సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం
posted on Dec 10, 2021 @ 3:04PM
అదిగో పీఆర్సీ. ఇదిగో పీఆర్సీ. ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం.. త్వరలోనే ప్రకటిస్తాం. ఇలా జగన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల ఫోకస్ మొత్తం పీఆర్సీ చుట్టూనే తిరిగేలా చేస్తోంది. అయితే, సర్కారు ట్రాప్‌కి ఉద్యోగ సంఘాలు అంత ఈజీగా చిక్కేలా లేవు. పీఆర్సీ ప్రకటించినంత మాత్రాన సమస్యలన్నీ తీర్చేసినట్టు కాదంటున్నారు. తమ డిమాండ్లు అన్నిటినీ నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదంటున్నారు. సీపీఎస్ రద్దు చేస్తాననే హామీతో అందలమెక్కిన జగన్‌రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.
సీపీఎస్ రద్దు బాధ్యత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీపీఎస్ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదన్నారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావులు ఆ మేరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
"ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలి. పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్‌సీ ప్రకటించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి. పీఆర్‌సీతో పాటు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా సీఎం జగన్ చొరవ తీసుకోవాలి." అంటూ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు మరోసారి వినిపించాయి.
"పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదు. రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పటివకే ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతాం. సీఎంపై ఉన్న గౌరవంతో మూడేళ్లు ఎదురుచూశాం. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదు. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలి" అని పిలుపునిచ్చాయి ఏపీ ఉద్యోగ సంఘాలు.