కన్న తల్లిని ఇంటి నుంచి గెంటేసిన మున్సిపల్ చైర్మెన్..

అతను అధికార పార్టీ నాయకుడు. పట్టణానికి ప్రధమ పౌరుడు. పట్టణ ప్రజల రక్షణ బాధ్యతలు చూసే గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆ నాయకుడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించాడు. కన్న తల్లిపైనే దాడి చేశాడు. ఏకంగా ఇంటి నుంచి గెంటేశాడు. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ వైసీపీ నేత. కన్న తల్లిని ఇంటి నుంచి మున్సిపల్ చైర్మెన్ గెంటేస్తున్న ఫోటోలు,దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. మున్సిపల్ చైర్మెన్ రఘు.. తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. తల్లిని ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులతో కొన్ని రోజులుగా రఘు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే వారిపై దాడి చేశాడు. ఆస్తి కోసం రఘు తమను వేధిస్తున్నాడని తల్లి సరోజ ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. ఇంటికొచ్చి తమపై దాడి చేస్తున్నాడని, కుమారుడితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. మున్సిపల్ చైర్మెన్ నుంచి  తమకు రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేసింది. గత మూడు నెలలుగా ఆస్తి కోసం తన కొడుకు వేధిస్తున్నాడని పోలీసులకు వెల్లడించింది ఆ తల్లి. కన్న తల్లిని మున్సిపల్ చైర్మెన్ గెంటేసిన ఘటన ఎమ్మిగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. కన్న తల్లిపైనే కిరాతకంగా దాడి చేసిన వ్యక్తి తమకు చైర్మెన్ గా ఉండటం దౌర్బాగమని ఎమ్మిగనూరు  ప్రజలు మండిపడుతున్నారు. కన్నతల్లిపై దాడి చేసిన మున్సిపల్ చైర్మెన్ పై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలతో కుటుంబ సభ్యులకు కూడా రక్ణణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్మెన్ తీరు తమకు  తీవ్ర ఇబ్బందికరంగా మారిందని జిల్లా వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. 

టెస్లా స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంత‌? ఫీచ‌ర్స్‌ ఏంటి?

టెస్లా. ఎల‌క్ట్రిక్ కార్లు, అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు, శాటిలైట్లు.. లేటెస్ట్‌గా స్మార్ట్‌ఫోన్లు. అన్నిట్లోనూ ఎలాన్ మ‌స్క్ మార్క్ త‌ప్ప‌క క‌నిపిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా, మిగ‌తా వాటికంటే సంథింగ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అందుకే, టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ రాబోతోందంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తి పెరిగింది. మార్కెట్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ ఫోన్‌ పేరేంటి? ధరెంత ఉంటుంది? ఏమేం ఫీచర్లు ఉంటాయి? ఫోన్‌ను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు? లాంటి విశేషాల‌పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్‌గా సెర్చ్ చేస్తున్నారు. ఇంత‌కీ టెస్లా ఫోన్ ప్ర‌త్యేక‌త‌లేంటంటే.... మోడల్‌ పై/పీ (Model Pi/P) పేరుతో టెస్లా ఫోన్ రాబోతోంద‌ని తెలుస్తోంది. కంప్లీట్ గేమింగ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌ చేయనుంది. పైభాగంలో నేవీ బ్లూ.. వెన‌క‌ స్కై బ్లూ క‌ల‌ర్‌లో ఫోన్ ఉంటుంద‌ని అంటున్నారు. ఐఫోన్‌కు యాపిల్ సింబ‌ల్ ఉన్న‌ట్టు.. ఈ ఫోన్ వెనుక వైపు ‘T’ అక్షరంతో టెస్లా లోగో ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి.  టెస్లా ఫోన్‌లో 108 ఎంపీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉంటాయట. 6.5 ఇంచెస్‌ స్క్రీన్‌.. 4K రిజల్యూషన్ డిస్‌ప్లే.. స్నాప్ డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌.. 2 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ఉంటుంద‌ట‌. అయితే, టెస్లా ఫోన్‌ ఓఎస్‌ గురించి వివ‌రాలు మాత్రం ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తారా?  లేక‌, అండ్రాయిడ్‌లాంటి వాటితోనే ప‌ని కానిచ్చేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్రస్తుతం టెస్ట్ మోడ్‌లో ఉన్న టెస్లా ఫోన్‌.. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి రిలీజ్ కానుంది.  టెస్లా స్మార్ట్‌ఫోన్‌ ధర 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 60 వేల నుంచి రూ. 90 వేలు ఉండొచ్చు. టెస్లా ఫోన్.. యాపిల్ ఐఫోన్‌, శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్ ఫోన్స్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయం. అయితే, టెస్లా ఫోన్ గేమింగ్ సెగ్మెంట్లో రానుండటంతో వేటి మార్కెట్ వాటికే అంటున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు? బీజేపీ నేతలకు సిగ్నల్స్..

2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చాయి. మొదటి టర్మ్ లో అసెంబ్లీలో ముందుగానే రద్దు చేశారు కేసీఆర్. 2019 జూన్ వరకు గడువున్నా .. దాదాపు 10 నెలల ముందుగానే 2018 ఆగస్టులో అసెంబ్లీని డిసాల్వ్ చేశారు. దీంతో తెలంగాణలో ఆరు నెలల ముందుగా అంటే 2018 డిసెంబర్ తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక రెండో టర్మ్ లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ దూకుడు పెంచడం, వరుస సమావేశాలు నిర్వహించడం, జిల్లాల పర్యటనలకు సిద్ధమవడంతో .. ముందస్తు ఎన్నికల ప్రచారానికి బలం చేకూరింది. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సిట్టింగులపై టికెట్లు ఇస్తానని చెప్పారు కేసీఆర్. త్వరలో ఎన్నికలు రాబోతున్నందు వల్లే గులాబీ బాస్ ఆ ప్రకటన చేశారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ తీరు ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందన్న సంకేతాలు ఇస్తుండగా.. తాజాగా కేంద్రం పెద్దల నుంచి అలాంచి సిగ్నలే వచ్చింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.  తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారని సమాచారం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చని  అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. తనకున్న ఇన్‌పుట్స్ ఆధారంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు.  త్వరలోనే  తాను తెలంగాణకు వస్తానని, రెండు రోజుల పర్యటిస్తానని కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు అమిత్ షా. కేసీఆర్ సర్కార్ పై గట్టిగా పోరాడాలని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేశారు. కేసీఆర్ అసత్యప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై అమిత్ షా సీరియస్‌ అయ్యారనే తెలుస్తోంది. రాష్ట్ర మంత్రుల చావు డప్పు కొట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్టుగా సమాచారం. మొత్తంగా రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కామెంట్ల ప్రకారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. అందుకే కమలం నేతలు కూడా దూకుడు పెంచారని అంటున్నారు. 

