బీహార్‌కు ప్ర‌త్యేక హోదా!.. మ‌రి, ఏపీకి? జ‌గ‌న‌న్న వ‌ల్ల కావ‌ట్లేదా..?

ప్ర‌త్యేక హోదాపై అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు చేసినంత పోరాటం ఇంకెవ‌రూ చేయ‌లేదు. స్పెష‌ల్ స్టేట‌స్ కోసం ఢిల్లీపై ధ‌ర్మ‌పోరాటం చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నారు. తాజాగా, మ‌రోసారి రాజీనామాల‌కు రెడీ అన్నారు. ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పెష‌ల్ స్టేట‌స్‌పై పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేశారు. మ‌రి, జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రిగా ప్ర‌త్యేక హోదా కోసం ఏం చేశారు? త‌నవంతుగా ఎలాంటి ప్ర‌య‌త్నం చేశారు? అంటే.. ఏమీ చేయ‌లేద‌నే చెప్పాలి. ఏపీకి హోదా కోసం కేంద్రాన్ని గ‌ట్టిగా అడిగింది లేదు.. పార్ల‌మెంట్‌లో ఆ పార్టీ ఎంపీలు ఒక్క ప్లకార్డు ప‌ట్టుకున్న‌దీ లేదు.. మోదీని, అమిత్‌షాను నిల‌దీసిందీ లేదు. వైసీపీ ప్ర‌భుత్వ చేత‌గానిత‌నం వ‌ల్లే.. ఏపీకి విభ‌జ‌న హ‌క్కు అయిన‌ ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించేశార‌ని అంటున్నారు.  ఇక‌, స్పెష‌ల్ స్టేట‌స్‌పై కేంద్రం సైతం డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌ని అంటున్నారు. ఏపీ సహా మరే ఇతర రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంగీకరించవని కేంద్రం గతంలో పలుమార్లు చెప్పింది. కానీ, తాజాగా బీహార్‌కు స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చే అంశాన్ని నీతి అయోగ్ పరిశీలిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట‌ర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని తెలిపారు. ఈ అంశంపై గౌరవనీయ సీఎం జగన్, అన్ని పార్టీల నేతలు వెంటనే దృష్టి సారించాలని ల‌క్ష్మీనారాయ‌ణ‌ సూచించారు. ప్ర‌త్యేక హోదాపై బీజేపీ, జేడీయూ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ప్రారంభం అయింది. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన రాష్ట్రాల ర్యాంకుల ఆధారంగా ప్ర‌త్యేక హోదా బీహార్ కు ఇవ్వాల‌ని సీఎం నితీష్ కేంద్రానికి లేఖ రాశారు. అయితే, బీహార్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రంలేద‌ని బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం రేణుదేవి అంటున్నారు. త‌మ స్టేట్‌కి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మ‌ని 2009 ఎన్నిక‌ల నుంచి నితీష్ కుమార్ ప‌లుమార్లు డిమాండ్ చేశారు. తాజాగా విడుద‌లైన ర్యాంకు ఆధారంగా ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ ను మ‌ళ్లీ తెర‌మీద‌కు తీసుకొచ్చారు.  బీహార్‌కు స్పెష‌ల్ స్టేట‌స్ కోసం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ త‌మకు మిత్ర‌ప‌క్ష‌మైన‌ప్ప‌టికినీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీపై అంత‌లా పోరాడుతుంటే.. అందులో ఆవ‌గింజంత వంతు పోరాట‌మైనా ఏపీ సీఎం జ‌గ‌న్ చేయ‌క‌పోతుండ‌టంపై ఆంధ్రులంతా మండిప‌డుతున్నారు. కేంద్రం ఇచ్చేదీ లేనిదీ త‌ర్వాతి మాట‌. ముందు మ‌న‌వంతుగా.. మ‌న విభ‌జ‌న హ‌క్కుగా.. ప్ర‌త్యేక హోదాపై కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీయాలిగా? ఏపీ వాయిస్‌ను కేంద్రం ద‌గ్గ‌ర‌ బ‌లంగా వినిపించాలిగా? మ‌రి, మాట వ‌రుస‌కైనా వైసీపీ ప్ర‌భుత్వం హోదాపై గ‌ళం విప్ప‌క‌పోవ‌డం దారుణ‌మంటున్నారు. బీహార్ ఎపిసోడ్‌తో.. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తోంది. జ‌గ‌న్ తీరుపై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.   

తిరుప‌తికి ముగ్గురు మొన‌గాళ్లు.. అమ‌రావ‌తి కోసం అరుదైన క‌ల‌యిక‌..

