పీకే పనై పోయిందా? శకునం చెప్పే పిల్లి కుడితిలో పడిందా?
posted on Dec 17, 2021 @ 5:41PM
రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన ప్రశాంత్ కిశోర్ పనై పోయిందా? శకునం చెప్పే పిల్లి కుడితిలో పడింది అన్నట్లుగా, ఇంత వరకు అడిగిన అందరికీ కోట్లలో ఎన్నికల వ్యూహాలను సప్లై చేసిన పీకే, ఇప్పుడు, తన రాజకీయ వ్యూహం ఏమిటో తనకే అర్థం కాక తికమక పడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి, పశ్చిం బెంగాల్ ఎన్నికల తర్వాత పీకే , ఇక ఎన్నికల వ్యాపారానికి స్వస్తి చెప్పేస్తున్నానని ప్రకటించారు. ఆయన ఆ మాట మీద నిలబడితే ఎలా ఉండేదో కానీ, అయన అక్కడి నుంచి ఒక్క విషయంలో మినహాయించి అన్ని విషయాల్లోనూ వరస పెట్టి పిల్లి మొగ్గలు వేస్తూనే ఉన్నారు.
‘బీజీపీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి’అనే సింగల్ పాయింట్ ఫార్ములా చుట్టూ పీకే, పిల్లి మొగ్గలు, కుప్పి గంతులు వేస్తున్నారు. నిజానికి వ్యూహకర్తల, పరిస్థితులను అన్ని కోణాల్లో పరిశీలించి, ఆకలింపు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు కార్యక్షేత్రంలో దిగుతారు. నిజానికి, పీకే కూడా బెంగాల్ వరకు అదే పద్దతిలో పనిచేశారు. ఆ తర్వాతనే పీకే ఆలోచనలు పక్కదారి పట్టాయి. ఒక విధంగా చూస్తే బెంగాల్ తర్వాత పీకేలో రాజకీయ ఆశలు మొదలయ్యాయి అనిపిస్తుంది. అందుకే ఆయన, స్థిరం అడుగులు వేయలేక పోతున్నారు. అందుకే ఆయన భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన ఎమీతోచక ఆలోచనలు మొద్దుబారిన కొత్త వ్యుహాల కోసం అల్లాడుతున్నారనే చర్చ కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో మొదలైంది. మరో వంక సోనియా, రాహుల్ మొదలు కేసీఆర్, కేటీఆర్ వరకు ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ, మోడీని ఓడించేందుకు పేకే వ్యూహాల మీద ఆధార పడడం .. అన్యధా శరణం నాస్తి ..త్వమేవ శరణం పేకే ..అంటూ వెంట పడడడం కూడా ఆయనలో మార్పుకు కారణం అంటున్నారు. అందుకే ఆయన ఆలోచనలు బాలన్స్ తప్పు తున్నాయి నిపిస్తుంది. ఒక విధంగా పిచ్చోడి చేతిలో రాయి, అన్నట్లుగా పీకే వ్యవహరిస్తున్నారు.
నిజానికి బెంగాల్ గ్యాప్ తర్వాత ఆయన కాంగ్రెస్ అనుకూల స్టాండ్ తీసుకున్నారు. కాంగ్రెస్ లేకుండా విపక్షాలు బీజేపీని ఎప్పటికీ ఓడించలేవని సూత్రీకరించారు. ఆ విధంగా కాంగ్రెస్ చుట్టూ ప్రతిపక్షాలను నిలబెట్టీ ప్రయత్నం చేశారు. స్వయంగా తానూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, కాంగ్రెస్’కు ఛీ కొట్టి మళ్ళీ మమతా బెనర్జీ (తృణమూల్) అనుకూల స్టాండ్ తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులను దగ్గరుండి తృణమూల్ పంచకు చేర్చారు. ఇప్పడు మళ్ళీ రాహుల్ గాంధీకి జై కొడుతున్నారు. రాహుల్ గాంధీ రాజకీయాలకే పనికిరాడని, నిజానికి కాంగ్రెస్ కష్టాలకు ఆయనే కారణమని కొంత కాలం రాహుల్ గాంధీని రఫ్ ఆడారు..
అయితే ఇప్పుడు మళ్ళీ దేశానికీ ప్రధాని అయ్యే అర్హతలు అన్నీ రాహుల్ గాంధీకి ఉన్నాయని, ఆయనో జాతి రత్నం అంటున్నారు. రాహుల్‌కు ప్రధాని అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, రాహుల్ ప్రధాని కావాలని.. యువత కోరుకుంటోందని అంటున్నారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పిన నోటితోనే.. ఇప్పుడు కేంద్రంలో.. కాంగ్రెస్ లేకుండా.. అసలు ప్రభుత్వమే ఏర్పాటు కాదని పీకే వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి, ఇలా ఇటు అటూ ఏటంటే అటు కొట్టుకు పోతున్న పీకే అలోచనలు .. వ్యూహాలు అయితే ..రహస్య అజెండాలో భాగం అయినా కావాలి .. కాదంటే ... ఆయన వ్యూహాల మేజిక్ బాక్స్ నిండుకుని అయినా ఉండాలి .. అయితే ... ఇక పీకే .. పీకేది ఏమీ లేదని మాత్రం ఇంతకాలం ఆయన చుట్టూ తిరిగిన రాజకీయ నాయకులే ఇక పీకే దుకాణం బంద్ ..అయినట్లే అనీ అంటున్నారు. ప్రతి కుక్కకు ఒక రోజుంటుంది... పీకే రోజు వెళ్ళిపోయింది.