కుప్పం నుంచి ప్రక్షాళన.. చంద్రన్న యుద్ద తంత్రం..
posted on Dec 10, 2021 @ 1:42PM
యుద్ధంలో గెలుపు కాదు, ఓటమి ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. ఎక్కడ పోగుట్టుకున్నావో అక్కడే వెతుక్కోమంటుంది.ఆంధ్ర ప్రదేశ్’లో తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అదే పనిలో వుంది.రెండున్నరేళ్ళ క్రితం, 2019లో జరిగిన ఎన్నికల్లో, అనూహ్యంగా ఓడి పోయిన, టీడీపీ నాయకత్వం, ఇప్పుడు పడిలేచిన కెరటంలా పూర్వ వైభవం సాధించేదుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. సొంత ఇంటినిచాక్కదిద్దుకునే పనిలో పడింది. గత ఎన్నికలలో నవరత్నాలను ముందు పెట్టి ఒక్క ఛాన్స్’ ఇస్తే అద్భుతాలు చేస్తామని నమ్మబలికి,అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం,ఇంకా సగంకాలం అయినా పూర్తి కాకముందే. కాడి తన్నేసింది. అరాచక పాలనతో, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసింది. ఓ వంక ప్పుల కుప్పలు మరో వంక పన్నుల మోతతో ఆర్థిక వ్యవస్థను అధః పాతాళానికి తీసుకుపోయింది.
మరో వంక, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ, నాయకులు కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా, కీలక నేతలు టార్గెట్’గా అన్ని రకాల దాడులకు పాల్పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికను కూల్చి వేయడం మొదలు, తెలుగు దేశం పార్టీ నాయకుల ఇళ్ళఫై, చివరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడుల వరకు, అసెంబ్లీలో చంద్రాబాబు, ఆయన సతీమణిపై దుర్భాషలాడడం వరకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసేపీ నాయకత్వం తెలుగు దేశం పార్టీ నైతిక స్థైర్యాన్ని దేబాబ్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ టార్గెట్’ గా రాజకీయ వ్యూహం నడిపిస్తోంది. ఇందులో భాగంగానే,అటు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూర్ జిల్లా కుప్పం, లోకేష్ పోటీ చేసి ఓడి పోయిన మంగళగిరి నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.
వైసీపీ నాయకత్వం అధికారాన్ని అడ్డు పట్టుకుని, అడ్డదారుల్లో కోవర్టులను పోగేసి కుప్పం మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించింది.చంద్రబాబు సొంత నియోజక వర్గంలో జెండా ఎగరేసి, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయచ్చని జగన్ రెడ్డి భావించారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు,వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయరని ప్రచారం సాగించారు. అయితే, చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి కుతంత్రాన్ని ముందుగానే పసి గట్టి, పడి లేచిన కెరటంలా అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయడమే కాదు, అక్కడ నివాసం కూడా ఏర్పటు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతి నెలలో కనీసం ఒక సారి నియోజక వర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ అన్నిటినీ మించి, కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన మొదలుపెడతానని స్పష్టం చేశారు. కోవర్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టారు.
మరో వంక తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటి చేసిన లోకేష్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో అనుహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ నుండి గెలుపే ధ్యేయంగా లోకేష్ పని చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజానికి, గత ఎన్నికలలో వైసేపీ, తెలుగు దేశం పార్టీల మధ్య సీట్ల దూరం చాల ఉన్నా, ఓట్ల పది శాతం లోపే ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటే, ఇప్పిటికిప్పుడు ఎన్నికలు జరిగినా, వైసీపీ ఓటమి తధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.