తిరుప‌తిలో అమ‌రావ‌తి. శుక్ర‌వారం భారీ బ‌హిరంగ స‌భ‌. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ‌ మ‌హోద్య‌మ స‌భ‌. పెద్ద ఎత్తున ఏర్పాట్లు. వేలాదిగా అమ‌రావ‌తి మ‌ద్ద‌తుదారులు. అందుకే, ఇప్పుడు అన్నిదారులూ తిరుప‌తి వైపే మ‌ళ్లుతున్నాయి. తిరుప‌తిలో అమ‌రావ‌తి నినాదం మారుమోగుతోంది. ఇక‌, రాజ‌ధాని రైతుల స‌భ‌.. అరుదైన రాజ‌కీయ క‌ల‌యిక‌గా మారుతోంది. టీడీపీ-జ‌న‌సేన‌-వైసీపీ ప్రముఖులు వేదిక‌ను పంచుకోనున్నారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత.. టీడీపీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ఒకే స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు. వీరికి వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ సైతం తోడ‌వుతుండ‌టం.. తిరుప‌తి స‌భ ముగ్గురు మొన‌గాళ్ల స‌భ‌గా మార‌నుంద‌ని అంటున్నారు.  చంద్ర‌బాబు + ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల క‌ల‌యిక‌పైనే అంద‌రి ఆస‌క్తి. 2014లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇచ్చింది. చంద్ర‌బాబు గెలుపు కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ కృషి చేశారు. జ‌గ‌న్‌ను చిత్తుగా ఓడించారు. ఆ త‌ర్వాత మారిన స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో టీడీపీ నుంచి జ‌న‌సేన దూరం జ‌రిగింది. బీజేపీతోనూ క‌టీఫ్ చేసుకుంది. ప‌వ‌న్ దెబ్బ‌కి.. 2019లో వైసీపీని విజ‌యం వ‌రించింది. న‌వ్యాంధ్ర భ‌విష్య‌త్తు అంథ‌కార‌మ‌య‌మైంది. రెండేళ్లుగా చంద్ర‌బాబు-ప‌వ‌న్‌ల మ‌ధ్య ఎలాంటి వైరం లేదు. సానుకూల‌తే ఉంది. బాబు నివాసంపై వైసీపీ దాడికి య‌త్నించ‌డం, టీడీపీ ఆఫీసు విధ్వంసం, అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రిపై అసంబ‌ద్ధ వ్యాఖ్య‌ల వివాదం.. ఇలా ప‌లు అంశాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చంద్ర‌బాబుకు బాస‌ట‌గా నిలిచారు. వైసీపీ తీరును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు. ఇక‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన‌ధికారికంగా టీడీపీ + జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకున్నారు. ఉమ్మడి శత్రువు జగన్‌ను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో క‌లిసిపోయాయి. అధినేత లెవెల్‌లో మాత్రం ఆ స‌ఖ్య‌త ఇంకా బ‌హిరంగం కాలేదు. తాజాగా, తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతుల స‌భావేదిక‌ను చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లు క‌లిసి పంచుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. ఏడేళ్ల కింద‌టి జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెస్తున్నాయి.  చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లే కాదు.. జ‌గ‌న్‌కు, విజ‌య‌సాయిరెడ్డికి కంట్లో న‌లుసుగా మారిన రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు సైతం తిరుప‌తి స‌భ‌కు వ‌ర్చువ‌ల్ విధానంలో అటెండ్ కానుండ‌టం ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్ర‌తీరోజూ ప్రెస్‌మీట్ల‌తో, కోర్టులో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌తో, పార్ట‌మెంట్‌లో ప్ర‌స్తావ‌న‌తో, కేంద్ర పెద్ద‌ల‌కు ఫిర్యాదుల‌తో.. జ‌గ‌న్ స‌ర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ర‌ఘురామ‌. న‌వ‌ర‌త్నాల‌ను న‌ల‌గ్గొడుతున్నారు. సీఐడీ క‌స్ట‌డీతో ర‌ఘురామ‌ను క‌ట్ట‌డి చేయాల‌నుకున్న ప్ర‌భుత్వ కుతంత్రాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకొని.. ఏమాత్రం అద‌ర‌క‌, బెద‌ర‌క‌.. గోడ‌కు కొట్టిన బంతిలా మ‌రింత దూకుడుగా జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు ర‌ఘురామ‌. అలాంటి ర‌ఘురామ కృష్ణ‌రాజు తిరుప‌తి స‌భ‌లో వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించ‌నున్నారు. అమ‌రావ‌తికి, రాజ‌ధానికి మొద‌టి నుంచీ స్ట్రాంగ్ స‌పోర్ట‌ర్‌గా ఉన్న ర‌ఘురామ‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌తో పాటే తిరుప‌తి వేదిక‌గా త‌న గ‌ళాన్ని బ‌లంగా వినిపించ‌నుండ‌టం సంచ‌ల‌నంగా మార‌నుంది. ఇలా.. ముగ్గురు మొన‌గాళ్ల‌లాంటి చంద్ర‌బాబు- ప‌వ‌న్ క‌ల్యాణ్‌- ర‌ఘురామ కృష్ణంరాజులు.. తిరుప‌తి స‌భ‌కు సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తున్నారు. ఈ ప‌రిణామం అమ‌రావ‌తి రైతుల్లో ఉత్సాహం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో క‌ల‌వ‌రం.. నింపుతోంది. తిరుప‌తి స‌భ‌తో తాడేప‌ల్లి ప్యాలెస్‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయ‌ని అంటున్నారు. 

జనవరిలో ఒమిక్రాన్ విలయం! యూరప్ లో నిండిపోతున్న హాస్పిటల్స్..

అనుకున్నదంతా అవుతోంది.. భయపడుతున్నదే జరుగుతోంది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారికంగా వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు.  డెల్టా ప్లస్ వేరియంట్ ను డామినేట్ చేసే ఆధిపత్య జాతిగా ఒమిక్రాన్ పురోగమిస్తుందని సీడీసీ సైంటిస్టులు హెచ్చరించారు. 2022 తొలి రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ తెలిపారు. పండుగ సమయాల్లో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అమెరికాలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని తెలిపింది. మిగిలిన కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ రకానికి చెందినవని చెప్పింది. ఇక కొవిడ్ ధాటికి ఐరోపా దేశాలు అల్లాడిపోతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే అక్కడ పలు దేశాలకు వ్యాపించింది. కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని అక్కడి ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫ్రాన్స్‌లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించలేక వైద్యులు అలసిపోతున్నారు. టీకా తీసుకోని బాధితుల పట్ల వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.    బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి బ్రిటన్‌లో బుధవారం రికార్డు స్థాయిలో కొత్త కేసుల బయటపడ్డాయి. బుధవారం ఒక్కరోజే  78,610 మందికి వైరస్ సోకింది. ఈ జనవరిలో అత్యధికంగా 68 వేల మందికి పైగా కరోనా బారినపడగా.. ఈ దఫా ఉద్ధృతిలో ఆ సంఖ్య 78 వేలకు చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కోటి 10 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే అక్కడ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ భారీ అల వలే ముంచుకొస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల జాతినుద్దేశించి వ్యాఖ్యానించారు. గత వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ పట్ల మరింత అప్రమత్తత అవసరమని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.     ఫ్రాన్స్‌ కూడా కొవిడ్‌ కొత్త వేరియంట్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొవిడ్ వార్డుల్లో చికిత్స అందించలేక వైద్యులు అలిసిపోతున్నారు. వ్యాక్సిన్లు తీసుకోని వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ భారిన పడిన వారిలో ఎక్కువ మంది యువతే. వారంతా వ్యాక్సిన్ తీసుకోనివారే. దీంతో టీకా తీసుకోని వారి పట్ల వైద్య సిబ్బందికి కోపం, చిరాకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ బాధితుల్లోనే తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అందుకే చాలా మంది ఇక్కడ ఉద్యోగాలను వదులుకొని, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని చెప్పారు.  

అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు! 

