గులాబీ గూటిలో కౌన్సిల్ గుబులు.. కరీంనగర్ లో షాక్ తప్పదా?
posted on Dec 9, 2021 @ 7:14PM
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొద్ది గంటల సమయమ మాత్రమే మిగిలుంది. రేపు (డిసెంబర్ 10) పోలింగ్ జరుగుతుంది. నిజానికి ఇటు కరీంనగర్’లో గానీ ఖమ్మం. జిల్లాల్లో గానీ, అధికార పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో పార్టీ అభ్యర్ధులు సునాయాసంగా గెలుస్తారు. అయితే, హుజూరాబాద్ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్లనో ఏమో గానీ అధికార టీఆర్ఎస్ నేతల్లో నెలకొన్న అభద్రతాభావం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అనటున్నారు. అధికార పార్టీకి కొండంత సొంతబలం ఉంది. ప్రత్యర్ధులను చిత్తూ చేసే సంఖ్యాబలం వుంది.
అయినా అధికార పార్టీ భయానికి లోనై క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది. ఓటు హక్కున్న ఎంపీటీసీ. జడ్పీటీసీ, సభ్యులు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను రాష్ట్రం దాటించి, విందు వినోదాలతో క్యాంపుల్లో క్యాష్ కట్టలతో కట్టి పడేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా సీనియర్ నాయకులు, ఎంపీటీసీ. జడ్పీటీసీ, సభ్యులు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కోరికలు అడిగి తెలుసుకుని, మర్యాదలు చేస్తునట్లు వార్తలొస్తున్నాయి.మెజారిటీకి సరిపడా ఓటర్లు చేతిలో అధికారం.. పుష్కలంగా వనరులు.. కనుసైగతోనే పనిచేసుకుపోయే పార్టీ యంత్రాంగం.. అయినా ఎమ్మెల్సీలను గెలిపించుకునెందుకు ‘ఓటర్ల’ను ఎక్కడికో తీసుకుపోయి కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే, అందుకు పార్టీలో భగ్గుమంటున్న అసమ్మతి ప్రధాన కారణం పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని, బయటనుంచి వచ్చిన వారికీ పార్టీ టికెట్ ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి ఎగసి పడుతోందని అందుకే. అధికార పార్టీ పెద్దలు ఇంతలా అవస్థ పడవలసి వస్తోందని అంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే, కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, టీడీపీ నుంచి వచ్చిన ఎల్.రమణకు చెరో టికెట్ ఇవ్వడంతో, ఎప్పటినుంచి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, తెరాసకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగారు. నిజానికి, రవీందర్ సింగ్’కు గెలిచే అవకాశలు ఏ కొంచెం లేఉ . ఎందుకంటే, ఉమ్మడి జిల్లాలో మొత్తం 1300 పైచిలుకు ఓట్లు ఉంటే, అందులో 950 పైగా ఓట్లు తెరాస పక్షానే ఉన్నాయి ..అయినా రవీందర్ సింగ్’కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతు ఇస్తున్న నేపధ్యంలో జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్’ కు ముచ్చెమటలు పడుతున్నాయి. మరో వంక రవీందర్ సింగ్ గెలుపు పై ధీమాగా ఉన్నారు. హుజూరాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని అంటున్నారు.అదెలా, ఉన్నా తెరాస నాయకులు మాత్రం షేక్ అవుతున్నారు.
ఖమ్మం జిల్లాలో కూడా ఒకే ఓకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, జిల్లాలో పలువురు రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నప్పటికీ, ఉద్దండ పిండాలను తోసిరాజంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా టికెట్‌ను తాతా మధుసూదన్‌కు కేటాయించడంతో సేనియర్లు భగ్గు మంటున్నారు. సొంత పార్టీ సేనియర్లకు భయపడి, స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లను గోవాకు తరలించారు. పైకి అంతా బాగాగే ఉందన్నట్టున్నా ఎక్కడో ఏదో తెలీని భయం ఇప్పటికీ గులాబీ నేతల్లో వ్యక్తమవుతునే ఉంది.మరో వంక కాంగ్రెస్ కు పెద్దగా ఓట్లు లేకపోయినా తాతా మధు సామాజికవర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. తెరాసలోని ఒకరిద్దరు ముఖ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి దండిగానే వనరులు సమకూర్చినట్టు చెబుతున్నారు.
మరోవంక గోవాలో ఏర్పాటు చేసిన క్యాంపులోనూ వివక్ష చూపారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సామాజికవర్గాన్ని బట్టి, స్థాయిని బట్టి ట్రీట్ చేశారన్న కారణంగా కొందరు ఓటర్లు హర్ట్ అయినట్టు చెబుతున్నారు. కొందరికి ఫ్లైట్‌లలోనూ, మరికొందరికి బస్సులలోనూ ప్రయాణ ఏర్పాట్లు చేయడం.. గోవాలో ఏర్పాటు చేసిన విడిదిలోనూ, విందు వినోదాల్లోనూ ముఖం చూసి పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ లెక్కలన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న బెంగ నేతల్లో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తెరాస ఏమాత్రం డ్యామేజి జరిగిన ఇక కారు కదిలడం కష్టమని అందుకే గులాబీ పార్టీలో గుబులు వ్యక్తమవుతోందని అంటున్నారు.