ఆయన మారరు.. మార్చ వలసిందే...
ఇంటికంటే గుడి పదిలం అంటారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ప్రగతి భవన్ కంటే ఫామ్‌హౌస్ మేలని అంటారో లేదో కానీ, ఆయన ఫామ్‌హౌస్ (ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం)లో ఉండేదుకు ఎక్కువ ఇష్టపడతారని, ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అంతే కాదు, ముఖ్యమంత్రి కూడా ఒకటి రెండు సందర్భాలలో వ్యవసాయ క్షేత్రం ప్రస్తావన చేశారు. సరే, అది ఆయన ఎలా సంపాదించారు, ఎలా విస్తరించారు, కోటి రూపాయల ఆదాయం ఎలా వచ్చింది అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి పక్కన పెడితే, ముఖ్యమంత్రి గతేడాది డిసెంబర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 12 వరకూ, అంటే ఒక సంవత్సర కాలంలో 142 రోజుల పాటు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు.
సహజంగా ముఖ్యమంత్రి , మంత్రులు, సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తారు. కాదంటే, అత్యవసర విధులను అధికార నివాసం నుంచి నిర్వహిస్తారు. ప్రజలను, అధికారాలను ప్రత్యక్షంగా కలుస్తారు. సమస్యలు తెలుసు కుంటారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రతి రోజు కొంత సమయం ప్రజలకు కేటాయించి, ప్రజా దర్బార్’లో ప్రజల సమస్యలు తెలుసుకుని, అత్యవసరం అనుకున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. కానీ, కేసీఆర్ స్టైలే వేరు… ఇప్పుడే కాదు సచివాలయం కూల్చక ముందు కూడా అయన పెద్దగా,, సచివాలయం వైపు కన్నెత్తి చూడలేదు. ప్రగతి భవన తయారైన తర్వాత అసలు సచివాలయం ఒకటుందనే మరిచి పోయారు. ఆ తర్వాత సచివాలంలో ముఖ్యమంత్రి కాలు పెట్టిన సందర్భం బహుశా లేదని చెప్ప వచ్చును. అంతేకాదు, నిన్నమొన్నటి దాకా, ముఖ్యమంత్రి దర్శనం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులకు కూడా దొరికేది దు. ఇదేమి రహస్యం కాదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయక పోవడం ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం. అయితే, హుజూరాబాద్ ఎపిసోడ్ తర్వాత ఈమధ్య కాలంలో కొద్దిగా మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ, కడుపులో లేనిది కక్కుకుంటే వస్తుందా అన్నట్లు, ఆయన మొక్కుబడిగా మాత్రమే బయటకు వస్తున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి వర్కింగ్ స్టైల్ విషయంలో, చాలా చాలా విమర్శలు వచ్చాయి. అయినా, అయన ఎప్పుడూ విమర్శలను అంతగా పట్టించుకోలేదు. సచివాలయానికి చుట్టపు చూపుగా అయినా రాని ముఖ్యమంత్రి అని విపక్షాలు ఎద్దేవ చేసినా పట్టించుకోలేదు. అధికారుల అభ్యంతరాలను అయితే అసలే పట్టించుకోలేదు. సహజంగా ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. కానీ, కేసీఆర్ అందుకు విరుద్ధం.
అందుకే, ప్రగతి భవన్‌కే పరిమితమైన ఆయన ప్రజల సమస్యలు ఏం తెలుసుకుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫామ్‌హౌస్’కే, పరిమితమెయిన్ ముఖ్యమంత్రి ఇక పాలన ఎలా చేస్తారంటూ,పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో కదిగి పారేశారు. ఇతర విపక్షాలు ఆయనపై మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ కేసీఆర్.. నేనేను నేనే, అన్నట్లుగా తన పంథాను మార్చుకోవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.కొన్ని కొన్ని సందర్భాలలో నెలలో సగం రోజులకంటే ఎక్కువ ఫామ్‌హౌస్’లోనే ఉంటున్నారు. గతేడాది జూన్‌లో 18 రోజులు, జనవరిలో 17 రోజులు ఇలా ఫామ్‌హౌస్‌కే ఆయన పరిమితమయ్యారు. ఇలా ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్’కే పరిమితం అయితే, పరిపాలన పరంగానే, కాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ఆయన దారి ఆయనదే., ఆయనంతే ఆయనంతట ఆయన మారరు .. జనం మార్చ వలసిందే.