మతమార్పిడి నిరోధక చట్టం.. కమలం కంటే ‘రెండాకులు’ఎక్కువే..

మరో బీజేపీ పాలిత రాష్ట్రం మతమార్పిడి నిరోధక బిల్లు తీసుకొచ్చింది.  ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు మతమార్పిడి నిరోధక చట్టాలు చేసి అములు చేస్తున్నాయి. ఇపుడు ఆ జాబితాలో మరో  బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక  చేరింది. అయితే,దేశాన్ని హిందూ రాష్రం బగా ప్రకటించాలని చూస్తున్న బీజేపీ, పాలిత రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.ఇదేమి విచిత్రం కాదు. ఉహించనిదీ కాదు. నిజానికి ఇది ఎప్పుడో జరగవలసిందే కానీ, శాసన మండలిలో మెజారిటీ లేక పోవడం వలన కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకు కొంత జాప్యం చేసింది. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో పెద్దల సభలో అధికార బీజేపీకి ఆధిక్యత రావడంతో జాప్యం చేయకుండా మతమార్పిడి నిరోధక బిల్లు మంగళవారం(డిసెంబర్ 21) శాసనసభలో  ప్ర‌వేశ‌పెట్టింది. అయితే బీజేపే పాలిత రాష్ట్రాల కంటే, చాలా చాలాముందుగా 2002లోనే అంటే, నిండా రెండు దశాబ్దాల ముందుగా తమిళనాడు ప్రభుత్వం, మత మార్పిడి నిరోధక చట్టాని తీసుకొచ్చింది. కన్యాకుమారి, రామనాథపురం జిల్లాలలో జరిగిన మత ఘర్షణలు నేపధ్యంగా అప్పటి  ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చించి.  అయితే అప్పుడు కూడా, ఇప్పుడు కర్ణాటకలో మతమార్పిడుల నిరోధక బిల్లును వ్యతిరేకించిన విధంగానే, కాంగ్రెస్, డిఎంకే పార్టీల సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అయినా, బిల్లు సభలో భారీ మెజారిటీ (140/72)తో ఆమోదం పొందింది. ఆ సందర్భంలో విపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల విమర్శలకు సమాధానం చెపుతూ,ముఖ్యమంత్రి జయలలిత, ‘మత మార్పిడులు భారత దేశానికి హానికరం. నాకే అధికారం ఉంటే ఒక్కక్షణం ఆలోచించకుండా, మత మార్పిడులను అడ్డుకుంటాను’  అంటూ మహాత్మా గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. నిజానికి తమిళ నాడు చట్టం అంతగా కోరలున్న చట్టం కాదు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా  కన్యాకుమారి, రామనాథపురం జిల్లాలలో ఈరోజుకు కూడా ఫిషర్మెన్ (మత్సకారుల)పేదరికాన్ని పావుగా చేసుకుని మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, నాస్తిక భావజాలం పునాదిగా ఏర్పాడిన ద్రవిడ పార్టీలు (డిఎంకే అన్నా డిఎంకే) రాజకీయ అధిపత్యం కొనగుతున్న రాష్ట్రంలో  మతమార్పిడి నిరోధక చట్టం, అది కూడా , హిందుత్వ  భావజాల బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే  రెండు దశాబ్దాల ముందు రావడం నిజంగా కొంత ఆశ్చర్యకరమే.. అయితే, పరిస్థితులు అలా వచ్చాయి. అందుకే చట్టం చేయవలసి వచ్చిందని విశ్లేషకులు అంటారు.   కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన మత స్వేచ్ఛ హక్కు బిల్లు 2021, ఇంతవరకు ఇతర రాష్ట్రాలు తెచ్చిన చట్టాలకు భిన్నమైనది, కఠినమైనది అంటున్నారు. అందుకే, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు, బిల్లును వ్యతిరేకిస్తున్నాయి, బిల్లుకు డిసెంబర్ 20 (సోమవారం) కర్ణాటక మంత్రి మండలి ఆమోదం తెలిపింది .అనంత‌రం అసెంబ్లీ ముంద‌కు వ‌చ్చింది. బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడిల‌ను నిషేధించేందుకు ఈ బిల్లును ప్ర‌భుత్వం తీసుకొచ్చింది.అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, కార్యకర్తలు, పౌరులు మరియు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుని ఒక‌సారి పరిశీలిస్తే, ఈ చట్టం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో ప్రవేశపెట్టిన వాటి కంటే మరింత కఠినమైంది. మ‌త‌మార్పిడిల‌కు పాల్ప‌డితే కర్ణాటకలో కనీస శిక్ష మూడు నుండి ఐదు సంవత్సరాలతో పాటు… కనిష్టంగా రూ.25,000 జరిమానా విధించబడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.15,000 జరిమానా మాత్ర‌మే విధించ‌నున్నారు. వివాహం ద్వారా కానీ వివాహం తర్వాత మత మార్పిడిని నిషేధించడంతో పాటు, కొత్త బిల్లు ‘వివాహ వాగ్దానం’ ద్వారా మతవాగ్దానం’ ద్వారా మత మార్పిడిని కూడా నిషేధిస్తుంది.కర్ణాటక మతస్వేచ్ఛ హక్కు బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా “ప్రత్యక్షంగా లేదా ఇతరత్రా ఒక మతం నుండి మరొక వ్యక్తిని మతం మారడం లేదా మార్చడానికి ప్రయత్నించడం ద్వారా జరిమానా విధిస్తుంది. బలవంతం, మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహ వాగ్దానం లాంటి వాటి ద్వారా మతమార్పిడులకు సహకరించే కుట్ర చేసిన వారికి కూడా జరిమానా విధించబడుతుందని బిల్లు పేర్కొంది. ఇది బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఇలాంటి ఇతర చట్టాలకు భిన్నంగా ఉంది. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం.. సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తి మైనారిటీ రిలిజియన్ గ్రూపులోకి మారితే అతను రిజర్వేషన్లతో సహా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కోల్పోతాడు. కాగా, ఈ బిల్లును రాష్ట్రంలోని క్రిష్టియన్ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.

దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్‌!.. ప్ర‌ధాని మోదీ కీలక మీటింగ్‌..

ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 215కి చేరాయి. 15 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు క‌ల‌వ‌ర పెడుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యధికంగా 57 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 54, తెలంగాణ 25, కర్ణాటక 19, రాజస్థాన్‌ 18, కేరళ 15, గుజరాత్‌లలో 14 కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయి. కశ్మీర్‌లోనూ మూడు కేసులు వ‌చ్చాయి. యూపీ, ఒడిశా, ఏపీలలో రెండు కేసులు వచ్చాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, చండీగఢ్‌, లద్దాఖ్‌ లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇలా దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం.. త్వ‌ర‌లోనే క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌లు ఉండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌గా.. మ‌రోవైపు, గురువారం ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ భేటీలో మ‌రోసారి లాక్‌డౌన్ విధించే అంశాన్ని ప‌రిశీలిస్తారా? లేక‌, క్రిస్‌మ‌స్‌కు ఆంక్ష‌లు పెట్టి.. న్యూఇయ‌ర్‌కు 24గంట‌ల పాటు లాక్‌డౌన్ పెడ‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇప్ప‌టికే ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. డెల్టా రకం కంటే కొత్త వేరియంట్‌కు 3 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తున్న‌ట్టు హెచ్చరించింది. కొవిడ్‌ వార్‌ రూమ్‌లను మ‌ళ్లీ యాక్టివ్ చేయాల‌ని.. కేసులు పెరిగితే జిల్లా, స్థానిక స్థాయిల్లో కఠిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది.  ఒమిక్రాన్ క‌ట్ట‌డికి రాష్ట్రాల‌కు కేంద్రం ప‌లు సూచ‌న‌లు చేసింది. పరిస్థితులను బ‌ట్టి రాత్రి కర్ఫ్యూ విధించడం,  ప్రజలు గుమిగూడకుండా చూడటం, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేయడం, పరీక్షలు పెంచడం లాంటివి చేయాలని తెలిపింది. ఇదే స‌మ‌యంలో గురువారం ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మీక్ష నిర్వ‌హించ‌నుండ‌టంతో.. ఈ క‌ఠిన నిబంధ‌న‌లే కేంద్రం అధికారికంగా అమ‌లు చేస్తుందా?  పాక్షిక లాక్‌డౌన్ లాంటి చ‌ర్య‌ల‌కు దిగుతుందా?  క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో కేసులు పెర‌గ‌కుండా ఆంక్ష‌లు విధిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. గురువారం మ‌ళ్లీ పీఎం మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌తారా? మ‌రోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తారా? 

కేటీఆర్ సైలెంట్.. హరీష్ దూకుడు! కేసీఆర్ వ్యూహంలో బలిపశువా? 

కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది టీఆర్ఎస్ సర్కార్. వరి కొనుగోళ్ల విషయంలో తాడోపేడో తేల్చుకుంటామంటోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వెళ్లి.. కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామంటున్నారు తెలంగాణ మంత్రులు. అటు కేంద్ర మంత్రులు కూడా సీరియస్ గానే స్పందిస్తున్నారు. ఢిల్లీకి వచ్చి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ నేతలపై మండిపడుతున్నారు. కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం మధ్య కొన్ని రోజులుగా సాగుతున్న వార్ లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు జరుగుతున్నాయి. వరిపై తేల్చుకోవాలంటూ కేసీఆర్ మంత్రులను ఢిల్లీకి పంపింతే... ఆ బృందంలో కేటీఆర్ లేడు. టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం చేస్తుండగా... ఢిల్లీకి వెళ్లిన టీమ్ లో మాత్రం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే లేకపోవడం విచిత్రమే. అంతేకాదు వరి విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా మిగితా మంత్రులంతా మాట్లాడుతుండగా.. కేటీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు. ప్రతి విషయంపై ట్విట్టర్ లో స్పందించే ఐటీ మినిస్టర్.. పాడి క్రాప్ డిసిప్యూట్ పై మాత్రం ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. కేటీఆరే కాదు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ అంశంలో సైలెంట్ గానే ఉంటున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  టీఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తూ.. తమ కుటుంబ సభ్యులను మాత్రం నోరు విప్పకుండా కేటీఆరే ప్లాన్ చేశారని అంటున్నారు. కేంద్రానికి తాము టార్గెట్ కావద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులతో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ కూడా దురుసుగానే వ్యవహరించారు. ఏం పనిలేక ఇక్కడికొట్టి టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ..ఓ రకంగా వాళ్ల పరువు పోయేలా కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలుసు కాబట్టే... కేటీఆర్ ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్ లో ఉండిపోయారనే టాక్ నడుస్తోంది.  తాజాగా బుధవారం మంత్రి హరీష్ రావు వరి కొనుగోళ్ల విషయంలో స్పందించారు. కేంద్రమంత్రి పియూష్ గోయేల్ కామెంట్లకు కౌంటరిచ్చారు. 70 లక్షల రైతుల ఆత్మగౌరవాన్ని కేంద్రమంత్రి దెబ్బతీశారన్నారు. రైతుల సమస్యలపై వచ్చిన మంత్రులను కలవడం లేదని మండిపడ్డారు.రైతుల ఓట్లు కావాలి కానీ.. రైతుల భాద పట్టించుకోరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేంద్రమంత్రి గోయల్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు. పంజాబ్‌లో ఒడ్లు కొన్నట్లే.. తెలంగాణలో కొనమని ఆడిగామన్నారు. పంజాబ్‌లో కొని, ఇక్కడ ఎందుకు కొనరని ప్రశ్నించారు. యాసంగిలో ఓడ్లు కొంటారా కొనరా? అని నిలదీశారు. కరువు వస్తే రాష్ట్రాల దగ్గర ఉన్న ధాన్యం బలవంతంగా తీసుకుంటున్నారని, ఎగుమతి, దిగుమతులు కేంద్రం పరిధిలో ఉందన్నారు. రాష్ట్రాలపై బురద చల్లితే ఊరుకోమని హరీష్‌రావు అన్నారు. అయితే కేంద్రాన్ని టార్గెట్ చేసే విషయంలో కేటీఆర్ సైలెంట్ గా ఉంటుండగా.. హరీష్ రావు దూకుడుగా ఉండటం కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమంటున్నారు. సివిల్ సప్లయ్, వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నా హరీష్ రావుతో కేంద్రాన్ని తిట్టిస్తున్నారని చెబుతున్నారు. హరీష్ రావుతో మాట్లాడిస్తే.. బీజేపీకి అతనే టార్గెట్ అయ్యేలా గులాబీ బాస్ స్కెచ్ వేశారంటున్నారు. రేపు బీజేపీతో సంబంధాలు పూర్తిగా తెగిపోతే... ఇప్పుడు గట్టిగా మాట్లాడిన నేతలే ఇబ్బందులు పడతారని, తన కొడుకు-కూతురు మాత్రం సేఫ్ గా ఉంటారనేది కేసీఆర్ ఆలోచన అంటున్నారు.  ఓ రకంగా హరీష్ రావును ఇరికించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

2022లో క‌రోనాకు ముగింపు!.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న బిల్‌గేట్స్‌

ఒమిక్రాన్ విజృంభిస్తోంది. డెల్టాకంటే డేంజ‌ర‌స్‌గా.. అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ఆఫ్రికాలో మొద‌లై.. అంత‌లోనే ప్ర‌పంచ దేశాల‌న్నిటినీ క‌మ్మేసింది. యూఎస్‌లో ఒక్క‌రోజులోనే ల‌క్షా 80వేల కొవిడ్ కేసులు న‌మోద‌వ‌డం.. అందులో ఒమిక్రాన్ కేసులే అధికంగా ఉండ‌టం క‌ల‌వ‌రం రేపుతోంది. బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌లతో ఒమిక్రాన్ ఓ ఆటాడుకుంటోంది. ఇక‌, ఇండియాలో 200ల‌కు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా, ఒమిక్రాన్ వ‌ర్రీపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ స్పందించారు. వ్యాక్సిన్ల పంపిణీ, వ్యాధుల నివార‌ణ‌పై గేట్స్ ఫౌండేష‌న్ త‌ర‌ఫున విస్తృతంగా ప‌ని చేస్తున్న బిల్‌గేట్స్‌.. క‌రోనాపై త‌న‌దైన విశ్లేష‌ణ చేశారు. ఒమిక్రాన్‌పై హెచ్చ‌రించారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.... 'ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రతి ఇంటికీ వ్యాపిస్తోంది. చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంత వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. డెల్టాతో పోల్చితే.. ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత సగం మాత్రమే ఉన్నా.. వేగంగా ప్రబలే లక్షణం వల్ల ఉద్ధృతి భారీ స్థాయిలో ఉండొచ్చు. ప్ర‌జ‌లంతా తప్పకుండా కొవిడ్ టీకాలు తీసుకోవాలి. బూస్టర్ తీసుకుంటే రక్షణ మరింత మెరుగవుతుంది. వ్యాక్సిన్‌లు ప్రజలు తీవ్ర ఆనారోగ్యం బారినపడకుండా, మరణించకుండా ఉండేలా అవి మెరుగ్గా పనిచేస్తున్నాయి' అని బిల్‌గేట్స్‌ ట్వీట్లు చేశారు.    'ఒక దేశంలో ఒమిక్రాన్ డామినెంట్‌గా మారిన తర్వాత.. ఆ వేవ్ అక్కడ మూడు నెలల కంటే తక్కువ సమయమే ఉంటుంది. ఆ కొన్ని నెలలు మనకు చెడు రోజులుగా మారొచ్చు. కానీ మనం సరైన చర్యలు తీసుకుంటే.. ఈ మహమ్మారి 2022లో ముగిసిపోవచ్చు. ఏదోఒక రోజు కరోనా ముగిసిపోతుంది.' అని బిల్‌గేట్స్ అభిప్రాయప‌డ్డారు. 

మూడుతో కొత్త వ్యూహం.. అందుకేనా  రద్దు నాటకం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని, దానితో పాటుగా సీఆర్డీఎ చట్టం రద్దు బిల్లును ఉపసంహరించుకుంది.అయితే,ఏపీ అసెంబ్లీలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ రద్దు రద్దు కాదని, ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరింత పటిష్ట చట్టం తీసుకొస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రద్దు వెనక ఉన్న రహస్యం  ఏమిటో, ఎందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారో, ఇప్పుడు అందరికి అర్థమై పోయింది. కోర్టులో కేసు నిలబడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. అది రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే, జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెనకడుగు వేశారు. ఇది అందరికీ తెలిసిన నిజం. అంటే, మూడు రాజదానులు లేదా ముఖ్యమంత్రి ముద్దుగా పిలుచుకునే వికేంద్రీకరణ నుంచి ‘మడమ’ తిప్పలేదని చెప్పకనే చెప్పారు.అంతే కాదు, ఆ రోజు నుంచి ఈరోజు వరకు, మంత్రులు, అధికారపార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా,మూడు రాజధానుల మంత్ర జపం చేస్తూనే ఉన్నారు.  అయితే నిజంగా రేపటి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తారా, లేదా అనేది పక్కన పెడితే, మూడు రాజదానుల వివాదాన్ని, ఎన్నికల వరకు సజీవంగా ఉంచేందుకు జగన్ రెడ్డి ఎత్తులు వేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగానే ఉంది. అంతే కాదు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ప్రాంతీయ విబేధాల పొగరాజేసి, సెంటిమెంట్స్ రెచ్చగొట్టి, ప్రభుత్వ వైఫల్యాలను మరుగున పరిచి  ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు జగన్ రెడ్డి కొత్త వ్యూహం పన్నుతున్నారని రాజకీయ, మీడియా  వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా  జగన్ రెడ్డి ...  మూడు రాజధానుల చట్టం రద్దు ప్రకటనతో పాటుగానే, 2019 ఎన్నికల ఫలితాలు, అదే విధంగా తదనంతరం జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా వికేద్రీకరణ (మూడు రాజదానుల) కు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు. ప్రజలు హైదరాబాద్ వంటి సూపర్ కాపిటల్,(ఒకే రాజధాని) కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అన్నారు.  అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని, సమతుల్య అభివృద్ధి సాధ్యమంవుతుందని చెప్పు కొచ్చారు. అంటే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రాజధాని వివాదాన్ని ఎన్నికల అంశంగ చేసుకునేందుకు జగన్ రెడ్డి ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ప్రజల జ్ఞాపక శక్తి కొంచెం తక్కువే కావచ్చును కానీ, అయినా అందరినీ అన్ని సందర్భాలలో మోసం చేయడం జగన్ రెడ్డి సహా  ఎవరికైనా అయ్యే పని కాదాని అంటున్నారు.

సీక్రెట్ జీవోలెందుకు.. జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ప్రశ్నల వర్షం కురిపించింది.  జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. జీవోలు సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఎన్ని జీవోలు విడుదల చేసింది.. ఎన్ని జీవోలు వెబ్‌సైట్లో ఉంచింది.. సీక్రెట్ అంటూ అప్‌లోడ్ చేయని జీవోల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. వెబ్‌సైట్‌లో ప్రభుత్వ జీవోలను ఉంచకపోవడంపై తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో ఐదు శాతం మాత్రమే వెబ్ సైట్‌లో ఉంచుతున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 ఎనిమిదిలకు విరుద్ధమని అన్నారు. టాప్ సీక్రెట్ జీవోలు అప్‌లోడ్  చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. 

నా తల్లిని నిందించిన వారిని వదిలిపెట్ట.. నారా లోకేశ్ ప్ర‌తిజ్ఞ‌..

తన తల్లి భువ‌నేశ్వ‌రిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలిపెట్ట‌న‌ని.. వారికి తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రిలా మెతక వైఖరితో ఉండనని.. గట్టిగా సమాధానం ఇస్తానని చెప్పారు. గౌరవం కోరుకునే కుటుంబం తమదని.. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైనా ఇలాగే మాట్లాడతారా? అని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు.. విదేశాల్లో జల్సాలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఆదుకున్న తమపై నిందలు వేస్తారా? అని లోకేశ్ మండిప‌డ్డారు.  నారా భువ‌నేశ్వ‌రి స్పందించిన మ‌ర్నాడే లోకేశ్ ఇలా హెచ్చ‌రించ‌డంతో ఆ ఘ‌ట‌న‌తో నారా వారి కుటుంబం ఎంత‌లా బాధ‌ప‌డిందో అర్థం అవుతోంద‌ని అంటున్నారు. తాను కోలుకోవ‌డానికి 10 రోజులు ప‌ట్టింద‌ని.. మ‌హిళ‌ల‌పై ఇలాంటి అవ‌మానాలు దారుణ‌మ‌ని.. ఇలాంటి ప‌నికి మాలిన విష‌యాల‌పై కాకుండా.. ప్ర‌జా సేవ‌పై దృష్టిపెట్టాల‌ని భువ‌నేశ్వ‌రి ఘాటుగా స్పందించారు. తాజాగా, నారా లోకేశ్ సైతం వైసీపీకి మ‌రింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  త‌న తండ్రిలా తాను మెత‌క కాదంటూ.. ఆ న‌లుగురిని వ‌దిలేదే లే అంటూ.. గ‌ట్టిగా బుద్ధి చెప్తానంటూ నారా లోకేశ్ వైసీపీ నేత‌ల‌పై ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. 

'మెగా' షాక్‌!.. దిగ్గ‌జానికే దిక్కులేదా? జ‌గ‌న‌న్నా మ‌జాకా!

అత‌నో 'మెగా' బిజినెస్‌మేన్‌. తెలుగు రాష్ట్రాల్లో టాప్‌మోస్ట్ కాంట్రాక్ట‌ర్‌. క‌శ్మీర్ నుంచి అస్సోం వ‌ర‌కూ.. అనేక ప్రాజెక్టులు చేస్తుంటారు. కాళేశ్వ‌ర‌మైనా.. పోల‌వ‌ర‌మైనా.. ఆయ‌న క‌ట్టాల్సిందే. మోదీ ప్ర‌భుత్వ ప్రాజెక్టులూ ఆయ‌న‌కు ద‌క్కాల్సిందే. లెక్క‌లేనంత సంపాద‌న‌. ఎక్క‌డికెళ్లినా ప‌ర్స‌న‌ల్ ల‌గ్జ‌రీ చాప‌ర్‌లోనే. మోదీ, కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌కు మెగా ప‌వ‌ర్ ఆయ‌న‌. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రినైనా ఒక్క‌రోజులోనే క‌లిసొస్తారు. సీఎంల‌తో చిట్‌చాట్‌లోనే మెగా డీల్స్ చేసుకుంటారు. ఇక‌, తెలుగు సీఎంల కోసం వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టి.. నెంబ‌ర్ వ‌న్ న్యూస్ ఛానెల్‌ను చేజిక్కించుకున్నారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌కు అత్యంత ముఖ్యుడు. కానీ..... ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్‌రెడ్డితో.. మెగా రెడ్డి గారికి ఎక్క‌డో తేడా కొట్టిన‌ట్టుంది. ఆ బిజినెస్ టైకూన్‌కు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో బిగ్ ఝ‌ల‌క్ త‌గిలింది. జ‌గ‌న‌న్న ప‌ర్మిష‌న్ కోసం 36 గంట‌ల పాటు.. అనామ‌కుడిగా.. కుక్కిన పేనులా.. ప‌డిగాపులు కాశార‌ట‌. సీఎం జ‌గ‌న్‌తో ఆ మెగా ప‌ర్స‌నాలిటీకి బాగా తేడాలొచ్చాయ‌ట‌. ఇంత‌కీ వాళ్ల మ‌ధ్య అస‌లేం జ‌రిగింది? మెగా వ్యాపార‌వేత్త‌ని జ‌గ‌న్‌రెడ్డి అంత‌గా ఎందుకు అవ‌మానించారు?   నిమిషాల్లో పీఎం మోదీ అపాయింట్‌మెంట్ సాధించగ‌ల ఆయ‌న‌కు.. సీఎం జ‌గ‌న్ క్యాబిన్‌లోకి మాత్రం అంత ఈజీగా ఎంట్రీ ద‌క్క‌లేదు. ఏకంగా 36 గంట‌ల పాటు జ‌గ‌న్ వెయిట్ చేయించార‌ని తెలుస్తోంది. ఈయ‌న ఆయ‌న మ‌నిషే అయినా.. ఈయ‌న ఆయ‌న‌కు మొద‌టినుంచి అత్యంత ఆప్తుడిగా ఉన్నా.. ఆయ‌న గెలుపు కోసం ఈయ‌న అన్నిర‌కాలుగా బాగా స‌హ‌క‌రించినా.. గెలిచాక జ‌గ‌న‌న్న ఈయ‌న చేతిలో ప‌లు పెద్ద ప్రాజెక్టులు పెట్టినా.. ఇప్పుడు మాత్రం వారిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు బాగా చెడిపోయాయ‌ట‌. ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డిని కలవడానికి రోజున్నర పాటు పడిగాపులు పడాల్సి వచ్చిందట. రోజున్నర తర్వాత కూడా ముఖ్యమంత్రి అతన్ని కలిసింది లేనిది క్లారిటీ లేదు. ఈ విష‌యం ఈయ‌న‌కు మెగా షాకింగే.   చేసిన ప‌నుల‌కు డ‌బ్బులు అడ‌గ‌డానికి మెగా బిజినెస్‌మేన్‌.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌రికి వెళ్లార‌ని తెలుస్తోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు క‌డుతున్నాం.. జేబు నుంచి డ‌బ్బులు పెట్టుకుంటున్నాం.. చాలాకాలంగా ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన‌ బిల్లులు మాత్రం రావ‌ట్లేద‌ని.. పెండింగ్ బిల్లుల వ‌సూళ్ల కోసం ఈయ‌న‌.. జ‌గ‌న్ ద‌గ్గ‌రికి వెళ్లార‌ట‌. మెగాకు 3వేల 800 కోట్ల వ‌ర‌కూ ప్ర‌భుత్వం బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌ట‌. భారీ మొత్తం కావ‌డంతో.. ఏకంగా య‌జ‌మానే ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌రికి వ‌చ్చారు. ఈయ‌న ఎందుకు వ‌చ్చారో తెలిసే.. బ‌కాయిల చెల్లింపుపై ఏం చెప్పాలో తెలీకే.. జ‌గ‌న్ గంట‌ల త‌ర‌బ‌డి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా ముఖం చాటేశార‌నేది ఓ టాక్‌. ఏపీ ఖ‌జానాలో చిల్లి గ‌వ్వ కూడా లేదు. ఉద్యోగుల‌కే వేళ‌కు జీతాలివ్వ‌లేని దుస్థితి. ఇక దాదాపు 4వేల కోట్ల బిల్లులు ఇంకేమిస్తారు. అందుకే, ఇలా త‌ప్పించుకున్నార‌ని అంటున్నారు. అయితే, జ‌గ‌న్ ముఖం చాటేయ‌డంలో.. మ‌రో ఆస‌క్తిక‌ర రాజ‌కీయ అంశ‌మూ ఉంద‌నేది మ‌రో వాదన‌.  మెగా మెన్ కు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీలోని బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతో ఈయన హైదరాబాద్ లో రహస్య సమావేశం పెట్టారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ తీరు, భారీగా పోగుప‌డిన‌ పెండింగ్ బిల్లుల‌పై చర్చించారట. ఏపీలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంపై అంతా అసహనం వ్యక్తం చేశారట. జగన్ రెడ్డి పాలనపై బడా పారిశ్రామిక వేత్తలు తీవ్రమైన కామెంట్లు చేశారని సమాచారం. గ‌త చంద్రబాబు పాలనపైనా సమావేశంలో చర్చ జరిగిందట. టీడీపీ హయాంలోనూ ప్రాజెక్టులు చేసింది వీళ్లే. అప్పుడు టైమ్‌కి బిల్లులు చెల్లించేవార‌ని.. మ‌న రెడ్డినే క‌దాని గెలిపించుకుంటే.. మ‌న జేబులే ఖాళీ అవుతున్నాయ‌ని.. ఆ మీటింగ్‌లో ఉన్న బిగ్ బిజినెస్‌మేన్‌లు అంతా తీవ్ర‌ అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. ఆ స‌మావేశం విష‌యాల‌ు జ‌గ‌న‌న్న తెలిశాయని.. మెగా ఆధ్వార్యంలో జ‌రిగిన ఆ మీటింగ్‌పై జ‌గ‌న్ గుర్రుగా ఉన్నార‌ని.. త‌న మ‌నిషే త‌న‌కు వ్య‌తిరేకంగా స‌మావేశంపెట్టి.. పెండింగ్ బిల్లుల‌పై కాంట్రాక్ట‌ర్ల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఏంట‌ని.. ముఖ్య‌మంత్రి మెగాపై మండిప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఆ మీటింగ్ జ‌రిగిన కొన్నిరోజుల‌కే సీఎంను క‌లిసేందుకు మెగా మేన్ రావ‌డం.. ఆయ‌న‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా రోజున్న‌ర పాటు వెయిట్ చేయించ‌డంపై.. రాజ‌కీయ‌, వ్యాపార వ‌ర్గాల్లో బిగ్‌ న్యూస్‌.. బిగ్ డిబేట్ న‌డుస్తోంది.

అశోక్ కు అవమానం.. నో రేషన్.. సీఎం ఫామ్ హౌజ్ లో కలకలం.. వామ్మో ఒమిక్రాన్.. టాప్ న్యూస్@1PM

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. రామతీర్థం బోడికొండ ఆలయ పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. శంకుస్థాపన బోర్డుపై అశోక్‌గజపతిరాజు పేరును లేకుండా చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన తనను విస్మరించడంతో అశోక్‌గజపతిరాజు ఆవేదనకు లోనయ్యారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు అశోక్‌గజపతిరాజును తోసేశారు. ---- ఆంధ్రప్ర‌దేశ్ లో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందుల‌ను అర్థం చేసుకోవాల‌ని  సీఎం జ‌గ‌న్‌కు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల‌కు జీతాలు ఇవ్వ‌క‌పోతే వారు ఎలా బ‌తుకుతార‌ని ఆయ‌న సీఎంను నిల‌దీస్తూ ట్వీట్ చేశారు.'పారిశుద్ధ్య‌ కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. వాళ్లు బ‌తికేదెలా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు? మీ చర్యలతో వాళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయ చేసి వాళ్ల‌ జీతాలు వారికి ఇప్పించండి' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సూచించారు. ------- విశాఖలో రూ. 200 కోట్ల భూవివాదం చోటుచేసుకుంది. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌చైర్మన్‌ జీవీపై హయగ్రీవ ఇన్‌ఫ్రా చైర్మన్‌ జగదీశ్వరుడు తీవ్ర ఆరోపణలు  చేశాడు. ప్రభుత్వ పెద్దల పేరుతో జీవీ బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. యండాడలో రూ.200  కోట్ల విలువైన భూమిని బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ సహకారంతో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ----- బియ్యం కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే ఉచిత బియ్యానికి ఏపీలో తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచే పంపిణీ కావా ల్సిన బియ్యం ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఈ ఏడాది నవం బరు నెల నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఉండదని ఇంతకు ముందు చెప్పినా ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. అయితే డిసెంబరు నెలలో పంపిణీ ఇంతవరకు ప్రారంభం కాలేదు.ఈనెలలో ఇక పంపిణీ లేనట్టేనని తెలుస్తోంది.  -------- తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో కలకలం రేగింది. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూలి పనికి వెళ్లిన యువకుడు చనిపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. యువకుడు అక్కడి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు ఎర్రవెళ్లి ఫాహౌస్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.  --------- కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని... ఇదే సమయంలో బీజేపీ నేతలకు మాత్రం సమయం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులను పట్టుకుని వారికి పని లేదు అని అంటారా? అని మండిపడ్డారు. ---------- రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదనివ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రంలో రేషన్‌ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రజలను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వచ్చారని బరాబర్‌ అడుగుతామని చెప్పారు. రైతులను అడ్డం పెట్టుకుని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ------- తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవపురంలో పేకాటశిబిరంపై పోలీసుల దాడి చేశారు.  పేకాట ఆడుతూ తహశీల్దార్‌ కిషోర్‌బాబు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాడుతూ పోలీసులకు కొత్తపేట తహశీల్దార్‌ కిషోర్‌బాబు చిక్కాడు. మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 సెల్‌ఫోన్లు, రూ.94 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ------ క్రికెటర్‌ను చేస్తామని చెప్పి నారాయణగూడకు చెందిన ఓ మహిళా క్రికెటర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నారాయణగూడలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతి, ఆమె సోదరుడుకు మానవ హక్కుల నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు మంచి భవిష్యత్తు ఉందని మాయమాటలు చెప్పి నమ్మించారు. వారి నుంచి  సైబర్ నేరగాళ్లు ఒక లక్షా ఇరవై వేలు దండుకున్నారు. రెండు నెలలుగా బుకాయిస్తుండడంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ------- అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.వాటిలో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని వివ‌రించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంద‌ని చెప్పారు. ---  

