జగన్ మడమ తిప్పినట్టేనా? కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ లేనట్టేనా?
posted on Dec 10, 2021 9:29AM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాక్ వాకింగ్ ప్రాక్టీస్’ చేస్తున్నారా? మాట తప్పను మడమ తిప్పను, అంటూ హామీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు వెనకడుగులు వేస్తున్నారా ? అంటే, అవుననే అంటున్నారు.ముఖ్యమంత్రి అడుగులు వెనక్కి పడుతున్నాయి, ఆయన బ్యాక్ వాకింగ్ చేస్తున్నారు., అనే సమాధానమే పార్టీ వర్గాల నుంచి వస్తోంది.
మూడు రాజధానుల మొదలు ముఖ్యమంత్రి ఒక్కొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారని, అందుకు వరస పెట్టి ఉదాహరణలు చెపుతున్నారు.అదలా ఉంటే ఇప్పుడు ఆ జాబితాలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేరిందనే మాట వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. మంత్రి పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా వాపోతున్నారు. ‘మాట తప్పను, మడప తిప్పను’ అంటూ జనాన్ని నమ్మించి మోసం చేసినట్లుగానే,తమను కూడా ముఖ్యమంత్రి. ‘జగనన్న బాధితుల’ జాబితాలో చేర్చారని పార్టీ ఎమ్మెల్యేలు ప్రైవేటుగా వాపోతున్నారు.
రెండున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తొలి మంత్రివర్గంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు.కానీ,అప్పుడే, రెండున్నరేళ్ళ తర్వాత, మంత్రివర్గాన్ని సమూలంగా మారుస్తానని, కొత్త ముఖాలతో నింపుతానని మాటిచ్చారు. అయితే, ఇప్పుడు రెండున్నరేళ్ళు పూర్తవుతున్న సమయం వచ్చే సరికి ముఖ్యమంత్రి, ‘మాటా లేదు మడమ లేదు. అంతా ‘తూచ్’ అంటూ ఇప్పట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదన్న సందేశాలు పంపుతున్నారు.
నిజానికి రెండుమూడు నెలల క్రితమే, ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తి చేశారని , కొత్త కాబినెట్ జాబితా సిద్దమైందని లీకులు వచ్చాయి. అలాగే, ముఖ్యమంత్రి సన్నిహిత బందువు మంత్రి బాలినేని కూడా, పదవులు వదులుకునేందుకు తనతో సహా మంత్రులందరూ సిద్దం కావాలని అన్నారు.
అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం , మరో ఐదారు నెలల వరకు పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ ఉండదని తెలుస్తోంది. అయితే ఈ లోగా రాజకీయ అవసరాల రీత్యా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు, స్వల్ప మార్పులు చేర్పులు జరిగితే జరగవచ్చని, ఇటు రాజకీయ వర్గాల్లో అటు అధికార వర్గాల్లో వినవస్తోంది.అంతే కాదు, నిజంగా వచ్చే సంవత్సరం (2022) మే, జూన్ నెలలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినా, ముందుగా అనుకున్నట్లుగా సంపూర్ణ పక్షాళన ఉండదని, ఓ అరడజనుకు ఒకటి రెండు అటూ ఇటుగా పాత ముఖాలను తొలిగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించి పార్టీనాయకులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎప్పుడు, ఎలాంటి మార్పులు జరిగినా రాజకీయ సమీకరణల ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయని, గతంలోమాటిచ్చిన విధంగా సమూల పక్షాళ ఉండదని అంటున్నారు.
అయితే, కొవిడ్ కారణంగా రెండున్నరేళ్ళలో ఎక్కువ కాలం మంత్రులు తమ శాఖల్లో సరిగా ‘పని’ చేయలేక పోయారని, కాబట్టి ఇంకొంత కాలం తమను కొనసాగించాలని కోరిన నేపధ్యంలో ముఖ్యమంత్రి, పొడిగింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే,అసలు కారణం అది కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో తేనే తుట్టెను కదిలిస్తే, అది ఎటు పోయి ఎటుకు దారితీస్తుందో అనే భయంతో పాటుగా, మంత్రి వర్గం మొత్తాన్ని ఒక్కసారిగా మార్చేస్తే, కొత్త మంత్రులు తమ శాఖలో కుదురుకునే సరికి పుణ్యకాలం పూర్తయి ఎన్నికలు వస్తాయి,కాబట్టి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ముందు చూపుతో, సంపూర్ణ మార్పుకు మంగళం పాడేశారని పార్టీ వర్గాల సమాచారం, అయితే, చివరకు ఏమి జరుగుతుంది, అనేది చివరకు ముఖ్యమంత్రికి కూడా తెలియదని, వైసీపీ నేతలు గుస గుసలు పోతున్నారు.