అమ్మాయిల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ప్రత్యేక వివాహ చట్టం, పర్సనల్ లా, హిందూ వివాహ చట్టం 1955లకు సవరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ అంశంపై ప్రస్తావించిన ఏడాది తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని మోదీ ఆనాటి ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటి వరకు అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. అబ్బాయిలకు అయితే 21 ఏళ్లు కనీస వివాహ వయస్సుగా నిర్ధారించారు. ఈ ఆధునిక సమాజంలో అమ్మాయిలు- అబ్బాయిల కనీస వివాహ వయస్సులో తేడా ఎందుకనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ అంతరాన్ని తొలగించాలంటూ అభ్యర్థనలు, డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాజాగా అమ్మాయిలకు కూడా వివాహ కనీస వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. అమ్మాయిల కనీస వివాహ వయస్సు తక్కువగా ఉండడం వల్ల వారి కెరీర్కు అవరోధం అవుతోందని పలు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా 18 ఏళ్లకే పెళ్లయితే చిన్న వయస్సులోనే గర్భం దాల్చి, అమ్మాయిలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే అమ్మాయిల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్లు వచ్చాయి. సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కేబినెట్ ఇప్పుడు అమ్మాయిల కనీస వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.  అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు పెంపుపై గత ఏడాది జూన్ లో జయా జైట్లీ నేతృత్వంలో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. నిపుణులు డాక్టర్ వీకే పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వశాఖల సీనియర్ అధికారులు ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా వ్యవహరించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించింది.  పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. అమ్మాయిలు మొదటిసారి గర్భం దాల్చే నాటికి వారి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. 21 ఏళ్లకు అమ్మాయిలకు పెళ్లి చేస్తే.. ఆమె పుట్టింటిపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్ ఫోర్స్ కమిటీ వివరించింది. ఈ ప్రతిపాదనకే కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీంగా తెలిసింది.

టీమిండియాతో కోహ్లీ వెళ్లలేదా? బీసీసీఐలో రచ్చ ముదురుతోందా? 

టీమిండియాలో కొనసాగుతున్న రచ్చ మరింత ముదురుతోంది. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తనకు ముందుగా చెప్పలేదంటూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోహ్లీ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. బీసీసీఐలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని, వెంటనే ఈ వివాదానికి తెర దించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ వివాదం సాగుతుండగానే  ఊహించని, ఇబ్బందికర పరిణామాల మధ్య టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా టూర్ కు బయల్దేరింది. కరోనా నేపథ్యంలో  ప్రత్యేక విమానంలో  క్రికెటర్లు బయల్దేరారు. విమానంలో ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో కోహ్లీ కనిపించడం లేదు. దీంతో సౌతాఫ్రికా టూర్ వెళ్లిన టీమిండియా సభ్యుల్లో విరాట్ కోహ్లీ ఉన్నాడా లేదా అన్న అనుమానం వస్తోంది. అయితే బీసీసీఐ వర్గాలు మాత్రం టీమిండియా సభ్యుల వెంట కోహ్లీ కూడా ఉన్నారని చెబుతున్నారు. మరీ బీసీసీఐ పోస్టు చేసిన ఫోటోలో కోహ్లీ ఎందుకు లేడన్నది మరో వివాదంగా మారింది. బీసీసీఐ తీరుపై పై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. విమానంలో కోహ్లీ ఎక్కడున్నాడో మీకు కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. సౌతాఫ్రికా  సిరిస్ లో  మొదట ఇండియా మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టెస్టుకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. అయితే గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.  కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన వివాదంపై తాజాగా కపిల్ దేవ్ స్పందించారు. కోహ్లీ సహా ఎవరికీ చెప్పాల్సిన పని లేదంని అన్నారు. చెప్పకుండా తొలగించడం షాక్ కు గురిచేసిందని శరణ్దీప్ సింగ్ అన్నారు. వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నోరు విప్పాలని సునీల్ గవాస్కర్ అన్నారు. అప్పుడే వివాదంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు ఎలా వచ్చాయో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అసలు వివాదం ఎందుకు వచ్చిందో తెలియాలన్నారు గవాస్కర్. వన్డేలకు కెప్టెన్ గా తప్పిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ చెబితే అందులో ఎలాంటి తప్పు లేదని, వారికి అన్ని విధాలా ఆ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. కెప్టెన్ అనేవాడు జస్ట్ కో–ఆప్టెడ్, నాన్ ఓటింగ్ సభ్యుడు మాత్రమేనని తేల్చి చెప్పారు. 

టికెట్ల ధ‌ర‌ల్లో సినిమా ట్విస్టులు.. హైకోర్టు తీర్పు ఎవ‌రికి అనుకూలం?

సింగిల్ జ‌డ్జి మీ ఇష్టం అన్నారు. సినిమా టికెట్లు పెంచుకోవ‌చ్చ‌ని గుడ్‌న్యూస్ చెప్పారు. టాలీవుడ్ మొత్తం సంబ‌ర‌ప‌డింది. కానీ, అది ముడ్నాళ్ల‌ ముచ్చ‌టగా మారింది. సింగిల్ జ‌డ్జి తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లింది. అక్క‌డ మేట‌ర్ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. స్టే ఇవ్వ‌కున్నా.. తీర్పును కాస్త మార్చింది. థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని.. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకోవాల‌ని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇక‌, గత ఆదేశాల ప్ర‌కారం టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇదీ.. మేట‌ర్‌.  ఇంత‌కీ హైకోర్టు తీర్పు ఎవ‌రికి అనుకూలం? ఇంకెవ‌రికి ప్ర‌తికూలం? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు థియేట‌ర్లు.. ఇద్ద‌రిలో ఎవ‌రికైనా లాభం జ‌రగొచ్చు అంటున్నారు. అయితే, కండిష‌న్స్ అప్లై. టికెట్ ధ‌ర‌ల‌ను ఇంత పెంచుతామంటూ ముందుగా థియేట‌ర్ యాజ‌మాన్యాలు జేసీకి ప్ర‌తిపాద‌న‌లు పంపాలి. అయితే, ప్ర‌భుత్వంలో భాగంగా ఉండే జేసీ.. స్వ‌తంత్రంగా నిర్ణ‌యం తీసుకుంటారా? ఆయ‌న్ను అలా సొంతంగా నిర్ణ‌యం తీసుకోనిస్తారా? అనేదే ఇక్క‌డ కీల‌కాంశం. ప్ర‌భుత్వం జాయింట్ కలెక్ట‌ర్ల‌పై ఒత్తిడి పెంచి టికెట్ ధ‌ర‌ల పెంపును క‌ట్ట‌డి చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. జేసీలు అంతఃక‌ర‌ణ‌శుద్ధితో డెసిష‌న్ తీసుకుంటారా? అలా తీసుకోనిస్తారా? అనేదే ఆస‌క్తిక‌రం.   పాల‌కులు చెప్పినట్టు జేసీలు నడుచుకునేలా ఒత్తిడి చేస్తారా? అలా ప్ర‌భుత్వం నుంచి ప్రెజ‌ర్ వ‌చ్చే అవకాశం లేక‌పోలేద‌ని అనుమానిస్తున్నారు. అయితే.. జేసీలు కనుక పరిధి దాటి వ్యవహరిస్తే.. వారికి న్యాయ‌ చిక్కుల్లో త‌ప్ప‌వు. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్‌లు కోర్టులో దోషిగా నిల‌బ‌డిన సంద‌ర్భాలు ఏపీలో అనేకం ఉన్నాయి. ఇలా.. అటూఇటూ తిరిగి సినిమా టికెట్ల ధ‌ర‌ల వ్వ‌వ‌హారం జేసీల కోర్టులోకి వ‌చ్చిప‌డింది. మ‌రి, జాయింట్ క‌లెక్ట‌ర్లు.. సినిమాకు, థియేట‌ర్ల‌కు అనుకూలంగా న్యాయం వైపు నిల‌బ‌డ‌తారా? లేక‌, ఎప్ప‌టిలానే త‌మ‌పై వ‌చ్చే ఒత్తిళ్ల‌కు వంగిపోతారా? అనేదానిపై కొత్త సినిమాలు, పెద్ద సినిమాల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.   

