జనసేన పోరు.. డీఎస్ కథేంటీ.. సాగర్ జర్నీ.. టాప్ న్యూస్@1PM
posted on Dec 18, 2021 @ 11:52AM
ఏపీ ఎంపీలు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమించాలంటూ జనసేన దీక్ష చేపట్టింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేసింది పాదయాత్ర కాదని.. స్థానిక ఎన్నికల ప్రచార యాత్ర అని ఆరోపించారు. జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పైకి వ్యతిరేకమంటూనే లోపాయకారంగా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.
----
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చామని, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్నేహితుడి పరామర్శకు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై కేసులు పెట్టారన్నారు. జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు.
-----
సాలూరులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 216 కిలోల గంజాయిని సరిహద్దులు దాటిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సాలోని కోరాపూర్ జిల్లా పుట్టంగించి నుంచి రాజస్థాన్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఓ భారీ వాహనంలో ఎవరికి తెలియకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ గంజాయి తరలిస్తున్న వాహంన పట్టుబడింది.
-----
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ రూ.కోటి కాగా శుక్రవారం రోజున రూ.1.5కోట్లుగా నిర్ణయించింది. టీటీడీ దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందనున్నారు.
---------
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పాలమంగళంలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. దాదాపు 300 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న 18 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
----
ఐఏఎంసీని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. నానక్‌రాంగూడలో ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీరమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తాను సీజేఐ కాగానే ఐఏఎంసీ ఏర్పాటును ప్రతిపాదించానని... దీనికి ఆగస్టు 20న సీఎం కేసీఆర్ అంగీకరించారని అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారని కేసీఆర్ అన్నారు.హైదరాబాద్‌ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో సీజేఐ ఎన్వీ రమణ ఒకరని తెలిపారు.
-----
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ అన్నీ అనుభవించారన్నారు. రెండు సార్లు పీసీసీ ఎంజాయ్ చేశారని.. అయితే పార్టీ కష్టాల్లో ఉన్నపుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారన్నారు. డి శ్రీనివాస్ కుమారుడు బీజేపీలో ఎంపీ అయ్యారన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నాయని వీహెచ్ చెప్పారు.
--------
నాగార్జున సాగర్‌లో టూరిజం లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. విజయపురిసౌత్ నుంచి నాగార్జున కొండకు ఏపీ టూరిజం లాంచీ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. కొండకు వెళ్లే టూరిజం లాంచీలకు ఐఆర్ఎస్, అటవీశాఖ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. భద్రతా కారణాలతో గత 2 ఏళ్లుగా సాగర్‌లో పర్యాటక శాఖ లాంచీలు నిలిచిపోయాయి. ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులకే కొండకు వెళ్లేందుకు అనుమతి లభించింది.
---
సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ లేఖ కలకలం రేపుతోంది. కొండపాక మండలం సిర్సనగండ్ల సర్పంచ్ గుడెపు లక్ష్మరెడ్డికి రూ.20 లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పేరిట లేఖ వచ్చింది. మావోయిస్టు జగన్ పేరిట రూ.20 లక్షలు ఇవ్వాలని, సాయంత్రంలోగా సమకూర్చాలని ఫోన్ వచ్చింది. లక్ష్మారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
----
బెదిరింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌ను బీజేపీ అనుసరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, మద్దతుదారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో అఖిలేశ్ స్పందిస్తూ బీజేపీ ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు.
---