ఎస్పీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు.. యూపీలో వేడెక్కిన రాజకీయం
posted on Dec 18, 2021 @ 1:11PM
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది, అయినా ఎన్నికల వేడి మాత్రం, ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఓ వంక, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన, బీజేపీ అధికారాన్ని, నిలుపుకోవాలని, తద్వారా కేంద్రంలో ముచ్చటైన మూడో వరస విజయానికి బాటలు వేసుకోవాలని తహతహ లాడుతోంది. మరో వంక బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు సమాజ్ వాదీ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. బీజేపీ గెలుపుకోసం ప్రధాని నరేంద్ర మోడీ మొదలు బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి వెంట ఒకరు యూపీలో ఎన్నికల దండ యాత్రలు సాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం సొంత నియోజక వర్గం వారణాశిలో సాగించిన ఆద్యాత్మిక రాజకీయ సుడిగాలి పర్యటన యూపీ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంతగా ఆశలు పెట్టుకుందో చెప్పకనే చెపుతోంది..
ప్రధాని అటు వెళ్ళారో లేదో ఇటు అమిత్ షా దిగి పోయారు. రాష్ట్ర రాజధాని లక్నోలో 'సర్కార్ బనావో, అధికార్ పావో'’ ర్యాలీలో పాల్గొన్నారు . షాతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ర్యాలీలో పాల్గొన్నారు.అంతే కాదు 2017లో వచ్చిన భారీ మెజారిటీకి ఏ మాత్రం తగ్గకుండా మెజారిటీ సాధించేందుకు,బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
మరోవంక బీజేపీని దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ప్రయత్నాలు చేస్తున్నా, ఎస్పీనే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచి తొడచరుస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీజేపీ పై విరుచుకు పడుతున్నారు. జనం కూడా చాల వరకు ఎస్పీనే బీజేపీకి ప్రత్యాన్మాయంగా మరీ మరీ మాట్లాడితే బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీగా గుర్తిస్తున్నారు. అయితే బీజేపీ ఇటు రాష్ట్రంలో,అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అఖిలేష్ యాదవ్ దూకుడుకు ఎక్కడికక్కడ కళ్ళెం వేసేందుకు ఐటీ, ఈడీ అస్త్రాలను సంధిస్తోంది. తాజగా, ఈరోజు (శనివారం) సమాజ్‌వాదీ పార్టీ నేతలు, మద్దతుదారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ నేపధ్యంలోనే అఖిలేష్ యాదవ్ బెదిరింపు రాజకీయాల్లో బీజేపీ కుడా కాంగ్రెస్‌ను అనుసరిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం వారణాసి నుంచి మావు చేరుకుని, సహదత్ పురలోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయన పన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని నినాదాలు చేశారు. పోలీసులు స్పందిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ప్రజలను కోరారు. మెయిన్‌పురిలోని ఆర్‌సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా లక్నోలోని జైనేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. వీరిద్దరూ అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితులేనని తెలుస్తోంది.
అంతే కాదు అఖిలేష్ యాదవ్ ఆర్థిక ములాలపై దెబ్బ తీసేందుకు బీజీపీ ఏ చిన్న అవకాశాన్ని వాదులు కోవడం లేదని అంటున్నారు. అదెలా ఉన్నా, బీజేపీ వ్యతిరేక ఓటు పూర్తిగా ఎస్పీ వైపుకు తెచ్చుకునేందుకు అఖిలేష్ చేస్తున్న ప్రయత్నం ఇంతవరకు విజయవంతగా ముందుకు సాగుతోంది. బెజేపీని ఓడించాలంటే ఎస్పీని గెలిపించాలనే భావ్ననను అఖిలేష్ విజయవంతంగా ముదుకు తీసుకు పోతున్నారు. ఈ క్రమంలో బీఎస్పీ,కాంగ్రెస్ పార్టీలు బెగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి లాగా . జీరో రేసులో ముందుండే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.