ఈటల కాంగ్రెస్ లో చేరబోతున్నారా? బండి సంజయ్ తో వైరమా? 

హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది. వామపక్ష భావజాలంతో రాజకీయంగా ఎదిగిన రాజేందర్.. బీజేపీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ఈటల రాజేందరే క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన  ఈట‌ల రాజేంద‌ర్ ను తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ హైదరాబాదులో స‌న్మానించింది. అనంత‌రం ఆ యూనియ‌న్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో  మాట్లాడిన ఈట‌ల రాజేంద‌ర్.. తనకు పార్టీ మారే ఆలోచనే లేదన్నారు. తాను పార్టీలు మారే రకం కాదన్నారు. టీఆర్ఎస్ నుంచి తనంతట తానుగా బయటికి రాలేదని, వాళ్లే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా చేశారన్నారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేసీఆర్ వర్గమే కావాలని ప్రచారం చేస్తుందని క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో కొట్లాటే.. తెలంగాణలో అధికారం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మెజార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇక టీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదని అక్కడి నేతలే అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. ముందు రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దాలని ఎమ్మెల్యే హితవు పలికారు.బీజేపీలో గ్రూపులు లేవని... బండి సంజయ్‌తో వైరం లేదని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్. ఏడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే ఇప్పుడు దళితబంధు అమలు చేయాలని  ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.  టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు రాజేందర్. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న రాజ‌కీయ పార్టీతోనే సాధ్య‌మ‌ని టీఆర్ఎస్‌ను పెట్టారని, ప్ర‌త్యేక రాష్ట్రం కోస‌మే ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేశానని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో చోటు సాధించానని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. 2014లో రాష్ట్ర సాధించుకున్నామ‌ని, అనంత‌రం ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించానని గుర్తు చేశారు. త‌న‌ శ‌క్తి మేర‌కు ప‌నిచేశానని తెలిపారు. 2018లో మ‌ళ్లీ గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించానని, క‌రోనా స‌మ‌యంలో ఆరోగ్య శాఖలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశానని ఈటల రాజేంద‌ర్ అన్నారు.  

జ‌గ‌న్‌తో తేల్చుకుంటాం.. పీఆర్సీపై ఉద్యోగుల ఫైట్‌..

పీఆర్సీ పూర్తి నివేదిక ఉద్యోగులకు ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను ప్ర‌భుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారులతో కమిటీ వేసి.. స‌ర్కారుకు నచ్చినట్టు నివేదిక ఇచ్చారని మండిప‌డ్డారు. 14.39 పిట్‌మెంట్‌కు ఉద్యోగులు వ్యతిరేకమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ, డీఏ ఇవ్వాలని.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పిట్‌మెంట్‌పై సీఎం జగన్‌ దగ్గర తేల్చుకుంటామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.  50 శాతం పిట్‌మెంట్ అడుగుతున్నామని.. ఉద్యోగుల కనీస వేతనం రూ. 23 వేలు ఉండాలని ఏపీ జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ 23 లక్షలకు పెంచాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మూల వేతనం పెంచాలన్నారు. డిమాండ్లపై సరైన స్పందన ఉంటేనే ప్రభుత్వంతో చర్చిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. విజ‌య‌వాడ ధర్నా చౌక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా చేపట్టింది. 

మండలి సభ్యులకు మంత్రి పదవులు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం విస్తరణకు సిద్దమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, మారుతున్న పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్ళవలసి వచ్చినా అందుకు సిద్దంగా ఉండే విధంగా, పార్టీలో అదే విధంగా మత్రి మండలిలో మార్పులు చేర్పులు చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్,ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్య నేతలు కొందరికి సంకేతం ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే, ముఖ్యమంత్రి స్వయంగా జిల్లా పర్యటనలకు బయలు దేరుతున్నారు. మరో వంక నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మంత్రి వర్గ విస్తరణ కసరత్తు కూడా చేస్తున్నారు. కాగా, మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఈసారి బీసీ, ఎస్సీలకు  అదే విధంగా మండలి సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.  ఇటీవల జరిగిన మండలి ఎన్నికలలో ఏకంగా ఒకే సారి 19 మంది అధికార పార్టీ సభ్యులు ఎన్నికయ్యారు.నిజానికి మండలిలో ప్రతిపక్ష సభ్యులు కేవలం దిష్టి చుక్కల్లా మాత్రమే మిగిలారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. అధికార టీఆర్ఎస్. సభ్యుల సంఖ్య 34కు చేరింది. వీరు గాక మరో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అంటే, ఆ ఇద్దరితో కలిపి టీఆర్ఎస్ సంఖ్యా బలం 36 కు చేరింది. ఇందులో ముఖ్యమంత్రి కుమార్తె కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్ గుత్తా  సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇలా చాలామంది హేమాహేమీలున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న ‘పెద్దలు’ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాగే, దిగువ సభలోనూ  మంత్రి పదవులు ఆశిస్తున్నవారు, కుల సమీకరణాల దృష్ట్యా అవసరంగా మంత్రి వర్గంలోకి తీసుకోవలసినవారు ఉన్నారు.  అయితే, ఈసారి మంత్రి వర్గం కూర్పుతో పాటుగా మండలి చైర్మన్, ఉప చైర్మన్, చీఫ్ విప్ ఇతర పదవులను, పార్టీ పదవులను కూడా కలుపుకుని ఒకే సారిగా, మార్పులు చేర్పులు చేపట్టీ ఆలోచనలో  ముఖ్యమంత్రి ఉన్నారని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కునేందుకు సైన్యాన్ని సిద్దం చేస్తున్నారని అంటున్నారు.  కాగా,రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా ఎన్నికైనా  బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌కు మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని  అంటున్నారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అదే సామాజిక  వర్గానికి చెందిన బండాకు  మంత్రివర్గంలో  ఖాయంగా స్థానం  దక్కుతుందని, అంటున్నారు. అలాగే, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వేగంగా  మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాలను అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.ఇందులో భాగం రెడ్డి, వెలమ సామాజిక వర్గాలపై వేటు పడే అవకశం ఉందని అంటున్నారు. అలాగే, కుల సమీకరణాలు, రాజకీయ అవసరాల దృష్ట్యా ఇంద్దరు ముగ్గురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసనలు  ఉంటాయని అంటున్నారు. అయితే ఎవరా ఇద్దరు ముగ్గురు .. ఆనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

