జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పిన‌ట్టేనా? కేబినెట్ పునర్‌వ్య‌వస్థీకరణ లేనట్టేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ వాకింగ్ ప్రాక్టీస్’ చేస్తున్నారా? మాట తప్పను మడమ తిప్పను, అంటూ హామీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు వెనకడుగులు వేస్తున్నారా ? అంటే, అవుననే అంటున్నారు.ముఖ్యమంత్రి అడుగులు వెనక్కి పడుతున్నాయి, ఆయన  బ్యాక్ వాకింగ్ చేస్తున్నారు., అనే సమాధానమే పార్టీ వర్గాల నుంచి వస్తోంది.   మూడు రాజధానుల మొదలు ముఖ్యమంత్రి ఒక్కొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారని, అందుకు వరస పెట్టి ఉదాహరణలు చెపుతున్నారు.అదలా ఉంటే ఇప్పుడు ఆ జాబితాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేరిందనే మాట వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. మంత్రి పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా వాపోతున్నారు. ‘మాట తప్పను, మడప తిప్పను’ అంటూ జనాన్ని నమ్మించి మోసం చేసినట్లుగానే,తమను కూడా ముఖ్యమంత్రి. ‘జగనన్న బాధితుల’ జాబితాలో చేర్చారని పార్టీ ఎమ్మెల్యేలు ప్రైవేటుగా వాపోతున్నారు.  రెండున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తొలి మంత్రివర్గంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు.కానీ,అప్పుడే, రెండున్నరేళ్ళ తర్వాత, మంత్రివర్గాన్ని సమూలంగా మారుస్తానని, కొత్త ముఖాలతో నింపుతానని మాటిచ్చారు. అయితే, ఇప్పుడు రెండున్నరేళ్ళు పూర్తవుతున్న సమయం వచ్చే సరికి ముఖ్యమంత్రి, ‘మాటా లేదు మడమ లేదు. అంతా ‘తూచ్’ అంటూ ఇప్పట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదన్న సందేశాలు పంపుతున్నారు.  నిజానికి రెండుమూడు నెలల క్రితమే, ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తి చేశారని , కొత్త కాబినెట్ జాబితా సిద్దమైందని లీకులు వచ్చాయి. అలాగే, ముఖ్యమంత్రి సన్నిహిత బందువు మంత్రి బాలినేని కూడా, పదవులు వదులుకునేందుకు తనతో సహా మంత్రులందరూ సిద్దం కావాలని అన్నారు. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం , మరో ఐదారు నెలల వరకు పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ ఉండదని తెలుస్తోంది. అయితే ఈ లోగా రాజకీయ అవసరాల రీత్యా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు, స్వల్ప మార్పులు చేర్పులు జరిగితే జరగవచ్చని, ఇటు రాజకీయ వర్గాల్లో అటు అధికార వర్గాల్లో వినవస్తోంది.అంతే కాదు, నిజంగా వచ్చే సంవత్సరం (2022) మే, జూన్ నెలలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినా, ముందుగా అనుకున్నట్లుగా సంపూర్ణ పక్షాళన ఉండదని,  ఓ అరడజనుకు ఒకటి రెండు అటూ ఇటుగా పాత ముఖాలను తొలిగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించి  పార్టీనాయకులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎప్పుడు, ఎలాంటి మార్పులు జరిగినా రాజకీయ సమీకరణల ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయని, గతంలోమాటిచ్చిన విధంగా సమూల పక్షాళ ఉండదని అంటున్నారు.  అయితే, కొవిడ్ కారణంగా  రెండున్నరేళ్ళలో ఎక్కువ కాలం మంత్రులు తమ శాఖల్లో సరిగా ‘పని’ చేయలేక పోయారని, కాబట్టి ఇంకొంత కాలం తమను కొనసాగించాలని కోరిన నేపధ్యంలో ముఖ్యమంత్రి, పొడిగింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే,అసలు కారణం అది కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో తేనే తుట్టెను కదిలిస్తే, అది ఎటు పోయి ఎటుకు దారితీస్తుందో అనే భయంతో పాటుగా, మంత్రి వర్గం మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేస్తే, కొత్త మంత్రులు తమ శాఖలో కుదురుకునే సరికి పుణ్యకాలం పూర్తయి ఎన్నికలు వస్తాయి,కాబట్టి  రాజకీయంగా ఇబ్బందులు  ఎదుర్కోవలసి  వస్తుందనే ముందు చూపుతో, సంపూర్ణ మార్పుకు మంగళం పాడేశారని పార్టీ వర్గాల సమాచారం, అయితే, చివరకు ఏమి జరుగుతుంది, అనేది చివరకు ముఖ్యమంత్రికి కూడా తెలియదని, వైసీపీ నేతలు గుస గుసలు పోతున్నారు.

అక్కడ మూడు రోజులు వీకెండ్.. ఉద్యోగులకు పండగే..

ఉద్యోగులకు వారానికి నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయిస్తూ ఇటీవలేయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యూఏఈ బాటలోనే షార్జా కూడా పని దినాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. షార్జా ఏకంగా మూడు రోజుల వీకెండ్ ప్రకటించింది. అక్కడ వారంలో కేవలం నాలుగు రోజులే పని దినాలు. శుక్ర, శని, ఆదివారం మూడు రోజులు సెలవు. 2022 జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ నిబంధన అమలులోకి వస్తుందని షార్జా అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజుల వీకెండ్‌ నిర్ణయానికి సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా రూలర్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు.  షార్జా కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం షార్జా ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. నాలుగు రోజుల పని దినాల్లో ప్రతి రోజు 8 గంటలు మాత్రమే పని ఉంటుంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల వీకెండ్ ఉంటుంది. ఇక యూఏఈ తీసుకొచ్చిన కొత్త వీకెండ్ నిబంధన ప్రకారం ఆ దేశంలోని ఉద్యోగులకు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 8గంటలు పని చేస్తారు. శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నాలుగున్నర గంటలు మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. అలాగే ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు.   

