చిన్న నిర్లక్ష్యంతో భారీ మూల్యం!
posted on Dec 10, 2021 @ 10:31AM
చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒమిక్రాన్ వైరస్ పెను ప్రమాదకారిగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించిందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. అయితే ఒమిక్రాన్ వైరస్ డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రభావం కలిగి ఉందని గుర్తించినట్లు డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. చాలా దేశాలకు విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల కారణంగానే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిందనే విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్న విషయం స్పష్ట మైందని డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ టేడ్రోల్ అద్నం గేబ్రియల్ అన్నారు. ఒమిక్రాన్ విస్తరణను నివారించేందుకు దేశాలు సమగ్ర చర్యలు చేపట్టడం ద్వారా సాధ్యమని తెలిపారు. తద్వారా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని టేడ్రోల్ అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్ పరీక్షలు, సీక్వెన్సింగ్ పెంచాల్సిన అవసరం ఉందని గేబ్రియల్ స్పష్టం చేశారు.
అయితే.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యాన్నే చెల్లించక తప్పదని గేబ్రియల్ హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారాంతపు సమీక్షలో భాగంగా సమర్పించిన నివేదికలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం గణాంకాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
డెల్టా వేరియంట్ ప్రభావం కన్నాఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరగవచ్చని, ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకరమని అంటున్నాయి. ముందు జాగ్రత చర్యలు చేపట్టడం ద్వారా ఒమిక్రాన్ తీవ్రతను తగ్గించవచ్చని అంటున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.