టాయిలెట్లు కట్టలేని సీఎం.. కిల్లర్ బస్.. జనంలోకి కేసీఆర్.. టాప్ న్యూస్@7PM

రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది. తిరుపతిలో తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభను నిర్వహించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని ధర్మానసం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించనున్నారు అమరావతి రైతులు.  ---- వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 టాయిలెట్లు కట్టలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 3 రాజధానులు కడతారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ శేక్షావలి, నూర్ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందని స్పష్టం చేశారు.  ----- రాష్ట్రంలోని సామాన్యుడు రాజధానిలో ఉండలేని పరిస్థితిని గత ప్రభుత్వ నాయకులు తీసుకొచ్చారని హోం మంత్రి సుచరిత అన్నారు. వైసీపీకి 2019లో అధికారం ఇచ్చారనన్నారు. ప్రజలకు మంచి చేయడం చూసి టీడీపీ తట్టుకోలేపోతుందన్నారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆమె అన్నారు. కుప్పం ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ------ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న తీరుపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల్లో పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఐకాస నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్చల్లా కాకుండా చిట్‌చాట్‌లా జరుగుతోందని సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు.  --- పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా... మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.  ------ ఈ నెల 18వ తేదీన జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు. ద‌ళిత బంధుతో పాటు ఇత‌ర అంశాల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లైంది.  -------- తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతే బయటకు రావాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ గుర్తించామని... వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నామని అంజనీ కుమార్ తెలిపారు ------ తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, చికిత్స పొందుతున్న భారత వాయు సేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ఆర్మీ హెలికాప్టర్‌  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14కు చేరింది. కెప్టెన్ వరుణ్ సింగ్ మరణ వార్తను ఐఏఎఫ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.  ------- తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. ------ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తొలిసారి స్పందించాడు విరాట్ కోహ్లీ. తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు కేవలం గంటన్నర ముందే చెప్పారని చెప్పాడు. టెస్ట్ జట్టు ఎంపిక సమయంలోనే సెలెక్టర్లు   వన్డే కెప్టెన్సీపై తనతో మాట్లాడారని చెప్పారు కోహ్లీ. అయితే  తనతో టెస్టు జట్టు గురించి చీఫ్ సెలెక్టర్ మాట్లాడారని.. అంతా అయిపోయాక.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఐదుగురు సెలెక్టర్లు నిర్ణయించారని చెప్పారని తెలిపారు. --

ద‌ళిత బంధుపై ఫోకస్.. 18న క‌లెక్ట‌ర్ల‌తో సీఎం స‌మావేశం.. 

జనాల నుంచి విమర్శలు, విపక్షాల ఆరోపణలపై సీఎం కేసీఆర్ దిగొచ్చారు. దళిత బంధు పథకం అమలుపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు. ద‌ళిత బంధుతో పాటు ఇత‌ర అంశాల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు యాదాద్రి జిల్లాలోని  ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లైంది.  అయితే నవంబర్ తర్వాత రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. కాని నవంబర్ 4 పోయి నెలన్నర కావస్తున్నా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు. లేదు దళిత బంధు పథకాన్ని కేసీఆర్ అటకెక్కించారనే ఆరోపణలు వచ్చాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే  ఆ పథకాన్ని తీసుకొచ్చారని, అందుకే ఇప్పుడు మాట్లాడటం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. దళిత సంఘాలు కూడా సర్కార్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూ పంపిణి లాగే దళిత బంధు స్కీమ్ నిలిచిపోతుందనే అనుమనాలు వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుండటంతో దళిత బంధు పథకం అమలుపై కేసీఆర్ ఫోకస్ చేశారని తెలుస్తోంది.  మరోవైపు   టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సమావేశం ఈ నెల 17న జరుగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో 12 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే పార్టీ నిర్మాణానికి తీసుకోవాలసిన చర్యలను సీఎం వివరించే అవకాశం ఉంది. 

ఒక రూపాయికే 100 ఎంబీ డేటా.. జియో బంపర్ ఆఫర్ 

టెలికాం సంస్థలు ఇటీవలే టారిఫ్ మార్చేశాయి డేటా రేట్లను పంచేశాయి.  ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కూడా టారిఫ్ లను భారీగా పెంచింది.  1 జీబీ డేటాను మొన్నటి వరకు  11 రూపాయలకు  అందించిన జియో... దాన్ని రూ. 15కి పెంచింది. దీంతోపాటు అన్ని టారిఫ్ లను ఆ సంస్థ పెంచేసి వినియోగదారులపై భారం మోపింది. అయితే తాజాగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.  తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది రిలయన్స్ జియో. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు ప్రకటించింది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. జియో బాటలోనే ఇతర టెలికాం సంస్థలు తమ టారిఫ్ ను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

బిగ్ బ్రేకింగ్: అమరావతి రైతుల సభకు అనుమతి

రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది తిరుపతిలో తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభను నిర్వహించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని ధర్మానసం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించనున్నారు అమరావతి రైతులు.  హైకోర్టులో ఇరు వర్గాల హోరాహోరీ వాదనలు జరిగాయి. పాదయాత్రకు అనుమతి ఇచ్చారని, సభకు కూడా అనుమతి ఇవ్వాలని కోరిన పరిరక్షణ సమితి న్యాయవాదులు. సభకు అనుమతి ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సభకు కూడా అనుమతి ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర  మంగళవారం  ముగిసింది. నవంబర్‌ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరులో ప్రారంభించిన మ‌హా పాద‌యాత్ర 45 రోజుల‌కు అలిపిరిలో ముగిసింది. రైతులు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 450 కి.మీ.పైగా పాదయాత్ర చేశారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర చేరగానే.. ర‌థానికి 108 కొబ్బరికాయలు కొట్టి యాత్రకు ముగింపు పలికారు. స్థానికులు గుమ్మడికాయలతో దిష్టితీశారు.  మంగళ హారతులు పట్టారు. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి మారిమోగిపోయింది.  చివరి రోజు మహాపాదయాత్రకు రాజ‌ధాని ప్ర‌జ‌లు భారీగా తరలివచ్చారు. అమరావతినే ఏపీకి ఏకైక రాజ‌ధానిగా ఉండాలంటూ నిన‌దించారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గుర‌య్యారు రైతులు. మ‌హాపాద‌యాత్ర ముగియ‌డంతో బుధ‌వారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 500 మంది చొప్పున శ్రీవారి దర్శనం చేసుకుంటున్నార మ‌రావ‌తి జేఏసీ ప్ర‌తినిధులు. ఆ మేర‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. 