పీఆర్సీ పంతం.. మ‌రోర‌త్నం మాయం.. టికెట్ క‌ట్‌.. టాప్‌న్యూస్ @ 1pm

1. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. సీఎం జగన్‍తో ఆర్థిక‌ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‍రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. బుధ‌వారం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్‌కు మంత్రి బుగ్గన, సజ్జల వివరించారు. ప్ర‌భుత్వ తీరుపై, పీఆర్సీపై ఉద్యోగులంతా ఆగ్ర‌హంగా ఉన్నార‌ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  2. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  3. సబ్జెక్ట్‌లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిప‌డ్డారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని.. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన HSBC మూతపడటం బాధాకరమంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.  4. తిరుప‌తి బహిరంగ సభకు.. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ" అని నామకరణం చేశారు రైతులు. స‌భా ప్రాంగణంలో భూమి పూజ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు సమీపంలోని దామినీడు ద‌గ్గ‌ర‌ సభ జరగనుంది. ప‌లువురు కీలక రాజ‌కీయ‌ నేతలు, ప్ర‌జాసంఘాల నాయ‌కులు బహిరంగ సభకు హాజ‌రుకానున్నారు.  5. బీజేపీకి బీసీలపై ప్రేమ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి మండిప‌డ్డారు. బీసీ కులాల జన గణనను కేంద్రం తిరస్కరించడం సరికాదన్నారు. దేశంలో బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉందన్నారు. బీసీల మనోభావాలను గౌరవించని బీజేపీ.. భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.  6. మంచిర్యాల జిల్లాలోని ఇందారం-1ఏ బొగ్గు గనిపై మావోయిస్టు పోస్టర్ కలకలం రేపుతోంది. గని అధికారులను, పలువురు కార్మికులను హెచ్చరిస్తూ మావోయిస్టు మంగిలాల్ పేరిట పోస్టర్ వెలిసింది. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టర్‌లో పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే పోస్టర్ వేసింది మావోయిస్టులు కాదని పోలీసులు భావిస్తున్నారు.  7. గుంటూరు జిల్లాలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలంటూ ఆర్జేడీ కార్యాలయం ద‌గ్గ‌ర‌ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. జీవో 42, 50, 51 వెనక్కి తీసుకోవాలని డిమాండ్  చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల నుండి తీసుకున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపాలన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్థలాలను కొట్టేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే అధికారుల ఇళ్ల‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.  8. తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది. ఐదు లక్షలు ఇస్తే వదిలేస్తానని.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ యువతి తండ్రికి కిడ్నాపర్ ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు. ఆందోళన చెందిన యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 9. కోనసీమలో ఒమైక్రాన్ కలకలం చెలరేగింది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యాధికారులు వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి ఒమైక్రాన్‌ నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఒమైక్రానా, కాదా అనేది తేలుతుంద‌ని చెబుతున్నారు.  10. చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌(CoSC) కమిటీ ఛైర్మన్‌గా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతుల్లో న‌ర‌వ‌ణెనే సీనియర్‌ కావడంతో ఆయ‌న‌కు చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌బాధ్యతలు అప్పగించారు.   

మ‌రో ర‌త్నం మాయం.. మూడు రాజధానుల పేరుతో మోసం..

సబ్జెక్ట్‌లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిప‌డ్డారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని.. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన HSBC మూతపడటం బాధాకరమంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. విశాఖ మ‌కుటంలో మ‌రోర‌త్నం మాయం.. అంటూ HSBC శాఖ మూత ప‌డింద‌నే వార్తా క‌థ‌నాన్ని త‌న ట్వీట్‌కు జ‌త చేశారు లోకేశ్‌. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్‌గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు లోకేశ్‌. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనమని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసంచాలని దుయ్య‌బ‌ట్టారు.    విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని వైసీపీ ప్ర‌భుత్వానికి హితవు పలికారు లోకేశ్‌. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

రావత్‌ స్థానంలో న‌ర‌వ‌ణె.. CoSC ఛైర్మ‌న్‌గా నియామ‌కం..

చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌(CoSC) కమిటీ ఛైర్మన్‌గా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతుల్లో న‌ర‌వ‌ణెనే సీనియర్‌ కావడంతో ఆయ‌న‌కు చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌బాధ్యతలు అప్పగించారు.  సీవోఎస్‌సీ కమిటీ సమావేశమై రావత్‌ దంపతులకు నివాళులలు అర్పించింది. ఆ తర్వాత జనరల్ నరవణె కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. రావత్‌ మరణం తర్వాత కొత్త సీడీఎస్‌ ఎవరనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సీడీఎస్‌గా జనరల్ నరవణె పేరే ప్రధానంగా వినిపిస్తోంది. సీనియార్టీ పరంగా ఆయననే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. జనరల్ నరవణె.. 2019 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీకి ఛైర్మ‌న్ అయ్యారు. ఇక‌, త్వ‌ర‌లోనే సీడీఎస్ కూడా అవుతార‌ని అంటున్నారు. 

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ‌ మ‌హోద్య‌మ స‌భ‌.. తిరుప‌తిలో జోరుగా ఏర్పాట్లు..

ఒక్క‌రోజే గడువుంది. ఒక్క‌రోజులోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అదిరిపోయేలా భారీ బ‌హిరంగ స‌భ జ‌ర‌పాలి. హైకోర్టు నిర్ణ‌యం బుధ‌వారం సాయంత్ర‌మే వ‌చ్చింది. శుక్ర‌వారం తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు అనుమ‌తి ల‌భించింది. అదికూడా మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కే ప‌ర్మిష‌న్‌. అందుకే, రాజ‌ధాని రైతులు కాలంతో పోటీ ప‌డుతున్నారు. వ‌డివ‌డిగా బ‌హిరంగ స‌భ‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.   తిరుప‌తి బహిరంగ సభకు.. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ" అని నామకరణం చేశారు. స‌భా ప్రాంగణంలో భూమి పూజ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు సమీపంలోని దామినీడు ద‌గ్గ‌ర‌ సభ జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, వైసీపీ నర్సాపురం ఎం.పీ  రఘురామ కృష్ణంమరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు శైలజానాథ్, తులసి రెడ్డి, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, తదితర కీలక నేతలు బహిరంగ సభకు హాజ‌రుకానున్నారు. ప‌లు ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారు. మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా శుక్రవారం తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు బుధ‌వారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. సభకు అనుమతి నిరాకరించడానికి పోలీసులు తెలిపిన‌ కారణాలు సహేతుకంగా లేవని త‌ప్పుబ‌ట్టింది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. 3 రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభ నిర్వహించుకొనేందుకు అనుమతి నిరాకరించడం ప్రాథమిక హక్కులను హరించడమేనని తెలిపింది. సమస్యలపై ఉద్యమించడం, గొంతెత్తడం కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. హైకోర్టు అనుమ‌తి త‌ర్వాత‌.. అమ‌రావ‌తి రైతులు బ‌హిరంగ స‌భ‌కు అత్యంత వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.   

