సచిన్ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్.. థ్యాంక్స్ చెప్పిన టెండూల్కర్..
posted on Dec 18, 2021 @ 11:25AM
సచిన్ టెండూల్కర్. క్రీజ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. మైదానం వెలుపల అంత కూల్‌గా ఉంటాడు. చాలా సెన్సిటివ్ అంటారు. అలాంటిది ఇటీవల తన దగ్గరి స్నేహితురాలు ఒకామెకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అయితే, ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే స్పందించారు. ఆమెను ఆటోలో హాస్పిటల్‌కు తరలించారు. సమయానికి చికిత్స అందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని.. ప్రస్తుతం ఆవిడ క్షేమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.
తన ఫ్రెండ్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసి సచిన్ ఆందోళన చెందారు. అయితే, ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని.. ట్రాఫిక్ పోలీస్ సమయానికి హాస్పిటల్‌లో చేర్చడం వల్ల ప్రాణాపాయం తప్పిందని తెలిసి.. కాస్త ఊరట చెందారు. వెంటనే తన స్నేహితురాలిని ఆసుపత్రికి తరలించిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరా అని ఆరా తీశారు. ఆయన్ను స్వయంగా కలుసుకొని థ్యాంక్స్ చెప్పారు.
ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు సచిన్. ‘అలాంటి వారి వల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు. వారికి అభినందనలు. మనమంతా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం’ అని పోస్ట్ చేశారు.