ఉద్యోగులకు ప్రజలకు మధ్య పీఆర్సీ చిచ్చు..ఇదేనా జగన్నాటకం?
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కంటే, ప్రభుత్వ ఉద్యోగులజీత భత్యాలు. పెన్షన్ల వ్యయం ఎక్కువగా ఉందంటే, ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను నమ్మడమే కాదు మనందరినీ నమ్మ మంటున్నారు. నిజానికి పీఆర్సీ పేరిట సాగుతున్న ప్రహసనంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే వినిపిస్తున్నాయి.అయితే,ఇది వ్యూహాత్మకంగా పేల్చిన బాంబుగానే చూడ వలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంలో 111 శాతం, అంటే ఆదాయం కంటే, 11 శాతం అధికంగా, ప్రభుత్వ ఉద్యోగుల్ జీతాలు. పెన్షన్లకే పోతోందని, చీఫ్ సెక్రటరీ ప్రకటించడాన్ని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి. ఇటు ప్రభుత్వ ఉద్యోగులను, అటు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే చీఫ్ సెక్రటరీ తప్పుడు సమాచారాన్ని, ప్రజల ముందు ఉంచారని జనసేన ఆరోపించింది. నిజంగా,రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కంటే, జీతాలు, పెన్షన్లు ఎక్కువగా ఉంటే, ఆ విషయాన్ని బడ్జెట్’లో ఎందుకు ప్రస్తావించలేదని, జన సేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్య ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి ఉద్యోగుల గొంతు నొక్కేందుకు చీఫ్ సెక్రటరీ ద్వారా, ఒక అసత్యాని ప్రచారం చేస్తోందని మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజమే, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సమాన్య ప్రజల్లో ఒక విధమైన ఏహ్య భావం, వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది లంచాల కోసం ప్రజలను వేదిపులకు గురి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్వయం కృతం కావచ్చును, లేక ఇతర కరణాలు ఏవైనా ఉన్నా, ఉద్యోగుల పట్ల ప్రజల్లో సద్భావన లేదు.అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం మాత్రం సరి కాదు.
ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతాలు,పెన్షన్లకు నెలకు రూ.4600 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని, ఉద్యోగ సంఘాలు పదే పదే చెపుతున్నా, ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉంది? ఇప్పుడు ఎందుకు, రూ. 67,000 కోట్లు ఖర్చవుతోందని ఏ లెక్కన చెపుతున్నారని, మనోహర్ ప్రశ్నించారు. ఆలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది తప్ప ఇతర నియమకాలు ఏమీ జరగలేదు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది జీతాలు కేంద్ర నిధుల నుంచే ఇస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ లేదు గ్రూప్ 1,2,3,4 నియామకాలు జరగలేదు. అలాంతప్పుడు, అదనపు భారం ఎక్కడ నుంచి పడుతుందని, జనసేన ప్రశ్నించింది.
అయితే, ఈ లెక్కలు పద్దులు ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహత్మకంగానే పీఆర్సీ ప్రహసనం నడిపిస్తోందని, ప్రజల్లో సహజంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉండే వ్యతిరేకతను మరింతగా పెంచి, ఉద్యోగుల నోరు మూయించడమే కాకుండా, రాజకీయంగాను ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గోప్యంగా జరిగిపోయే పీఆర్సీ తంతును నెలల తరబడి సాగించి ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకతను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, అందుకే ఉద్యోగులకు ఇస్తున్న జీతాలే ఎక్కువని, పీఆర్సీఇప్పుడు ఒకే చేసినా వచ్చే సంవత్సరం చివరిలో ఎప్పుడో అమలు చేస్తామని చెప్పడం, ఆ విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టి, జనం ముందు వారిని పాపాల భైరవులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు భావిస్తున్నారు.