బిపిన్ రావత్.. ఖతర్నాక్ సూపర్ సోల్జర్.. ఫ్యామిలీ మేన్..
posted on Dec 10, 2021 @ 10:05AM
దేశానికే తొలి సీడీఎస్. అంతకు ముందు ఆర్మీ చీఫ్. ఎంత టాలెంట్ ఉంటే.. ఆ స్థాయికి ఎదగాలి? ఎంత కరేజ్ ఉంటే.. ఆర్మీ చీఫ్ అవ్వాలి? ఎంత చాణక్యం ఉంటే.. సీడీఎస్‌కు ఎంపిక చేయాలి? అవును, జనరల్ బిపిన్ రావత్.. సామాన్య సైనికుడు కాదు. సూపర్ సోల్జర్. భయం అన్నది ఆయన కళ్లల్లో కనిపించదు. దడ అనేది ఆయన గుండెలను చేరదు. దూకుడే ఆయన నైపుణ్యం. సాహసమే ఆయన ఊపిరి. అందుకే, రక్షణ శాఖలో అత్యన్నత హోదా అలంకరించారు. ప్రమాదవశాత్తూ మరణించారు. బిపిన్ రావత్ గొప్పతనం గురించి.. ఆయనతో 15 ఏళ్లకుపైగా కలిసి పని చేసిన తెలుగు సైనిక వీరుడు, రిటైర్డ్ కల్నల్ పి.వి. దుర్గా ప్రసాద్ సవివరంగా వివరించారు. లక్నోలో పనిచేసేటప్పుడు.. వారిద్దరూ పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఇద్దరి కుటుంబాల మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్ ఉంది. బిపిన్‌తో తనకున్న అనుబంధాన్ని.. రావత్ పరాక్రమాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే......
"రావత్ ఓ జగమొండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మడమ తిప్పడు. వెనకడుగు వేయడు. ప్రమాదాలను లెక్కచేయడు. ఆ తెగువ, మొక్కవోని ధైర్యమే ఆయనను రక్షణ రంగంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాయి. రావత్ 1978లో సైన్యంలో చేరే నాటికి నేను 5-11 గూర్ఖా రైఫిల్స్‌లో సేవలందిస్తున్నాను. రావత్ శిక్షణ 1980లో పూర్తయ్యాక.. 5-11 గుర్ఖా రైఫిల్స్‌లో చేరారు. ఎల్‌వోసీ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల్లో 15 ఏళ్ల పాటు కలిసి పని చేశాము. మా కుటుంబాలు లఖ్‌నవూలో కలిసి ఉండేవి. రావత్ భార్య మధులికను మేమంతా ‘మధు’ అని పిలిచేవాళ్లం. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి భార్య అయినా ఆమెలో ఎక్కడా అహం కనిపించేది కాదు."
దసరా నాడు ఏం జరిగిందంటే...
"పాక్ సరిహద్దు చకౌటి బార్డర్‌లో పనిచేస్తున్న సమయంలో దసరా వచ్చింది. 100 మీటర్ల దూరంలో శత్రువులు పొంచి ఉంటారు. అయినా ఆరోజు తన ట్రూప్‌తో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని రావత్ భావించారు. పాక్ సరిహద్దు వరకు వెళ్లి.. తాము పండుగ ఉత్సవాలు జరుపుకుంటున్నామని.. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని బిపిన్ హెచ్చరించారు. ఆ తర్వాత 2 గంటల పాటు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొన్నారు."
అడవిలో హెలికాప్టర్ క్రాష్.. ఐఈడీ బ్లాస్ట్...
"ఆపత్కాలంలో కూడా బిపిన్ మానసికంగా చాలా స్థిరంగా ఉండేవారు. ఓరోజు అతను సరిహద్దులోని అటవీ ప్రాంతంలో రౌండింగ్ కోసం ఓ హెలికాప్టర్ ఎక్కారు. ఆ హెలికాప్టర్ ఎగురుతున్న సమయంలో సాంకేతిక సమస్య రావడంతో చతికిల పడింది. ఇతరులయితే ప్రమాదాన్ని శంకించి ఆ రోజుకు వాయిదా వేసుకునే వారేమో. కానీ బిపిన్ మాత్రం ఎలాంటి జంకు లేకుండా.. మరో హెలికాప్టర్‌ను రప్పించి, అందులో విధులు నిర్వహించి వచ్చారు. ఓ రోజు మా ట్రూప్‌లోకి శిక్షణ నిమిత్తం ఓ మేజర్ జనరల్ చేరారు. లంచ్ తర్వాత కాస్త ముందుకు వెళ్లి బ్రీఫింగ్ చేస్తున్నాము. అదే సమయంలో భోజనం చేసిన స్థలంలో ఒక్కసారిగా ఐఈడీ పేలుడు జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే కనీసం శరీర భాగాలు కూడా దక్కవు. అంతటి పేలుడు జరగ్గా కొత్తగా వచ్చిన మేజర్ కాస్త చలించినప్పటికీ.. బిపిన్ మానసిక ధైర్యం కోల్పోకుండా కారణాలపై ఆరా తీయడానికి నిమగ్నమయ్యారు. ఇవన్నీ సహజమే.. పట్టించుకోవద్దని మేజర్‌కు ధైర్యం చెప్పారు."
మధుతో అనుబంధం...
"అప్పట్లో నా భార్యకు స్కూటర్ కూడా నడపడం రాదని తెలుసుకున్న రావత్ భార్య మధులికా.. ఆమెను బయటకు తీసుకెళ్లేవారు. డ్రైవింగ్ నేర్పేవారు. కొన్ని రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న నా భార్య ఎంతో సంతోషించింది. లఖ్‌నవూలో ఉన్న సమయంలో మధు చాలా హుషారుగా ఉంటూ ఏ పనికీ వెనకాడకుండా భర్తకు తగ్గ భార్య అనిపించుకున్నారు."
40 ఏళ్ల స్నేహం...
"నా 40 ఏళ్ల సర్వీసులో ఎన్నో రోజులు బిపిన్‌తో గడిపాను. అతను రక్షణ రంగంలో అత్యున్నత స్థానంలో సీడీఎస్‌గా ఎంపికవడంతో ఎంతో సంతోషించాను. అతని షెడ్యూలు బిజీగా ఉంటుందని భావించి నేను కాస్త ఆలోచించినా ఆయన మాత్రం తరచూ నాతో ఫోన్‌లో మాట్లాడేవారు. దుండిగల్, ఎంసీఎంఈ, సీడీఎంలలో లెక్చర్ ఇవ్వడానికి నగరానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసేవాడిని." అంటూ బిపిన్ రావత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రిటైర్డ్ కల్నల్ దుర్గా ప్రసాద్.