వివేకా మ‌ర్డ‌ర్ కేస్‌.. పీకే మార్క్ పాలిటిక్స్‌!

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పెద్దల హస్తం ఉందా?.. ఈ హత్య ఇంటి దొంగల పనేనా? .. అందుకే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు? ఈశ్వరుడే కాదు.. సీబీఐ వాళ్లు కూడా ఈ హత్య కేసులో నిందితులను పట్టుకోకుండా అంత పకడ్బందీగా పథక రచన చేశారా? ఆ క్రమంలోనే వివేకా హత్య కేసు సైడ్ ట్రాక్ పట్టించేందుకు అమ్మదొంగలు తయారయ్యారా? ... అంటే అవుననే సమాధానం వస్తుందని కడప జిల్లా వాసుల నుంచి. వైయస్ వివేకానందరెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఆయన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసిందే. మరి అలాంటి వ్యక్తి హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న ట్విస్ట్‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ ట్విస్ట్‌లన్నీ పరిశీలిస్తే..  టాలీవుడ్‌లో ఓ మాంచీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని అంటున్నారు.   వివేకానందరెడ్డి హత్యపై తొలుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి..  స్పందించారు. వివేకా గుండెపోటుతో మరణించారంటూ ఆయన మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత.. వివేకానందరెడ్డి.. దారుణ హత్యకు గురయ్యారంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అనంతరం నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. మీడియా సాక్షిగా మాట్లాడుతూ.. వివేకా హత్య మరింత దారుణమా.. టీడీపీ నాయకులు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈ హత్య ఛేదించడం పోలీసుల వల్ల కాదని.. సీబీఐ అయితేనే కరెక్ట్ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు... సాధ్యమైనంత త్వరగా దోషులను పట్టుకోవాలని.. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలని నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని మీడియా సాక్షిగా ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం.. హైకోర్టులో ఈ కేసు సీబీఐకి ఇవ్వాలంటూ వేసిన కేసును సాక్షాత్తూ వైయస్ జగనే స్వయంగా విత్ డ్రా చేయడం.. అయితే అప్పటికే వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వం చేసిన సిట్‌ అధికారులను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  తరచు మార్చడం.. దీంతో వివేకా హత్య కేసు ఇంచ్ కూడా ముందుకు కదలక పోవడం.. ఆ క్రమంలో వివేకా కుమార్తె వైయస్ సునీత విసుగు చెంది.. ఈ హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసులో వీళ్లే నిందితులుగా ఉండే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేయడం.... ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని సీబీఐ తమదైన శైలిలో ప్రశ్నించింది. ఆ క్రమంలో వైయస్ వివేకానందరెడ్డికి అత్యంత నమ్మకస్తులను కూడా సీబీఐ వదలకుండా ప్రశ్నించింది.  ఆ క్రమంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని అంతా భావించారు. ఇక వివేకా వద్ద గతంలో డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి అప్రూవర్‌గా మారి.. జరిగినదంతా.. మొత్తం సీబీఐ ఎదుట చెప్పాశాడు. వివేకా హత్యకు కోట్లలో సుపారీ ఫిక్సీ అయిందని.. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు వీళ్లేనంటూ పలువురి పేర్లను ప్రకటించడమే కాకుండా.. వివేకా రక్త సంబంధీకులు వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డి కూడా దీనిలో ప్రధాన పాత్ర ఉందంటూ సంచలన  విషయాలు బయట పెట్టాడీ దస్తాగిరి. అయితే అప్పడే అసలు సిసలు రాజకీయం రాజుకుంది. అప్పటికే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకీ తీసుకుంది. ఈ నేపథ్యంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి.. నేరుగా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసి... వివేకా హత్యతో ఆయన కుమార్తె వైయస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. ఆ తర్వాత భరత్ యాదవ్ అనే వ్యక్తి సైతం మీడియా సాక్షిగా ఇవే ఆరోపణలు గుప్పించడం గమనార్హం.  మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి హఠాత్తుగా తెరపైకి వచ్చి.. వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిల పాత్ర ఉందని.. అందుకు సాక్ష్యం చెప్పాలంటూ తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి తీసుకు వస్తున్నారని.. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించారు.  ఇంకోవైపు వివేకానందరెడ్డి వద్ద మూడు దశాబ్దాలగా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి సైతం కడప ఎస్పీని కలిసి... తనకు వివేకా కుమార్తె, అల్లుడు నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు. దీనిని బట్టి చూస్తే బ్లాక్ మెయిలింగ్, బురద చల్లడం ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మరక్షణలో పడేయడం ద్వారా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కడప జిల్లా వాసులు అంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వేగానికి బ్రేకులు వేసేందుకే నిందితులు ఇలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తున్నారని జిల్లా వాసులు  చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా వివేకా హత్య కేసు దర్యాప్తు.. సైడ్ ట్రాక్ పట్టడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు.  ఏదీ ఏమైనా ఈ హత్య కేసులో ఒకరు తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చి.. దర్యాప్తు సంస్థపైనా... బాధిత కుటుంబ సభ్యులపైన ఏకంగా పోలీసులకే ఫిర్యాదులు చేయడం చూస్తుంటే...  నేటి రాజకీయాల్లో బిహారీ బాబు ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయం లాగే.. ఈ వివేకా హత్య కేసులోని ఈ ట్విస్ట్‌లు చూస్తే.. ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయాలని గుర్తు చేస్తున్నాయని కడప జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో ఎన్ని ట్విస్ట్‌లు జరిగినా.. ఈ కేసును ఛేదించడం సీబీఐ ముందున్న అతి పెద్ద సవాల్ అని కడప వాసులు విశ్లేషిస్తున్నారు.

జిల్లాల పర్యటనకు కేసీఆర్.. ముందస్తు ఎన్నికలు ఖాయమేనా? 

తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? టీఆర్ఎస్ నేతలకు ఇప్పటికే సిగ్నల్ వచ్చేసిందా ? అంటే తెలంగాణ భవన్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రగతి భవన్ లేదా ఫౌంహౌజ్ కే పరిమితం అవుతారనే విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్.. ఒక్కసారిగా రూట్ మార్చారు. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు పార్టీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. పాలన పరుగులు పెట్టేలా కలెక్టర్లతోనూ చర్చలు జరపబోతున్నారు. కేసీఆర్ కు సంబంధించి తాజాగా విడుదలైన షెడ్యూల్ తో తెలంగాణలో ఏదో జరగబోతుందన్న చర్చ సాగుతోంది.  కేసీఆర్ శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాజకీయంగా క్రియాశీలం కావాలని పార్టీ నేతలను కేసీఆర్  ఆదేశిస్తారని చెబుతున్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో వంద శాతం అమలు చేస్తారు. వచ్చే మార్చికల్లా అన్ని నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాలపై కలెక్టర్లు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనను చేపట్టనున్నారు. ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 19 నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి తన పర్యటనను కేసీఆర్ ప్రారంభించనున్నారు. 19న వనపర్తి జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లు, కర్నె తాండ ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, కొత్త కలెక్టరేట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 20న జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ జిల్లాలో కూడా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ ఇక ఎలాంటి చిన్న చిన్న ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇక వచ్చేది పూర్తి స్థాయి అసెంబ్లీ ఎన్నికలే. షెడ్యూల్ ప్రకారం 2023 చివరిలో జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఓ ఏడాది త్యాగం చేసి.. మరో ఐదేళ్లు ఎక్స్‌ టెన్షన్ పొందేందుకు వచ్చే ఏడాది చివరిలో ముందస్తుకు వెళ్తారన్న గట్టి అంచనాల్లో తెలంగాణ రాజకీయవర్గాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఆయన దళిత బంధు పథకం అమలు.. ఇతర వ్యవహారాలను ఖచ్చితంగా వచ్చేఏడాది ఆగస్టులోపు పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులూ ఆ లోపు కొలిక్కి తెస్తున్నారని అంటున్నారు, కేసీఆర్ ఈ తీరిక లేని పర్యటనలు… ఇక ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పటి వరకూ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వస్తున్నాయి.  

ఓటర్ కార్డుతో ఆధార్ లింక్! రాజకీయ పార్టీలకు షాక్‌.. 

నకిలీ ఓటరు కార్డులను నిరోధించడం కోసం ఓటర్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడా చిత్తశుద్ధితో లేదు. పూర్తి స్థాయిలో ఆధార్‌తో లింక్ చేయడానికి ఇష్టపడటం లేదు.తాజా బిల్లు ప్రకారం ఓటర్‌ కార్డుతో ఆధార్‌ లింక్‌ అనేది స్వచ్ఛందం. ప్రజలు ఇష్టమైతే లింక్‌ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించుకునే అవకాశం ఉంది.  ఒకే వ్యక్తి పేర వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఓటరు కార్డులు ఉండటంపై చాలా కాలం క్రితమే ఎన్నికల సంఘం దృష్టిసారించింది. బోగస్‌ కార్డుల నిరోధానికి ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయాలని నిర్ణయించింది. అప్పట్లో కొంత వరకూ ఓటర్ కార్డులో ఆధార్ కార్డులు లింక్ చేశారు. అయితే అప్పట్లో సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయకుండా ఆధార్‌ నంబర్లు సేకరించడానికి ఈసీకి అధికారం లేదని స్పష్టం చేసింది. దీంతో చట్ట సవరణ చేయాలని కేంద్రప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదించింది. ఈ కారణంగానే తాజా బిల్లు తెచ్చారు.  ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ఏటా నాలుగు కటాఫ్‌ తేదీలు ఉండేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఓటర్ జాబితా సవరణ చేసే వారు. ఇకపై జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1లను కటాఫ్‌ తేదీలుగా పేర్కొంది. సర్వీస్‌ ఓటర్లకు సంబంధించిన నిబంధనలు కూడా మార్చివేశారు. రక్షణ రంగంలో పనిచేసేవారు పురుషులా, స్త్రీలా అన్నది సంబంధం లేకుండా వారి భాగస్వాములను సర్వీస్‌ ఓటర్లుగా పరిగణించనున్నారు. దీని కోసం చట్టంలో ‘భార్య’ అన్న స్థానంలో ‘భాగస్వామి’ అని మార్చారు.  ఓటర్ కార్డుతో అనుసంధానం సగం మంది చేసుకుని.. సగం మంది చేసుకోకపోతే.. గందరగోళం ఏర్పడుతుంది. మొత్తంగా ఒకే విధానం ఉంటే.. ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇప్పటికే జరుగుతున్న ఎన్నికల్లో దొంగ ఓటర్ల ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఆధార్ కార్డుతో లింక్ చేయడమే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. కానీ నిర్బంధం చేయకుండా ఎందుకు స్వచ్చందం అంటున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. లింక్ చేసుకోని ఓటర్లే .. ఫలితాలను తేల్చేసే పరిస్థితి మన దేశంలో ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. 

బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదా? ఈ పాపం ఎవరిది? 

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్త అంశం వెలుగులోకి  వచ్చింది. వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సుకు 20 రోజులుగా మెయింటెనెన్స్ లేదని తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం డిపోలో ఈ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టేస్తుందంటూ డ్రాఫ్ట్ షీట్‌లో నమోదు చేశారు. మరమ్మతులు చేయాలంటూ ఎన్నోసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆర్టీసీ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. డ్రైవర్ చిన్నారావు మృతికి బస్సు మెయింటెనెన్స్ లోపమే కారణమంటూ ఆర్టీసీ జోన్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతికి సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై విచారణ జరుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.  జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. వాగులో కొట్టుకుపోతున్న వారిని స్థానికులు కాపాడటంతో మృతుల సంఖ్య భారీగా తగ్గింది.  బస్సు ప్రమాద జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం కలచివేస్తోందని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.  

చెన్నైలోనూ చుక్కెదురు? గులాబీ బాస్ పై నమ్మకం పోయిందట? 

