అందరు ఒకటైతేనే మోడీ ఓటమి సాధ్యం..పీకే జోస్యం
భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తుందా? మోడీ మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అంటే, ప్రస్తుతానికి అయితే అవుననో కాదనో చెప్పే పరిస్థితి లేదు. నిజానికి మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత దినదినాభివృద్ధి చెందుతోంది. ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, నిరుద్యోగం ఒకటని కాదు, అన్ని విధాల జనం సమస్యలతో సతమత మవుతున్నారు. కొవిడ్ కష్టాలు సరే సరి. ప్రభుత్వం వివాదస్పద సాగు చట్టాల ఉప సంహరణ వంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా,పెద్దగా ఫలితం కనిపించడం లేదు. జనాగ్రహం చల్లారడం లేదు. అయినా ... బీజేపీ, మోడీని ఓడించగలమన్న ధీమా ప్రతిపక్ష శిబిరంలో కనిపించడం లేదు. బీజేపీకి,మోడీకి ప్రత్యాన్మాయాన్ని ప్రతిపక్ష పార్టీలు , నాయకులు దేశ ప్రజల ముందుంచ లేక పోతున్నారు. అందుకే, దేశంలో రాజకీయ వాతావరణం ఇప్పటికీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లే, కనిపిస్తోంది.
అయితే ఎన్నికల వ్యూహకర్త, పశ్చిమ బెంగాల్’లో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసిన ప్రశాంత్ కిశోర్ (పీకే)మాత్రం ఇందుకు సంబందించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. ‘ఇండియా టుడే’ సంపాదకుడు రాజ్ చెంగప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదిరితే, వేగంగా స్పందించే యంత్రాంగం ఉంటే,2024 ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కోగలమనే విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.అయితే, అదే సమయంలో ఆయన బీజేపీకి కాంగ్రెస్ ఏకైక ప్రతిపక్షం కానే కాదని స్పష్టం చేశారు. నేరుగా పోటీ పడితే బీజేపీని ఆ పార్టీ ఓడించలేదని, ఆ స్థానంలో ప్రతిపక్షాలు బలోపేతం కావాలని సూచించారు. కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన తృణమూల్, ఎన్సీపీ వంటి పార్టీలు ప్రత్యామ్నాయంగా బలోపేతం కావాలన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో 200 ఎంపీ సీట్లకు బీజేపీ 47కే పరిమితమైందని గుర్తు చేశారు.
నిజమే, కానీ, ఈ రాష్రాి ల్లో కాంగ్రెస్ సహా మరే పార్టీ కూడా బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలవలేదు.కాంగ్రెస్ పార్టీ అయితే, కేవలం 20 సీట్లు మాత్రమె గెలిచింది. అందులో 13 సీట్లు ఒక్క కేరళ లోనే ఉన్నాయి. తెలంగాణ, తమిల్ నాడు రాష్ట్రాలలో మూడేసి, ఒరిస్సాలో ఒకే ఒక్క సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలుగెలిచాయి. సో ..ఎలా చూసినా, పీకే చెప్పినట్లుగా,బీజేపీయేతర ప్ర్త్యలు అన్నీ ఏకంయితేనే, బీజేపీని ఓడించడం సాధ్యం అవుతుంది.