గులాబీ గూటిలో కౌన్సిల్ గుబులు.. కరీంనగర్ లో షాక్ తప్పదా?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొద్ది గంటల సమయమ మాత్రమే మిగిలుంది. రేపు (డిసెంబర్ 10) పోలింగ్ జరుగుతుంది. నిజానికి ఇటు కరీంనగర్’లో గానీ ఖమ్మం. జిల్లాల్లో గానీ, అధికార పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో పార్టీ అభ్యర్ధులు సునాయాసంగా గెలుస్తారు. అయితే, హుజూరాబాద్ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్లనో ఏమో గానీ అధికార  టీఆర్ఎస్  నేతల్లో  నెలకొన్న అభద్రతాభావం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అనటున్నారు.  అధికార పార్టీకి కొండంత సొంతబలం ఉంది. ప్రత్యర్ధులను చిత్తూ చేసే సంఖ్యాబలం వుంది.   అయినా అధికార పార్టీ భయానికి లోనై  క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది. ఓటు హక్కున్న ఎంపీటీసీ. జడ్పీటీసీ, సభ్యులు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను రాష్ట్రం దాటించి, విందు వినోదాలతో క్యాంపుల్లో క్యాష్ కట్టలతో కట్టి పడేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా సీనియర్ నాయకులు, ఎంపీటీసీ. జడ్పీటీసీ, సభ్యులు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కోరికలు అడిగి తెలుసుకుని, మర్యాదలు చేస్తునట్లు వార్తలొస్తున్నాయి.మెజారిటీకి సరిపడా ఓటర్లు  చేతిలో అధికారం.. పుష్కలంగా వనరులు.. కనుసైగతోనే పనిచేసుకుపోయే పార్టీ యంత్రాంగం.. అయినా ఎమ్మెల్సీలను గెలిపించుకునెందుకు ‘ఓటర్ల’ను  ఎక్కడికో తీసుకుపోయి కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే, అందుకు పార్టీలో భగ్గుమంటున్న అసమ్మతి  ప్రధాన కారణం పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని, బయటనుంచి వచ్చిన వారికీ పార్టీ టికెట్ ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి ఎగసి పడుతోందని అందుకే. అధికార పార్టీ పెద్దలు ఇంతలా అవస్థ పడవలసి వస్తోందని అంటున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే, కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, టీడీపీ నుంచి వచ్చిన ఎల్.రమణకు చెరో టికెట్ ఇవ్వడంతో, ఎప్పటినుంచి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, తెరాసకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగారు. నిజానికి, రవీందర్ సింగ్’కు గెలిచే అవకాశలు ఏ కొంచెం లేఉ . ఎందుకంటే, ఉమ్మడి జిల్లాలో మొత్తం 1300 పైచిలుకు ఓట్లు ఉంటే, అందులో 950 పైగా ఓట్లు తెరాస పక్షానే ఉన్నాయి ..అయినా  రవీందర్ సింగ్’కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతు ఇస్తున్న నేపధ్యంలో జిల్లా మంత్రులు  కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్’ కు ముచ్చెమటలు పడుతున్నాయి. మరో వంక రవీందర్ సింగ్ గెలుపు పై ధీమాగా ఉన్నారు. హుజూరాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని అంటున్నారు.అదెలా, ఉన్నా తెరాస నాయకులు మాత్రం షేక్  అవుతున్నారు.  ఖమ్మం జిల్లాలో కూడా ఒకే ఓకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, జిల్లాలో పలువురు రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నప్పటికీ, ఉద్దండ పిండాలను తోసిరాజంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా టికెట్‌ను తాతా మధుసూదన్‌కు కేటాయించడంతో సేనియర్లు భగ్గు మంటున్నారు. సొంత పార్టీ సేనియర్లకు భయపడి, స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లను గోవాకు తరలించారు. పైకి అంతా బాగాగే ఉందన్నట్టున్నా ఎక్కడో ఏదో తెలీని భయం ఇప్పటికీ గులాబీ నేతల్లో వ్యక్తమవుతునే ఉంది.మరో వంక కాంగ్రెస్‌ కు పెద్దగా ఓట్లు లేకపోయినా తాతా మధు సామాజికవర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు  టికెట్‌ ఇచ్చింది. తెరాసలోని ఒకరిద్దరు ముఖ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థికి దండిగానే వనరులు సమకూర్చినట్టు చెబుతున్నారు. మరోవంక గోవాలో ఏర్పాటు చేసిన క్యాంపులోనూ వివక్ష చూపారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సామాజికవర్గాన్ని బట్టి, స్థాయిని బట్టి ట్రీట్‌ చేశారన్న కారణంగా కొందరు ఓటర్లు హర్ట్‌ అయినట్టు చెబుతున్నారు. కొందరికి ఫ్లైట్‌లలోనూ, మరికొందరికి బస్సులలోనూ ప్రయాణ ఏర్పాట్లు చేయడం.. గోవాలో ఏర్పాటు చేసిన విడిదిలోనూ, విందు వినోదాల్లోనూ ముఖం చూసి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ లెక్కలన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న బెంగ నేతల్లో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తెరాస ఏమాత్రం డ్యామేజి జరిగిన ఇక కారు కదిలడం కష్టమని అందుకే గులాబీ పార్టీలో గుబులు వ్యక్తమవుతోందని అంటున్నారు.

ప్ర‌మాద‌మా? కుట్రా?.. ఉచితంగా ఓటీఎస్‌.. మోదీతో 'సాయి'లీల‌లు.. టాప్‌న్యూస్ @ 7pm

1. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సందేహాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరికొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనే దానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  2. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఉదారత చాటుకున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు చ‌నిపోయిన ఆయ‌న వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.  3. దేశంలో అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రుల్లో జగన్‌ ప్రథమ స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఓటీఎస్‌ పేరుతో పేదలను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎవరూ భయపడవద్దని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు.  4. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదును చేయిస్తామని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో లక్ష సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోని అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన నియోజకవర్గంగా ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీని కొడంగల్‌కు తీసుకువస్తాన‌ని.. కొడంగల్ తనకు గుండె లాంటిదన్నారు రేవంత్‌రెడ్డి.  5. ప్రధాని మోడీతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే, బుధ‌వారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను, గురువారం ప్ర‌ధాని మోదీని విజ‌య‌సాయిరెడ్డి క‌ల‌వ‌డం వెనుక ఏదో ముఖ్య‌మైన‌ రాజ‌కీయ కోణం ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. 6. లోక్‌సభ జీరో అవర్‌లో విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీలు భిన్న స్వరాలు వినిపించారు. విశాఖ రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. రైల్వేజోన్‌పై కేంద్రం పూటకోమాట మాట్లాడుతోందని భరత్‌ విమర్శించారు. అయితే భరత్‌ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా వైసీపీ ఎంపీ సత్యవతి మాట్లాడారు. రైల్వేజోన్‌ ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు సత్యవతి చెప్పారు. 7. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పురోగతి లేదన్నారు. బడ్జెట్‌లోనూ కేవలం రూ. 40 లక్షలు కేటాయించడం.. ఏపీని అవమానించడమేనని అన్నారు. రైల్వేజోన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 8. శ్రీకాళహస్తిలో అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతులు సంఘీభావం తెలిపారు. కుప్పం ఎన్నికలతో పాటు మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం ఉందని ఆరోపించారు. పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షన్ క‌ల్చ‌ర్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రిస్తోంద‌ని.. ఆ హింస‌తో విసిగి పోయామ‌ని పులివెందుల రైతులు అన్నారు.  9. సంచ‌ల‌నం సృష్టించిన శిల్పాచౌద‌రి కేసులో ఆమెను మ‌రో మూడు రోజుల పాటు పోలీస్ క‌స్ట‌డీకి ఇచ్చేందుకు కోర్టు అనుమ‌తించింది. శిల్పాచౌదరిని ఇప్ప‌టికే రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు ఆమె నుంచి ఎలాంటి స‌మాచారం రాబ‌ట్ట‌లేక‌పోయారు. కోర్టు అనుమ‌తితో మ‌రోసారి శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు నార్సింగి పోలీసులు విచారించనున్నారు.  10. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినందునే ఆందోళనను ఉపసంహరించుకున్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం తమ డిమాండ్లను ఆచరణలో పెట్టకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చ‌రించారు.   

