మాస్క్ లేకపోతే రూ.25వేలు ఫైన్.. వామ్మో జగనన్న బాదుడే బాదుడు..
posted on Dec 10, 2021 @ 12:31PM
మాస్క్ లేకపోతే ఫైన్. ఇది రొటీన్ న్యూస్. ఇప్పటికే తెలంగాణ సర్కారు మాస్క్ లేకపోతే రూ.1000 ఫైన్ విధించి సంచలనంగా నిలిచింది. కేసీఆరే వెయ్యి వేస్తే.. ఇక తాము మరింత ఫైన్ వేయాలనుకున్నారో ఏమో.. సీఎం జగన్ ఓ రేంజ్‌లో జరిమానా బాదేశారు. ఏకంగా రూ.25వేలు ఫైన్ విధించారు. అయితే, ఈ భారీ మొత్తం ప్రజలపై కాకుండా.. తెలివిగా షాపులకు ఫైన్ వేసేలా ఖతర్నాక్ రూల్ పెట్టారు. పబ్లిక్‌కు మాత్రం వంద రూపాయల ఫైన్‌తో సరిపెట్టారు. జగనన్న నిర్ణయం జనాలకు, షాపు యాజమాన్యాలకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా ఉందంటున్నారు.
ఏపీ ప్రభుత్వం మరోసారి కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ.100 జరిమానా విధించనుంది. మాస్క్ లేని వారిని దుకాణాలకు రానిస్తే.. ఆయా షాపులు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులకు రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసి వేయించనుంది.
మాస్క్ నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్ నెంబర్ 80109 68295 కు సమాచారం అందించాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.