కాంగ్రెస్ లో డీఎస్ చేరికకు బ్రేక్! బీజేపీ ఎంపీ వల్లే ఆగిందా..?
posted on Dec 18, 2021 9:22AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడింది. శుక్రవారం డీఎస్ కాంగ్రెస్ లో చేరిక జరుగుతుందని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు డీఎస్. దాదాపు 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అప్పుడే డీఎస్ కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. డీఎస్ చేరిక కార్యక్రమానికి రావాలంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు నేతలకు అధిష్టానుంచి పిలుపు కూడా వచ్చింది. అయితే సడెన్ గా అది వాయిదా పడింది.
డీఎస్ విషయంలో ఏఐసీసీ నుంచి పీసీసీ వర్గాలకు తాజా సమాచారం వచ్చింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగోర్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అందిన ఆదేశాలతో చివరి నిమిషంలో డీఎస్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు రావాలో చెబుతామని, అప్పటి వరకు వేచి ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో డీఎస్ చేరిక ఎందుకు వాయిదా పడిందన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం డీఎస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం మరో ఆరు నెలలకుగాపైగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక పార్టీ మారితే ఫిరాయింపు చట్టం వర్తించే అవకాశం ఉంది. దీంతో ఆ ఇబ్బంది లేకుండా సంక్రాంతి తర్వాత ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఫిరాయింపుల వ్యవహారం వల్లే డీఎస్ చేరికకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా.. అసలు సంగతి మాత్రం మరొకటి అంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డీఎస్ రాకను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక సోనియాతో డీఎస్ చర్చల తర్వాత... డీఎస్ పార్టీలోకి ఎంట్రీ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ నిజామాబాద్ నేతలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేరికను స్థానిక నేతలు వ్యతిరేకించినట్టు సమాచారం. ఇటీవల కాలంలో డీఎస్ కొడుకు, బీజేపీ ఎంపీ అర్వింద్.. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు కూడా ఇందుకు ఓ కారణమంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. మొత్తానికి డీఎస్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశం నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.