అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు.. ప్రతిపక్ష ఐక్యత ఎండ మావేనా?
మరో రెండున్నరసంవత్సరాల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీని ఓడిచి ప్రధాని మోడీని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంగా విపక్షాల ఐక్యత కోసం, ఇటు నుంచి కాంగ్రెస్ అటు నుంచి తృణమూల్ మధ్యలో ఎన్సీపీ..ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో సాగుతున్న ఈ ప్రయత్నాలు ఇంతవరకు అంతగా ఫలించలేదు. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న విధంగా అటూ ..ఇటూ ఊగుతున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి నాయకత్వం విషయంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న బిగ్ ఫైట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. జాతీయ స్థాయిలో ఆశక్తికరంగా సాగుతున్న కథలోకి వెళితే ..
తృణమూల్ కాంగ్రెస్ తేల్చి చెప్పింది.కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించేంది లేదని తెగేసి చెప్పింది. విషయం, సందర్భం వేరు కావచ్చును, కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించెడి లేదని, కాంగ్రెస్’ పార్టీ సెకండ్ ఫెడల్’గా తృణమూల్ పనిచేయదని, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ (మమతా బెనర్జీ మేనల్లుడు)స్పష్టం చేశారు.రాజ్య సభ నుంచి 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్’ విషయంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన అభిషేక్, సభలోపల వెలుపల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాటం చేద్దాం, కానీ, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర అధికార కూటమిలోని ఎన్సీపీ, శివసేన పార్టీల మధ్య జాతీయ విపక్ష కూటమి నాయకత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్దపడిన ఎన్సీపీ, యూపీఏ ముగిసిన ఆధ్యాయం అన్న మమత అభిప్రాయాన్నే పునరుద్ఘాటించింది. ప్రస్తుత లోక్ సభలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏలో కంటే యూపీఏ వెలుపల ఉన్న ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆ కారణంగా అందరినీ కలుపుకుని పోయేలా, ఉమ్మడి నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పాటు అవసరమని ఎన్సీపీ పేర్కొంది. ఎన్సీపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తమైందని, ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. సో .. బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏర్పడే కూటమిలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు (సోనియా , రాహుల్ ) నలుగురిలో నారాయణ గుంపులో గోవింద్ అన్నట్లుగా అందరిలో ఒకరుగా ఉండాలే కానీ,ఎత్తు కుర్చీ ఆశిస్తే కుదరదని శరద్ పవార్ పార్టీ, ఎన్సీపీ కూడా స్పష్టం చేసింది. తృణమూల్ బాణినే వినిపించింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు అంగీకరిస్తుంది, అనేది పక్కన పెడితే, మహ రాష్ట్ర సంకీర్ణంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి.
మహారాష్ట్ర సంకీర్ణ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరో కీలక భాగస్వామ్య పార్టీ, శివసేన కాంగ్రెస్ పార్టీ లేనిదే ప్రతిపక్షమే లేదని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఐ కేంద్రంగానే విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని అభిప్రాయ పడుతోంది. శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, మంగళ వారం కాంగేస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో పాటుగా విపక్ష్ల పార్టీల ఐక్యత గురించి కూడా చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చిన రౌత్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం, అని అన్నారు.అదే సమయంలో కాంగ్రెస్ లేకుండా ఏర్పడే కూటమి బీజేపీని ఓడించలేదు అని కూడా రౌత్ స్పష్టం చేశారు.
మరోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఇక పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఎన్నికలోనూ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. మరో వంక మరో రెండు మూడు నెలల్లో ముంబై మహా నగర పాలిక సహా రాష్ట్రంలోని మరి కొన్ని నగరపాలక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి, ఈ ఎన్నికలే విపక్ష పార్టీల ఐక్యతకు అసలైన లిట్మస్ టెస్ట్ అంటున్నారు.