DSPకి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్.. ఊ అంటారా? ఉలిక్కిపడతారా?
posted on Dec 18, 2021 @ 10:52AM
థియేటర్లలో పుష్ప హవా నడుస్తోంది. పుష్పరాజ్ మాస్ అప్పీల్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఐటం సాంగ్ అయితే కుమ్మేస్తోంది. సమంత 'ఊ' అనగానే.. ఆడియన్స్ అంతా ఊ ఊ.. అంటున్నారు. ఆ సాంగ్ ఎంత హిట్ అయిందో.. అంతే కాంట్రవర్సీగా మారింది. ఐటమ్ సాంగ్స్‌ను డివోషనల్ సాంగ్స్‌తో లింక్ చేస్తూ.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మంట రేపుతున్నాయి.
తాజాగా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్‌గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి స్లోకాలతో పోల్చటాన్ని ఖండించారు. దేవిశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. DSP వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
దేవిశ్రీ ప్రసాద్ అసలేమన్నారంటే..
ఇటీవల జరిగిన ‘పుష్ప’ ఈవెంట్‌లో దేవిశ్రీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ అన్ని తనకు డివోషనల్ సాంగ్సే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదాహరణకు పాడి చూపిస్తాను అంటూ తాను కంపోజ్ చేసిన రెండు ఐటెం సాంగ్స్‌కు డివోషనల్ లిరిక్స్‌తో ట్యూన్ కట్టి పాడి వినిపించారు కూడా.
ఆర్య 2లోని ‘రింగ రింగ..’ సాంగ్‌కు ‘నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వే తీర్చాలి స్వామి.. స్వామీ.. స్వామీ..’ అంటూ అదే ట్యూన్‌లో పాడారు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్‌కు కూడా ‘స్వామీ.. నేను కొండ ఎక్కాను, పూలు పళ్లు అర్పించాను.. ప్రసాదం తినేసి.. నా కష్టాలు తీర్చు స్వామి.. ఊ అంటావా స్వామి.. ఊ ఊ అంటావా స్వామి..’ అని పాడి వినిపించారు. పుష్ప స్పెషల్ సాంగ్‌ను ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ డివోషనల్‌కి మార్చి పాడుకున్నారంటూ దేవిశ్రీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. పాటని మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుందంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేవిశ్రీ ఇచ్చిన ఈ వివరణపైనే లేటెస్ట్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు కించపరిచారని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్.