జైలులో నెలకు కోటి లంచం.. తిహార్‌లో సుఖేశ్ లీలలు...
posted on Dec 18, 2021 @ 3:19PM
అతను జైల్లో ఉన్నాడు. అందులోనూ దేశంలోనే టైట్ సెక్యూరిటీ ఉండే తీహార్ జైలు. అంతటి కట్టుదిట్టమైన జైల్లో ఓ కిలాడీ ఉన్నాడు. అసలే ఆర్థిక నేరగాడు. ఇంకేం.. జైలు సిబ్బందికి డబ్బులు వెదజల్లాడు. వందో, వెయ్యో కాదు.. ఏకంగా నెలకు కోటి రూపాయల లంచం ఇస్తున్నాడు. జైల్లోనే జల్సాలు చేస్తున్నాడు. సెల్‌లోనే లగ్జరీలు అనుభవిస్తున్నాడు. అతన్ని కలిసేందుకు బాలీవుడ్ హీరోయిన్స్, మోడల్స్ వచ్చి పోతున్నారు. తాజాగా ఈడీ దర్యాప్తులో ఆ వైట్ కాలర్ క్రిమినల్ జైలు బాగోతం బయటపడింది. విషయం తెలిసి విచారణ అధికారులే అవాక్కయ్యారు. ఇదంతా.. ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ గురించి.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి.. తిహార్ జైలుకు తరలించారు. కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చారు. జైల్లో తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్.. ప్రతి నెలా రూ.కోటి లంచం ఇస్తున్నాడని ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్టు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. జైల్లో మొబైల్ ఫోన్ వాడేందుకు 15 రోజులకు రూ.60-75లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. జైల్లో సిబ్బందికి చికెన్ పార్టీలు కూడా ఇచ్చేవాడట సుఖేశ్.
జైల్లో ఉన్న సుఖేశ్‌ను జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు, మోడల్స్ వచ్చేవారని సమాచారం. మొత్తం 12 మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్టు తెలుస్తోంది. సుఖేశ్ జైలులో ఉన్నప్పటికీ 2021 జనవరి నుంచి ఫోన్ ద్వారా హీరోయిన్ జాక్వెలిన్‌తో మాట్లాడుతున్నట్టు ఈడీ ఛార్జిషీట్లో నమోదు చేసింది. సుఖేశ్ కేసులో 200 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలతో జాక్వెలిన్‌నూ ప్రశ్నించారు ఈడీ అధికారులు. అతని నుంచి జాక్వెలిన్ సుమారు రూ.10 కోట్లు విలువైన కానుకలు తీసుకున్నారని అంటున్నారు. సుఖేశ్ పంపిన కానుకల్లో.. రూ.52 లక్షల విలువైన గుర్రం, నాలుగు పర్షియన్ పిల్లులు (ఒక్కోటి రూ.9 లక్షలు) ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా తిహార్ జైలు నుంచి జాక్వెలిన్‌తో సుకేశ్ మాట్లాడేవాడని, ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని ఈడీ వర్గాలు తెలిపాయి. సుకేశ్‌పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్ కేసులు ఉన్నాయి.
ఇక, ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే.. తిహార్ జైలు సిబ్బంది తనను వేధింపులకు గురిచేస్తున్నారని సుఖేశ్.. జైలు ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. తనను డబుల్ లాక్ గదిలో బంధించడంతో మానసికంగా కుంగిపోతున్నానని అన్నారు. తన భార్యను కేవలం రెండు వారాలకు ఒకసారి మాత్రమే కలవనిస్తున్నారని ఆరోపించడం ఆసక్తికరం.