అక్కడ మూడు రోజులు వీకెండ్.. ఉద్యోగులకు పండగే..
posted on Dec 10, 2021 8:18AM
ఉద్యోగులకు వారానికి నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయిస్తూ ఇటీవలేయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యూఏఈ బాటలోనే షార్జా కూడా పని దినాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. షార్జా ఏకంగా మూడు రోజుల వీకెండ్ ప్రకటించింది. అక్కడ వారంలో కేవలం నాలుగు రోజులే పని దినాలు. శుక్ర, శని, ఆదివారం మూడు రోజులు సెలవు. 2022 జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ నిబంధన అమలులోకి వస్తుందని షార్జా అధికారులు స్పష్టం చేశారు. మూడు రోజుల వీకెండ్ నిర్ణయానికి సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా రూలర్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు.
షార్జా కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం షార్జా ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. నాలుగు రోజుల పని దినాల్లో ప్రతి రోజు 8 గంటలు మాత్రమే పని ఉంటుంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల వీకెండ్ ఉంటుంది. ఇక యూఏఈ తీసుకొచ్చిన కొత్త వీకెండ్ నిబంధన ప్రకారం ఆ దేశంలోని ఉద్యోగులకు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 8గంటలు పని చేస్తారు. శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నాలుగున్నర గంటలు మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. అలాగే ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు.