ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం ..ఎందుకంటే!
posted on Dec 18, 2021 @ 11:36AM
ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య పరిరక్షణ,, ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు, మేథావులు, సామాన్య జనం అందరూ కూడా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కోరుతున్నారు. దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభలు, సమావేశాలు, సదస్సులు ఇలా అనేక ప్రయత్నాలు జరిగుతూనే ఉన్నాయి. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఇదొక ఉత్తమ మార్గంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అయినా, ప్రభుత్వాలు ఎందుకనో, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, ఎప్పటికప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తూవస్తున్నాయి. అలాంటిది హఠాత్తుగా ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకోసంగా ఈ నిర్ణయం తీసుకున్నా, ఇది స్వాగతించ వాల్సిన నిర్ణయంగానే, పరిశీలకులు భావిస్తున్నారు.
ఓటరు గుర్తింపు కార్డును ఆధార్’ తో అనుసంధానం చేయడం ద్వారా దొంగ ఓట్లను నివారించవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటరు కార్డులు ఒకటి, రెండు, మూడు కూడా ఉండవచ్చును కానీ అధార్ నెంబర్ మాత్రం దేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నా ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది. పోలింగ్ సమయంలో ఓటరు ఓటు గుర్తింపు కార్డుతో పాటుగా, ఆధార్ కార్డు కూడా చూపించాలంటే దొంగ ఓటు వేసే అవకాశం లేకుండా పోతుంది. ఆ విధంగా దొంగ ఓట్లను తగ్గించవచ్చును అని సంస్కరణ వాదులు భావిస్తున్నారు.
అయితే నిజంగా ఆధార్ అనుసంధానంతోనే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న దొంగ ఓట్ల రుగ్మత తొలిగి పోతుందా, అంటే అనుమానమే. ఎందుకంటే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా, ఇంతవరకు ఎనికల ఆక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల ప్రధానాధికారిగా టీ.ఎన్. శేషన్ శ్రీకారం చుట్టిన ఎన్నికల సంస్కరణలు, తీసుకున్న చర్యలు మొదలు ఇంతవరకు ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలకు మనోళ్ళు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. సో .. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, అది కూడా సగం అయిష్టంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇస్తుందని ఆశించడం ఎంతవరకు సమజసం అనేది కాలమే నిరనయిస్తుందని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే, చాంతాడంత రాగం తీసి ఎదో పాట పాడినట్లుగా, కేంద్ర మంత్రి వర్గం, ఓటరు గుర్తింపు నెంబరుకు, ఆధార్ అనుసంధానం తప్పని సరి చేయలేదు. ఐచ్చికంగ వదిలేసింది. అంటే, మీరు కావాలనుకుంటే, అనుసంధానం చేసుకోవచ్చు, వద్దను కుండే వదిలేయనూ వచ్చును. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఐచ్చిక క్లాజు, ద్వారా అనుసంధానం స్వచ్చంధం చేయటమే అనుమానాలకు తావిస్తోంది.
అయితే, ఓటరు ఐడీ నెంబరుకు, ఆధార్ నెంబరు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఓటల్ జాబితాను బలోపేతం చేయడానికి, ఓటింగ్ ప్రక్రియను మరింత పెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, న్యాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం ఐచ్చికంగా వదిలేసిన ఓటర్లు శ్రద్ద తీసుకుని అనుసంధానం చేసుకోవాలని, ఒక విధంగా ఇది మాన్ ఓటు హక్కును లాక్ చేసుకోవడమే అని అంటున్నారు. మన ఆస్తుల రక్షణకు ఇటికి తాళం వేసుకున్నట్లుగానే, మన ఓటుకు ఆధార్ టప్ లాక్ చేసుకోవాలని అంటున్నారు.
అదలా ఉంటే కేంద్ర మంత్రి వర్గం ఎన్నికల సంస్కరణలకు సంబందించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఓటుహక్కు నమోదుకు ఇప్పటివరకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇకనుండి ఏడాదిలో నాలుగు తేదీలను తీసుకోవాలని కూడా మంత్రివర్గం ఎన్నికల సంఘానికి సూచించింది.