పవన్ దీక్ష ఎవరికోసం.. ఎందుకోసం ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఓ వంక రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకంగా మారిన అమరావతి రైతుల మహా పాదయాత్ర తుది దశకు చేరుకుంది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించేందుకు అమరావతి రైతులు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటోంది. అదే సమయంలో అమరావతి రైతుల ఆందోళనకు కౌంటర్’గా ప్రభుత్వ సహకారంతో రాయలసీమ హక్కుల వేదికలు రంగంలోకి దిగుతున్నాయి. రాయలసీమ హక్కుల కోసం డిసెంబరు 13 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో విజయవాడలో రాయలసీమ ధర్మపోరాట దీక్షను నిర్వహించాలని నిర్ణయించాయి.
మరోవంక 300 రోజులుగా సాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఆందోళన మరో మలుపు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా, బీజేపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేపడుతున్నారు. నిజానికి, కేంద్ర నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరుతూ 300 రోజులకుగా పైగా కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసే సంఘ్ పరివార్ సంస్థలతో సహా వివిధ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు, కార్మికుల ఆందోళనలో ప్రత్యక్షంగా, పరోక్షంగ పాల్గొంటున్నాయి. అయినా, కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ తప్పదని, తమ నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్’లో తెలుగు దేశం సభ్యులు ఇదే విషయాన్ని, పలు సందర్భాలలో ప్రస్తావించారు. అయినా, కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. వివాదస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది.
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడంలోని అంతర్యం ఏమిటి? ఎందుకోసం? ఎవరి కోసం? జనసేనాని దీక్ష చేపట్టారు? అనే విషయంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి, పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా జనసేన నిర్వహించిన సభలోనూ ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా, పవన్ కళ్యాణ్, కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన పోరడటానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.అంతేకాని,కేంద్రాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు.అదే సందర్భంలో ఆయన అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చారు. ఆతర్వాత ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని అల్టిమేటం ఇచ్చారు. అయితే, వారాలు నెలలుగా మారినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం మరిచి పోయినట్లే ఉన్నారు. ఇప్పు మళ్ళీ, దీక్షకు దిగారు.
అదలా ఉంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు అంశాన్ని తమ పార్టీ తరపున కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదని తెలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కావాలని విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ఆర్థిక శాఖను కోరారు. ఈ అంశంలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ బదులిచ్చారని ఆ శాఖ అండర్ సెక్రటరీ పేర్కొన్నారు. అంటే, పవన్ కళ్యాణ్ కనీసం లేఖ ద్వారా అయినా కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించ లేదని అనుకోవలసి వస్తుంది. ఈ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్ దీక్ష ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది. పవన్ కల్యాణ్ దీక్ష ఎవరి కోసం? ఎందు కోసం? లేక కేవలం ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా ? అనే చర్చ జరుగుతోంది.