుభవిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరించే ఒక బలగం కమాండ్ లో మిగతా కమాండ్లను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు బిపిన్ రావత్. దళాలను ఆధునికీకరించడం, హేతుబద్ధీకరణతో పాటు వనరులను, ఆయుధ సంపత్తిని గరిష్ట వినియోగానికి అనుకూలంగా మలిచే బాధ్యత బిపిన్ రావత్ తీసుకున్నారు. థియేటర్ కమాండ్స్ విషయంలో త్రివిధ దళాల్లో ప్రధానంగా వైమానిక దళంలో తీవ్ర అయిష్టత ఉందంటారు. అయినప్పటికీ.. ఇది ప్రధాని మోదీ అప్పగించిన బాధ్యత.. మీ అభ్యంతరాలను 2022 జూన్ లోగా చెప్పండి అంటూ తన ముసాయిదా నివేదికను త్రివిధ దళాధిపతులకు బిపిన్ ఇచ్చారట. వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి దీన్ని ఒక కొలిక్కి తేవాలన్న దృఢ సంకల్పంతో బిపిన్ రావత్ కృషిచేస్తున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకోకుండా అనంత లోకాలకు వెళ్లిపోవడం దురదృష్టం. నిజానికి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచే సీడీఎస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అయితే… త్రివిధ దళాల మధ్య విభేదాలకు దారితీస్తుందేమో అనే భయంతో గత ప్రభుత్వాలు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సాహసం చేయలేదు. కాగా.. ప్రధాని మోదీ ప్రభుత్వం సీడీఎస్ ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం వెనుక బిపిన్ రావత్ పై ఉన్న నమ్మకం కూడా ఓ కారణం అంటారు. బిపిన్ రావత్ ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. మనసులో మాను కఠినంగా వెల్లడించడం వల్ల పలుమార్లు బిపిన్ రావత్ విమర్శలకు కూడా గురయ్యారు. సైన్యాధిపతిగా ఉన్నప్పుడే బిపిన్ రావత్ పాలకపక్షం మనసెరిగి మాట్లాడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను రావత్ తప్పుపట్టారు. తర్వాత కశ్మీర్ లో రుళ్లు రువ్వే పిల్లలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణం అయ్యాయి. సైనికుడి నుంచి మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి వరకూ బిపిన్ రావత్ సఖ్యతగా ఉండి, వారిని ఉత్సాహపరిచేవారు. భారత త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసి వాటిని మరింత ఆధునికీకరించి, వాటి మధ్య సమన్వయం సాధించే లక్ష్యంతో ఓ సరికొత్త వ్యవస్త బిపిన్ రావత్ నాయకత్వంలో రూపొందుతోంది. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోవడం విషాదకరం.

సీఎం స్టాలిన్‌కు హైకోర్టు ప్రశంసలు.. మ‌న ముఖ్య‌మంత్రులూ ఉన్నారే...

మామూలుగా అయితే కోర్టులు అంత ఈజీగా పాల‌కుల‌ను ప్ర‌శంసించ‌వు. మంచి ప‌రిపాల‌న అందిస్తేనే శెభాష్ అంటుంది. తాజాగా, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న క‌ర్త‌వ్యాన్ని చ‌క్క‌గా నిర్వ‌హిస్తున్నార‌ని మ‌ద్రాసు హైకోర్టు న్యాయ‌మూర్తి అభినందించారు. స్టాలిన్‌పై విమర్శలు చేయడాన్ని ఆపాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ..నిందితుడు సాట్టై మురుగన్‌ను హెచ్చరించింది.  మదురైకు చెందిన సాట్టై మురుగన్‌ గతంలో స్టాలిన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జామీను కోరుతూ సాట్టై మురుగన్‌ మదురై ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి పుగళేంది ముందుకు విచారణకు వచ్చింది. స్టాలిన్‌ను మెచ్చుకుంటూ.. అభినందించకపోయినా ఫర్వాలేదుగానీ ఆయన్ను విమర్శించడాన్ని కోర్టు సహించదన్నారు న్యాయ‌మూర్తి. కోర్టుకు ఇచ్చిన హామీని అధిగమించి ఇకపై ఒక్కమాట మాట్లాడినా జామీను రద్దు చేస్తామని హెచ్చరించారు. ముఖ్య‌మంత్రిగా స్టాలిన్ ప‌నితీరు అలా ఉంది మ‌రి. ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోతున్నారు. వ‌ర‌ద‌ల వేళ మోకాళ్లోతు నీళ్ల‌లో దిగి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. అమ్మ ప‌థ‌కాల‌ను అదే పేరుతో య‌ధాత‌థంగా కొన‌సాగిస్తున్నారు. ప్ర‌భుత్వ క‌మిటీల్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు స్థానం క‌ల్పిస్తున్నారు. ఎక్క‌డ ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే స్పందిస్తూ.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ చూర‌గొంటున్నారు. అందుకే, ఇటీవ‌ల ఇండియా టుడే స‌ర్వేలో నెంబ‌ర్ 1 సీఎంగా నిలిచారు.  