ఎంతుంటే అంత ఇచ్చుకోండి.. సీఎంవో ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో వినూత్న పోకడలు పోతోంది. చివరకు ప్రభుత్వ శాఖల వద్ద మిగిలిన చిల్లర పైసలకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్కుర్తి పడుతోందని అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వ శాఖల వద్ద ఎంత మిగులుంటే, అది ఎంత చిన్నమొత్తమే అయినా,చివరకు లక్ష రూపాయలే అయినా ఆ మిగులు మొత్తాన్ని స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్’లో జమ చేయాలని ముఖ్యమంత్రి కార్యలయమే నేరుగా ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాల సమాచారం. అద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల తలుపులు అన్నీ మూసకు పోయిన నేపధ్యంలో డిపార్టుమెంట్ల వద్ద మిగిలిన పైసా పైసా పోగేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నుంచి ప్రభుత్వం స్టేట్ పవర్ కార్పొరేషన్‌కు భారీగా అప్పులు తెచ్చింది. అలా తెచ్చిన అప్పుల్లో మేజర్ షేర్ ఇతర అవసరాలకు వాడుకుంది. స్టేట్ పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ఖాతాలో పైసలు నిండుకున్నాయి, నిజానికి, స్టేట్ పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ను ప్రభుత్వం ఒక సూటుకేసు సంస్థగా వాడుకుందనే ఆరోపణలున్నాయి. కేంద్ర సంస్థల నుంచి తెచ్చిన నిధులను, ఎందుకోసం తెచ్చారో అందుకు ఉపయోగించలేదు. కేంద్ర సంస్థలకు చెల్లించవలసిన నిధులను సకాలంలో తిరిగి చెల్లించనూ లేదు.
చివరికి ఆ సంస్థల ఉన్నతాధికారులే నేరుగా రాష్ట్రానికి వచ్చి... అప్పు కట్టకపోతే జెన్‌కోను ‘డిఫాల్టర్’గా ప్రకటిస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం అప్పటికప్పుడు మారిటైమ్ కార్పొరేషన్ ద్వారా రూ.1500 కోట్లు అప్పు తెచ్చి... అందులో రూ.900 కోట్లను పీఎ్‌ఫసీకి, ఆర్‌ఈసీకి చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అర్థం కావడంతో... పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ తదుపరి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త పథకం వేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని మిగులు నిధులు, నెల వారీగా వచ్చే ఆదాయాన్ని కొన్ని నెలల పాటు స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి అర్జెంట్‌గా డబ్బులు కావాలి. మీ దగ్గరున్న డబ్బులను ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఇవ్వండి. మీ సొమ్ములకు మంచి వడ్డీ కూడా వస్తుంది, అంటూ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చేశాయని అధికార వర్గాల సమాచరం.నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు రావడంతో, డిపార్టుమెంటు హెడ్స్, తమ దగ్గర ఎంత ఉంటే అంత కార్పొరేషన్ కు సమర్పించుకుంటున్నారు.
ఈ విధంగా ప్రభుత్వ శాఖల వద్ద పైసా మిగలకుండా, మొత్తం మిగులు నిధులు ఈ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేస్తే.. ఆ సొమ్మును మొత్తాన్ని పవర్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం లాగేసుకుంటుందని, అధికారులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రభుత్వశాఖల వద్ద కనీసం లక్ష రూపాయలున్నా వదలొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే ఎంతుంటే అంత కనీసం లక్ష ఉన్నా సరే డిపాజిట్‌గా స్వీకరిస్తాం.అని ముఖ్యమంత్రి కార్యాలయం డిపార్టుమెంటు హెడ్స్’కు సందేశాల మీదసందేశాలు పంపుతోందని తెలుస్తోంది. అంతేకాదు, ఆరు నెలల నుంచి పదేళ్ల కాల పరిమితిపై తీసుకునే డిపాజిట్స్ పై కాలపరిమితిని బట్టి వడ్డీ శాతాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఆరు నెలల వరకు 5.5 శాతం వడ్డీ, ఆరు నెలల నుంచి ఏడాదికి 6 శాతం, ఏడాది నుంచి మూడేళ్ల పాటు డిపాజిట్ చేస్తే 6.4 శాతం, మూడేళ్లు దాటితే 6.5 శాతం, ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకూ 7 శాతం, పదేళ్లు దాటితే 8 శాతం వడ్డీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇతర జాతీయ బ్యాంకులకంటే ఎక్కువ గానే వడ్డీ అందిస్తామని ఆశ చూపారు. మీ దగ్గర ఉన్న వనరులు, అదనపు నిధులు, తాత్కాలిక నిధులను పవర్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేసి విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని ఆ సంస్థ సీఎ్‌ఫఓ కోరారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న తమ ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరారు. డిపాజిట్లు ఇచ్చేవరకే శాఖల పని. ఆ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ సొమ్ములు కావాలంటే ఇస్తారా? డిపాజిట్‌ను మధ్యలో రద్దు చేసుకుని, డబ్బులు వెనక్కి తీసుకోవచ్చా? ఇవేవీ తెలియదు.అయితే అధికారులు మాత్రం ఈ డిపాజిట్స్ వెనక్కి వచ్చేవి కాదని, చివరకు ఐపీ ఖాతాలో చేరిపోతాయని, అయినా, కాదనే వీలులేకుండా నిబంధనలు ఫ్రేమ్ చేశారని అంటున్నారు.