వరి కాదు ఉరి.. మరో రైతు బలి..
posted on Dec 10, 2021 @ 2:11PM
తెలంగాణలో వరి పంట పుష్కలంగా పండిది. కానీ, ఇప్పుడు అదే రైతుల పాలిట ఉరి తాడుగా మారింది. పండిన పంటను కొనే నాధుడు లేక రైతు ఉరి స్తభం వైపు చూస్తున్నారు. ఓ వంక కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత వర్షకాలం పంట చివరి గింజ వరకు కొంటామని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, అదే అంటోంది. చివరి గింజ వరకు కొంటామని అంటోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలలో కాటా, కదలడం లేదు. ధాన్యం తరగడం లేదు. ఎండకు ఎండకు ఎండి వానకు తడిసి వడ్లు పాడై పోతోంది. మొలకెత్తుతోంది.
మరోవంక రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఒకటి రెండు రోజులు కాదు, నెల రోజులకు పైగా ఐకేసీ సెంటర్ల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. తీరా అక్కడ అమ్ముకున్నా తరుగు కింద కిలోల లెక్కన కోత. ఈ వరుస దెబ్బలతో వరి రైతు అల్లాడిపోతున్నాడు. పంట వేసిన పాపానికి కౌలు చెల్లించలేక.. అప్పులు పేరుకుపోయి అన్నదాత ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది.
మొన్న కామారెడ్డి జిల్లాలో ఓ బీరయ్య.. నిన్న జగిత్యాల జిల్లాలో ఐలయ్య ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులు కాసి గుండెపగిలి చనిపోయారు. ఈరోజు మెదక్ జిల్లాలో మరో వరి రైతు నేలకొరిగాడు. పంట దిగుబడి రాక.. అమ్ముదామంటే గిట్టుబాటు ధరలేక ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యను ఆశ్రయించాడు. పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. నేనేమి చేయగలను సారు అంటూ అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది.
హవేలీ ఘన్‌పూర్ మండలం బోగడ భూపతిపూర్‌కి చెందిన రైతు రవికుమార్(50) ఆత్మహత్య చేసుకున్నారు. పంట దిగుబడి రాక.. గిట్టుబాటు ధరలేక అప్పుల బాధలో కూరుకుపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రవికుమార్ రాసిన సూసైడ్ లెటర్ కన్నీరు పెట్టిస్తోంది. రైతుల దీనస్థితిని కళ్లకు కడుతోంది. అన్నదాత ఆక్రందనను వర్ణిస్తోంది.
సీఎం కేసీఆర్ గారికి అంటూ రవికుమార్ సూసైడ్ లెటర్ రాశారు. వర్షాకాలం సన్నరకం వేయమంటేనే వేశానని.. మొత్తం సన్నరకమే సాగుచేశానని రవికుమార్ లేఖలో తెలిపారు. దిగుబడి తక్కువ వచ్చిందని.. మొదలు ధర లేదని ఆయన వాపోయారు. నా పొలం మొత్తం వరిసాగే అవుతది నేనేం చేయగలను అంటూ రవికుమార్ రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది.