మూడు రాజధానుల సభ తుస్.. గేట్లు బంద్.. మహిళలు జంప్
posted on Dec 18, 2021 @ 2:35PM
వైయస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం అందుకుంది. ఈ నినాదానికి అనుకూలంగా అభివృద్ధి వికేంద్రీకరణ రాయలసీమ మనోగతం పేరిట శనివారం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వాహకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అందుకోసం పరిసర ప్రాంతాల నుంచి ఈ సభకు భారీగా జనాన్ని నిర్వాహాకులు తరలించారు. అయితే అలా వచ్చిన జనం ముఖ్యంగా మహిళలు.. ఈ సభ ఇంకా ప్రారంభం కాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.
సభ నిర్వాహకులు మహిళలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇందిరా మైదానం గేట్లు బంద్ చేయించారు. దీంతో మహిళలు సభ నిర్వహాకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బారికేడ్లు దాటుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ సభకు వచ్చిన మహిళలు.. తమను ఎందుకు తీసుకు వస్తున్నారో.. అసలు ఈ సభ ఉద్దేశం ఏంటో తెలియక వచ్చామని.. తీరా ఈ సభకు వచ్చాక విషయం తెలిసిందని సదరు మహిళలు గుసగుసలాడుకోవడం స్థానికంగా వైరల్ అయింది.
ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్.. అమరావతికి మద్దతు ప్రకటించి.. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో అప్పటికే రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళన దాదాపు 725 రోజులకు చేరుకుంది. నవంబర్ ఒకటో తేదీన అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ చేపట్టిన పాదయాత్ర ఇటీవల పూర్తి అయింది. ఆ క్రమంలో రాజధాని అమరావతి పరిరక్షణ పేరిట డిసెంబర్ 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతికి అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అంతేకాకుండా ఈ సభకు అన్ని పార్టీల నేతలు సైతం హాజరై.. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వీకేంద్రీకరణ జరగాలంటూ.. రాయలసీమ అభివృద్ధి చెందాలంటూ ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖులు ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ ఏర్పాటు వెనక జగన్ ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారనే టాక్ వైరల్ అవుతోంది