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కలకలం.. కూలి పనికి వెళ్లిన యువకుడి మృతి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో కలకలం రేగింది. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూలి పనికి వెళ్లిన యువకుడు చనిపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. యువకుడు అక్కడి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు ఎర్రవెళ్లి ఫాహౌస్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలోకి చాలా మంది కూలీలు పనికోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన  ఆంజనేయులు (19) మంగళవారం ఫామ్ హౌస్ ‌లో కూలి పనులకోసం వెళ్లాడు. అయితే ఆయన అక్కడ పనిచేస్తున్నక్రమంలో ఓ బావి వద్ద చెట్ల పొదలు ఉన్నాయి. వాటిని తొలగించాలని అధికారులు చెప్పడంతో వాటిని తొలిగిస్తూ ఆబావిలో జారిపడిపోయాడు. అతన్ని బావిలో నుంచి బయటకు తీసేసరికి అతను చనిపోయాడు.

ఏపీలో మ‌రో ఒమిక్రాన్‌ కేసు.. తెలుగు రాష్ట్రాల్లో డేంజ‌ర్ బెల్స్‌..

ఒమిక్రాన్‌. ప్ర‌పంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. ఎక్క‌డో ఆఫ్రికా దేశాల్లో ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినా.. వేగంగా ప్ర‌పంచ దేశాల‌ను ఆక్ర‌మించేస్తోంది. ఇండియాలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగురాష్ట్రాల్లోకి చొచ్చుకొచ్చింది. దేశంలో ఒమిక్రాన్ వెలుగు చూసిన కొత్త‌ల్లోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఓ కేసు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒమిక్రాన్ కేసులు రాలేదు. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో మాత్రం విజృంభించింది. ఇప్ప‌టికి  తెలంగాణ‌లో 20కిపైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  తాజాగా, ఏపీలో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నారు. ఈ విష‌యం తెలిసి మహిళ నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు అధికారులు.  తిరుప‌తి మ‌హిళ‌కు ఒమిక్రాన్‌ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్‌ వచ్చింది. ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు విజయనగరం జిల్లాలో నమోదుకాగా.. రెండో కేసు తిరుప‌తిలో వెలుగు చూసింది. తెలంగాణ‌లో మాదిరే ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతాయా? అనే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. 

రామ‌తీర్థంలో హైటెన్ష‌న్‌.. అశోక్‌ గజపతిరాజును తోసేసిన అధికారులు..

రామ‌తీర్థం. ఈ పేరు వింటేనే ఏపీలో అదోర‌క‌మైన టెన్ష‌న్‌. రామ‌తీర్థంలో కోదండ‌రాముడి విగ్ర‌హ శిర‌స్సును ధ్వంసం చేసిన ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. తాజాగా, అదే రామ‌తీర్థం.. అదే కోదండ‌రామాల‌యంలో.. మ‌రోసారి ఉద్రిక్తత త‌లెత్తింది. అస‌లేం జ‌రిగిందంటే... విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన పూజలను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, వెల్లంపల్లి నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు పూర్వం నుంచి రాజవంశీయులే చేసేవారని.. దీనికి విరుద్ధంగా మంత్రులు నిర్వహించడంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు మండిప‌డ్డారు.  పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడాన్ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌తిరేకించారు. ఆగ్ర‌హంతో ఆయన ఆ ఫ‌ల‌కాల‌ను తోసేశారు. ఈ క్రమంలో అధికారులు, అశోక్‌ మధ్య స్వల్ప తోపుతాట జ‌రగ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.  పూజల అనంతరం స్వామివారిని దర్శించుకుని రామ‌తీర్థం నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు అశోక్ గ‌జ‌ప‌తిరాజు. ప్ర‌భుత్వం, మంత్రులు, అధికారుల తీరుపై భ‌క్తులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

కొవిషీల్డ్‌ టీకా తీసుకున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..

ప్రపంచ దేశాలను ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. సౌతాఫ్రికాలో మొదటగా వెలుగు చూసిన కొత్త వైరస్... ఇప్పటికే 100 దేశాలకు పాకేసింది. ఒమిక్రాన్ తో ఐరోపా దేశాలు అల్లాడిపోతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ లో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. యూఎస్ లో వారంలోనే ఒమిక్రాన్ కేసులు 70 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు డబుల్ సెంచరీ దాటేశాయి. రోజు రోజుకు వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్లపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలకు ఒమిక్రాన్ ను నిరోధించే శక్తి ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో బూస్టర్ కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఒమిక్రాన్ ఆందోళనలు ఉన్న నేపథ్యంలో భారత్ కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోనికి వచ్చింది. భారత్ లో ఎక్కువగా వినియోగించిన కొవిషీల్డ్‌ టీకాపై ఆసక్తికర పరిశోధనా ఫలితాలు వచ్చాయి.  కొవిషీల్డ్‌గా పిలుస్తున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా పనితీరుపై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం సాగించారు. రెండు డోసులు తీసుకున్న 3 నెలల తర్వాత.. ఈ టీకా కారణంగా లభించే రక్షణ క్రమంగా క్షీణిస్తున్నట్టు గుర్తించారు. బూస్టర్‌ డోసు ద్వారా ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.  పరిశోధకులు కేవలం ఒక్క ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్నవారినే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ వివరాలను ‘ద లాన్సెట్‌’ పత్రిక వెల్లడించింది. స్కాట్లాండ్‌, బ్రెజిల్‌కు చెందిన మొత్తం 4.4 కోట్ల మందిలో టీకా కారణంగా ఏర్పడిన యాంటీబాడీలస్థాయికి సంబంధించిన డేటాను విశ్లేషించినట్లు గ్లాస్గో వర్సిటీ ఆచార్యుడు కటికిరెడ్డి శ్రీనివాస విఠల్‌ వెల్లడించారు.  తాజా పరిశోధనతో కోవిషీల్డ్ టీకా తీసుకున్న వాళ్లు మూడు నెలలు పూర్తయితే... బూస్టర్ డోస్ గా తీసుకోవాలనే చర్చ సాగుతోంది. 