ద‌గ్గు, జ్వ‌రం కాదు.. రాత్రిళ్లు చెమ‌ట‌లు.. ఒమిక్రాన్ కొత్త లక్షణాలు..

ఒమిక్రాన్‌. ఒమిక్రాన్‌. ఒమిక్రాన్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. డెల్టా కంటే ఈ వేరియంట్ చాలా డేంజ‌ర‌స్ అంటున్నారంతా. డెల్టా కంటే 20 రెట్లు ఎక్కువ‌గా వ్యాపిస్తుంద‌ని చెబుతున్నారు. ఆఫ్రిక‌న్ కంట్రీస్‌లో కేసులు కూడా అదే రేంజ్‌లో న‌మోదు అవుతున్నాయి. తాజాగా స‌రిహ‌ద్దులు దాటేసి.. మ‌న దేశంలోకీ అడుగుపెట్టింది ఒమిక్రాన్‌.  ఇంత‌కీ ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు ఏంటి? కొవిడ్‌లానే జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, త‌ల నొప్పి, వాస‌న కోల్పోవ‌డం.. లాంటివేనా? లేక‌, మ‌రేమైనా కొత్త ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అనేది ఆస‌క్తిక‌రం. ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో డెల్టా కంటే భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్‌ వెల్లడించారు. ఈ వేరియంట్‌ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటల‌తో బాధపడుతున్నారని అన్నారు.    "ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయి. కొవిడ్-19 లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల్లో లేవు. ఒమిక్రాన్‌ సోకినవారు ఎక్కువగా తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధపడుతున్నారు" అని డాక్టర్‌ ఏంజెలిక్‌ కాట్జీ ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.  వ్యాక్సిన్‌ తీసుకోనివారిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు విపరీతంగా ఉంటున్నాయని.. కొందరు బాధితుల్లో మాత్రం అసాధారణ లక్షణాలు కన్పిస్తున్నాయని డాక్ట‌ర్ ఏంజెలిక్‌ అన్నారు. "ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన బాధితులకు అలసట, బలహీనతతో పాటు రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఎంతలా అంటే ఈ చెమట కారణంగా వారి దుస్తులు, బెడ్‌ కూడా తడిసిపోతున్నట్టు వారు చెబుతున్నారు. చాలా మందిలో ఈ లక్షణం కన్పిస్తోంది" అని ఆ డాక్ట‌ర్‌ వెల్లడించారు. గొంతు గరగర కూడా ఎక్కువగా ఉంటోందన్నారు. డెల్టా సోకిన వారు వాసన కోల్పోగా.. ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో ఆ లక్షణం కన్పించట్లేదని తెలిపారు. అయితే, మందులతో ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్నట్టు చెప్పారు. 

అవును ఆయన ఏసు దేవుడే.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ఇంత చక్కగా అమలు కావడానికి  కారణం ఏమిటి? అధికారంలోకి వచ్చే ముందు ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి, మనసు కరిగి, గుండె తరిగి, అధికారంలోకి వచ్చిన తర్వాత, చేతి వెముకలు తీసి పక్క పెట్టి, సంక్షేమ పందారం పెద్ద ఎత్తున చేస్తున్నారని, అనుకుంటున్నారా? అవును మీరే కాదు, మనందరం కూడా ఇంత కాలం అలాగే అనుకుంటూ వచ్చాం. కానీ,కాదు. జగనన్న దాతృత్వ ఆలోచన వెనుక ఉన్న అసలు రహాస్యం అయన క్రైస్తవాన్ని అనుసరించడమేనని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత  తెలిపారు.  కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవాన్ని అనుసరిoచటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్‌కు కలిగిందని సుచరిత తెలిపారు. కులం వేరు, మతం వేరు ఎవరైనా వారి వారి విశ్వాసానుసారం మతమార్పిడి చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిజం, సుచరిత చెప్పింది సువార్త అంత సత్యం.  నిజానికి జగన్మోహన్ రెడ్డి, ఏసు మార్గంలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు అనుసరించే విధానాలనే, జగన్ రెడ్డి ఓటు బ్యాంక్ రాజకీయాలకు అనువుగా మలచుకుని ఆచరిస్తున్నారు. ఏసు  మార్గాన్నే అనుసరిస్తున్నారు. క్రైస్తవ సంస్థలు తాయిలాలు ఎరగా వేసి మత మార్పిడులను ప్రోత్సహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఒక్క ఏపీలోనే కాదు, దేశ మంతటా క్రైస్తవ  సంస్థలు చేస్తున్నది అదే. అందుకోసమే పాస్టర్లను నియమించి, ప్రచారం సాగిస్తున్నాయి. జగన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. అయితే, క్రైస్తవ సంస్థలు, మిషనరీలు కేవలం మత మార్పిడుల మీద దృష్టి పెడితే, జగన్ రెడ్డి ఓట్ల కోసం తాయిలాలు ఎరవేస్తున్నారు. అదొక్కటే తేడా మిగిలినదంతా సేమ్..టూ.. సేమ్. అంటున్నారు. అందుకే కొందరు జగన్ రెడ్డిని ముద్దుగా, ప్రేమగా ఏసు రెడ్డి అని కూడా పిలుచు కుంటారు. 

ఒమిక్రాన్‌పై WHO వార్నింగ్‌.. ఇండియాకు బిగ్‌ వ‌ర్రీ!

