రేప్ తప్పదంటే.. ఎంజాయ్ చేయాలి!
posted on Dec 17, 2021 @ 6:53PM
‘రేప్ తప్పనిసరి అయినప్పుడు ఎంజాయ్ చేయడం మేలు’ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారారి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో చిన్నా చితకా వ్యక్తి అయితే.. అంతగా పట్టింపు వచ్చేది కాదేమో..! స్వయంగా ఓ సీనియర్ ఎమ్మెల్యే, గతంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా వ్యవహరించిన వ్యక్తి. ఆ వ్యక్తి అయినా ఎక్కడో అన్నా అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చనుకున్నా.. ఆయన ఏకంగా శాసనసభ వేదికగానే ఈ వ్యాఖ్యలు చేయడం.. మహిళలు, రాజకీయ పక్షాలు భగ్గుమనడంతో.. క్షమాపణ కోరక తప్పలేదాయనకు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అనుకుంటున్నారా?.. ఆయన ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్.
‘అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మేలు’ అని కర్ణాటక శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను ఉద్దేశించి కేఆర్ రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా రమేశ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా మహిళలు, ప్రజా సంఘాల నుంచి రమేశ్ కుమార్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నాలిక్కరుచుకున్న రమేశ్ క్షమాపణలు కోరారనుకోండి. ‘అత్యాచారం గురించి అసెంబ్లీలో నేను ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలుపుతున్నా. రేప్ లాంటి క్రూరమైన నేరాన్ని తేలిగ్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. అనుకోకుండా నోరుజారా. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతా’ అని ట్విట్టర్లో రమేశ్ కుమార్ తెలిపారు.
కర్నాటక అసెంబ్లీలో సభ్యులు నిరవధికంగా ఆందోళన చేస్తుండడంతో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ‘నేను అన్నింటినీ ఆస్వాదిస్తూ.. అవును, అవును అనే పరిస్థితిలో ఉన్నా’ అన్నారు. ఆ వెంటనే రమేశ్ స్పందిస్తూ ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా ఆస్వాదించాలి’ అనే ఓ సామెత ఉంది.. మీరు ఇప్పుడు సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఏదో సరదా కోసమే రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారనుకున్నా తీవ్ర దుమారాన్నే లేపుతున్నాయి. రమేశ్ కుమార్ వ్యాఖ్యలు విచారకరం అని, దురదృష్టకరమని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఖండించారు. మహిళలంటే చిన్నచూపు చూసే ప్రజా ప్రతినిధులు ఉండడం బాధాకరమని నిప్పులు చెరిగారు. రమేశ్ కుమార్ వ్యాఖ్యలపై సుమోటోగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలా ఉండగా.. 2019లో కర్ణాటక అసెబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా కేఆర్ రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సందర్భాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ‘తన పరిస్థితి అత్యాచార బాధితురాలిగా ఉంద’ని అప్పట్లో రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు కూడా దుమారం రేపాయి. ‘అత్యాచారం జరిగినప్పుడు దాన్ని అక్కడితో వదిలేస్తే ఒకసారితో అయిపోతుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితుడిని జైల్లో పెడతారు. కానీ లాయర్లు వదలరు. ఎన్నిసార్లు జరిగింది? ఎంతమంది చేశారు? అని ప్రశ్నిస్తారు. అత్యాచారం ఒకసారే జరుగుతుంది. కానీ కోర్టులో వందసార్లు జరుగుతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది’ అని అప్పట్లో రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.