యువ కెరటం.. పదునైన రాజకీయం.. హ్యాపీ బర్త్ డే రామ్మోహన్ నాయుడు..
posted on Dec 18, 2021 @ 12:21PM
'వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం నింపిన రాకెట్టూ' అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవర్స్టార్ పవన్ను వర్ణించిన పాట అభిమానుల్నే కాదు అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. తెలుగుదేశం పార్టీలో బుల్లెట్లా ముందుకు దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ మరెవరో కాదు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.
2014లో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రామ్మోహన్నాయుడు వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రామ్మోహన్నాయుడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరుతో సభలో ఉన్న అందరినీ ఆకట్టుకుని ఔరా అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టి యావద్దేశం దృష్టినీ ఆకర్షించారు రామ్మోహన్నాయుడు. దివంగత మాజీ లోక్సభ స్పీకర్, నాన్న కింజరాపు ఎర్రంనాయుడి రాజకీయ వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు అక్షరాలా పుణికిపుచ్చుకున్నారు. ఎర్రంనాయుడి రాజకీయ ఒరవడినే కొనసాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాలుగేళ్లలోనే నాన్న వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు నిలబెట్టారు.
చిన్నతనంలో ఎలాంటి రాజకీయ నీడ పడకుండా పెరిగిన రామ్మోహన్నాయుడు.. ఎంపీగా పోటీ చేసే వయస్సు కూడా రాక ముందే అభ్యర్థిగా ఖరారైన యువ నేత రామ్మోహన్నాయుడు. ఎంపీగా విజయాలు సాధించిన ఆయన భయంతో, బాధ్యతతో, క్రమశిక్షణతో ఎదిగారు. పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి గుణాత్మక పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు. అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకుని రామ్మోహన్నాయుడు రికార్డులకెక్కారు. తన పనితనంలో, దూసుకుపోయే తత్వంతో పార్లమెంట్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. బుల్లెట్లా దూసుకుపోయే రామ్మోహన్నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మినిష్టర్ కొడాలి నానిని ఆయన ఇలాఖా గుడివాడలోనే విమర్శించగల దమ్మున్నోడు రామ్మోహన్నాయుడు. రాజకీయ భిక్షపెట్టిన టీడీపీకి కొడాలి వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. జగన్ పిరికివాడని, వేల కిలోమీటర్లు నడిచినా బెణకని ఆయన కాలు ఢిల్లీ టూర్ అనగానే ఎందుకు బెణికిందంటూ సూటిగా ప్రశ్నించగల సత్తా ఉన్న నేత రామ్మోహన్నాయుడు. టీడీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా ముందువరసలో నిలబడే నిబద్ధతగల యువ నేత రామ్మోహన్నాయుడు. పార్టీ నిర్దేశించిన పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అరెస్టులు కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిన ప్రతిసారి పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ప్రతి నిరసన కార్యక్రమంలోనూ రామ్మోహన్ పాత్ర తప్పకుండా ఉండాల్సిందే.
విశాఖపట్నంలో రైల్తే జోన్ ఎంత అవసరమో స్పష్టంగా వివరిస్తూ 2017లో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేట్ పరం విషయంలో ఏపీ పట్ల సవతితల్లి విధానం ప్రదర్శిస్తోందంటూ లోక్‌సభలోనే తూర్పారపట్టారు రామ్మోహన్‌నాయుడు. జగన్ సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న నవరత్నాలను బూడిద రత్నాలని ఆయన అభివర్ణించారు. 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్‌కు 24 గంటలూ భజనం చేయడంలోనూ, బూతులు తిట్టడంలో వైసీపీ నాయకుడు పోటీపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులంటే జగన్ ప్రభుత్వానికి అస్సలు గౌరవం లేదని, నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి సక్సెస్ అయ్యారు.