ఆల్ఫా. బీటా. డెల్టా. ఇవ‌న్నీ ఓ లెక్క‌.. ఒమిక్రాన్ ఇంకోలెక్క‌. ఒమిక్రాన్ డేంజ‌ర‌స్ వేరియంట్ అని.. అసాధార‌ణ రీతిలో వ్యాపిస్తోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO హెచ్చరించింది. ఇప్పటికే 77 దేశాలకు విస్తరించింద‌ని.. త్వరలోనే మరిన్ని దేశాలపై పంజా విసరడం ఖాయమని తెలిపింది. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ కట్టడికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. ఒమిక్రాన్ స్వల్ప వ్యాధి మాత్రమేనంటూ నిర్ధారణకు రావద్దని.. అలా అనుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని  WHO హెచ్చరించింది.  ఒమిక్రాన్ వేరియంట్‌ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి నెలకొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికాలో బయటపడుతోన్న కేసుల్లో 3శాతం ఈ రకమే ఉంటున్నాయి. యూరప్‌లోనూ ఆస్పత్రిలో చేరికలు పెరుగుతున్నాయి. మరోసారి కఠిన ఆంక్షలు విధించే యోచనలో బ్రిటన్‌ ప్రభుత్వం ఉంది.    ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోవడంలో వ్యాక్సిన్‌లు అంత సమర్థవంతంగా పని చేయట్లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఫైజర్ కంపెనీ రిలీజ్ చేసిన యాంటీవైరల్ ట్యాబ్లెట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తుది ఫలితాల విశ్లేషణలో వెల్లడైంది.  మరోవైపు, ఇండియాలో ఒమిక్రాన్ కేసులు సెంచ‌రీ దిశగా దూసుకుపోతుండ‌టం తీవ్ర ఆందోళ‌న‌క‌ర అంశం. ఇప్ప‌టికీ దేశంలో వ్యాక్సిన్ తీసుకోని వారు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. రెండు డోసులు కంప్లీట్ కాని వారి సంఖ్య మ‌రింత అధికం. వ్యాక్సిన్‌ల ప్ర‌భావం ఒమిక్రాన్‌పై అంతంతమాత్ర‌మేన‌ని చెబుతుండ‌టం.. ఇండియాలో కేసులు పెరుగుతుండ‌టం డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇక‌, ఇప్ప‌టికే ఏపీలో ఓ కేసు వెలుగు చూడ‌గా.. తాజాగా తెలంగాణ‌లో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌జ‌లు మాస్క్‌లు ధరించ‌డం.. సామాజిక దూరం పాటించ‌డం  త‌ప్ప‌నిస‌రి.   

వన్డేలకు కెప్టెన్ గా ఉంటానని చెప్పినా తీసేశారు! విరాట్ కోహ్లీ సంచలనం.. 

భారత క్రికెట్ టీమ్ లో గందరగోళం నెలకొందన్న వార్తలు మరింత నిజమయ్యాయి. టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అలాంటి సంకేతమిచ్చారు. బీసీసీఐలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించిన కోహ్లీ.. కీలక విషయాలు చెప్పారు. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడం, రోహిత్ శర్మతో విభేదాలు, బీసీసీఐ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విరాట్ కోహ్లీ.  సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విరాట్.. కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తొలిసారి స్పందించాడు. తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు కేవలం గంటన్నర ముందే చెప్పారని చెప్పాడు. టెస్ట్ జట్టు ఎంపిక సమయంలోనే సెలెక్టర్లు   వన్డే కెప్టెన్సీపై తనతో మాట్లాడారని చెప్పారు కోహ్లీ. అయితే తనతో టెస్టు జట్టు గురించి చీఫ్ సెలెక్టర్ మాట్లాడారని.. అంతా అయిపోయాక.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఐదుగురు సెలెక్టర్లు నిర్ణయించారని చెప్పారని తెలిపారు. వన్డే కెప్టెన్లీ నుంచి తప్పించడంపై తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు కోహ్లీ.  టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు కెప్టెన్ గా ఉండనన్న తన నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతించిందని చెప్పాడు విరాట్ కోహ్లీ. మరోమారు ఆలోచించకుండా తన నిర్ణయాన్ని అంగీకరించిందని, చాలా మంచి నిర్ణయమంటూ మెచ్చుకుందని గుర్తు చేశాడు. ఆ సమయంలోనే వన్డేలు, టెస్టులకు నాయకత్వం వహిస్తానంటూ బీసీసీఐకి చెప్పానన్నాడు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని తెలిపాడు. అయితే, తాను వేరే ఫార్మాట్లకు నాయకత్వం వహించలేనని సెలెక్టర్లు భావిస్తే తానేమీ చేయలేనన్నాడు. వన్డేలో ఆడట్లేదన్న విషయంపైనా కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. సౌతాఫ్రికాతో వన్డేలూ ఆడుతున్నానని తేల్చి చెప్పాడు. చాలా మంది అబద్ధాలు రాస్తున్నారని, తానెప్పుడూ విశ్రాంతి కావాలంటూ ఎవరినీ అడగలేదని కోహ్లీ స్పష్టం చేశారు. రోహిత్ చాలా మంచి నాయకుడని, జట్టును సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా నడిపించడంలో దిట్ట అని కోహ్లీ కొనియాడాడు. రాహుల్ ద్రావిడ్ ఓ గొప్ప వ్యక్తి అన్నాడు. తన వంతుగా జట్టును ముందుకు నడిపించేందుకే తాను కృషి చేస్తానని, వన్డేలు, టీ20ల్లో రోహిత్ కు వంద శాతం అండగా నిలుస్తానని స్పష్టం చేశాడు. తనకు, రోహిత్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నానని, చెప్పి చెప్పి అలసిపోయానని అన్నాడు. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై బీసీసీఐ చెబుతున్న కారణాలను అర్థం చేసుకోగలనని తెలిపాడు. జట్టును హీన స్థితికి తీసుకెళ్లేలా తన నిర్ణయాలుండవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