ఇక‌, అదే ఇండియా టుడే స‌ర్వేలో ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి చాలా వెన‌క్కి వెళ్లిపోయారు. స్టాలిన్‌తో పోలిస్తే.. జ‌గ‌న్ ప‌రిపాల‌న అధ్వాన్నంగా ఉందంటున్నారు. సీమ‌కు వ‌ర‌దొస్తే.. అదేదో ఈవెంట్‌కు అటెండ్ అయిన‌ట్టు సెక్యూరిటీ మ‌ధ్య ఇలా వ‌చ్చి.. అలా వెళ్లిపోయారు. చంద్ర‌బాబు ముద్ర క‌నిపించ‌కుండా రాజ‌ధాని అమ‌రావ‌తిని ఆగ‌మాగం చేశారు. చంద్ర‌బాబు క‌ట్టించిన 20 ల‌క్షల ఇళ్ల‌ను పేద‌ల‌కు పంచ‌కుండా ప‌క్క‌న పెట్టేశారు. ఇక టీడీపీ నేత‌ల‌పై క‌క్ష్య‌ సాధింపు చ‌ర్య‌ల‌కైతే లెక్కేలేదు. చివ‌రాఖ‌రికి చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిని కూడా వ‌ద‌ల్లేదు వైసీపీ నాయ‌కులు. చంద్ర‌బాబుతో క‌న్నీళ్లు పెట్టించేలా వేధించారు. మ‌ద్యం ధ‌ర‌లు పెంచేసి.. ఇసుక దొర‌క్కుండా చేసేసి.. చెత్త ప‌న్నుల‌న్నీ వేసేసి.. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. ఇప్పుడిక ఓటీఎస్ పేరుతో పేద‌ల‌ను దోచుకునే ప‌థ‌కం తెర‌మీద‌కు తీసుకొచ్చారు. మ‌ద్రాసు హైకోర్టు సీఎం స్టాలిన్ పాల‌న‌ను అభినందిస్తే.. ఇక ఏపీ హైకోర్టు మాత్రం జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొట్టికాయ‌లు వేసిందో లెక్కే లేదు. మాజీ ఈసీ నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో గానీ, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వైసీపీ రంగులు వేయ‌డం, అడ్డ‌గోలు జీవోలు ర‌హస్యంగా ఉంచ‌డం, మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం, ప్ర‌భుత్వ కార్యాల‌యాల త‌ర‌లింపు... అబ్బో చెప్పుకుంటూ పోతే పేజీలు చాల‌వు. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులపై కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌ల జ‌రిగాయంటే.. దోషిగా కోర్టులో నిల‌బ‌డ్డారంటే మాట‌లా? ఎక్క‌డ స్టాలిన్‌.. ఎక్క‌డ జ‌గ‌న్‌.. అంతా ఆంధ్రుల క‌ర్మ అంటున్నారు ప్ర‌జ‌లు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జ‌గ‌న్‌రెడ్డికి ఏమాత్రం తీసిపోరు. అందుకే, ఉప ఎన్నిక‌ల్లో వ‌రుస పరాజ‌యాలు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాల్సింది.. మారాల్సింది.. ఎంతైనా ఉందంటున్నారు.   

చిన్న నిర్లక్ష్యంతో భారీ మూల్యం!

చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒమిక్రాన్ వైరస్ పెను ప్రమాదకారిగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించిందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. అయితే ఒమిక్రాన్ వైరస్ డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రభావం కలిగి ఉందని గుర్తించినట్లు డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. చాలా దేశాలకు విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల కారణంగానే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిందనే విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్న విషయం స్పష్ట మైందని డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ టేడ్రోల్ అద్నం గేబ్రియల్ అన్నారు. ఒమిక్రాన్ విస్తరణను నివారించేందుకు దేశాలు సమగ్ర చర్యలు చేపట్టడం ద్వారా సాధ్యమని తెలిపారు. తద్వారా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని టేడ్రోల్ అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్ పరీక్షలు, సీక్వెన్సింగ్ పెంచాల్సిన అవసరం ఉందని గేబ్రియల్ స్పష్టం చేశారు. అయితే.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యాన్నే చెల్లించక తప్పదని గేబ్రియల్ హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారాంతపు సమీక్షలో భాగంగా సమర్పించిన నివేదికలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం గణాంకాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డెల్టా వేరియంట్ ప్రభావం కన్నాఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఆసుపత్రులలో  రోగుల సంఖ్య పెరగవచ్చని, ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకరమని అంటున్నాయి. ముందు జాగ్రత చర్యలు చేపట్టడం ద్వారా ఒమిక్రాన్ తీవ్రతను  తగ్గించవచ్చని అంటున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.  

