పవన్ లెక్కేంటి? తిరుపతి సభకు రాలేదేంటి? రైతుల కంటే డ్యాన్సరే ముఖ్యమా?
posted on Dec 18, 2021 @ 1:56PM
పవన్ కల్యాణ్ తిరుపతి మహా సభకు ఎందుకు రాలేదు? అమరావతికి జనసేనాని ఇప్పటికే మద్దతు ఇచ్చారుగా? మరి, రైతుల సభకు రావొచ్చుగా? అంత ప్రతిష్టాత్మక సభకు పీకే రాకపోవడాన్ని ఎలా చూడాలి? పవన్ గైర్హాజరు వ్యూహత్మకమా? పీకే లెక్కేంటి? అమరావతిపై తిక్కేంటి?
జనసేనాని పవన్ కల్యాణ్. పార్ట్ టైమ్ పొలిటిషియన్ అనేది విమర్శకుల ఆరోపణ. తాను మాత్రం 25 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానంటున్నారు పీకే. తాను మాత్రమే 100% పర్‌ఫెక్ట్ అంటారు. తనను గెలిపించకపోవడం ప్రజల పొరబాటేనని చెబుతారు. అదంతా సరే.. అమరావతి విషయంలోనే పవన్ కల్యాణ్ వైఖరి మరింత చర్చనీయాంశమవుతోంది. అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తూనే.. తిరుపతిలో జరిగిన మహా సభకు హాజరుకాకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ పీకే తిరుపతికి ఎందుకు రాలేదు? అమరావతి విషయంలో ఆయన రియల్ స్టాండ్ ఏంటి?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారు. ఆంధ్రుల హక్కును అడ్డగోలుగా అమ్ముతున్నది కేంద్రమైతే.. ఆ కేంద్ర బీజేపీని గానీ, మోదీని, నిర్మలను గానీ.. పల్లెత్తు మాట అనకుండా చేస్తున్న పోరాటం ఎవరి మీదనో ఆయనకైనా అర్థం అవుతోందో లేదో అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు, ధర్నాలు చేస్తున్న పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని కోసం మాత్రం మొహమాటంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజధాని రైతులు జనసేనాని మద్దతు కోసం ఆయన చుట్టూ తిరుగుతుంటే.. అమరావతికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందంటూ ఉత్తుత్తి మాటలు చెబుతున్నారే గానీ.. విశాఖ ఉక్కులా గట్టి సంకల్పం మాత్రం చూపించడం లేదనే విమర్శ ఉంది. ఏపీ రాజధానిగా అమరావతికి బీజేపీ మద్దతుగా నిలబడగా.. వైసీపీ ఆడుతున్న మూడు రాజధానుల డ్రామాపై పోరాటం చేయడం పవన్ కల్యాణ్‌కు మరింత సులువైన అంశం. కానీ, ఉక్కు విషయంలో చూపిస్తున్నంత ఇంట్రెస్ట్.. కేపిటల్ ఇష్యూపై కనబరచడం లేదంటున్నారు.
అమరావతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి.. తిరుపతిలో రాజధాని రైతులు నిర్వహించిన మహా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ, సీపీఐ నారాయణ, ఎంపీ రఘురామలాంటి హేమాహేమీలు హాజరైన ఆ సభలో.. పవన్ కల్యాణ్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అలా అని పవన్ కల్యాణ్ ఏ విదేశాల్లోనో, సినిమా షూటింగ్స్‌లోనో బిజీగా లేరు. తీరిగ్గా.. తన మిత్రుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య నాట్య ప్రదర్శన తిలకిస్తూ ఉండిపోయారు. తిరుపతిలో అమరావతి రైతుల మహా సభా? త్రివిక్రమ్ వైఫ్ డ్యాన్స్ ప్రోగ్రామా? అంటే.. పీకే రెండో ఆప్షన్‌నే సెలెక్ట్ చేసుకున్నారు. త్రివిక్రమ్ సతీమణి నాట్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత అమరావతి రైతుల సభకు ఇవ్వలేదని అంటున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బాగా ముదిరిపోయారని అంటున్నారు. పొలిటికల్‌గా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడంలో యాక్టివ్‌గా ఉంటున్నారని చెబుతున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం వీక్ అవుతున్న సమయానికి కావాలనే.. స్టీల్ ప్లాంట్‌పై ఫైట్ చేస్తున్నారని భావిస్తున్నారు. జనసేన తన సొంత ఎజెండా ప్రకారమే పాలిటిక్స్ చేస్తుందని చెప్పడమే ఆయన ఉద్దేశం అంటున్నారు. గతంలో గాజువాకలో ఓడిపోయారు కాబట్టి విశాఖ ఉక్కుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా టాక్. ఇక, అమరావతి ఉద్యమంలో ముందునుంచీ పవన్ కల్యాణ్ అంత యాక్టివ్‌గా లేరు. రాజధానికి మద్దతు ప్రకటించారే కానీ.. తనదైన స్టైల్‌లో.. గతంలో ప్రత్యేక హోదా విషయంలో పోరాడినట్టు పోరాడటం లేదు. అప్పుడంటే స్పెషల్ స్టేటస్‌కు ప్రజల సపోర్ట్ లేదంటూ తప్పుకున్నారు.. మరి, ఇప్పుడు అమరావతిపై అప్పటిలానే పోరాడవచ్చుగా? అమరావతికి ప్రజల సపోర్ట్ దండిగా ఉందిగా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, అమరావతి కోసం గట్టిగా పోరాడితే.. మిగతా ప్రాంతాల్లో పార్టీ పలుచ బడుతుందని భయమో.. అమరావతి క్రెడిట్ చంద్రబాబుకు వెళుతుందని అనుమానమో.. కారణం ఏదైనా.. పవన్ కల్యాణ్ మాత్రం అమరావతి ఉద్యమం విషయంలో ఫక్తు రాజకీయ నాయకుడిలానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తిరుపతిలో అంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహా సభకు.. రైతులు స్వయంగా ఆహ్వానించినా.. జనసేనాని హాజరుకాకపోవడం.. అదే సమయంలో త్రివిక్రమ్ భార్య డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లడం.. పీకే లెక్కకు.. తిక్కకు.. నిదర్శనం అని చర్చించుకుంటున్నారు.