జనరల్ బిపిన్ రావత్ మృతిపై ఎయిర్ చీఫ్ సంచలనం..
posted on Dec 18, 2021 @ 1:35PM
తమిళనాడు రాష్ట్రంలోని కూనురు సమీపంలో డిసెంబర్ 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. అత్యంత సురక్షితమైన, భద్రత కలిగిన ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ప్రమాదంపై పలు సందేహాలు తలెత్తాయి. హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది. అయితే 10 రోజులవుతున్నా ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పక్కా సమాచారం రావడం లేదు. ఘటనాస్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్ ను డీకొడ్ చేస్తూ దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. బిపిన్ రావత్ ప్రయాణించిన చాపర్ పై సైబర్ అటాక్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై రోజుకు కొత్త విషయం బయటికి వస్తుండగా.. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరడ్ కు ముఖ్యఅతిథిగా హాజరైన వివేక్ రామ్.. బిపిన్ రావత్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటనపై స్పందించారు. బిపిన్ రావత్ విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏమి చెప్పలేమన్నారు. ప్రమాదంపై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందని.. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారన్నారు.
హెలికాప్టర్ కూలిపోవడానికి వాతావరణ తప్పిదమా..? మానవ తప్పిదమా..? లేక సాంకేతిక లోపమా..? అనేది విచారణ చేస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ప్రమాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాతే ఏమైనా మాట్లాడగలమన్నారు వివేక్‌రామ్. రావత్ ఘటనపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదని చెప్పారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి ఎవిడెన్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకోసం వారాల సమయం పడుతుందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్.
తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వివేక్ రామ్. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయని... వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్టీ డైమన్షన్ వార్‌పై దృష్టి సారించాలని కాడెట్స్‌కు చెబుతున్నామన్నారు. కేవలం యుద్ధం వైపే కాదు సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలని చెబుతున్నామన్నారు. డ్రోన్ దాడులు ఛాలెంజింగ్‌గా మారాయన్నారు. డ్రోన్ దాడుల నుంచి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.