పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులంతా పాస్! 

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాలపై తెలంగాణలో దుమారం రేపుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా గత సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు తెలంగాణ సర్కార్. అందరిని పాస్ చేస్తామని ప్రకటించింది. అయితే గత సెప్టెంబర్ లో మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. దీంతో స్టూడెంట్స్ షాకయ్యారు. క్లాసులు వినకుండా ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియక ఆందోళన పడ్డారు. సిలబస్ తగ్గించామని, అందరూ పాసయ్యేలా చూస్తామని బోర్డు అధికారులు చెబుతూ వచ్చారు. అయితే ఇటీలల విడుదల చేసిన ఫలితాల్లో 49 శాతం మంది మాత్రమే పాసయ్యారు.  ఇంటర్ ఫలితాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో కొందరు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడ్డారు. మరికొందరు సూసైడ్ ప్రయత్నాలు చేసి హాస్పిటల్స్ లో చేరారు. అందరిని పాస్ చేస్తామని చెప్పి.. ఫెయిల్ చేయడమేంటని విద్యార్థులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర రోజూ ఆందోళనలు జరుగుతుండటంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలు ఆడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని యోచిస్తోంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ 35 శాతం కనీస మార్కులు వేసి, పాస్‌ చేసే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ పరీక్షలను మొత్తం 4,59,242 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. పాసైన వారిలో 25 శాతం మంది విద్యార్థులు.. 75 శాతానికి పైగా మార్కులు సాధించారు. కనీస మార్కులు 35-50 శాతం మధ్య సాధించిన విద్యార్థులు 3 శాతం మంది మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఫెయిల్‌ అయిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి 5-10 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడం, 10వ తరగతిలో పరీక్ష రద్దు చేసి అందరినీ పాస్‌ చేయడమేనని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఫలితాలపై అధ్యయనం చేస్తోంది.    

గుజరాత్ లో మరోసారి భారీగా డ్రగ్స్ సీజ్.. ఏపీకి లింకులు ఉన్నాయా?

గుజరాత్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా రూ. 400 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పడవపై దాడి చేసిన భారత తీర రక్షణ దళం (ఐసీజీ), గుజరాత్ ఏటీఎస్  77 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.  డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు వంటి విషయాలను ఆరా తీస్తున్నారు. గత సెప్టెంబర్ లోనూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది.  ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోల హెరాయిన్  పట్టుబడింది. దాని విలువ రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. పట్టుబడిన హెరాయిన్ కు  ఏపీతో లింకులు బయటపడ్డాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్లలో వచ్చిన ఆ హెరాయిన్ సంచులు.. గుజరాత్‌  మీదుగా ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు లో రెండు కంటైయినర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అందులో బ్యాగుల్లో నింపిన పౌడర్ లాంటి పదార్థం కనిపించింది. ఏంటని ఆరా తీస్తే.. టాల్కమ్ పౌడర్ అని దాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు చెప్పారు. ఐనా అధికారులకు అనుమానం తొలగలేదు. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తే అది హెరాయిన్ అని తేలింది. అంత భారీ మొత్తంలో హెరాయిన్ ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు.  ఒక కంటైనర్‌లో 1999.579 కిలోల హెరాయిన్ దొరికింది. రెండో కంటైనర్‌లో 988.64 కేజీలు పట్టుబడింది. మొత్తంగా 2988.219 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్ఘాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ ఇరాక్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ముంద్రా పోర్టుకు తరలించారు. ముంద్రా నుంచి విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. ఆ డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ సంస్థ(కు వెళ్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, గుజరాత్‌లోని గాంధీ ధామ్, మాంద్వీలో అధికారులు సోదాలు చేశారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ.. విజయవాడలోని సత్యనారాయణపురంలోని గడియారంవారి వీధి అడ్రెస్‌తో 2020 ఆగస్టు 18న రిజిస్టరయింది. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు పేరిట ఈ కంపెనీని స్థాపించారు. బియ్యం, పప్పులు, పండ్లు, కూరగాయలు టోకు వ్యాపారం కోసం స్థాపించినట్లు పేర్కొన్నారు.  ఆషీ ట్రేడింగ్ కంపెనీ మూలాలు.. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకు విస్తరించి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన ఫోన్ నెంబర్ మాత్రం ఎం.సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. చెన్నై కేంద్రంగా ఈ కంపెనీని సుధాకర్ నెలకొల్పినట్లు తెలిసింది.

వరల్డ్ బ్యాడ్మింటన్ లో శ్రీకాంత్ కు రజతం.. తొలి ఇండియన్ గా రికార్డ్ 

స్పెయిన్ లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత ఆటగాడు, తెలుగు తేజం  కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22తో సింగపూర్ కు చెందిన లో కీన్ యూ చేతిలో వరుసగా గేముల్లో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్ లో పేలవంగా ఆడిన శ్రీకాంత్, రెండో గేములో పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన కీన్ యూ... ప్రపంచ విజేతగా అవతరించాడు. రజత పతకంతో సరిపెట్టుకున్నాడు  కిదాంబి శ్రీకాంత్. ఈ గేమ్‌లో శ్రీకాంత్ తీవ్రంగా పోరాడినప్పటికీ ప్రత్యర్థి కీన్ యూ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ చివరి వరకు పోరాడిన కిడాంబి.. ప్రత్యర్థి స్మాష్‌ల ముందు నిలవలేకపోయాడు. ఫైనల్లో ఓడిపోయినా శ్రీకాంత్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఈ వేదికపై భారత్‌కు ఇది రెండో పతకం. సెమీస్‌లో కిడాంబి చేతిలో ఓడిన లక్ష్యసేన్‌ ఇప్పటికే కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ రజతం సాధించాడు.  

జగన్ సర్కార్ అప్పుల తిప్పలు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల చిక్కుల్లో చిక్కుంది. నిజమే, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అప్పుల చిక్కుల్లో చిక్కుకోవడం ఏమిటి.. ఎప్పుడోనే అప్పుల ఊబిలో కూరుకు పోయింది కదా, అనచ్చును. కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కొత్తగా వచ్చి పడిన కష్టానికి, మరో అప్పు మార్గం కూడా కనిపించడం లేదు. దేశంలో ఈ స్థాయిలో అప్పులు చేసిన మరో రాష్ట్రం ఉందో లేదో కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం అవకాశం ఉన్నఅన్ని సోర్సెస్ నుంచి ఆఖరి పైసా వరకు అప్పు తెచ్చుకుంది. చివరకు ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సొమ్ములను, జగన్ రెడ్డి ఇంచక్కా పుచ్చేసుకుంది. ప్రభుత్వ శాఖల వద్ద, లక్ష రూపయలు ఉన్నా అవీ ఇచ్చేయండని ఉత్తర్వులు జారీచేసి మరీ తెచ్చేసుకుంది.  అంతకు ముందే  రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద అప్పుపుచ్చుకునే వెసులు బాటున్న మూడు అప్పు దారుల్లోంచి, రూ. 4,900 కోట్లు అప్పు తెచ్చుకుని బకాయి పడింది. ఇప్పుడు ఈ బకాయిల వసూలు కోసం ఆర్‌బీఐ అధికారులు జగన్ రెడ్డి ప్రభుత్వం మెడ్ మీద కత్తిపెట్టి వెంట పడుతున్నారు. ప్రస్తుతానికి అయితే, ఆర్‌బీఐ అధికారులు రోజూ ప్రోద్దున్నే సుప్రభాతం వినిపింఛినట్లు, నిష్ఠగా ఈ మెయిల్స్‌ పంపి అప్పు సంగతి గుర్తు చేస్తున్నారు. బకాయి సొమ్ము తక్షణం చెల్లించండి, లేదంటే రాష్ట్ర క్రెడిట్‌ రేటింగ్‌ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులకు ఫోన్లుచేసి అధికార బాషలో అక్షింతలు కూడా వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ  గౌరవ మర్యాదలు కొంత వరకే అని ఆ గీతదాటీతే, గతంలో కేంద్ర విద్యుత్ ఆర్థిక సంస్థల అధకారులు, ఏపీ అప్పుల వసూలుకు విజయవాడ వచ్చినట్లుగా, ఆర్‌బీఐ అధికారులు కూడా వచ్చినా రావచ్చని అంటున్నారు. ఇంతవరకు ఇక్కడ తెచ్చి అక్కడి అప్పు, ఆక్కడ తెచ్చి ఇక్కడి అప్పు సర్దుబాటు చేస్తూ వచ్చిన రాష్ట్ర అప్పుల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి కుడా  ఈ అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం కనిపించడం లేదు. అవకాశం ఉన్న మేరకు  అప్పులన్నీ నవంబరులోనే వాడేశారు. అన్ని శాఖల నుంచీ ఊడ్చి మరీ ఖర్చుపెట్టేశారు. రూ.1,000 కోట్ల అప్పును మాత్రం డిసెంబరు మొదటివారంలో తెచ్చి వాడారు. ఇక ఆ తర్వాత ఏ శాఖలోనూ నయాపైసా మిగల్లేదు. బ్యాంకుల వద్దకు వెళ్లే అప్పులివ్వడానికి అవి సవాలక్ష షరతులు పెడుతున్నాయి. దీంతో ఆ ప్రయత్నాలూ ఫలించలేదు. కేంద్రం కొత్త అప్పులకు అనుమతివ్వకపోవడంతో.. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి అప్పులు తెచ్చుకునే వెసులుబాటును రాష్ట్రం కోల్పోయింది.ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ అప్పు తీర్చేందుకు కొత్త అప్పు పుట్టే దారేది కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మునిగిపోతే అత్యవసరమైన అప్పులు కట్టేందుకు ప్రతి రాష్ట్రం ఆర్‌బీఐ వద్ద సింకింగ్‌ ఫండ్‌ జమ చేస్తుంది.  అయితే జగన రెడ్డి ప్రభుత్వం సికింగ్ ఫండ్’ని కూడా సక్రంగా నిర్వహించక పోవడంతో, టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఈఎస్‌డీఎల్‌ కింద ఆర్‌బీఐ నుంచి రాష్ట్రం రూ.2,200 కోట్లు తీసుకునే అవకాశం ఉండగా,  ప్రస్తుతం రూ.700 కోట్లు మాత్రమే తీసుకోగలుగుతోంది. దీనిఫలితమే రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.అయితే అన్నిటికీ మూలం, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక క్రమ శిక్షణ అటకెక్కించడమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.

డాక్టరుగా మారిన ఎమ్మెల్యే రోజా! 

సినీ నటి, ఫైర్ బ్రాండ్ లీడర్, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డాక్టరయ్యారు. చేతిలో స్టెతస్కోప్ పెట్టుకుని పలువురు చిన్నారులను పరీక్షించారు. ఆ తర్వాత తనకు డాక్టర్ అవ్వాలన్న కోరిక ఈ విధంగా తీర్చుకున్నట్టు సరదాగా వ్యాఖ్యానించారు.  ఆదివారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే రోజా . ఈ సందర్బంగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని పలువురు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ నార్మల్, షుగర్ నార్మల్ అంటూ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.  తనకు చిన్నవయసులో డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉండేదని ఈ సందర్బంగా రోజా అన్నారు. కానీ, డాక్టర్ కాలేక యాక్టర్‌ను అయినట్టు చెప్పారు. తిరుపతిలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్‌గా తాను పాస్ అయినట్టు చెప్పారు ఎమ్మెల్యే రోజా . ఆ తర్వాత వైద్య సీటు కోసం ప్రవేశ పరీక్ష కూడా రాశానని, కానీ తనకు సినిమాల్లో అవకాశం రావడంతో అన్నీ వదిలేసి ఈ సినిమా రంగంలోకి వెళ్లినట్టు చెప్పారు. రోజా డాక్టర్ గా మారడంతో ఆమెను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 

