ప్రమాదమా? కుట్రా?.. ఉచితంగా ఓటీఎస్.. మోదీతో 'సాయి'లీలలు.. టాప్‌న్యూస్ @ 7pm
posted on Dec 9, 2021 @ 5:55PM
1. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సందేహాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరికొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనే దానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
2. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఉదారత చాటుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు చనిపోయిన ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.
3. దేశంలో అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రుల్లో జగన్ ప్రథమ స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎవరూ భయపడవద్దని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
4. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదును చేయిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో లక్ష సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోని అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన నియోజకవర్గంగా ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీని కొడంగల్‌కు తీసుకువస్తానని.. కొడంగల్ తనకు గుండె లాంటిదన్నారు రేవంత్‌రెడ్డి.
5. ప్రధాని మోడీతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే, బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను, గురువారం ప్రధాని మోదీని విజయసాయిరెడ్డి కలవడం వెనుక ఏదో ముఖ్యమైన రాజకీయ కోణం ఉండి ఉంటుందని అంటున్నారు.
6. లోక్‌సభ జీరో అవర్‌లో విశాఖ రైల్వేజోన్‌పై వైసీపీ ఎంపీలు భిన్న స్వరాలు వినిపించారు. విశాఖ రైల్వేజోన్‌పై స్పష్టత ఇవ్వాలని ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. రైల్వేజోన్‌పై కేంద్రం పూటకోమాట మాట్లాడుతోందని భరత్ విమర్శించారు. అయితే భరత్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా వైసీపీ ఎంపీ సత్యవతి మాట్లాడారు. రైల్వేజోన్ ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు సత్యవతి చెప్పారు.
7. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పురోగతి లేదన్నారు. బడ్జెట్‌లోనూ కేవలం రూ. 40 లక్షలు కేటాయించడం.. ఏపీని అవమానించడమేనని అన్నారు. రైల్వేజోన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
8. శ్రీకాళహస్తిలో అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతులు సంఘీభావం తెలిపారు. కుప్పం ఎన్నికలతో పాటు మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం ఉందని ఆరోపించారు. పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షన్ కల్చర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని.. ఆ హింసతో విసిగి పోయామని పులివెందుల రైతులు అన్నారు.
9. సంచలనం సృష్టించిన శిల్పాచౌదరి కేసులో ఆమెను మరో మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. శిల్పాచౌదరిని ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. కోర్టు అనుమతితో మరోసారి శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు నార్సింగి పోలీసులు విచారించనున్నారు.
10. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినందునే ఆందోళనను ఉపసంహరించుకున్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం తమ డిమాండ్లను ఆచరణలో పెట్టకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.