హైదరాబాద్ లో ఐఏఎంసీ ప్రారంభం.. సీజేఐ ఎన్వీ రమణను కీర్తించిన కేసీఆర్
posted on Dec 18, 2021 @ 3:00PM
దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐకు అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహముద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ఆయనకే ప్రధాన పాత్ర పోషించారుని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోందన్నారు కేసీఆర్. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందని చెప్పారు.
హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారని తెలిపారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, నగరానికి, మన వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు కేసీఆర్.
హైదరాబాద్ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్ అంగీకరించారని, తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైందని చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు, మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఏఎంసీ ఏర్పాటు చేశామని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలంగా ఉందని, ఉత్తర, దక్షిణ భారతానికి హైదరాబాద్ వారధి లాంటిదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.