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రామ్మోహన్‌నాయుడు స్పందించే తీరు అందరి చేతా ఔరా అనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ రామ్మోహన్నాయుడు లేఖ సంధించారు. కోవిడ్ సమయంలో కొన్ని సంస్థల సహకారంతో శ్రీకాకుళం రిమ్స్లో 50 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. శ్రీకాకుళంలో కోవిడ్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసి, వైద్యులు, హాస్పిటళ్లు, బెడ్ల సమాచారం బాధితులకు అందుబాటులో ఉండేలా చేయడం ఆయన బాధ్యతగల నాయకుడనిపించుకున్నారు.
డ్రగ్స్ వ్యాపారంతో విజయవాడకు ఉన్న లింకుల్ని ప్రజలకు తెలియకుండా అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ రామ్మోహన్నాయుడు విరుచుకుపడ్డ తీరు అకట్టుకుంది. పన్నుల మీద పన్నులు వేసి, ప్రజల్ని వైసీపీ సర్కార్ ఇబ్బందులు పెడుతున్న తీరుపై స్పందించడం గమనార్హం. వైసీపీ సర్కార్ కొత్త ఇసుక పాలసీ తెచ్చి 20 లక్షల మంది భవన నిర్మాణ కూలీల దైనందిన జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిందని రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఇవన్నీ ప్రజలంటే రామ్మోహన్‌నాయుడికి ఉన్న బాధ్యతను గుర్తు చేసే అంశాలే.
మూడో క్లాసు దాకా సొంతూరు శ్రీకాకుళంలోనే చదివిన రామ్మోహన్నాయుడు 1994లో తొలిసారిగా హైదరాబాద్ వెళ్లారు. భారతీయ విద్యాభవన్లో 4, 5 క్లాసులు చదివారు. 1996లో ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు మళ్లీ చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు. ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరిన రామ్మోహన్నాయుడికి హిందీ అర్థంకాక ముందు చాలా ఇబ్బంది పడ్డారు. 12వ తరగతి తర్వాత రామ్మోహన్నాయుడు అమెరికా వెళ్లేందుకు పరీక్ష రాసి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల నిమ్మాడలో పుట్టిన రామ్మోహన్నాయుడికి ఇంజనీరింగ్ అంటే ఇష్టమట. అందుకే అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత ఎంబీఏ పూర్తిచేసి ఇండియా తిరిగివచ్చారు. అమెరికాకు చెందిన ఓ ఇంటీరియర్ కంపెనీతో టై అప్ చేసుకుని ఢిల్లీలో మార్కెటింగ్ చేశారు. రామ్మోహన్‌నాయుడి నాన్న ఎర్రంనాయుడు మరణించినప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకుంటారు. ఏ కెరీర్ ఎంచుకున్నా తాను చూసుకుంటానని చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారంటారు. ఎర్రంనాయుడి మరణించిన సమయం 14 రోజుల్లో లక్షలాది మంది తనను ఓదార్చేందుకు వచ్చారని, వారంతా తాను రాజకీయాల్లోకి రావాలని కోరారని చెబుతారు రామ్మోహన్‌నాయుడు. ఎర్రంనాయుడికి ప్రజల్లో ఉన్న అభిమానం చూసి ఆయన మార్గాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి రామ్మోహన్నాయుడు వచ్చానంటారు. ట్యూషన్ మాస్టర్నిపెట్టుకుని హిందీ నేర్చుకున్నాను అంటారాయన.
పార్లమెంటరీ జీవితంలో రామ్మోహన్నాయుడిపై ప్రభావం చూపిన వారిలో ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒకరు. లోక్సభలో తన తొలిరోజుల్లో ఓ చిన్న ప్రశ్న హిందీలో అడిగినప్పుడు వెంకయ్యనాయుడు తనను సభలోనే అభినందించారని, అందరితో సభలో చప్పట్లు కొట్టించారని రామ్మోహన్నాయుడు సంతోషంగా చెప్పుకుంటారు. టీడీపీ రాజకీయాల్లో యువనేత రామ్మోహన్‌నాయుడు మరింతగా దూసుకుపోయే బుల్లెట్ లాంటి వారనడంలో సందేహం లేదు.