సెక్యులర్ ఫ్రంటే శ్రీరామ రక్ష..  కామ్రేడ్ పినరయ్ జోస్యం 

దేశం నెత్తి మీద నుంచి ఓ పెద్ద బరువు దిగిపోయింది. కామ్రేడ్ పినరయ్ విజయన్ ఆ బరువును ఇట్టే దించేశారు. కేంద్రంలో ఏడేళ్ళుగా తిష్టేసుకు కూర్చున్న బీజేపీ ప్రభుత్వాని గద్దేదించడం ఎలా? మోడీ మూడోసారి ప్రధాని కుర్చీలో కూర్చోకుండా చేయడం ఎలా? అని అందరినీ వేధిస్తున్న ప్రశ్నకు పినరయ్ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. వామపక్షాల సారధ్యంలో ఏర్పడే  సెక్యులర్ ఫ్రంట్ బీజేపీనే  గద్దెదించుతుందని  విజయన్ ధీమా వ్యక్త పరిచారు.   దేశంలో బీజేపీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏది అనే విషయంలో అనేక చర్చలు నడుస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పడుతుందని అంటున్నారు. కొందరేమో కాంగ్రెస్ లేని కూటమి, ఆత్మ లేని దేహం అంటున్నారు. మమతా బెనర్జీ అయితే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ, ఈజ్ నో మోర్’ అంటున్నారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ఏకంగా శపథమే చేశారు. కొద్ది రోజుల క్రితం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి చేశారు కానీ, ఆ తర్వాత మెత్త బడ్డారు. ఇప్పుడు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు.  ఈ మధ్యే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ శపథం చేస్తున్నారు. అయితే ఇవేవీ కావని, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా సెక్యూలర్ ప్రత్యామ్నాయం  లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోనే ఏర్పడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. అయితే, విజయన్ కూడా ఎందుకనో  కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ  ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేదని, ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రసంగంలో రాహుల్ ప్రసంగంలోని హిందూ, హిందుత్వ పదాలను ఉదహరిస్తూ ఆయన ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజాన్ని కాకుండా సాఫ్ట్ హిందుత్వ గురించి మాట్లాడుతోందని, దీంతో ప్రజలకు ఇప్పటికి కాంగ్రెస్‌పై ఉన్న నమ్మకం సన్నగిళ్లిపోయిందని విజయన్ అన్నారు. రాహుల్ గాంధీ మాటల్లోని సాఫ్ట్ హిందుత్వ స్టాండ్‌ను కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తోంది. కాకపోతే జైపూర్‌లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారంతే. కాంగ్రెస్ పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కార్యకర్తల్లో కూడా ఆ పార్టీపై నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ‘సెక్యూలర్ ప్రత్యామ్నాయం’ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదు. సెక్యూలరిజం కాకుండా హిందూయిజం గురించి కాంగ్రెస్ మాట్లాడడం తన ఉనికిని మరింత తగ్గించుకోవడమే. కాంగ్రెస్‌కు ఇంతకంటే పెద్ద తప్పు అవసరం లేదని  విజయన్ అన్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో బీజేపీకి వ్యతిరేకంగా  ఉమ్మడి కూటమి ఏర్పాటుకు సాగుతున్న యజ్ఞం మూడు కూటములు,ఆరు ఫ్రంట్లుగా వర్ధిల్లుతోంది.  

చెప్పుతో కొట్టండి.. సీపీఎస్ ర‌ద్దు హామీపై చంద్రాగ్ర‌హం..

ఢిల్లీలో వైసీపీ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోందని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వేడుకుంటుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసి.. ఇప్పుడు అడుక్కుంటే అవుతుందా? అని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఏపీని ఇంత భ్రష్టు పట్టించిన సీఎం ఎక్కడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ నేతలు.. హైదరాబాద్‌లో తాను ఏమి చేసానో చూడాలని చంద్ర‌బాబు స‌వాల్ చేశారు. రెండు కళ్లుగా ఉన్న అమరావతి, పోలవరాన్ని పొడిచేసి.. ఏపీని గుడ్డిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 టాయిలెట్లు కట్టలేని జగన్.. 3 రాజధానులు కడతారా? అంటూ మండిపడ్డారు.  సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైంది? అని టీడీపీ అధినేత‌ చంద్రబాబు నిలదీశారు. హామీ నెరవేర్చకపోతే చెప్పుతో కొట్టండి అన్నారు.. ఇప్పుడేం చెబుతారు? అని ప్రశ్నించారు. జగన్ ఒక దొంగ పిల్లి.. కళ్లు మూసుకుని పాలు తాగుతూ త‌న‌ను ఎవరూ చూడడం లేదనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్‌ అని ఓటేసిన ప్రజలు.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నార‌ని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ శేక్షావలి, నూర్ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందని చంద్ర‌బాబు అన్నారు. ఐటీకి ఇచ్చిన ప్రోత్సహం వల్లే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడని తెలిపారు.

చంద్రబాబు 44.. జగన్ ఇచ్చేదెంత? పీఆర్సీపై ఉద్యోగుల్లో ఉత్కంఠ..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ  రగడ ముదురుతోంది. పీఆర్సీ కమిషన్ 27 శాతం ఫిట్ మెంట్ సిఫారస్ చేయగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎస్ కమిటి మాత్రం కేవలం 14.29 శాతం సిఫారస్ చేసింది. 14.29  ఫిట్‌మెంట్ ఇచ్చినా ప్రభుత్వంపై రూ. 4వేల కోట్ల అదనపుభారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు 30 శాతానికి పైగానా పీఆర్సీ ఇవ్వాల్సిందేనని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుదన్నది ఆసక్తిగా మారింది. చివరి సారి ఉద్యోగులకు 44 శాతం పీఆర్సీ ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పడు ఉద్యోగులంతా చంద్రబాబును గుర్తు చేసుకుంటూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పీఆర్సీ అంటే ఏంటీ? గతంలో ఎవరు ఎంత పీఆర్సీ ఇచ్చారో చూద్దాం..  పీఆర్‌సీ అంటే పే రివిజన్ కమిషన్. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి వంటివి సిఫార్సు చేసే కమిటి. ప్రతి అయిదేళ్లకోసారి ఈ సంఘాన్ని నియమిస్తారు. ఈ సంఘం ఇచ్చే సిఫార్సును విని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా జీతాలు పెంచడమే ఉంటుంది. పీఆర్‌సీ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే జీతాలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది.కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని పే కమిషన్ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో పే రివిజన్ కమిషన్ అంటారు.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ప్రకటించిన పీఆర్సీ వివరాలు చూస్తే.. 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం పీఆర్సీ ప్రకటించింది. ఇది అప్పట్లో  సంచలనం. తర్వాత 1993లో కాంగ్రెస్ సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కార్ కూడా ఎన్టీఆర్ తరహాలోనే 10 శాతం పీఆర్సీ ఇచ్చింది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 25 శాతం పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇది అప్పట్లో ఉద్యోగులు ఊహించినదాని కంటే ఎక్కువ.  చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ ప్రభుత్వం 2005లో ఉద్యోగులకు పీఆర్సీ  ఇచ్చింది. అయితే అది కేవలం 16 శాతమే. అంతకుముందు 1999లో చంద్రబాబు సర్కార్ 25 శాతం ఇవ్వగా.. వైఎస్సార్ కేవలం 16 శాతం పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందారు. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య సర్కార్ 2010లో ఉద్యోగులకు 39 శాతం పీఆర్సీ ప్రకటించింది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతుండటంతో.. ఉద్యోగులను కూల్ చేయడానికి రోశయ్య సర్కార్ 39 శాతం పీఆర్సీ ఇచ్చిందనే చర్చ జరిగింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015లో రెండు తెలుగు రాష్ట్రాలు పీఆర్సీ ప్రకటించాయి. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యోగులు భారీగా పీఆర్సీ డిమాండ్ చేశారు. దీంతో కేసీఆర్ సర్కార్ ఏకంగా 43 శాతం పీఆర్సీ ప్రకటించింది. ఉద్యోగులకు స్వరాష్ట్రం కానుకగా అభివర్ణించింది. విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడంతో ఉద్యోగులకు ఇచ్చిన  పీఆర్సీ పెద్ద ఆశ్చర్యం కల్గించలేదు. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలంగాణకు ధీటుగా.. కాదు వాళ్ల కంటే ఎక్కువగానే 44 శాతం పీఆర్సీ ఇచ్చారు. ఏపీలో లోటు బడ్జెట్ లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు 44 శాతం పీఆర్సీ ప్రకటించారు చంద్రబాబు. విభజనతో కష్టాల్లో పడిన ఏపీ అభివృద్ధికి ఉద్యోగులు పాత్ర కీలకమని భావించడం వల్లే చంద్రబాబు ఎక్కువ పీఆర్సీ ఇచ్చారని భావించారు. చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెప్పారు. ఏపీ పాలనలో ఇది కనిపించింది కూడా. 