బిపిన్ రావత్‌.. ఖ‌త‌ర్నాక్‌ సూప‌ర్ సోల్జ‌ర్‌.. ఫ్యామిలీ మేన్‌..

దేశానికే తొలి సీడీఎస్‌. అంత‌కు ముందు ఆర్మీ చీఫ్‌. ఎంత టాలెంట్ ఉంటే.. ఆ స్థాయికి ఎద‌గాలి? ఎంత క‌రేజ్ ఉంటే.. ఆర్మీ చీఫ్ అవ్వాలి? ఎంత చాణ‌క్యం ఉంటే.. సీడీఎస్‌కు ఎంపిక చేయాలి? అవును, జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌.. సామాన్య సైనికుడు కాదు. సూప‌ర్ సోల్జ‌ర్‌. భ‌యం అన్న‌ది ఆయ‌న క‌ళ్ల‌ల్లో క‌నిపించ‌దు. ద‌డ అనేది ఆయ‌న గుండెల‌ను చేర‌దు. దూకుడే ఆయ‌న నైపుణ్యం. సాహ‌స‌మే ఆయ‌న ఊపిరి. అందుకే, ర‌క్ష‌ణ శాఖ‌లో అత్య‌న్న‌త హోదా అలంక‌రించారు. ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించారు. బిపిన్ రావ‌త్ గొప్ప‌త‌నం గురించి.. ఆయ‌న‌తో 15 ఏళ్ల‌కుపైగా క‌లిసి ప‌ని చేసిన తెలుగు సైనిక వీరుడు, రిటైర్డ్ క‌ల్న‌ల్ పి.వి. దుర్గా ప్ర‌సాద్ స‌వివ‌రంగా వివ‌రించారు. లక్నోలో పనిచేసేట‌ప్పుడు.. వారిద్ద‌రూ పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఇద్దరి కుటుంబాల మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్ ఉంది. బిపిన్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని.. రావ‌త్ ప‌రాక్ర‌మాన్ని పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు. ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే...... "రావత్‌ ఓ జగమొండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మడమ తిప్పడు. వెనకడుగు వేయడు. ప్రమాదాలను లెక్కచేయడు. ఆ తెగువ, మొక్కవోని ధైర్యమే ఆయనను రక్షణ రంగంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాయి. రావత్‌ 1978లో సైన్యంలో చేరే నాటికి నేను 5-11 గూర్ఖా రైఫిల్స్‌లో సేవలందిస్తున్నాను. రావత్‌ శిక్షణ 1980లో పూర్తయ్యాక.. 5-11 గుర్ఖా రైఫిల్స్‌లో చేరారు. ఎల్‌వోసీ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల్లో 15 ఏళ్ల పాటు కలిసి పని చేశాము. మా కుటుంబాలు లఖ్‌నవూలో కలిసి ఉండేవి. రావత్‌ భార్య మధులికను మేమంతా ‘మధు’ అని పిలిచేవాళ్లం. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి భార్య అయినా ఆమెలో ఎక్కడా అహం కనిపించేది కాదు."  ద‌స‌రా నాడు ఏం జ‌రిగిందంటే... "పాక్‌ సరిహద్దు చకౌటి బార్డర్‌లో పనిచేస్తున్న సమయంలో దసరా వచ్చింది. 