మోదీ, షాల‌తో విజ‌య‌సాయి ఏకాంత చ‌ర్చ‌లు.. ఏంటి సంగ‌తి?

బుధ‌వారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. గురువారం ప్ర‌ధాన మంత్రి మోదీని విజ‌య‌సాయి క‌లిశారు. ఈ రెండు మీటింగ్‌లు స‌డెన్‌గా జ‌రిగిన‌వే. ముంద‌స్తు షెడ్యూల్ కానీ, అపాయింట్‌మెంట్ కానీ లేకుండా విజ‌య‌సాయి ఆ ఇద్ద‌రితో ఒంట‌రిగా మాట్లాడారు. ఇది అనూహ్య ప‌రిణామ‌మే. ఇటీవ‌ల కాలంలో ఇలా ఆక‌స్మిక భేటీలు జ‌రిపింది లేదు. ఇప్పుడే స‌డెన్‌గా ఈయ‌న వారిని ఎందుకు క‌లిసిన‌ట్టు? వారు కూడా ఈయ‌న‌తో మాట్లాడాల్సిన అంత అర్జెంట్ మేట‌ర్ ఏముంటుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. ఈ వ‌రుస భేటీల‌ను ప‌లు ర‌కాలుగా విశ్లేషిస్తున్నారు. గ‌తంలో సీఎం జ‌గ‌న్‌కే మోదీ, అమిత్‌షాల అపాయింట్‌మెంట్ అంత ఈజీగా దొరికేది కాదు. ఢిల్లీ వెళ్లి ప‌డిగాపులు పడి.. ఒట్టిచేతుల‌తో తిరిగొచ్చిన దాఖ‌లాలు ఉన్నాయి. అలాంటిది, విజ‌య‌సాయిరెడ్డి మాత్రం బుధ‌వారం షాను.. గురువారం మోదీని క‌ల‌వ‌డం కాక‌తాళీయం మాత్రం కాదు. ఇది ప‌క్కా అనూహ్య‌మే అంటున్నారు. ఇంత‌కీ వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏమై ఉంటుంద‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఎప్ప‌టిలానే రొటీన్‌గా.. మ‌ర్యాద‌పూర్వ‌క స‌మావేశం, రాష్ట్ర స‌మ‌స్య‌లు, విభ‌జ‌న హామీలంటూ పైకి ఏదో చెప్పినా.. లోలోన మాత్రం ఇంకేదో జ‌రుగుతోంద‌నే అనుమానం రాక‌మాన‌దు.  ఇటీవ‌ల జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఏపీలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. ఓటీఎస్‌పై ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తుతోంది. భువ‌నేశ్వ‌రి టాపిక్‌, చంద్ర‌బాబు క‌న్నీటి ఎపిసోడ్‌తో అధికార పార్టీని అంతా అస‌హ్యించుకుంటున్నారు. అటు హైకోర్టులో అక్ర‌మ ఆస్తుల కేసులో కీల‌క వాద‌న‌లు ముగిశాయి. కోర్టు హాజ‌రు నుంచి సీఎం జ‌గ‌న్‌కు మిన‌హాయింపు ర‌ద్దు చేయాల‌ని సీబీఐ బ‌ల‌మైన వాద‌న‌లు చేసింది. ముఖ్య‌మంత్రి హోదాలో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆ వాద‌న‌లు ముగిశాక‌.. తీర్పు రిజ‌ర్వు చేసింది హైకోర్టు. మ‌ళ్లీ కోర్టుకు హాజ‌రుకాక త‌ప్ప‌దా అనే అనుమానం ఏ1, ఏ2లను వెంటాడుతోంద‌ని అంటున్నారు.  స‌రిగ్గా.. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో ఏ2, వైసీపీలో నెం.2 గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిని, ప్ర‌ధాన మంత్రితో వ‌రుస‌గా భేటీ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేసుల గురించి ఏమైనా మాట్లాడి ఉంటారా? లేక‌, ఇద్ద‌రి అవ‌స‌రాల మేర‌కు పొత్తుల‌పై ఏదైనా చ‌ర్చించారా? అని అనుకుంటున్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌లపై మాత్రం వాళ్ల భేటీ జ‌రిగి ఉండ‌ద‌ని అంటున్నారు. ఎందుకంటే, ఏపీ ప్రాబ్ల‌మ్స్ గురించి అయితే.. విజ‌య‌సాయితో పాటు మిగ‌తా వైసీపీ ఎంపీలు కూడా వెళ్లి ఉండేవారు. ఆయ‌న ఒక్క‌రే అంత ర‌హ‌స్యంగా భేటీ కావాల్సిన అవ‌స‌రం ఇంకేదో ఉంద‌ని భావిస్తున్నారు. జ‌గ‌న్‌పై ఉన్న సీబీఐ కేసుల గురించో.. బీజేపీతో అంట‌కాగేందుకో.. విజ‌యసాయి.. మోదీ, షాల‌ను క‌లిసుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. 

దొంగ బంగారం కేసులో వైసీపీ నేతలు అరెస్ట్? 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమ దందాలు చేస్తున్నారు. అయితే కొందరు వైసీపీ నేతలు అతిగా చేస్తూ  పోలీసులకు పట్టుబడుతున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలుగా ఉన్నారు కాబట్టి. ఎలాగోలా బయటపడుతున్నారు. కాని పక్క రాష్ట్రాల్లో మాత్రం వీళ్ల పప్పులు ఉడకడం లేదు. గతంలో పలువురు వైసీపీ నేతలు తెలంగాణలో అరెస్ట్ అయ్యారు. తాజాగా వైసీపీ నేతలను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. హిందూపురం వైసీపీ నేతల పలువురిని కర్ణాటక పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దొంగ బంగారం వ్యవహారంలో హిందూపురం వైసీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో ఓ దొంగల ముఠాను అదుపులోకి తీసుకొని కర్ణాటక పోలీసులు విచారణ నిర్వహించారు. ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు హిందూపురంలోని ముగ్గురు వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకెళ్లారు.  తమను తీసుకెళుతుండగా కర్ణాటక పోలీసుల వాహనాలను అడ్డుకొని వైసీపీ నేతలు రచ్చ చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్న వైసీపీ నేతలను కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్లారు. వైసీపీ నేతల అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. తమ పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు కర్ణాటక పోలీసులతో కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 

రైల్వేజోన్‌పై నిల‌దీసిన రామ్మోహ‌న్‌.. లోక్‌స‌భ‌లో కేంద్రానికి క్వ‌శ్చ‌న్స్‌..

టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు. ఆయ‌న మైక్ ప‌ట్టుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసుగా. గ‌తంలో పార్ట‌మెంట్‌లో స్పెష‌ల్ స్టేట‌స్‌పై రామ్మోహ‌న్ చేసిన ప్ర‌సంగం చారిత్ర‌కం అంటారు. ఇప్ప‌టికీ ఆ స్పీచ్ అనేక మంది చెవుల్లో మారుమోగుతుంటుంది. తాజాగా, ఆయ‌న విశాఖ రైల్వేజోన్‌పై లోక్‌స‌భ‌లో మాట్లాడారు. కేంద్రం తీరును తీవ్రంగా నిర‌సించారు. దేశంలో కొత్త‌గా రైల్వేజోన్లు ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై రామ్మోహ‌న్ నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్‌ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్‌సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని త‌ప్పుబ‌ట్టారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారనీ, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమే అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశాన్ని కేంద్రం ఎందుకు చేర్చలేదని ప్ర‌శ్నించారు. ఈ రెండు జాబితాలోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. రైల్వే జోన్‌ ఏర్పాటు, ఎంత బడ్జెట్‌ కేటాయిస్తున్నారో చెప్పాలని.. ఏపీ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు. 

బ్లాక్ బాక్స్ లో అంతా భద్రం..  మిస్టరీ హిస్టరీ సేఫ్‌..

విమాన, చాపర్ ప్రమాదాలు జరగగానే బ్లాక్ బాక్స్‌ తెరపైకి వస్తుంది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. ఇప్పటికే బ్లాక్ బాక్స్ అనేది ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై వాయుసేన దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో బ్లాక్స్ బాక్సే కీలకం కానుంది. హెలికాప్టర్‌ ప్రమాదస్థలిని పరిశీలించిన వాయుసేన అధికారులు  బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. బ్లాక్ బాక్స్ లో నమోదైన సంభాషణలను డీకోడ్ చేస్తూ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..? డేటాను ఎలా నిక్షిప్తం చేసుకుంటుంది?  బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇందులో రికార్డు అవుతుంటాయి. ఒకవేళ రేడార్ సిగ్నల్స్‌ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు చేస్తారు. విమానంలో ఎంతో మంది ప్రాణాలు ఉంటాయి. కాబట్టి బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ప్రతి విమానంలోను ఉండాలనేది విమానాయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు.  బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా  ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుంది.  బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే ఎందుకు అమరుస్తారు..? బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఇక్కడే ఎందుకు అమరుస్తారంటే ఇది చాలా సురక్షితమైన చోటని నిపుణులు చెబుతున్నారు.  విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వసం కాదు కాబట్టి ఇక్కడే బ్లాక్ బాక్స్‌ను అమరుస్తారు. అదే కాక్ పిట్ అయితే ఎక్కువగా ధ్వంసమయ్యే ఛాన్సెస్ ఉంటాయి.  బ్లాక్ బాక్సులో ఏముంటాయి? ఎలా పని చేస్తుంది? బ్లాక్ బాక్సులో రెండు కాంపొనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లయిట్ డేటా రికార్డర్ (FDR) రెండోది కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (CVR).FDR విమానంకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అంటే ట్రాజెక్టరీ, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది. వేగం, ఇంధనం ఎంత ఉంది, ఇంజిన్ థ్రస్ట్ లాంటి ముఖ్య పారామీటర్ల సమాచారం స్టోర్ చేస్తుంది ఎఫ్‌డీఆర్. అంతేకాదు విమానం ప్రతి కదలికను రికార్డు చేస్తుంది. అంతేకాదు ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు.. ల్యాండింగ్ గేర్‌ వేయడంలో జాప్యం జరిగిందా, లేదా పాక్షికంగా ధ్వంసమైందాలాంటి అంశాలను కూడా ఎఫ్‌డీఆర్ రికార్డు చేస్తుంది.  ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌ కాక్‌పిట్‌లో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేస్తుంది. పైలట్ల సంభాషణ నుంచి ఏటీసీతో పైలట్ల సంభాషణ వరకు ప్రతిదీ రికార్డు అవుతుంది.  ప్రమాదంకు ముందు అరగంట ఏం జరిగిందనేదే కీలకం ఇక పైలట్ ఎక్కడైనా సమస్య ఎదుర్కొన్నారా.. లేక విజిబులిటీ, లేదా వాతావరణ ఇబ్బందులను ఏటీసీకి తెలిపారా..? ప్రమాదం ముందు కాక్‌పిట్‌లో ఏంజరిగింది? వంటి కీలక విషయాలను సీవీఆర్ బయటపెడుతుంది. సీవీఆర్ అందించే నివేదిక ఆధారంగానే ఇది సాంకేతిక సమస్యతో విమాన ప్రమాదం జరిగిందా లేక మానవతప్పిదంతో ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ధృవీకరిస్తారు. ఇవన్నీ ఒక మెటల్ బ్లాక్‌లోని మెమొరీ బోర్డుపై స్టోర్ అయి ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత దీన్ని వెలికి తీసి డీకోడ్ చేస్తారు.  ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. అయితే క్షణాల్లో, నిమిషాల్లో జరిగే ప్రమాదాలు బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తం కావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. 

ఢిల్లీ సరిహద్దుల్లో  రైతుల ధర్నా ముగిసింది 

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సర కాలం పైగా, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిన నేపధ్యంలో ఆందోళన విరమించాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ఆ ప్రక్రియ అంతా చకచకా సాగిపోయింది. నూతన సాగు చట్టాలు రద్దయ్యాయి. అయినా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని చెబుతూ రైతులు నిరసనలు కొనసాగిస్తూ వచ్చారు. వీటిపైనా సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కిసాన్ మోర్చా సమావేశమైంది. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి.. తుది నిర్ణయం తీసుకుంది. నిరసనలకు ముగింపు పలికినట్లు మోర్చా ప్రకటించింది.  ఈ నేపథ్యంలో రైతులు.. తమ టెంట్లను తీసివేస్తున్నారు. దిల్లీ- హరియాణా సింఘూ సరిహద్దు వద్ద నిరసన స్థలాల వద్ద ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను తొలగిస్తున్నారు.రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు. హామీల అమలుకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులు దిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేయనున్నారు.

రావ‌త్ అప్పుడు బ‌తికే ఉన్నారు.. మంచినీళ్లు అడిగారు.. ప్ర‌త్య‌క్ష సాక్షుల మాట‌ల్లో..

సీడీఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. పొగ‌మంచు వ‌ల్ల కుప్ప‌కూలింద‌ని అంటున్నారు. ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రిపించాల‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి డిమాండ్ చేశారు. పెద్ద కార‌ణాలు లేకుండానే.. ఆర్మీ హెలికాప్ట‌ర్ కూల‌డం.. అందులో సీడీఎస్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించ‌డం సంచ‌లనంగా మారింది. గంట‌ల త‌ర‌బ‌డి ఆయ‌న మృతిపై ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇంత‌కీ.. ఆ స‌మ‌యంలో అక్క‌డ అస‌లేం జ‌రిగింది? ప్ర‌త్య‌క్ష సాక్షి ఎవ‌రైనా ఉన్నారా? ఉంటే, వారి వ‌ర్ష‌న్ ఇప్పుడు కీల‌కం కానుంది.  హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని, అయితే ఆయనే రావత్‌ అనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్‌ కూలిన ఘటన, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఆ వివ‌రాలు వారి మాట‌ల్లోనే... "మధ్యాహ్నం సమయంలో మేం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో భారీ శబ్దం వినిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కన్పించింది. దట్టమైన పొగ రావడంతో ముందు మాకెవరూ కన్పించలేదు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నారు. మేం వారి దగ్గరకు వెళ్లాం. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను మంచినీళ్లు కావాలని అడిగారు. మేం ఆయనను బెడ్‌షీట్‌ సాయంతో బయటకు లాగాం. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయనను తీసుకెళ్లారు. నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్‌ జనరల్‌ రావత్‌ అని నాకు తర్వాత కొందరు వ్యక్తులు చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అప్పుడే తెలిసింది. ఈ దేశం కోసం ఎంతగానో సేవ చేసిన వ్యక్తికి నేను మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయా" అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.  రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు సీనియర్ ఫైర్‌మ్యాన్‌ ఒకరు తెలిపారు. అందులో ఒకరు సీడీఎస్‌ రావత్‌ అని అన్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రక్షణశాఖ సిబ్బందికి లోగొంతుకతో తన పేరును చెప్పారని తెలిపారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మరణించారని అన్నారు. గాయపడిన మరో వ్యక్తి గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టిందన్నారు.  

ప్రమాదమా.. కుట్రా? బిపిన్ రావత్ మరణంపై సందేహాలు? 

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం దేశ ప్రజలను, ఆర్మీ వర్గాలను కలవరానికి గురి చేసింది.  అత్యంత భద్రత, సురక్షితమైనదిగా చెబుతున్న MI-17v5 హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించింది రష్య‌న్ మేడ్‌ అత్యంత సుర‌క్షిత‌మైన‌ హెలికాప్ట‌ర్‌. ప్ర‌ధాని మోదీ సైతం ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంఐ హెలికాప్ట‌రే వాడుతారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. అయినా కునూరు ఘ‌ట‌న‌లో హెలికాప్ట‌ర్ నుంచి మంట‌లు చెల‌రేగాయ‌ని అంటున్నారు.   MI-17v5 హెలికాప్ట‌ర్‌లో అత్యాధునిక ఏవియానిక్స్‌ ఉండటంతో ఏ వాతావరణ ప‌రిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా దీనిని రూపొందించారు. 36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల పేలోడ్‌ను తరలించగలదు. తాజా ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్‌తో స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్నారు. అంటే, ఇది ఓవ‌ర్ లోడ్ ఏమీ కాదు. ఈ హెలికాప్ట‌ర్‌ అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆర్మీ ఆప‌రేష‌న్స్‌తో పాటు ప్ర‌కృతి విప‌త్తులు, సహాయక చర్యల్లో కూడా దీనిని వినియోగిస్తున్నారు.  MI-17v5 సిరీస్‌ హెలికాప్ట‌ర్‌తో ఇప్పటి వరకు ఎలాంటి భారీ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఏకంగా సీడీఎస్‌ ప్రయాణిస్తు హెలికాప్ట‌రే కుప్ప‌కూల‌డంతో కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సందేహాలు ఉన్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ హెలికాప్టర్‌గా చెప్తూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా సరిచూశానని, అది వాస్తవానికి సిరియన్ వైమానిక దళానికి చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై వరుస ట్వీట్లు చేసిన సుబ్రమణ్య స్వామి..  సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరికొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనేదానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. దేశ భద్రతకు ఇది చాలా పెద్ద హెచ్చరిక అన్నారు సుబ్రమణ్య స్వామి. తమిళనాడు వంటి సురక్షిత ప్రాంతంలో ఓ సైనిక హెలికాప్టర్ పేలిందని, అలా కనిపిస్తోందని అన్నారు. దీనిపై చాలా చాలా కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు.   

ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేస్తారా?

చట్టం ముందు అందరూ సమానమే కానీ, రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ సమానమని సామాన్యులు అనుకుంటే, కాదనేందుకు కారణాలు కనిపించవు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మొదలై, ఇంచుమించుగా పుష్కరకాలం పూర్తయింది. అయినా, విచారణ సాగుతూనే వుంది.. ఓ వంక రాజకీయ నాయకుల మీద వున్న కేసులును విచారణ వేగంగా పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడోనే చెప్పిందంటారు.కానీ, వాస్తవంలో ఏమి జరుగుతున్నదో వేరే చెప్పనక్కరలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ క్రతువు చూస్తే, చట్టం ముందు అందరూ సమానం కాదు అనుకోవలసి వస్తుందని సామాన్యులు అనుకుంటున్నారు.  నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద ఒకటి కాదు, 11 ఈడీ కేసులు, 12 సీబీఐ కేసులు మొత్తం 23  కేసులున్నాయి. అయినా ఆయన రాజకీయ,ఆర్థిక,వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి అవరోధం లేకుండా సాగిపోతున్నాయి.ఓ పదహారు నెలలు జైల్లో ఉన్నా, బెయిలు పై బుయటకు వచ్చిన తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని, కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహయింపు పొందుతున్నారు. ఈ మినహాయింపు వలన విచారణ మరింత జాప్యం అవుతోంది సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఈ కేసులోఏం తీర్పు రాబోతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అదేశిస్తే ఈ కేసులో కీలక పరిణామాలు జరగవచ్చని తెలుస్తోంది. విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది పలు అంశాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు కోర్టుకు వివరించి  ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.ఈ నేపద్యంలో కోర్టు ఎలా ఉంటుంది అనేది అత్యంత కీలకంగా మారిందని అంటున్నారు. తీర్పు తిరగబడితే రాజకీయంగా తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు.   హై కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏమి చేయాలనే దానిపై ఇప్పటికే,  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉన్నాఆమార్గంలో వెళ్లరాదని, నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంలో అ వసరం అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు ముఖ్యమంత్రే కేంద్ర బిందువుగా ఉన్నారు. మంత్రులు సలహాదారులు ఎందరున్నా, ప్రభుత్వ పాలనా సింగిల్ మ్యాన్ షో గానే సాగుతున్న నేపధ్యంలో, పేస్ మారిస్తే ప్రయోజనం ఉంటుందని  పీకే. జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ ఆలోచనకు కొనసాగింపుగా  కోర్టులకు సహకరించడం ద్వారా జగన్ వ్యక్తిగత ఇమేజిని పెంచుకునే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే, బీహారు మాజీ  ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రూట్ లో శ్రీమతి భారతిని ముఖ్యమంత్రి చేయడం కాదంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రూట్లో, నమ్మినబంటుకు బాధ్యతలు అప్పగించి రిమోట్ కంట్రోల్ పాలన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ఏదైనా, అంతిమ నిర్ణయం హై కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. 