జగన్ పాలనపై స్వామీజీ వేషంలో వైసీపీ ఎమ్మెల్యే సర్వే.. జనం నాడితో షాక్

కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షలు, నుదుటన విభూది, కళ్లజోడుతో  స్వామీజీ రూపంలో ఓ కొత్త వ్యక్తి గ్రామాల్లో కనిపించారు. ఈయనెవరో ఎప్పుడూ చూడలేదని జనాలు అనుకున్నారు. తీరా చూస్తే ఆయన స్థానిక ఎమ్మెల్యే. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన మారు వేషం వేశారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఈ వినూత్న ప్రయత్నం చేశారు. స్వామీజీ వేషంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరాతీశారు. అచ్యుతాపురం మండల కేంద్రంతోపాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించి వైసీపీ పాలనలోని నవరత్నాలపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని ఆరా తీశారు.  ఎక్కువమంది స్థానికులు తమ ప్రాంతంలో సమస్యలతో పాటూ కష్టాలను స్వామీజీ వేషంలో ఉన్న ఎమ్మెల్యేతో చెప్పుకున్నారట. అయితే ఎక్కువ మంది ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.  ప్రధానంగా రోడ్లు బాగాలేవని ఎక్కువ మంది కంప్లైంట్ చేశారట. కొందరైతే ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టారట. ఇక నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని జనాలు అభిప్రాయపడ్డారట. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే ధరలు పెరుగుదలతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారట.  గ్రామాల్లో జనాల సమస్యల్ని తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మారు వేషంలో వెళ్లారు. తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి స్థానికంగా జనాలు చెప్పిన సమస్యల్ని ప్రస్తావించారట.. దీంతో కంగుతిన్న అధికారులు 'ఇంతకు మీరెవరని' ప్రశ్నిస్తే ఆయన తన మారు వేషం తీసేశారు. ఎమ్మెల్యేను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారట. ప్రభుత్వ పథకాలపై జనాల నుంచి ఎక్కువగా వ్యతిరేక అభిప్రాయం వస్తే.. ఎమ్మెల్యే మాత్రం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తి ఉన్నారని చెప్పుకొచ్చారు.  స్థానిక ఎమ్మెల్యేనే ఇలా మారువేషంలో  ఎలమంచలి నియోజకవర్గం జనాల్లో చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం వినూత్నంగా ఉందని స్థానికులు చర్చించుకున్నారు. పాత రోజుల్లో రాజులు ప్రజల కష్టాలు తెలుకునేందుకు ఇలా మారు వేషాల్లో వెళ్లేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారనే చర్చ సాగుతోంది. మరోవైపు అధికారులు మాత్రం ఎమ్మెల్యే కోసం పరుగులు పెట్టారని తెలుస్తోంది.   

125 ఏళ్లలో రెండో అత్యల్ప టెంపరేచర్.. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది. పొగమంచుకు చల్లటి గాలులు కూడా తోడు కావడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాత్రిపూట, ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఏపీ ఏజెన్సీలోని పాడేరు, అరకులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మినుములూరులో 8 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్ లో లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 125 ఏళ్లలో రెండో అత్యల్ప టెంపరేచర్.. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా.. ఆ జిల్లాలో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున కుమురం భీం జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గత 125 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి మాత్రమే. 1897 నుంచి ఇప్పటివరకూ ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తే.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2017 డిసెంబరు 27న 3.5, అంతకుముందు నిజామాబాద్‌లో 1897 డిసెంబరు 17న 4.4, హైదరాబాద్‌లో 1946 జనవరి 8న 6.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు నుంచి నాలుగు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డిలో 8.4, హైదరాబాద్‌లో 9.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. రాబోయే మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకింత చలి...? ఇరాన్‌, ఇరాక్‌ ప్రాంత వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తర భారతంపై గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉత్తర భారతంలో హిమాలయ సానువుల్లో బాగా మంచు కురుస్తోంది. అక్కడి నుంచి దక్షిణ భారతం వైపు శీతల గాలులు వీస్తున్నందున వాటి ప్రభావంతో తెలంగాణ అంతటా చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3.5 నుంచి 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉంటోందని, ఈ నెల 27 వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేశారు. చలికన్నా గాలులతో శీతల వాతావరణం ఏర్పడుతోందని వెల్లడించారు.

జగన్ పై సీబీఐ కోర్టు అసహనం.. ఏం జరగనుందో? 

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.  కేసు విచారణ సందర్భంగా సీఎం జగన్ పై సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడం పట్ల తీవ్రంగా స్పందించింది. ప్రతిసారి మినహాయింపు కోరుతున్నారని అసంతృప్తి వెలిబుచ్చింది. విచారణకు ఎందుకు హాజరు కావడంలేదని సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించింది.అందుకు సీఎం జగన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ... హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టును కోరామని వివరణ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ హైకోర్టులో దీనిపై తీర్పు రానుందని వెల్లడించారు. అనంతరం సీబీఐ కోర్టు స్పందిస్తూ... దీనిపై వివరాలను మెమో రూపంలో సమర్పించాలని జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జగన్ న్యాయవాది వెంటనే మెమో దాఖలు చేశారు. గతంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరగా, సీబీఐ కోర్టు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. దాంతో సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు దీనిపై వాదోపవాదాలు ముగించి తీర్పును రిజర్వ్ లో ఉంచింది. సీబీఐ కోర్టు తాజాగా అసహనం వ్యక్తం చేయడంతో జగన్ కేసులో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. కోర్టు విచారణకు సీఎం జగన్ హాజరు కావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇస్తే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.