100 మీటర్ల దూరంలో శత్రువులు పొంచి ఉంటారు. అయినా ఆరోజు తన ట్రూప్‌తో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని రావత్‌ భావించారు. పాక్‌ సరిహద్దు వరకు వెళ్లి.. తాము పండుగ ఉత్సవాలు జరుపుకుంటున్నామని.. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని బిపిన్‌ హెచ్చరించారు. ఆ తర్వాత 2 గంటల పాటు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొన్నారు." అడ‌విలో హెలికాప్ట‌ర్ క్రాష్‌.. ఐఈడీ బ్లాస్ట్‌... "ఆపత్కాలంలో కూడా బిపిన్‌ మానసికంగా చాలా స్థిరంగా ఉండేవారు. ఓరోజు అతను సరిహద్దులోని అట‌వీ ప్రాంతంలో రౌండింగ్‌ కోసం ఓ హెలికాప్టర్‌ ఎక్కారు. ఆ హెలికాప్టర్‌ ఎగురుతున్న సమయంలో సాంకేతిక సమస్య రావడంతో చతికిల పడింది. ఇతరులయితే ప్రమాదాన్ని శంకించి ఆ రోజుకు వాయిదా వేసుకునే వారేమో. కానీ బిపిన్‌ మాత్రం ఎలాంటి జంకు లేకుండా.. మరో హెలికాప్టర్‌ను రప్పించి, అందులో విధులు నిర్వహించి వచ్చారు. ఓ రోజు మా ట్రూప్‌లోకి శిక్షణ నిమిత్తం ఓ మేజర్‌ జనరల్‌ చేరారు. లంచ్‌ తర్వాత కాస్త ముందుకు వెళ్లి బ్రీఫింగ్‌ చేస్తున్నాము. అదే సమయంలో భోజనం చేసిన స్థలంలో ఒక్కసారిగా ఐఈడీ పేలుడు జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే కనీసం శరీర భాగాలు కూడా దక్కవు. అంతటి పేలుడు జరగ్గా కొత్తగా వచ్చిన మేజర్‌ కాస్త చలించినప్పటికీ.. బిపిన్‌ మానసిక ధైర్యం కోల్పోకుండా కారణాలపై ఆరా తీయడానికి నిమగ్నమయ్యారు. ఇవన్నీ సహజమే.. పట్టించుకోవద్దని మేజర్‌కు ధైర్యం చెప్పారు." మ‌ధుతో అనుబంధం... "అప్పట్లో నా భార్యకు స్కూటర్‌ కూడా నడపడం రాదని తెలుసుకున్న రావ‌త్ భార్య‌ మధులికా.. ఆమెను బయటకు తీసుకెళ్లేవారు. డ్రైవింగ్‌ నేర్పేవారు. కొన్ని రోజుల్లోనే డ్రైవింగ్‌ నేర్చుకున్న నా భార్య ఎంతో సంతోషించింది. లఖ్‌నవూలో ఉన్న సమయంలో మధు చాలా హుషారుగా ఉంటూ ఏ పనికీ వెనకాడకుండా భర్తకు తగ్గ భార్య అనిపించుకున్నారు." 40 ఏళ్ల స్నేహం... "నా 40 ఏళ్ల సర్వీసులో ఎన్నో రోజులు బిపిన్‌తో గడిపాను. అతను రక్షణ రంగంలో అత్యున్నత స్థానంలో సీడీఎస్‌గా ఎంపికవడంతో ఎంతో సంతోషించాను. అతని షెడ్యూలు బిజీగా ఉంటుందని భావించి నేను కాస్త ఆలోచించినా ఆయన మాత్రం తరచూ నాతో ఫోన్‌లో మాట్లాడేవారు. దుండిగల్‌, ఎంసీఎంఈ, సీడీఎంలలో లెక్చర్‌ ఇవ్వడానికి నగరానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసేవాడిని." అంటూ బిపిన్ రావ‌త్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రిటైర్డ్ క‌ల్న‌ల్‌ దుర్గా ప్ర‌సాద్‌. 

జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పిన‌ట్టేనా? కేబినెట్ పునర్‌వ్య‌వస్థీకరణ లేనట్టేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ వాకింగ్ ప్రాక్టీస్’ చేస్తున్నారా? మాట తప్పను మడమ తిప్పను, అంటూ హామీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు వెనకడుగులు వేస్తున్నారా ? అంటే, అవుననే అంటున్నారు.ముఖ్యమంత్రి అడుగులు వెనక్కి పడుతున్నాయి, ఆయన  బ్యాక్ వాకింగ్ చేస్తున్నారు., అనే సమాధానమే పార్టీ వర్గాల నుంచి వస్తోంది.   మూడు రాజధానుల మొదలు ముఖ్యమంత్రి ఒక్కొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారని, అందుకు వరస పెట్టి ఉదాహరణలు చెపుతున్నారు.అదలా ఉంటే ఇప్పుడు ఆ జాబితాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేరిందనే మాట వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. మంత్రి పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా వాపోతున్నారు. ‘మాట తప్పను, మడప తిప్పను’ అంటూ జనాన్ని నమ్మించి మోసం చేసినట్లుగానే,తమను కూడా ముఖ్యమంత్రి. ‘జగనన్న బాధితుల’ జాబితాలో చేర్చారని పార్టీ ఎమ్మెల్యేలు ప్రైవేటుగా వాపోతున్నారు.  రెండున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తొలి మంత్రివర్గంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు.కానీ,అప్పుడే, రెండున్నరేళ్ళ తర్వాత, మంత్రివర్గాన్ని సమూలంగా మారుస్తానని, కొత్త ముఖాలతో నింపుతానని మాటిచ్చారు. అయితే, ఇప్పుడు రెండున్నరేళ్ళు పూర్తవుతున్న సమయం వచ్చే సరికి ముఖ్యమంత్రి, ‘మాటా లేదు మడమ లేదు. అంతా ‘తూచ్’ అంటూ ఇప్పట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదన్న సందేశాలు పంపుతున్నారు.  నిజానికి రెండుమూడు నెలల క్రితమే, ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తి చేశారని , కొత్త కాబినెట్ జాబితా సిద్దమైందని లీకులు వచ్చాయి. అలాగే, ముఖ్యమంత్రి సన్నిహిత బందువు మంత్రి బాలినేని కూడా, పదవులు వదులుకునేందుకు తనతో సహా మంత్రులందరూ సిద్దం కావాలని అన్నారు. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం , మరో ఐదారు నెలల వరకు పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ ఉండదని తెలుస్తోంది. అయితే ఈ లోగా రాజకీయ అవసరాల రీత్యా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు, స్వల్ప మార్పులు చేర్పులు జరిగితే జరగవచ్చని, ఇటు రాజకీయ వర్గాల్లో అటు అధికార వర్గాల్లో వినవస్తోంది.అంతే కాదు, నిజంగా వచ్చే సంవత్సరం (2022) మే, జూన్ నెలలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినా, ముందుగా అనుకున్నట్లుగా సంపూర్ణ పక్షాళన ఉండదని,  ఓ అరడజనుకు ఒకటి రెండు అటూ ఇటుగా పాత ముఖాలను తొలిగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించి  పార్టీనాయకులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎప్పుడు, ఎలాంటి మార్పులు జరిగినా రాజకీయ సమీకరణల ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయని, గతంలోమాటిచ్చిన విధంగా సమూల పక్షాళ ఉండదని అంటున్నారు.  అయితే, కొవిడ్ కారణంగా  రెండున్నరేళ్ళలో ఎక్కువ కాలం మంత్రులు తమ శాఖల్లో సరిగా ‘పని’ చేయలేక పోయారని, కాబట్టి ఇంకొంత కాలం తమను కొనసాగించాలని కోరిన నేపధ్యంలో ముఖ్యమంత్రి, పొడిగింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే,అసలు కారణం అది కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో తేనే తుట్టెను కదిలిస్తే, అది ఎటు పోయి ఎటుకు దారితీస్తుందో అనే భయంతో పాటుగా, మంత్రి వర్గం మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేస్తే, కొత్త మంత్రులు తమ శాఖలో కుదురుకునే సరికి పుణ్యకాలం పూర్తయి ఎన్నికలు వస్తాయి,కాబట్టి  రాజకీయంగా ఇబ్బందులు  ఎదుర్కోవలసి  వస్తుందనే ముందు చూపుతో, సంపూర్ణ మార్పుకు మంగళం పాడేశారని పార్టీ వర్గాల సమాచారం, అయితే, చివరకు ఏమి జరుగుతుంది, అనేది చివరకు ముఖ్యమంత్రికి కూడా తెలియదని, వైసీపీ నేతలు గుస గుసలు పోతున్నారు.

అక్కడ మూడు రోజులు వీకెండ్.. ఉద్యోగులకు పండగే..

ఉద్యోగులకు వారానికి నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయిస్తూ ఇటీవలేయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యూఏఈ బాటలోనే షార్జా కూడా పని దినాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. షార్జా ఏకంగా మూడు రోజుల వీకెండ్ ప్రకటించింది. అక్కడ వారంలో కేవలం నాలుగు రోజులే పని దినాలు. శుక్ర, శని, ఆదివారం మూడు రోజులు సెలవు. 2022 జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ నిబంధన అమలులోకి వస్తుందని షార్జా అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజుల వీకెండ్‌ నిర్ణయానికి సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా రూలర్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు.  షార్జా కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం షార్జా ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. నాలుగు రోజుల పని దినాల్లో ప్రతి రోజు 8 గంటలు మాత్రమే పని ఉంటుంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల వీకెండ్ ఉంటుంది. ఇక యూఏఈ తీసుకొచ్చిన కొత్త వీకెండ్ నిబంధన ప్రకారం ఆ దేశంలోని ఉద్యోగులకు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 8గంటలు పని చేస్తారు. శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నాలుగున్నర గంటలు మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. అలాగే ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు.   