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కు ఇప్పుడు ఎదురు దెబ్బల సీజన్ నడుస్తోందా? ఒకప్పుడు పట్టిందల్లా బంగారంగా, ఎదురన్నదే లేదన్నట్లుగా   సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు పట్టాలు తప్పిందా? ఇప్పుడు ఆయన  అడుగడుగునా అవరోధాలను  ఎదుర్కుంటున్నారా? అంటే అవుననే, అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నవంబర్ నెల చివరి వారంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని ఢిల్లీకి వెళ్ళారు. నాలుగు రోజులు అక్కడే ఉంది  వట్టి చేతులతో వనక్కి వచ్చారు.  నిజానికి, కొని తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదలు, కేసీఆర్ ఆలోచనలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. అందుకే,ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ కొత్త దారులు వెతుక్కుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఓ వంక రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. హుజూరాబాద్ తర్వాత తాడును చూసి పామని భయపడవలసి వస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే జరిగింది.సొంత బలం ఉన్నా, క్యాంపు రాజకీయాలు చేయక తప్పలేదు .ఏకగ్రీవంగా ఆరు, ఎన్నికలు జరిగిన ఆరు,మొత్తం 12 స్థానల్లో తెరాస అభ్యర్ధులు గెలిచినా, ఏదో వెలితి వెంటాడుతోంది. అదలా ఉంటే ముఖ్యమంత్రి సకుటుంబ సమేతంగా సాగించిన మూడు రోజుల తమిళనాడు యాత్ర కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదని, తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్’తో తెగతెంపులు చేసుకుని తాడు బొంగరం లేని దక్షిణాది రాష్ట్రాల కూటమిలో  చేరేందుకు సిద్దంగా లేరు.  అదే విషయం ఆయన కేసీఆర్’కు సున్నితంగా చెప్పారని సమాచారం. .తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబం, కేసీఆర్ కుటుంబానికి చక్కని ఆతిధ్యం ఇచ్చారు. కానీ, రాజకీయాల విషయం వచ్చేసరికి,చేతులు కలిపేందుకు  మొహమాటం లేకుండా సారీ అని చెప్పేశారని సమాచారం. విశ్వనీయ సమాచరం మేరకు, దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై కేసీయార్ తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ తో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంపై తన పోరాటానికి మద్దుతు కావాలని కోరారు, అయితే, స్టాలిన్ కేంద్రంతో కయ్యానికి సిద్దంగా లేనని, అదే సమయంలో కేంద్రం తేల్చుకోవలసిన అంశాలుంటే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ కూటమి ద్వారా పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ తో చెలిమికి స్టాలిన్ నో. అనేశారు. అంతే కాకుండా, కేసీయార్ ట్రాక్ రికార్డు తెలిసిన స్టాలిన్, గులాబీ బాస్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే భావంతో ఉన్నట్లు డిఎంకే వర్గాల సమాచారం. ఈ సందర్భంగా స్టాలిన్ సన్నిహిత సహచరుడు ఒకరు, తెలంగాణ ముఖ్యమంత్రి గతంలోనూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ వాళ్ళిద్దరూ కేసీయార్ తో చేతులు కలపలేదని, గుర్తు చేశారు. నిజానికి, కేసీఆర్’ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా విశ్వసనీయతను కోల్పోయారు. అందుకు కారణం లేక పోలేదు ఆయన హైదరబాద్ లో ఒక మాట ఢిల్లీలో ఇంకొక మాట చెప్పటం అందరూ గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో వరసగా రెండు రోజులు రచ్చచేసి, ఆ తర్వాత మౌనంలోకి వెళ్ళారు. అంతకు ముందు కూడా  మోడీతో ఇక యుద్ధమే అని హైదరాబాద్ లో ప్రకిటించిమ ఢిల్లీ వెళ్ళి మోడీకి నమస్కారం పెట్టి వచ్చారనే ప్రచారం జరిగింది.ఇలా   నిలకడలేకుండా ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా వ్యవహరించడం వల్లనే కేసీయార్’ను ఎవరు విశ్వసించడం లేదని అంటున్నారు. అందుకే, మొన్న నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, నిన్న స్టాలిన్ ...సారీతో సరి పెట్టారని అంటున్నారు.

ఒకే ఒక్కడు మోడీనే సర్వం! బీజేపీలో కాంగ్రెస్ కల్చర్

భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కల్చర్’ ప్రవేశించిందా? సిద్దాంత ప్రాధాన్యత పక్కకు పోయి, వ్యక్తి ఆరాధన ఎత్తు పీట వేసుకు కూర్చుందా? అంటే అవుననే అంటున్నారు, పార్టీ అంతర్గత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న విశ్లేషకులు. నిజానికి, ఇది కొత్తగా ప్రవేశించిన అవలక్షణం కాదు. కేంద్రంలో  మోడీ, షా జోడీ ఎంట్రీతోనే, పార్టీలో వ్యక్తి ఆరాధన ప్రవేశించిందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  అంతవరకు ఇతర పార్టీలకు భిన్నంగా, ‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’ అన్నట్లుగా ఉన్నపార్టీ, మెల్లమెల్లగా రాజకీయ  మందలో చేరిపోయిందని, పాతతరం సీనియర్ నాయకులు ఎప్పటినుంచో అంటూనే ఉన్నారు. ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో అయితే నేమి, ముఖ్యమంత్రులను మార్చడంలో అయితేనేమి, ఇతర పార్టీల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులను తమ పంచన చేర్చుకోవడంలో అయితే నేమి, ఇలా... ఇతర మధ్యేవాద, ప్రాంతీయ పార్టీల అవలక్షణాలు అన్నీ, మోడీ, షా నాయకత్వంలో బీజేపీ కూడా అలవరచుకుంది. నిజానికి ఆ అవలక్షణాలు కాంగ్రెస్ లో కంటే బీజీలోనే ఎక్కువగా పాదుకు పోయాయి.ఈ విషయంలో పార్టీలోనే కొందరు నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే, గెలుపు కోసం కట్టు తప్పినా పర్వాలేదనే వాదన పార్టీలో బలపడింది. బీజేపీ కూడా రాజకీయ పార్టీనేగానీ, సన్యాసి మఠం కాదు, రాజకీయాలే చేస్తుందనే  సమర్ధింపు స్వరాలూ ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్నాయి.  అదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన నేపధ్యంలో, పార్టీ వ్యవహారాల్లోనూ మోడీ ప్రత్యక్ష ప్రమేయం కోరుకుంటున్నారా, అనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే  వినవస్తున్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో రెండవ అదికార కేంద్ర లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధానిగా, పార్టీ అధ్యక్షరాలుగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పడు మోడీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని మోడీ, రాష్ట్రాల వారీగా ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం ఆనవాయతీగా వస్తోందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు (బుధవారం) దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారని,అంతకు మించి ప్రత్యేక ప్రాధాన్యత లేదని అంటున్నారు. ప్రధాని నివాసంలో ఈరోజు మూడు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు  అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో మోదీ పిచ్చాపాటి నిర్వహించారని పార్టీ నేతల సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారని, సమావేశాని హాజరైన ఎంపీలు చెపుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో మోడీ, షా మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో పార్టీ వ్యవహారాలఫై ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలఫై మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. పార్టీ మొత్తాన్ని తం గుప్పిట్లోకి తీసుకునేందుకు మోడీ సిద్దమవుతున్నారనే మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.