రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై వాయుసేన ప్రకటన..
posted on Dec 10, 2021 @ 1:58PM
సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ, ఆ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోవడం మరింత సంచలనం. పొగమంచు వల్లే హెలికాప్టర్ క్రాష్ అయిందని కొందరు అంటున్నారు. ప్రమాదంపై అనుమానం ఉంది.. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అంటున్నారు. ఇలా తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంపై తాజాగా భారత వైమానిక దళం స్పందించింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
‘డిసెంబర్ 8, 2021న జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను శోధిస్తున్నాం. అందుకోసం వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్టు ఆఫ్ ఎక్వైరీ వేసింది. ఈ విచారణ త్వరితగతిన పూర్తవుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటివరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను కాపాడాలి. ఎటువంటి సమాచారం లేని ఊహానాగాలకు దూరంగా ఉండాలి’ అని వైమానిక దళం విజ్ఞప్తి చేసింది.
హెలికాఫ్టర్ ఘటనపై త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయని గురువారం పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలం నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులనూ ప్రశ్నించనున్నారు. సైన్యం తరఫున అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.