గులాబీ గూటిలో కౌన్సిల్ గుబులు.. కరీంనగర్ లో షాక్ తప్పదా?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొద్ది గంటల సమయమ మాత్రమే మిగిలుంది. రేపు (డిసెంబర్ 10) పోలింగ్ జరుగుతుంది. నిజానికి ఇటు కరీంనగర్’లో గానీ ఖమ్మం. జిల్లాల్లో గానీ, అధికార పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో పార్టీ అభ్యర్ధులు సునాయాసంగా గెలుస్తారు. అయితే, హుజూరాబాద్ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్లనో ఏమో గానీ అధికార  టీఆర్ఎస్  నేతల్లో  నెలకొన్న అభద్రతాభావం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అనటున్నారు.  అధికార పార్టీకి కొండంత సొంతబలం ఉంది. ప్రత్యర్ధులను చిత్తూ చేసే సంఖ్యాబలం వుంది.   అయినా అధికార పార్టీ భయానికి లోనై  క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది. ఓటు హక్కున్న ఎంపీటీసీ. జడ్పీటీసీ, సభ్యులు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను రాష్ట్రం దాటించి, విందు వినోదాలతో క్యాంపుల్లో క్యాష్ కట్టలతో కట్టి పడేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా సీనియర్ నాయకులు, ఎంపీటీసీ. జడ్పీటీసీ, సభ్యులు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కోరికలు అడిగి తెలుసుకుని, మర్యాదలు చేస్తునట్లు వార్తలొస్తున్నాయి.మెజారిటీకి సరిపడా ఓటర్లు  చేతిలో అధికారం.. పుష్కలంగా వనరులు.. కనుసైగతోనే పనిచేసుకుపోయే పార్టీ యంత్రాంగం.. అయినా ఎమ్మెల్సీలను గెలిపించుకునెందుకు ‘ఓటర్ల’ను  ఎక్కడికో తీసుకుపోయి కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే, అందుకు పార్టీలో భగ్గుమంటున్న అసమ్మతి  ప్రధాన కారణం పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని, బయటనుంచి వచ్చిన వారికీ పార్టీ టికెట్ ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి ఎగసి పడుతోందని అందుకే. అధికార పార్టీ పెద్దలు ఇంతలా అవస్థ పడవలసి వస్తోందని అంటున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే, కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, టీడీపీ నుంచి వచ్చిన ఎల్.రమణకు చెరో టికెట్ ఇవ్వడంతో, ఎప్పటినుంచి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, తెరాసకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగారు. నిజానికి, రవీందర్ సింగ్’కు గెలిచే అవకాశలు ఏ కొంచెం లేఉ . ఎందుకంటే, ఉమ్మడి జిల్లాలో మొత్తం 1300 పైచిలుకు ఓట్లు ఉంటే, అందులో 950 పైగా ఓట్లు తెరాస పక్షానే ఉన్నాయి ..అయినా  రవీందర్ సింగ్’కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతు ఇస్తున్న నేపధ్యంలో జిల్లా మంత్రులు  కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్’ కు ముచ్చెమటలు పడుతున్నాయి. మరో వంక రవీందర్ సింగ్ గెలుపు పై ధీమాగా ఉన్నారు. హుజూరాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని అంటున్నారు.అదెలా, ఉన్నా తెరాస నాయకులు మాత్రం షేక్  అవుతున్నారు.  ఖమ్మం జిల్లాలో కూడా ఒకే ఓకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, జిల్లాలో పలువురు రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నప్పటికీ, ఉద్దండ పిండాలను తోసిరాజంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా టికెట్‌ను తాతా మధుసూదన్‌కు కేటాయించడంతో సేనియర్లు భగ్గు మంటున్నారు. సొంత పార్టీ సేనియర్లకు భయపడి, స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లను గోవాకు తరలించారు. పైకి అంతా బాగాగే ఉందన్నట్టున్నా ఎక్కడో ఏదో తెలీని భయం ఇప్పటికీ గులాబీ నేతల్లో వ్యక్తమవుతునే ఉంది.మరో వంక కాంగ్రెస్‌ కు పెద్దగా ఓట్లు లేకపోయినా తాతా మధు సామాజికవర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు  టికెట్‌ ఇచ్చింది. తెరాసలోని ఒకరిద్దరు ముఖ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థికి దండిగానే వనరులు సమకూర్చినట్టు చెబుతున్నారు. మరోవంక గోవాలో ఏర్పాటు చేసిన క్యాంపులోనూ వివక్ష చూపారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సామాజికవర్గాన్ని బట్టి, స్థాయిని బట్టి ట్రీట్‌ చేశారన్న కారణంగా కొందరు ఓటర్లు హర్ట్‌ అయినట్టు చెబుతున్నారు. కొందరికి ఫ్లైట్‌లలోనూ, మరికొందరికి బస్సులలోనూ ప్రయాణ ఏర్పాట్లు చేయడం.. గోవాలో ఏర్పాటు చేసిన విడిదిలోనూ, విందు వినోదాల్లోనూ ముఖం చూసి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ లెక్కలన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న బెంగ నేతల్లో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తెరాస ఏమాత్రం డ్యామేజి జరిగిన ఇక కారు కదిలడం కష్టమని అందుకే గులాబీ పార్టీలో గుబులు వ్యక్తమవుతోందని అంటున్నారు.