పేటీఎమ్ బ్యాచ్‌లు.. చంద్రుకు చంద్ర‌బాబు కౌంట‌ర్‌..

జ‌స్టిస్ చంద్రు. జై భీమ్ సినిమాతోనే కాదు.. ఏపీ హైకోర్టుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తోనూ వార్త‌ల్లో నిలిచారు. న్యాయ‌వాదిగా, న్యాయ‌మూర్తిగా ప‌ని చేసిన ఆయ‌నే.. హైకోర్టు జ‌డ్జిలు, తీర్పుల‌పై అసంబ‌ద్ధ ఆరోప‌ణ‌లు చేశారు. చంద్రు కామెంట్ల‌పై ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తులు సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జ‌స్టిస్ చంద్రుపై మండిప‌డ్డారు.  చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే... "ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు.. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా? ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా?.. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్లు సపోర్ట్ చేయవచ్చా?.. రిటైర్ అయిన తర్వాత వీళ్ల‌కి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు.. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు.." అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జస్టిస్ దేవానంద్ స్ట్రాంగ్ కౌంటర్... ఇప్ప‌టికే జ‌స్టిస్‌ చంద్రు ఆరోపణలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఖండించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని త‌ప్పుబ‌ట్టారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని చంద్రును దేవానంద్ నిల‌దీశారు. ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు.. హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్లి మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించండని చంద్రును ఎద్దేవా చేశారు జ‌స్టిస్ దేవానంద్‌. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా? అని జస్టిస్ బట్టు ప్రశ్నించారు. జ‌స్టిస్‌ చంద్రు అసలేమన్నారంటే... ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని చంద్రు ఆరోపించారు. ప్రభుత్వం.. శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని.. కొంద‌రు హైకోర్టు జ‌డ్జిలు అమ‌రావ‌తిలో భూములు కొన్నారని.. విచార‌ణ స‌మ‌యంలో ఆ జ‌డ్జీలు త‌ప్పుకోకుండా వారే అడ్డుకుంటున్నారంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు జ‌స్టిస్ చంద్రు. 

మృత్యువుతో పోరాడి ఓడిన కెప్టెన్ వరుణ్ సింగ్.. 

మృత్యువుతో వారం రోజులు పోరాడారు. చివరికి ఓడిపోయారు. తుది శ్వాస విడిచారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, చికిత్స పొందుతున్న భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ఆర్మీ హెలికాప్టర్‌  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14కు చేరింది.  కెప్టెన్ వరుణ్ సింగ్ మరణ వార్తను ఐఏఎఫ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని ఐఏఎఫ్ తెలిపింది. వరుణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపింది. డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించినవారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే తీవ్రంగా కాలిన గాయాలతో బెంగళూరులో చికిత్స పొందారు.  ఐఏఎఫ్  గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన తుది శ్వాస విడిచినందుకు తాను తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆయన చేసిన సేవలను మన దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. వరుణ్ సింగ్  కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 

వాగులో బస్సు బోల్తా.. 9 మంది మృతి! గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం..

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది  మంది ప్రయాణికులు మృతి చెందగా... మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు వేలేరుపాడు పేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు, పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన  బస్సు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం అత్యంత బాధాకరమన్నారు.  సంఘటన సమీపంలో ఉన్న పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించటంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానూభూతిని తెలియజేశారు. 

టీకా వేసుకోకుంటే ఉద్యోగం ఊస్టింగే! 

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వైరస్ ఇప్పటికే 60 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ నాటికి 50 వేల నుంచి 75 వేల మరణాలు నమోదు కావొచ్చని ఆరోగ్య సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడికి పలు దేశాలు, సంస్థలు కఠిన చర్యలకు దిగుతున్నాయి.  ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను జాబ్ లో నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ సర్క్యులర్ ను జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులంతా తమ తమ వ్యాక్సినేషన్ వివరాలను డిసెంబర్ 3 నాటికి సమర్పించాలని, టీకా వేసుకోని వారెవరైనా ఉంటే వచ్చే ఏడాది జనవరి 18లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. టీకా సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించింది. వ్యాక్సిన్ వేయించుకోకుంటే ముందుగా జీతాల్లో కోత పెడతామని, పదే పదే చెప్పినా వినకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని గూగుల్ హెచ్చరించింది.  కొవిడ్ టీకా తీసుకోకుంటే మొదటి 30 రోజుల పాటు పెయిడ్ అడ్మినిస్ట్రేషన్ లీవ్ కింద ఉద్యోగికి సెలవు ఇస్తామని, ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకోకుంటే ఆరు నెలల పాటు జీతం లేని వ్యక్తిగత సెలవుల్లోకి పంపిస్తామని హెచ్చరించింది. అప్పటికీ వినకుంటే సంస్థ నుంచి బయటకే పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చింది.తమ ఉద్యోగుల భద్రతకు వ్యాక్సినేషనే కీలకమని ఇప్పటికే చెప్పామని, ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకునేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ సంస్థ టీకా విధానాలపై కచ్చితంగా నిలబడతామని తేల్చి చెప్పారు.

జ‌గ‌న్‌కు స‌జ్జ‌ల స‌ల‌హాదారా? కుట్ర‌దారా?

అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తా. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇది. మ‌రి, అధికారంలోకి వ‌చ్చి ఎన్ని వారాలైంది?  సీపీఎస్ ర‌ద్దు ఏమైంది? అంటూ ప్ర‌భుత్వ ఉద్యోగులు గ‌ట్టిగానే నిల‌దీస్తున్నారు. పీఆర్సీ ఎపిసోడ్‌లో మ‌రోసారి సీపీఎస్ ర‌ద్దు ర‌చ్చ‌గా మారింది. వెంట‌నే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రంగంలోకి దిగిపోయారు. మీడియా ముందుకొచ్చి.. సీపీఎస్ గురించి తెలియకుండానే జగన్ హామీ ఇచ్చారంటూ.. జ‌గ‌న‌న్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసిపారేశారు. ఈ ఒక్కమాట‌తో జ‌గ‌న్‌కు ఏమీ తెలీద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిపోయింది. ఆయ‌న‌వి ఉత్తుత్తి గాలిమాట‌ల‌నే మేట‌ర్ లీక్ అయిపోయింది. చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఆరోపిస్తున్న‌ట్టు.. జ‌గ‌న్‌ది అనుభ‌వరాహిత్య‌మ‌నే సంగ‌తి తేలిపోయింది.  సీపీఎస్ గురించి తెలియ‌కుండానే జ‌గ‌న్ హామీ ఇచ్చార‌న‌డం.. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సజ్జల చెప్ప‌డం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జ‌గ‌న్‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో అస‌లు గుట్టు బ‌య‌ట‌పెట్టార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇంత‌కీ, స‌జ్జ‌ల అలా చెప్ప‌డానికి జ‌గ‌న్ అనుమ‌తి ఇచ్చారా?  లేక‌, స‌జ్జ‌ల‌నే ఫ్లో లో నిజం క‌క్కేశారా? అనుకోకుండా నోరు జారారా? అనుకునే నోటి నుంచి ఆ మాట వ‌చ్చిందా? జ‌గ‌న్‌కు అస‌లేమీ తెలీదా? ఆయ‌న గుట్టంతా స‌జ్జ‌ల‌కు తెలుసా? ఇలా ర‌క‌ర‌కాల టాక్స్ న‌డుస్తున్నాయి.  జ‌గ‌న్ మోనార్క్‌. ఎవ‌రినీ న‌మ్మ‌రు. ఎవ‌రి మాటా విన‌రు..అని అంటారు. త‌ల్లిని, చెల్లినే దూరం పెట్టారు. త‌న‌తో జైలుకెళ్లి వ‌చ్చిన ఏ2ను తాడేప‌ల్లికి రానివ్వ‌డం లేదు. ఆయ‌న త‌న నీడ‌ను కూడా న‌మ్మ‌రు. కానీ, స‌జ్జ‌ల‌తో మాత్రం బాగానే స‌ఖ్య‌త‌గా ఉంటున్నారు. త‌న మీడియాలో ప‌నిచేసే ఉద్యోగి నుంచి.. ఇప్పుడు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వ‌ర‌కూ.. స‌జ్జ‌ల‌కు బాగానే బూస్ట్ ఇచ్చారు. జ‌గ‌న్ మ‌న‌సెరిగి.. స‌జ్జ‌లనే అన్నీ తానై ముందుకొస్తుంటారు. పార్టీ త‌ర‌ఫునా.. ప్ర‌భుత్వం త‌ర‌ఫునా.. సీఎం త‌ర‌ఫునా.. అన్ని విష‌యాలూ ఆయ‌నే మాట్లాడుతుంటారు. ప్ర‌స్తుతం పీఆర్సీపై ఉద్యోగులంతా ర‌గిలిపోతుంటే.. జగ‌న్‌ను వెన‌కేసుకొచ్చేందుకు ఈయ‌న ముందుకొచ్చారు. ఆ ఫ్లోలో జ‌గ‌న్‌కు అంత‌గా అవ‌గాహ‌న లేద‌నే నిజాన్ని బ‌య‌ట‌పెట్టేశారని అంటున్నారు.  అస‌లే జ‌గ‌న్ మోనార్క్. అలాంటిది త‌న‌పైనే కామెంట్ చేస్తే ఊరుకుంటారా? అస్స‌లు ఊరుకోరు. తాడేప‌ల్లిలో ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. సీపీఎస్ ర‌ద్దుపై త‌న‌కు అవ‌గాహ‌న లేకుండా హామీ ఇచ్చానంటూ.. స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయిన‌ట్టు స‌మాచారం. స‌జ్జ‌ల ఓవ‌రాక్ష‌న్‌పై పిలిచి క్లాస్ ఇచ్చార‌ని చెబుతున్నారు. చంక‌న పెట్టుకుంటే.. చుల‌క‌న చేస్తావా? అంటూ స‌జ్జ‌ల‌కు జ‌గ‌న్ నుంచి షెంటింగ్స్ ప‌డ్డాయ‌ట‌. ఈ ఒక్క‌మాట పొలిటిక‌ల్‌గా ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలీదా? అంటూ గ‌ట్టిగానే మంద‌లిచ్చార‌ట‌. ఇంత‌గా న‌మ్మితే.. చేసింది ఇదా అని మండిప‌డ్డార‌ట జ‌గ‌న్‌. జ‌గ‌న్‌ను మొద‌టి నుంచీ త‌ప్పుదారి ప‌ట్టిస్తున్న‌ది స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌నే అని అంటుంటారు. మాట త‌ప్ప‌డు.. మ‌డ‌మ తిప్ప‌డు.. అనే ఇమేజ్ నుంచి అమ‌రావ‌తి, మూడు రాజ‌ధానులు.. పీఆర్సీ, సీపీఎస్ వ‌ర‌కూ.. అధికారంలోకి వ‌చ్చాక మాట త‌ప్పుడు.. మ‌డ‌మ తిప్పుడు.. వ్య‌వ‌హారాలే ఎక్కువ‌. వీట‌న్నిటికీ స‌జ్జ‌ల స‌ల‌హాలే కార‌ణ‌మ‌ని చెబుతారు. ఎవ‌రి మాటా విన‌ని జ‌గ‌న్‌.. ఒక్క స‌జ్జ‌ల మాటే వింటుండ‌టం వ‌ల్లే ఈ దుష్ప‌రిణామాల‌ని ఆరోపిస్తున్నారు. యూట‌ర్న్ నిర్ణ‌యాలు, రివ‌ర్స్ పాల‌న‌లో జ‌గ‌న్‌తో పాటు స‌జ్జ‌ల‌కూ ఎంతోకొంత భాగ‌స్వామ్యం ఉంద‌ని అంటున్నారు. తాజా, సీపీఎస్ ఎపిసోడ్‌లో స‌జ్జ‌ల కామెంట్స్‌.. ఆ ఇద్ద‌రికీ బాగా డ్యామేజ్ చేసిన‌ట్టే. త్వ‌ర‌లోనే ముఖ్య‌మైన మంత్రి ప‌ద‌వికి ఎస‌రు పెట్టిన స‌జ్జ‌ల‌కు ఇది శ‌రాఘాత‌మే. ఎంపీ ర‌ఘురామ అన్న‌ట్టు.. ఆయ‌న స‌జ్జ‌ల‌నా? కుట్ర‌లు చేసే బిజ్జ‌ల‌నా?

లోకేష్ పోరాటం.. పీఆర్సీ రగడ.. ఒమిక్రాన్ వచ్చేసింది.. టాప్ న్యూస్@1PM

మంగళగిరిలో పేదలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం  మంగళగిరి తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పేదల ఇళ్ల తొలగింపు నోటీసును ఉపసంహరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మంగళగిరిలో నిర్మిస్తున్న డివైడర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోకేష్ వస్తే పేదల ఇల్లు  తొలగిస్తారు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారని... అదే పని ఎమ్మెల్యే ఆర్కే  చేస్తున్నాడని లోకేష్ యెద్దేవా చేశారు.-------ఉద్యోగులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా ప్రభుత్వంపై రూ. 4వేల కోట్ల అధనపుభారం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మంగళవారం ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు మధ్య చర్చల సందర్భంగా కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. అయితే ఆ లెక్కలు తప్పని ఏపీజేఏసీ, ఏపీ ఎన్జీవో ఉద్యోగసంఘాల నేతలు అన్నారు.  ------- సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్  ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ దాఖలైంది. ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని  ఏజీ హైకోర్టును కోరారు. సినిమా టికెట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది.. ----- అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి సర్కిల్ 3 కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. జై అమరావతి.. ఒకటే రాజధాని.. అమరావతే రాజధాని అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.  ------ చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‍ని గుజరాత్, మధ్యప్రదేశ్‍లకు పంపగా... ఫుటేజ్‍లోని చెడ్డీ గ్యాంగ్ దుండగులను పోలీసులు  గుర్తించారు. గుజరాత్‍లోని దాహోద్‍లోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా తెలుస్తోంది. దీంతో  దాహోద్ ఎస్పీతో బెజవాడ సీపీ రాణా ఫోన్‌లో మాట్లాడారు.   ------- తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ నరసింహన్‌ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు ఆసుప‌త్రిలో శస్త్రచికిత్స జరిగింది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఐసీయూలో ఉన్నారు. మరో 3-4 రోజులు ఆయ‌న‌ ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంది. న‌ర‌సింహ‌న్ ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం కేసీఆర్ చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు. -- ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణకు వచ్చేసింది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు హెల్త్ డెరైక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.  కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.  ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ----- ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌‌తో ప్రజలు ఆందోళన చెందొద్దని.. జాగ్రత్తలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్‌ ట్రేస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ----- హైదరాబాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. కరెంట్ కట్ చేసింది. స్టేడియానికి సంబంధించి ఇప్పటిదాకా రూ.కోటికిపైగా కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ కొన్ని నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేశామని ఏడీఈ బాలకృష్ణ తెలిపారు. --------- గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను జాబ్ లో నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ సర్క్యులర్ ను జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులంతా తమతమ వ్యాక్సినేషన్ వివరాలను డిసెంబర్ 3 నాటికి సమర్పించాలని, టీకా వేసుకోని వారెవరైనా ఉంటే వచ్చే ఏడాది జనవరి 18లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది.  --------  

ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదా? వైసీపీ ఎంపీ రాగాలు అందుకేనా?

