సీఎం స్టాలిన్‌కు హైకోర్టు ప్రశంసలు.. మన ముఖ్యమంత్రులూ ఉన్నారే...
posted on Dec 10, 2021 @ 10:50AM
మామూలుగా అయితే కోర్టులు అంత ఈజీగా పాలకులను ప్రశంసించవు. మంచి పరిపాలన అందిస్తేనే శెభాష్ అంటుంది. తాజాగా, తమిళనాడు సీఎం స్టాలిన్ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి అభినందించారు. స్టాలిన్‌పై విమర్శలు చేయడాన్ని ఆపాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ..నిందితుడు సాట్టై మురుగన్‌ను హెచ్చరించింది.
మదురైకు చెందిన సాట్టై మురుగన్ గతంలో స్టాలిన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జామీను కోరుతూ సాట్టై మురుగన్ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి పుగళేంది ముందుకు విచారణకు వచ్చింది. స్టాలిన్‌ను మెచ్చుకుంటూ.. అభినందించకపోయినా ఫర్వాలేదుగానీ ఆయన్ను విమర్శించడాన్ని కోర్టు సహించదన్నారు న్యాయమూర్తి. కోర్టుకు ఇచ్చిన హామీని అధిగమించి ఇకపై ఒక్కమాట మాట్లాడినా జామీను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రిగా స్టాలిన్ పనితీరు అలా ఉంది మరి. ప్రజలతో కలిసిపోతున్నారు. వరదల వేళ మోకాళ్లోతు నీళ్లలో దిగి పరిస్థితిని పర్యవేక్షించారు. అమ్మ పథకాలను అదే పేరుతో యధాతథంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు స్థానం కల్పిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ.. ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. అందుకే, ఇటీవల ఇండియా టుడే సర్వేలో నెంబర్ 1 సీఎంగా నిలిచారు.
ఇక, అదే ఇండియా టుడే సర్వేలో ఏపీ సీఎం జగన్‌రెడ్డి చాలా వెనక్కి వెళ్లిపోయారు. స్టాలిన్‌తో పోలిస్తే.. జగన్ పరిపాలన అధ్వాన్నంగా ఉందంటున్నారు. సీమకు వరదొస్తే.. అదేదో ఈవెంట్‌కు అటెండ్ అయినట్టు సెక్యూరిటీ మధ్య ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. చంద్రబాబు ముద్ర కనిపించకుండా రాజధాని అమరావతిని ఆగమాగం చేశారు. చంద్రబాబు కట్టించిన 20 లక్షల ఇళ్లను పేదలకు పంచకుండా పక్కన పెట్టేశారు. ఇక టీడీపీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకైతే లెక్కేలేదు. చివరాఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా వదల్లేదు వైసీపీ నాయకులు. చంద్రబాబుతో కన్నీళ్లు పెట్టించేలా వేధించారు. మద్యం ధరలు పెంచేసి.. ఇసుక దొరక్కుండా చేసేసి.. చెత్త పన్నులన్నీ వేసేసి.. ఇవి చాలవన్నట్టు.. ఇప్పుడిక ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకునే పథకం తెరమీదకు తీసుకొచ్చారు.
మద్రాసు హైకోర్టు సీఎం స్టాలిన్ పాలనను అభినందిస్తే.. ఇక ఏపీ హైకోర్టు మాత్రం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో లెక్కే లేదు. మాజీ ఈసీ నిమ్మగడ్డ విషయంలో గానీ, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, అడ్డగోలు జీవోలు రహస్యంగా ఉంచడం, మూడు రాజధానుల నిర్ణయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు... అబ్బో చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు. ప్రభుత్వ ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ చర్యల జరిగాయంటే.. దోషిగా కోర్టులో నిలబడ్డారంటే మాటలా? ఎక్కడ స్టాలిన్.. ఎక్కడ జగన్.. అంతా ఆంధ్రుల కర్మ అంటున్నారు ప్రజలు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జగన్‌రెడ్డికి ఏమాత్రం తీసిపోరు. అందుకే, ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాల్సింది.. మారాల్సింది.. ఎంతైనా ఉందంటున్నారు.