ప్ర‌మాద‌మా? కుట్రా?.. ఉచితంగా ఓటీఎస్‌.. మోదీతో 'సాయి'లీల‌లు.. టాప్‌న్యూస్ @ 7pm

1. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సందేహాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరికొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనే దానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  2. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఉదారత చాటుకున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు చ‌నిపోయిన ఆయ‌న వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.  3. దేశంలో అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రుల్లో జగన్‌ ప్రథమ స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఓటీఎస్‌ పేరుతో పేదలను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎవరూ భయపడవద్దని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు.  4. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదును చేయిస్తామని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో లక్ష సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోని అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన నియోజకవర్గంగా ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీని కొడంగల్‌కు తీసుకువస్తాన‌ని.. కొడంగల్ తనకు గుండె లాంటిదన్నారు రేవంత్‌రెడ్డి.  5. ప్రధాని మోడీతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే, బుధ‌వారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను, గురువారం ప్ర‌ధాని మోదీని విజ‌య‌సాయిరెడ్డి క‌ల‌వ‌డం వెనుక ఏదో ముఖ్య‌మైన‌ రాజ‌కీయ కోణం ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. 6. లోక్‌సభ జీరో అవర్‌లో విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీలు భిన్న స్వరాలు వినిపించారు. విశాఖ రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. రైల్వేజోన్‌పై కేంద్రం పూటకోమాట మాట్లాడుతోందని భరత్‌ విమర్శించారు. అయితే భరత్‌ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా వైసీపీ ఎంపీ సత్యవతి మాట్లాడారు. రైల్వేజోన్‌ ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు సత్యవతి చెప్పారు. 7. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పురోగతి లేదన్నారు. బడ్జెట్‌లోనూ కేవలం రూ. 40 లక్షలు కేటాయించడం.. ఏపీని అవమానించడమేనని అన్నారు. రైల్వేజోన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 8. శ్రీకాళహస్తిలో అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతులు సంఘీభావం తెలిపారు. కుప్పం ఎన్నికలతో పాటు మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం ఉందని ఆరోపించారు. పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షన్ క‌ల్చ‌ర్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రిస్తోంద‌ని.. ఆ హింస‌తో విసిగి పోయామ‌ని పులివెందుల రైతులు అన్నారు.  9. సంచ‌ల‌నం సృష్టించిన శిల్పాచౌద‌రి కేసులో ఆమెను మ‌రో మూడు రోజుల పాటు పోలీస్ క‌స్ట‌డీకి ఇచ్చేందుకు కోర్టు అనుమ‌తించింది. శిల్పాచౌదరిని ఇప్ప‌టికే రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు ఆమె నుంచి ఎలాంటి స‌మాచారం రాబ‌ట్ట‌లేక‌పోయారు. కోర్టు అనుమ‌తితో మ‌రోసారి శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు నార్సింగి పోలీసులు విచారించనున్నారు.  10. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినందునే ఆందోళనను ఉపసంహరించుకున్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం తమ డిమాండ్లను ఆచరణలో పెట్టకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చ‌రించారు.   

మోదీ, షాల‌తో విజ‌య‌సాయి ఏకాంత చ‌ర్చ‌లు.. ఏంటి సంగ‌తి?

