ఈటల ఎటు పోతున్నారు? పార్టీ మారుతారా?
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగ వచ్చును. అందులోనూ పార్టీలు మారడం అంగీ మార్చినంత ఈజీ వ్యవహరంగా సాగిపోతున్న ప్రస్తుత సమయంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని వార్తలు రావడం పెద్ద విషయం కాదు. విశేషం కాదు. సహజం. ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుని కళ్ళతో పలకరించుకున్నా, నిముషాల్లో స్క్రోలింగులు వచ్చే రోజుల్లో ఈటల గురించి పుకార్లు రావడంలో ఆశ్చర్యం లేదు.
అయితే, నిన్న గాక మొన్న, అధికార తెరాస నుంచి బయటకు వచ్చి, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, ఇంతలోనే మళ్ళీ పార్టీ మారుతారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అంటే, కొంచెం చాలా ఆలోచించవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా,ఈటల అలాచేస్తే, అది ఆయన రాజకీయ భవిష్యత్’ను ప్రశ్నార్ధకం చేస్తుందని అంటున్నారు. నిజానికి, అలాంటిది ఏమీ లేదని, తాను పార్టీ మారే ప్రశ్నే లేదని, ఈటలే స్వయంగా ప్రకటించారు. పార్టీలు మారడం తన తత్త్వం కాదని, తెరాస నుంచి కూడా తాను బయటకు రాలేదని, బయటకు పపంపారని ఈటల వివరణ ఇచ్చారు. అయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఆ చర్చ అలా సాగుతూనే ఉంది.
అదలా ఉంటే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. బీజీపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే, ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం అనివార్యమని జాతీయ నాయకత్వం స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. ఈ నేపధ్యంలో ఇటు తెరాస నుంచి అటు కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పట్టున్న నాయకులను కమలం గూటికి చేర్చే కీలక బాధ్యతను తెరాస నుంచి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరిన డీకే అరుణకు అధిష్టానం అప్పగించి నట్లు తెలుస్తోంది.
తెరాసలో కింది స్థాయి కార్యకర్తల నుంచి నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి పుట్టు పూర్వోత్తరాలు, ఆపసోపాలు అన్నీ, ఈటలకు కొట్టిన పిండే, కాబట్టి ఆ బాధ్యతలను పార్టీ అధిష్టానం ఆయనకు అప్పగించిందని అంటున్నారు. ఇప్పటికే ఈటల ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈటల తెరాసలో అసంతృప్తులు తమతో టచ్’లో ఉన్నారని అంటున్నారు. ఖచ్చితంగా ఇంతమంది ఆని కాకుండా, పట్టున్న నాయకులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈటల అడుగులు వవేస్తున్నారని, ఇటు బీజేపీలో తెరాసలోనూ చర్చ జరుగుతోంది. ఈటల అడుగులు వేయడం వల్లనే ముఖ్యమంత్రి ఉన్నట్లుండి పార్టీ మీద దృష్టి పెట్టారని, జిల్లా పర్యటనలకు బయలు దేరుతున్నారని తెరాస పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా, బీజేపీ అదిష్టానం తెరాసకు బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా ప్రజలలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్’ కు ఈటలను ప్రత్యర్ధిగా నిలిపేందుకు కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. కేంద్ర నాయకత్వం ఉంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే ఈటల రాజేందర్ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్’పై పోటీ చేసేందుకు అయినా సిద్ధమని ప్రకటించారని అంటున్నారు.
అదలా ఉంటే, కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల బర్తరాఫ్ అయినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అనేక ఉహాగానాలు వినవచ్చాయి. అలాగే, ఆయన బీజేపీలో చేరి, హుజూరాబాద్ ప్రచారంలో తలమునకలై ఉన్న సమయంలోనూ, ఆయన బీజేపీలో ఇమడలేక పోతున్నారు. ఆయనకు, బీజేపీ నాయకులు సహకరించడ లేదు. ఆయన రేపోమాపో బీజీపీకు గుడ్ బై చెపుతున్నారు .. ఇండిపెండెంట్’గా పోటీకి రెడీ అవుతున్నారు, కాంగ్రెస్’లో చేరుతున్నారు .. అంటూ చాలా ఉహాగానాలు వినిపించాయి. అయినా, అందులో ఏ ఒక్కటీ నిజం కాలేదు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్’లో చేరుతున్నారు అంటూ వస్తున్న ఉహాగానాలు కూడా అంతే అంటున్నారు, ఈటల సన్నిహితులు. అంతేకాదు, కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈటలను బయటకు పంపినా, ఒక విధంగా ఈటల కూడా అదే కోరుకున్నరని. ఆయనసన్నిహితులు అంటున్నారు.