గుండెలపై తన్నిన జగన్, బాబు ఓస్డీపై సీ'ఐ'డీ, రామ్‌కీపై వేటు.. టాప్‌న్యూస్ @1pm
posted on Dec 10, 2021 @ 11:57AM
1. సీఎం జగన్ తీరుపై సొంతపార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రోశయ్య సంస్మరణ సభలో చిలకలూరిపేట వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రోశయ్య పార్ధివదేహాన్ని చూసేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదా? అంటూ ప్రశ్నించారు. వైసీపీలో తమ కులానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి.. గుండెలపై తన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2. విశాఖ రైల్వే జోన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గందరగోళంగా సమాధానమిచ్చారు. రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల లేవనెత్తిన సందేహాలపై స్పష్టత ఇవ్వకుండా మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒకింత గందరగోళం సృష్టించారు. రైల్వేజోన్‌పై స్పష్టత కోరితే విభజన హామీలన్నింటినీ నెరవేర్చుతామని మాత్రమే సమాధానం ఇచ్చారు. విశాఖ రైల్వేజోన్‌పై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కూడా చెప్పలేకపోయారు.
3. హైదరాబాద్‌లోని రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు చేపట్టారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా లక్ష్మీనారాయణ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో లక్ష్మీనారాయణపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు.
4. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినియోగదారుల పరిరక్షణ చట్ట సభ్యుల నియామకంపై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. వినియోగదారుల సభ్యుల నియామకంలో జోక్యం చేసుకోమంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై నెల్లూర్‌కు చెందిన కోలా ఉమామహేశ్వరరావు ధర్మాసనానికి అప్పీల్ చేశారు. వినియోగదారుల సభ్యుల నియామకం పూర్తిగా రాజకీయ సిఫార్సులతో జరిగిందని వాదించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయంటూ ధర్మాసనం అభిప్రాయపడింది.
5. రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీపై వేటు పడింది. ఆర్‌ఈఈఎల్ కంపెనీతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. గౌతమ్ రెడ్డి.. 20 నెలల పాటు తన నిధులతో చేపట్టే ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నిషేధం విధించింది. భారత్‌లో పారిశ్రామిక కాలుష్య నిర్వహణ ప్రాజెక్టుల ఏర్పాటులో కంపెనీ అనుసరించిన మోసపూరిత విధానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
6. గుంటూరు కలెక్టరేట్ దగ్గర స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆందోళనకు దిగింది. ఖాళీ కంచాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రభుత్వ పనుల బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్విర్యం అయిపోయిందన్నారు. సీఎం జగన్ తమ సమస్యను పరిష్కరించి.. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
7. సీపీఎస్ రద్దుపై విజయవాడలో ఉద్యోగుల సింహగర్జన జరుగుతోంది. ‘మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు.. మీ హామీ మా హక్కు’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు బ్యానర్‌తో నిరసన తెలిపారు. ఆంద్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ తరపున కార్యక్రమం నిర్వహించారు.
8. దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని మృతిచెందిన ఆర్మీ సోల్జర్ సాయితేజ తండ్రి మోహన్ అన్నారు. ఇద్దరు కుమారులు సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషపడ్డానని.. సాయితేజ మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయామని అన్నారు. సాయితేజకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, అతని భార్య చదువుకుందని, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కుటుంబం నిలబడుతుందని మోహన్ అన్నారు.
9. కేరళ రాష్ట్రంలోని కుట్టనాడ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్లు, బాతులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నిరోధించేందుకు అధికారులు కోళ్లు, బాతులను చంపేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
10. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలో ప్రభావం అధికంగా ఉండనుంది.