బుధ‌వారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. గురువారం ప్ర‌ధాన మంత్రి మోదీని విజ‌య‌సాయి క‌లిశారు. ఈ రెండు మీటింగ్‌లు స‌డెన్‌గా జ‌రిగిన‌వే. ముంద‌స్తు షెడ్యూల్ కానీ, అపాయింట్‌మెంట్ కానీ లేకుండా విజ‌య‌సాయి ఆ ఇద్ద‌రితో ఒంట‌రిగా మాట్లాడారు. ఇది అనూహ్య ప‌రిణామ‌మే. ఇటీవ‌ల కాలంలో ఇలా ఆక‌స్మిక భేటీలు జ‌రిపింది లేదు. ఇప్పుడే స‌డెన్‌గా ఈయ‌న వారిని ఎందుకు క‌లిసిన‌ట్టు? వారు కూడా ఈయ‌న‌తో మాట్లాడాల్సిన అంత అర్జెంట్ మేట‌ర్ ఏముంటుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. ఈ వ‌రుస భేటీల‌ను ప‌లు ర‌కాలుగా విశ్లేషిస్తున్నారు. గ‌తంలో సీఎం జ‌గ‌న్‌కే మోదీ, అమిత్‌షాల అపాయింట్‌మెంట్ అంత ఈజీగా దొరికేది కాదు. ఢిల్లీ వెళ్లి ప‌డిగాపులు పడి.. ఒట్టిచేతుల‌తో తిరిగొచ్చిన దాఖ‌లాలు ఉన్నాయి. అలాంటిది, విజ‌య‌సాయిరెడ్డి మాత్రం బుధ‌వారం షాను.. గురువారం మోదీని క‌ల‌వ‌డం కాక‌తాళీయం మాత్రం కాదు. ఇది ప‌క్కా అనూహ్య‌మే అంటున్నారు. ఇంత‌కీ వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏమై ఉంటుంద‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఎప్ప‌టిలానే రొటీన్‌గా.. మ‌ర్యాద‌పూర్వ‌క స‌మావేశం, రాష్ట్ర స‌మ‌స్య‌లు, విభ‌జ‌న హామీలంటూ పైకి ఏదో చెప్పినా.. లోలోన మాత్రం ఇంకేదో జ‌రుగుతోంద‌నే అనుమానం రాక‌మాన‌దు.  ఇటీవ‌ల జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఏపీలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. ఓటీఎస్‌పై ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తుతోంది. భువ‌నేశ్వ‌రి టాపిక్‌, చంద్ర‌బాబు క‌న్నీటి ఎపిసోడ్‌తో అధికార పార్టీని అంతా అస‌హ్యించుకుంటున్నారు. అటు హైకోర్టులో అక్ర‌మ ఆస్తుల కేసులో కీల‌క వాద‌న‌లు ముగిశాయి. కోర్టు హాజ‌రు నుంచి సీఎం జ‌గ‌న్‌కు మిన‌హాయింపు ర‌ద్దు చేయాల‌ని సీబీఐ బ‌ల‌మైన వాద‌న‌లు చేసింది. ముఖ్య‌మంత్రి హోదాలో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆ వాద‌న‌లు ముగిశాక‌.. తీర్పు రిజ‌ర్వు చేసింది హైకోర్టు. మ‌ళ్లీ కోర్టుకు హాజ‌రుకాక త‌ప్ప‌దా అనే అనుమానం ఏ1, ఏ2లను వెంటాడుతోంద‌ని అంటున్నారు.  స‌రిగ్గా.. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో ఏ2, వైసీపీలో నెం.2 గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిని, ప్ర‌ధాన మంత్రితో వ‌రుస‌గా భేటీ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేసుల గురించి ఏమైనా మాట్లాడి ఉంటారా? లేక‌, ఇద్ద‌రి అవ‌స‌రాల మేర‌కు పొత్తుల‌పై ఏదైనా చ‌ర్చించారా? అని అనుకుంటున్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌లపై మాత్రం వాళ్ల భేటీ జ‌రిగి ఉండ‌ద‌ని అంటున్నారు. ఎందుకంటే, ఏపీ ప్రాబ్ల‌మ్స్ గురించి అయితే.. విజ‌య‌సాయితో పాటు మిగ‌తా వైసీపీ ఎంపీలు కూడా వెళ్లి ఉండేవారు. ఆయ‌న ఒక్క‌రే అంత ర‌హ‌స్యంగా భేటీ కావాల్సిన అవ‌స‌రం ఇంకేదో ఉంద‌ని భావిస్తున్నారు. జ‌గ‌న్‌పై ఉన్న సీబీఐ కేసుల గురించో.. బీజేపీతో అంట‌కాగేందుకో.. విజ‌యసాయి.. మోదీ, షాల‌ను క‌లిసుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.