100 ఏళ్లనాటి పెంకుటిల్లుకు ఓటీఎస్.. జగనన్న సర్కారా మజాకా! 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్ ) పైనే రచ్చ రచ్చ అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ పై జనాలు భగ్గుమంటున్నా మొండిగా ముందుకు వెళుతోంది జగన్ సర్కార్. ఎవరికి బలవంతం లేదు.. స్వచ్ఛందమే అని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం జనాలను బెదిరిస్తూ అధికారులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సీరియస్ గా ఆదేశాలు ఉండటం వల్లే తాము ఓటీఎస్ అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కార్యక్రమంలో చిత్ర విచిత్రా లు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించి న పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎస్ లో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి  డబ్బులు చెల్లించాలని చెప్పారు. అంతేకాదు ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ బుర్రే శ్రీధర్‌ వచ్చి ఇంటి కొలతలు తీయాలని చెప్పటంతో దంపతులు అవాక్కయ్యారు. ఆ ఇంటి పై ఎలాంటి రుణం పొందలేదని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై హౌసింగ్‌ ఏఈ మల్లిఖార్జునరావును వివరణ కోరగా.. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.  కృష్ణాజిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో 96 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును లింగమనేని వెంకటసుబ్బమ్మ, రాజారావు వద్ద నుంచి 1981లో దండమూడి రాజగోపాలరావు-లక్ష్మి దంపతులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులోనే నివసిస్తున్నారు. అయితే ఓటీఎస్ లో భాగంగా 1996-97లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇండ్ల జాబితాలో రాజగోపాలరావు కు చెందిన పెంకుటిల్లు పేరును కూడా అధికారులు చేర్చారు. దీంతో స్థానిక వలంటీర్‌ తేజస్వి  వాళ్ల ఇంటికి వచ్చి ఓటీఎస్ జాబితాతో  పేరు ఉందని  చెప్పింది. ఇలాంటి ఘటనలు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన ఇండ్లకు ఓటీఎస్ పేరు చెప్పి డబుల్ కట్టాలని డిమాండ్ చేయడంపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

లాక్‌డౌన్ టైమ్‌లో పీఎంవోలో పార్టీలు.. పార్ల‌మెంట్‌లో క్షమాపణలు చెప్పిన ప్ర‌ధాని..

ఏడాది కింద‌టి విష‌యం. దేశ‌మంతా లాక్‌డౌన్‌. ప్ర‌జ‌ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్నాయి. ఎలాంటి పండుగ‌లూ, వేడుక‌లూ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే.. జ‌రిమానాలు వేస్తామ‌నే హెచ్చ‌రికలు జారీ అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా ఇంత‌టి క‌ఠిన నిబంధ‌న‌లు విధించిన దేశ ప్ర‌ధాని కొలువుదీరి ఉన్న పీఎంవో ఆఫీసులోనే లాక్‌డౌన్ స‌మ‌యంలో గ్రాండ్ పార్టీలు జ‌రిగితే..? విందు, వినోదం.. ఆట‌, పాట‌ల‌తో ప్ర‌ధాని కార్యాల‌య సిబ్బంది సంబ‌రాలు చేసుకుంటే..? అంత‌కంటే దారునం ఇంకేమైనా ఉంటుందా? ఆంక్ష‌లు విధించిన పాల‌కుల స‌న్నిధిలోనే అధికారులు అలా పార్టీలు చేసుకోవ‌డం ఏమ‌న్నా సమంజ‌స‌మా? అందుకు దేశ ప్ర‌ధాని జాతికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌ప్పు చేసిన అధికారుల‌పై వేటు వేశారు. ఈ విష‌యం బ్రిట‌న్‌లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌. కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్నారు. లాక్‌డౌన్‌పై జోకులు వేసుకున్నారు. దేశ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్న‌ సమయంలో వారు చేసిన నిర్వాకం ఏడాది తర్వాత తాజాగా వెలుగు చూసింది. ఆ వీడియో దృశ్యాలు లీకవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటులో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పీఎంవో లో జ‌రిగిన పార్టీపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. 2020 డిసెంబరు 18న ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా విస్మరించి క్రిస్మస్‌ పార్టీ జరుపుకున్నారు. విందుతో పాటు ఆటలు, పాటలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. క‌ట్ చేస్తే.. నాలుగు రోజుల త‌ర్వాత ప్రధాని కార్యాలయ సిబ్బంది తాము చేసుకున్న పార్టీని గుర్తు చేసుకుని జోకులు వేసుకున్నారు. తెగ న‌వ్వుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు లీక్ కావ‌డంతో ఏడాది త‌ర్వాత విష‌యం వెలుగు చూసింది. ప్రభుత్వ ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ పరిహాసపు మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డ‌య్యాయి. మరో అధికారి జ‌ర్న‌లిస్ట్‌లా యాక్ట్ చేస్తూ.. క్రిస్మస్‌ పార్టీ గురించి ప్రెస్ సెక్రెట‌రీని ప్రశ్నిస్తూ కామెడీ స్కిట్ చేసిన‌ట్టు ఆ వీడియోలో ఉంది.  ఈ వ్యవహారంపై విపక్ష లేబర్‌ పార్టీ నేత స్టార్మర్‌.. ప్రధాని జాన్సన్‌ను నిలదీశారు. దీంతో పార్ల‌మెంట్‌లో బోరిస్‌ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత.. లీకైన వీడియోలో కనిపించిన ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ తన పదవికి రాజీనామా చేశారు.   

2021లో టాప్ గూగుల్ ట్రెండ్స్ ఏంటో తెలుసా..?

బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. వెంట‌నే జ‌నాలంతా గూగుల్‌లో వెతికారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ తెలుసుకున్నారు. రావ‌త్ అనే కాదు.. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మాచారం కావాల‌న్నా.. గూగుల్ త‌ల్లిని అడిగేస్తుంటారు. క‌రోనా టైమ్‌లో అయితే.. గూగులే అంద‌రికీ దిక్చూచిగా నిలిచింది. ఇక క్రికెట్ మ్యాచ్‌లు అయితే.. గూగుల్‌లో లైవ్ అప్‌డేట్స్ చూడాల్సిందే. ఇలా.. 2021లో గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలిచిన టాపిక్స్ ఏంటో తెలుసా...? తాజాగా, 2021లో భారతీయులు గూగుల్‌ లో ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. అవేంటంటే.... లాస్ట్ ఇయ‌ర్‌లానే.. ఈ ఏడాది కూడా కరోనా, వ్యాక్సినేష‌న్ టాపిక్‌ టాప్‌లో నిలుస్తుంది అనుకున్నారు. కానీ, క‌రోనా సెర్చ్‌ను దాటేసి.. క్రికెట్ దూసుకుపోయింది. ఇండియాలో ఐపీఎల్‌కు ఎంత ఆద‌ర‌ణ ఉందో చాటిచెప్పింది. ఈ ఏడాది ఎక్కువ మంది ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ గురించి ఎక్కువగా వెతికారు. టాప్‌ 10 జాబితాలో ఐపీఎల్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా.. కొవిన్‌ పోర్టల్ సెకండ్ ప్లేస్‌లో, ఐసీఐసీఐ టీ20 వరల్డ్‌ కప్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో యూరో కప్‌, టోక్యో ఒలింపిక్స్‌ నిలిచాయి.  1. ఐపీఎల్ |   2. కొవిన్ పోర్టల్‌ |   3. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ |   4. యూరో కప్‌ |   5. టోక్యో ఒలింపిక్స్‌ |   6. కొవిడ్ వ్యాక్సిన్‌ |   7. ఫ్రీ ఫైర్‌ రిడీమ్ కోడ్‌ |   8. కోపా అమెరికా   9. నీరజ్‌ చోప్రా |   10. ఆర్యన్‌ ఖాన్‌   మూవీ కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ సినిమా గురించే గూగుల్‌ చేశారు. జై భీమ్‌ తర్వాత ఎక్కువగా షేర్షా సినిమా గురించి వెతికారు. ఇక మిగ‌తా టాప్ 10 మూవీ సెర్చెస్ ఏంటంటే.. 1. జై భీమ్‌ | 2. షేర్షా | 3. రాధే | 4. బెల్‌బాటమ్‌ | 5. ఎటర్నల్స్‌ | 6. మాస్టర్‌ | 7. సూర్యవంశీ | 8. గాడ్జిల్లా vs కాంగ్ | 9. దృశ్యం 2 | 10. భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా   వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలిపింక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో ఇండియాకు గోల్డ్ మెడ‌ల్‌ అందించిన నీరజ్‌ చోప్రా గురించి ఎక్కువ మంది యూజర్స్ గూగుల్ చేశారు. తర్వాత షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్ కోసం వెతకగా, మూడో స్థానంలో నటి షెహనాజ్‌ గిల్‌, నాలుగులో రాజ్‌ కుంద్రా, ఐదులో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. ఇక టాప్ 10లో ఉన్నావారు ఎవ‌రంటే... 1. నీరజ్‌ చోప్రా | 2. ఆర్యన్‌ ఖాన్‌ | 3. షెహనాజ్‌ గిల్‌ | 4. రాజ్‌ కుంద్రా | 5. ఎలాన్‌ మస్క్‌ | 6. విక్కీ కౌశల్ | 7. పీవీ సింధు | 8. బజరంగ్‌ పునియా | 9. సుశీల్‌ కుమార్‌ | 10. నటాషా దలాల్‌   Near Me అంటూ అందుబాటులో ఉన్న సేవల గురించి వెతికే జాబితాలో ఎక్కువ మంది కొవిడ్‌కు సంబంధించిన సమాచారం గూగుల్ చేశారట.  1. కొవిడ్ వ్యాక్సిన్‌ |   2. కొవిడ్ టెస్ట్‌ |   3. ఉచిత ఫుడ్ డెలివరీ |   4. ఆక్సిజన్ సిలిండర్‌ |   5. కొవిడ్ ఆస్పత్రి |   6. టిఫిన్‌ సర్వీస్‌ |   7. సీటీ స్కాన్‌ |   8. టేకవుట్ రెస్టారెంట్ |   9. ఫాస్టాగ్‌ |   10. డ్రైవింగ్ స్కూల్‌   What is.. అంటే ఏమిటీ.. అంటూ నెటిజ‌న్లు ఆస‌క్తిగా సెర్చ్ చేసిన అంశాలు ఈ ఏడాదిలో చాలానే ఉన్నాయి. అందులో ప్ర‌ముఖంగా సెర్చ్ చేసిన టాపిక్స్ ఇవే... 1. బ్లాక్‌ఫంగస్‌ | 2. ఫాక్టోరియల్ ఆఫ్‌ హన్రెండ్‌ | 3. తాలిబన్‌ | 4. అఫ్గాన్‌లో ఏం జరుగుతోంది | 5. రెమెడెసివిర్‌ | 6. స్క్వేర్‌ రూట్‌ ఆఫ్‌ 4 | 7. స్టెరాయిడ్ | 8. టూల్‌కిట్‌ | 9. స్క్విడ్‌ గేమ్‌ | 10. డెల్టా ప్లస్ వేరియంట్    How To.. ఎలా చేయాలి అంటూ ఎక్కువ మంది గూగుల్ చేసిన టాపిక్స్ ఏంటంటే..  1. కొవిడ్ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ | 2. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ | 3. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవడం | 4. పాన్‌-ఆధార్‌ లింక్‌ | 5. ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ | 6. ఇండియాలో క్రిప్టోకరెన్సీ కొనుగోలు | 7. బనానా బ్రీడ్ తయారీ | 8. ఐపీఓ కేటాయింపులు | 9. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు | 10. మార్కుల పర్సంటేజ్ లెక్కింపు   ఇక‌, వంటల కేటగిరీలో ర‌క‌ర‌కాల డిషెష్ గురించి శోధించారు నెటిజ‌న్లు. వాటిలో పుట్టగొడుగులు, ఆవిరి కుడుములు, మెతీ మటర్‌ మలాయి, పాలక్‌, చికెన్‌ సూప్‌ల గురించి ఎక్కువగా వెతికినట్లు గూగుల్ సంస్థ‌ తెలిపింది.  ఇక న్యూస్ త‌దిత‌ర అంశాల్లో.. టాప్ 10 గూగుల్ టాపిక్స్‌... 1. టోక్యో ఒలిపింక్స్‌ | 2. బ్లాక్ ఫంగస్‌ | 3. అఫ్గాన్ వార్తలు | 4. పశ్చిమబెంగాల్ ఎన్నికలు | 5. ట్రాపికల్‌ సైక్లోన్‌ | 6. లాక్‌డౌన్‌ | 7. సూయజ్‌ కెనాల్ క్రైసిస్‌ | 8. రైతుల నిరసన | 9. బర్డ్‌ ఫ్లూ | 10. సైక్లోన్‌ యాస్‌  

