చంద్రబాబు ఓఎస్డీ ఇంట్లో సీఐడీ సోదాలు.. రిటైర్డ్ ఐఏఎస్‌పై ఓవరాక్షన్..
posted on Dec 10, 2021 @ 2:32PM
ఆపరేషన్ చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ మెయిన్ టార్గెట్ ఇదే. చంద్రబాబుతో సహా ఆయన వెన్నంటే ఉన్న ప్రతీ ఒక్కరిపై ఏదో ఒకరకంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణ ఉంది. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ల వరకూ.. కీలక టీడీపీ నేతలందరినీ ఏదో ఒక కేసులో ఇరికించేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ నేతలతో పాటు.. చంద్రబాబు హయాం నాటి అధికారులనూ వైసీపీ ప్రభుత్వం వదలడం లేదంటున్నారు. సీఐడీని ముందుంచి.. తెర వెనుక పొలిటికల్ గేమ్ నడిపిస్తున్నారని మండిపడుతున్నారు.
గతంలో అప్పటి ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బాగా ఇబ్బందుల పాలు చేసిన జగన్ సర్కారు.. తాజాగా, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణపై ఫోకస్ పెట్టారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై సీఐడీ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది.
అయితే, తనిఖీల్లో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ ఇంటి దగ్గర ఏపీ సీఐడీ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా లక్ష్మీనారాయణ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో పని మనుషులతో దురుసుగా ప్రవర్తించారు. నోటీస్ ఇవ్వకుండా సెర్చ్ ఎలా చేస్తారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలీసులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.
లక్ష్మీనారాయణకు మద్దతుగా టీటీడీపీ నాయకులు తరలివచ్చారు. టీటీడీపీ నేతల ఎంట్రీతో సీఐడీ అధికారులు వెనక్కి తగ్గారు. అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చేందుకు సీఐడీ పోలీసులు ప్రయత్నించారు. సోదాలు ముగించి పంచనామా ప్రక్రియ చేపట్టారు. సోదాల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్నారు. 2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు. సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. సిమెన్స్ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్ మేనేజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ చెప్పారని సమాచారం. సిమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని లక్ష్మీనారాయణ తెలిపారు.
మరోవైపు, సీఐడీ విచారణలో లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు మొదట సీఐడీ అధికారులు నిరాకరించారు. అయితే, లక్ష్మీనారాయణకు రెండు సార్లు సర్జరీ జరిగిందని చెప్పడంతో.. బీపీ కూడా మారడంతో.. సీఐడీ సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.