పార్లమెంట్ ఉభయ సభల్లో, వైసీపీ సభ్యుల బీద అరుపులు, ఆర్తనాదాలు దేనికి సంకేతం? పెద్దల సభలో ఉత్తరప్రదేశ్’కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు జీవిఎల్ నరసింహ రావు, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రశ్నించడం, అందుకు విపులంగా, వివరంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం ఏమి సూచిస్తోంది? అదే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం, డిసెంబర్ 28 విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ సన్నాహలు, దేనికి సంకేతం? ఈ పరిణామాలను దేనికదిగా చూడాలా,లేక ఒకదానితో ఒకటి ముడిపడిన పరిణామాలుగా భావించాలా? అసలు ఢిల్లీలో ఏమి జరగుతోంది? ఎపీలో రేపు ఏమి జరగబోతోంది?  ఈ ప్రశ్నలు కొంత గంభీరంగా కనిపించినా, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు. మాత్రం ఇదేమీ అనూహ్య పరిణామం కాదనే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగాజారుతూనే వుంది.  ప్రతిపక్ష పార్టీలను పక్కన పెట్టినా, ఆర్థిక రంగ నిపుణులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా పరుగులు పరుగులు తీస్తోందని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా ఎప్పటికప్పుడు అక్షింతలు వేస్తునే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ వ్యయాన్ని తగ్గించుకోవాలని లేదంటే అప్పులు పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నస్థితికి చేరుతుందని ఒకటికి రెండు సార్లు  హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం 2019 - 20 తెచ్చిన అప్పుల్లో 80 శాతం  రెవిన్యూ వ్యయాలకే వెచ్చించడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. దాని వల్ల ఆస్తుల కల్పన ప్రక్రియ కుంటుపడిందని పేర్కొంది. తెచ్చిన రుణాల్ని ఆస్తుల కల్పనకు బదులు, ఇలా రెవెన్యూ వ్యయాల కోసం ఎక్కువ వెచ్చించడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం తీర్చాల్సిన రుణ భారం బాగా పెరిగిపోతుందని కాగ్‌ ఆందోళన వ్యక్తంచేసింది.  రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలను పద్దుల్లో చూపకపోవడం వల్లే ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే ఉన్నట్లు కనిపిస్తున్నాయని, వాటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటే నిర్దేశిత పరిధులను దాటేసి ఉండేవని తెలిపింది. ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంపై వాస్తవిక అంచనాలు రూపొందించుకోవడంలోనూ, రెవెన్యూ వ్యయ నియంత్రణలోనూ విఫలమైందని, అందుకే రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఇప్పుడు పెద్దల సభలో జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే సమాధానం ఇచ్చారు.ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో పూర్తిగా విఫలమైనదని కుండ బద్దలు కొట్టారు. ఏపీ ప్రభుత్వం రెవిన్యూ వ్యయాన్ని నియంత్రించలేక పోవడం వలన 14 ఆర్థిక సంఘం కాల వ్యవధి మొత్తంతో పాటు, 15 వ ఆర్థిక సంఘం తొలి సంవత్సరం 2020-21లోనూ రెవిన్యూ లోటు, గ్రాంటు మంజూరు చేసినా ఏపీ రెవిన్యూ లోటులో పెరుగుదల కనిపించిందని చెప్పారు, అంటే, ఏపీ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు చిట్కాలు సరిపోవని, శస్త్ర చికిత్స అవసరమని చెప్పకనే చెప్పారు.   నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కాదు, ఎప్పటినుంచో రాష్ట్ర వ్యవహారాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అదే మొత్తుకుంటున్నారు.  అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాటలు పట్టించుకోలేదు. అందిన మేరకు అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పందారం చేశారు. చివరకు ఇప్పుడు ఇక అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఎదురుకావడంతో లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిదున్ రెడ్డి, ఆదుకోండి ప్లీజ్ అంటూ కేంద్రాన్ని వేడుకున్నారు. నిజానికి, మిదున్ రెడ్డి ఇలా, లోక్ సభ వేదికగా కేంద్రాన్ని వేడుకోవడం,కన్నీరు కార్చడం ఇదే మొదటి సారి కాదు, ఇదే సమావేశాల్లో  ఇంతకు  ముందోసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు  జీతాలు ఇచ్చే పరిస్థితి కుడా లేదని, కేంద్రమే ఆదుకోవాలని ప్రధానిని వేడుకున్నారు. అలాగే, రాజ్యసభలో వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందని, కేంద్రమే ఆదుకోవాలని మొర పెట్టుకున్నారు.  అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక  పరిస్థితి అసలేం బాగులేదని అధికార పార్టీ సభ్యులు పార్లమెంట్ వేదికగా దేశానికి తెలియ జేయడం, ప్రభుత్వ స్పందన, ఇతర సంబంధిత పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కీలక నిర్ణయం ఏదో తీసుకునేందుకు సిద్ధంగా ఉందని,అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అటు నుంచి ఇటు నుంచి కూడా ఒకే సారి ఉభయ సభల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. అందుకే మిదున్ రెడ్డి ఆదుకోండని ప్రధాని మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్’ను వేడుకుంటూనే,రాష్ట్ర విభజన నాటి ముచ్చట్లు మొదలు, చాలా విషయాలు చెప్పు కొచ్చారు. ఏపీ ప్రజలకు ఇష్టం లేకున్నా యూపీఏ, ఎన్డీఏ కలిసి రాష్ట్రాన్ని విభాజించాయని, అదేదో నిన్నో మొన్నో జరిగినట్లు చెప్పు కొచ్చారు. విభజన హామీల ప్రస్తావన తెచ్చారు.  ముఖ్యంగా ఇంతవరకు గడచిన రెండున్నర సంవత్సరాలలో ఏనాడు మాట వరసకైనా మాట్లాడని ప్రత్యేక హోదా,పోలవరం ప్రాజెక్ట్ ప్రాస్తావన తీసుకొచ్చారు.ప్రత్యేక హోదా తప్ప మరో గత్యంతరం లేదని, ఇచ్చితీరాలనే అర్థం వచ్చేలా గొంతు పెద్దగాచేసి మరీ మాట్లాడారు. అలాగే, మిధున్ రెడ్డి, ఇంతకాలానికి ఎలా గుర్తించారో ఏమో కానీ,  పోలవరమ ప్రాజెక్ట్, ‘ఏపీ ప్రజల జీవన రేఖ’ అని గుర్తించారు. సవరించిన అంచనాలను ఆమోదించి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అన్నారు.  అంటే వినవస్తున్న మాటలు చోటు చేసుకుంటున్న  పరిణామాలను గమనిస్తే, ఏపీలో ఏదో జరగబోతోందని అనుమానించ వలసి వస్తోంది ..అదేమిటి ? ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీ విదిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోందా? లేక ఇంకేదైనా జరగబోతోందా .. ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్న .. రేపు ఏమి జరుగుతోందో  చూడవలసిందే అంటున్నారు విశ్లేషకులు.

మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త.. కేసీఆర్ ప‌రామ‌ర్శ‌..

ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా చేసిన వ్య‌క్తి. సుదీర్ఘ‌కాలం గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిన ఐపీఎస్‌. విభ‌జ‌న చిక్కుముడులను జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేశారు. కేంద్రానికి రాష్ట్రాల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌యక‌ర్త‌గా మెప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చాలా స‌న్నిహితంగా మెదిలారు. నెల‌కోసారి అన్న‌ట్టు.. సీఎం కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్ వెళ్లేవారు. న‌ర‌సింహ‌న్‌, కేసీఆర్ కుటుంబాల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండేవి. గ‌వ‌ర్న‌ర్‌గా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఏపీల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌.  గ‌వ‌ర్న‌ర్‌ ప‌ద‌వి నుంచి వైదొలిగాక‌.. త‌న సొంత రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులోని చెన్నైకే ప‌రిమిత‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి అక్క‌డే ఉంటున్నారు. తాజాగా, మాజీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుప‌త్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితం నరసింహన్ దంపతులకు కొవిడ్ సోకింది. నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక కోలుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ కొవిడ్ సింప్టమ్స్ తో నరసింహన్ ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది.  విష‌యం తెలిసి.. మంగ‌ళ‌వారం చెన్నైలో ఉన్న కేసీఆర్ న‌ర‌సింహ‌న్‌ను ప‌రామ‌ర్శించేందుకు హాస్పిట‌ల్‌కు వెళ్లారు. కానీ, ఐసీయూలో ఉండ‌టం, న‌ర‌సింహ‌న్ స్పందించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వైద్యులు ఆయ‌న‌ను క‌లిసేందుకు కేసీఆర్‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో, న‌ర‌సింహ‌న్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. క్షేమంగా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నరసింహన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల‌ని కోరారు.