రామ్‌కీపై వేటు.. కడప ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు యాక్షన్.. జగన్‌కు షాక్!
posted on Dec 10, 2021 @ 12:13PM
రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్‌పై వేటు పడింది. ఆర్‌ఈఈఎల్ కంపెనీతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌రెడ్డి.. 20 నెలల పాటు తన నిధులతో చేపట్టే ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నిషేధం విధించింది. భారత్‌లో పారిశ్రామిక కాలుష్య నిర్వహణ ప్రాజెక్టుల ఏర్పాటులో కంపెనీ అనుసరించిన మోసపూరిత విధానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
ఆర్‌ఈఈఎల్.. ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఉక్కాయపల్లిలో ఓ కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టును మరో సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించే విషయాన్ని కంపెనీ బిడ్డింగ్ సమయంలో వెల్లడించలేదు. 2017లో ఈ పనుల్ని ఆ సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించేటప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తీసుకోలేదు. ప్రపంచ బ్యాంక్ కొనుగోళ్ల మార్గదర్శకాలకు ఇది విరుద్ధం. దీంతో బ్యాంక్ దీన్ని మోసపూరిత చర్యగా పరిగణించి ఆర్‌ఈఈఎల్‌తో పాటు కంపెనీ ఎండీ గౌతమ్ రెడ్డిపై 20 నెలల పాటు నిషేధం వేటు వేసింది.
మామూలుగా అయితే ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన కంపెనీలపై ప్రపంచ బ్యాంక్ మరింత ఎక్కువ కాలమే నిషేధం విధిస్తుంది. అయితే ఈ విషయంలో ఆర్‌ఈఈఎల్ తమ తప్పు ఒప్పుకోవడంతో పాటు, ప్రపంచ బ్యాంక్‌కు సహకరిస్తూ.. దిద్దుబాటు చర్యలకు అంగీకరించడంతో నిషేధాన్ని 20 నెలలకు పరిమితం చేసిందని తెలుస్తోంది. అయినా, వరల్డ్ బ్యాంక్ నిర్ణయంతో.. ప్రపంచ బ్యాంక్ దాని అనుబంధ సంస్థల నిధులతో చేపట్టే ఎలాంటి ప్రాజెక్టుల్లో ఆర్‌ఈఈఎల్ 20 నెలల పాటు పాల్గొనకూడదు. దీంతో కంపెనీ ప్రతిష్ఠతో పాటు వ్యాపార అవకాశాలు కూడా దెబ్బతింటాయని అంటున్నారు. ఇంతకీ, రాంకీ గ్రూప్ ఎవరిదో తెలుసుగా..? జగన్‌రెడ్డికి సన్నిహితుడైన వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిదే...