మూడు రోజుల పాటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక..
posted on Dec 10, 2021 @ 11:27AM
వాన పేరెత్తితేనే తెలుగు ప్రజలు వణికిపోతున్నారు. వరద గుర్తొస్తే.. కంపించిపోతున్నారు. ఇటీవల రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వాన, వరద సృష్టించిన బీభత్సం అలాంటిది మరి. ఇంకా ఆ పీడకల మరవకముందే.. వరద బురద వదలకుండానే.. మరోసారి వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈసారి ఏపీతో పాటు తెలంగాణకు కూడా భారీ వాన గండం ఉందంటున్నారు.
రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉందనేది వెదర్ రిపోర్ట్.
తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉష్ణోగ్రతల్లో కూడా బాగా తగ్గుతాయని తెలిపారు.
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.