రావత్ కు నివాళి.. బ్లాక్ బాక్స్ లో ఏముంది.. జగన్ యూ టర్న్.. టాప్ న్యూస్@1PM

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి  పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయసభల్లో  ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.  --- తమిళనాడులోని కున్నూర్‌ సమీపంలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయిన చోట బీతావహ వాతావరణం కనిపించింది. ప్రమాదస్థలిని వాయుసేన అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌బాక్స్‌ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది. దీన్ని డీకోడ్‌ చేసేందుకు ఢిల్లీకి తరలిస్తున్నారు అధికారులు. . ------ ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో జిల్లా వాసి సాయితేజ మరణించడంతో స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సంద్రంలో ఉన్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సాయి తేజ మృతదేహం గ్రామానికి చేరుకోనుంది. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అధికార యంత్రాంగం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది. ------- గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59ను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో  ఏపీ సర్కార్ జీవో నెంబరు 59ను జారీ చేసింది.  ------- జీజీహెచ్‌లో మూడోరోజు జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అర్బన్, జిల్లా కలెక్టర్‌లకు వినతి పత్రాలు అందజేశారు. వైద్యులపై దాడులు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. తమపై దాడి చేసిన రాజకీయ పార్టీ వ్యక్తులను అరెస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు ------ వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎస్‌లో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి ఓటీఎస్‌లో భాగంగా డబ్బులు చెల్లించాలని ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. దీందో వృద్ధ దంపతులు కంగుతిన్నారు.  ------- ఒక దీక్ష... ఒక విజయం.. ఒక యాది...' అంటూ 2009, డిసెంబరు 9ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేస్తోన్న స‌మ‌యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం  తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ---- కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో ఎంపీ ధర్మపురి అరవింద్  భేటీ అయ్యారు. బైంసా అల్లర్ల అనంతరం పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ పిర్యాదు చేశారు. నలుగురు కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంఐఎం నేతల ఆదేశాల అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని ఎంపీ తెలియజేశారు.  -- పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం వేమనీడు త్రినాధబాబు అనే వ్యక్తిని ముఠా కిడ్నాప్ చేసింది. త్రినాధ్ బాబు తండ్రికి ఫోన్ చేసి లక్షన్నర రూపాయలను ముఠా డిమాండ్ చేసింది. ఈ కిడ్నాప్‌కు సంబంధించి వెంటనే స్పందించిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ముఠాను అరెస్టు చేసి,  త్రినాధ్ బాబును విడిపించారు.  --- ప్రకాశం జిల్లా  పెద్దారవీడు మండలం గోబ్బురు వద్ద విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరు స్వెటర్స్ అమ్ముకునేందుకు బైక్‌పై వెళ్తుండగా మంత్రి సురేష్ కాన్వాయ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బాడిగ మహేష్‌, క్షతగాత్రురాలు ఆయన భార్య మహేశ్వరిగా గుర్తించారు.  -------

జగన్ సర్కార్ మరో యూ టర్న్.. గ్రామ కార్యదర్శులపై జీవో వెనక్కి

ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో యూ టర్న్ తీసుకుంది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59ను  వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జీఓను ఉపసంహరించి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో  ఏపీ సర్కార్ జీవో నెంబరు 59ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. గ్రామ కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీసు డ్రస్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ సర్కార్ న్యాయస్థానానికి వెల్లడించింది. 

బిపిన్ రావత్ తర్వాత  సీడీఎస్ అతనే!

హెలికాప్టర్ ప్రమాదంలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మికంగా మృతి చెందారు. తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే.. తదుపరి సీడీఎస్ ఎవరనే అంశంపై ఊహాగానాలు ఇప్పడు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దేశ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చైనా దూకుడు చర్యలతో కవ్విస్తుండడంతో వీలైనంత తొందరగానే కొత్త సీడీఎస్ ను కేంద్రం నియమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సీడీఎస్ పోస్టు కొత్తగా సృష్టించింది కనుక బిపిన్ రావత్ తర్వాత సీనియర్ అంటూ ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో దేశ త్రివిధ దళాల్లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ను సీడీఎస్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో చూసుకుంటే త్రివిధ దళాల్లోనే జనరల్ బిపిన్ రావత్ తర్వాత అత్యంత సీనియర్ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె అవుతారు. ఎందుకంటే.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్లు నవరణె కన్నా రెండేళ్ల జూనియర్లు. దాంతో ఎంఎం నరవణెను తదుపరి సీడీఎస్ గా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆర్మీ చీఫ్ గా నరవణె వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సి ఉంది. కాగా.. సవరించిన ఆర్మీ నిబంధనల ప్రకారం సీడీఎస్ 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు సేవలు అందించే అవకాశం ఉంది. బిపిన్ రావత్ మరణించిన విషాదకర సమయంలో కూడా దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదనే సూత్రం ప్రకారం తదుపరి సీడీఎస్ ను త్వరగా నియమించాల్సి ఉంటుంది. అందుకే ప్రధాని నేంద్రమోదీ కూడా రావత్ మరణ వార్త తెలిసిన వెంటనే అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తదుపరి సీడీఎస్ గా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో పక్కన ప్రస్తుతం వైస్ సీడీఎస్ గా ఉన్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేరు కూడా సీడీఎస్ గా కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ నరవణె సీడీఎస్ గా నియమితులైతే.. ఆయన ప్రస్తుత స్థానంలో కొత్తగా ఆర్మీ చీఫ్ ను నియమించాల్సి ఉంటుంది. నరవణె తర్వాత ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి, నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వై కే జోషి సైన్యంలో సీనియర్లు. సైన్యం పోరాట సామర్ధ్యాన్ని పెంచేందుకు కేంద్రం నియమించిన షేకత్కర్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూసినా.. త్రివిధ దళాల చీఫ్ లలో ఒకరిని సీడీఎస్ గా నియించాలి. ఈ అంశం కూడా నరవణెకు సీడీఎస్ గా నియమితులు కావడానికి అనుకూల అంశంగా కానుంది. నిజానికి బిపిన్ రావత్ కూడా సీడీఎస్ పదవి నుంచి వచ్చే ఏడాది రిటైల్ కావాల్సి ఉంది. అంతలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో తదుపరి సీడీఎస్ ఎంపికపై ముందుగాకే కేంద్రం కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.

హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందంటే.. పార్లమెంట్ లో రాజ్ నాథ్ ప్రకటన 

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో  భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ చనిపోవడం పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. బిపిన్ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయసభల్లో  ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌ సింగ్‌కు వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.    సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలను శుక్రవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ సాయంత్రానికి రావత్‌ దంపతుల భౌతికకాయాలు ఢిల్లీకి చేరుకుంటాయని తెలిపారు. ప్రమాదంపై భారత వాయుసేన.. త్రివిధ దళాల దర్యాప్తును ఆదేశించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఎయిర్‌ మార్షల్‌ మానవీంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ బృందం వెల్లింగ్టన్‌ చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.    ‘‘బాధాతప్త హృదయంతో ఈ దురదృష్టకర వార్తను చెబుతున్నా. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న మిలిటరీ హెలికాప్టర్‌ డిసెంబరు 8న తమిళనాడులో కుప్పకూలింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ స్టాఫ్‌ కాలేజ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్‌లో రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లింగ్టన్‌ బయల్దేరారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వీరు ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. 12.08 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ రాడార్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. కున్నూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలను గుర్తించిన స్థానికులు అక్కడకు వెళ్లారు. అప్పటికే హెలికాప్టర్‌ మంటల్లో ఉంది. సమాచారమందుకున్న రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. రావత్‌, హెలికాప్టర్‌ ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో రావత్‌, ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం చెందడం బాధాకరం’’ అని రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు.  అనంతరం రావత్‌ మృతికి సంతాపంగా ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.