ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ధర్నా! కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ పిలుపు..
posted on Dec 17, 2021 @ 7:09PM
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి యుద్ధం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిలదీయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు కేసీఆర్. బీజేపీతో తాడో పేడో తేల్చుకుందామన్నారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రిని కలవాలని మంత్రులను ఆదేశించారు. సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోండి..తేల్చుకొని రండని ఆయన స్పష్టం చేశారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారన్నారు. తాను కూడా ఎల్లుండి పర్యటనలు రద్దు చేసుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు.
పార్టీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. నాయకులకు ఓపిక ఉండాలని, పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామని.. మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని.. మిల్లర్లతో టై అప్ ఉన్నోళ్లు వరి వేసుకోనివ్వాలని సీఎం స్పష్టం చేశారు. ‘రైతు బంధు’ యథావిధిగా ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.