మళ్లీ పోరాటం.. టికెట్లు అలా... కిల్లర్ పాలిటిక్స్.. టాప్ న్యూస్@7PM

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏసీబీ కేసులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను కోట్లు సంపాదించలేదని... ఉద్యోగులు తమను నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. --- సినిమా టికెట్ల విక్రయాల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కంపెనీ ద్వారానే ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం జీవో 142ని ఆదివారం జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ జీవోని అమల్లోకి తీసుకొస్తునట్లు చెప్పింది. ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కు ప్రభుత్వం అప్పగించింది. --------- ఏపీలో రోడ్ల పరిస్ధితి అధ్వానంగా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. రెండున్నరేళ్లలో  ఏపీలో ఒక్క కిలో మీటరు రహాదారి కూడా వేయని దుస్ధితి ఉందన్నారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు వేయడానికే కాంట్రాక్టర్లు వెనకాడుతున్నారని చెప్పారు.కాంట్రాక్టర్లు ఎందుకు కోర్టుకు వెళ్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 420 ప్రభుత్వాన్ని చూసి బ్యాంకులు సైతం భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ---------- విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం  హాట్ హాట్ గా సాగింది. వైస్ చైర్మన్లను వేదికపైకి ఆహ్వానించడంపై ఎమ్మెల్యే కన్నబాబు రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టం లేకపోతే వెళ్లి పోతామని ఎమ్మెల్యే కన్నబాబు అవంతిపై  ఫైర్ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీలకు ప్రత్యేక చా౦బర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. --------- భవిష్యత్ అవసరాలకు విద్యుత్ కొరత రాకుండా ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యుత్ పొదుపు అన్నది ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలన్నారు. విద్యుత్ ను వేస్ట్ చేయడం అంటే భవిష్యత్ లో విద్యుత్ కొరతకు కారణమవుతున్నట్టేనని అన్నారు ----------- తెలంగాణలో మరోసారి పరీక్ష ఫలితాల కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2019లో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.గతంలో చేసిన తప్పిదాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదన్న విషయం తాజా ఫలితాలతో నిరూపితమైందని పేర్కొన్నారు.  --- వరంగల్ ప్రాంతంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వరంగల్ లో 3 సాహిత్య పాఠశాలలకు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలో వరంగల్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవిత చదివి వినిపించారు. అద్భుత కట్టడాలు, ఆలయాలకు నెలవు ఓరుగల్లు అని వివరించారు. ఈ ప్రాంతం గొప్పదనాన్ని యునెస్కో కూడా గుర్తించిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. --------- కేరళలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు అళప్పుజ జిల్లాలోనే జరిగాయి. తొలుత ఎస్డీపీఐ కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్ శనివారం రాత్రి హత్యకు గురికాగా... ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ ను చంపేశారు. హత్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  -------- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 40,000 సంవత్సరాల కిందట భారతీయుల డీఎన్ఏ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందని పేర్కొన్నారు. మనందరి పూర్వీకులు ఒక్కరేనని వ్యాఖ్యానించారు. పూర్వీకుల వారసత్వంగా భారతదేశం వికసించిందని, సంస్కృతి కొనసాగుతోందని వివరించారు. ఈ విషయంలో తానేమీ ఆడంబరాలు పలకడంలేదని స్పష్టం చేశారు. --------- పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఏడాది ఫిలిప్సీన్స్ ను తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్ ఇదే. దీని ధాటికి 112 మంది మరణించారు. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 8 లక్షల మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం నేడు వివరాలు వెల్లడించింది.ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా రాయ్ విధ్వంసం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి.

గులాబీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబుల్.. కేసీఆర్ సర్వేలో ఏముందో?  

తెలంగాణ రాజకీయాలలో తెరాస ఆధిపత్యానికి రోజులు చెల్లాయా?పార్టీ అధినాయకత్వంలో ముందున్న ధీమా ఇప్పుడు సన్నగిల్లిందా? ఓటమి తప్పదేమో అన్న భయం తెరాస నాయకత్వాన్ని వెంటాడుతోందా? అంటే అన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా, తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రసంగంలో ఒక విధమైన బేల తనం, భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి హుజూరాబాద్ ఓటమితోనే కేసీఆర్’లో కలవరం మొదలైంది,ఇక అక్కడి నుంచి బయటకు ఎన్ని బింకాలుపోయినా, లోపలి భయం మాత్రం గుండెలను తాకుతోందని, అదే బేలతనం, భయం తెరాస విస్తృత స్థాయి సమావేశంలో వ్యక్తమైందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు జ‌నంలోనే ఉండాల‌ని, ఆదేశించార‌ని అంటున్నారు.  ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రజల్లో రోజురోజుకు ప్రభుత్వం పట్ల వ్యతిరేత పెరుగుతోందని, అన్ని వర్గాలలో అసహనం ఎక్కువ అవుతోందని, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని, ప్రజలు తమను నిలదీస్తున్నారని అంటున్నారు. దీంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తమ ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా తమ పరిస్థితి మారింద‌ని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు పోతారని వార్తల నేపధ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి, మరో వంక టికెట్ వస్తుందో రాదో అన్న సందేహం, ఈ అన్నిటినీ మించి ప్ర‌జ‌ల్లో క్‌రమంగా వేగంగా పెరుగుతున్న వ్య‌తిరేక‌తతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులలో గుబులు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, వరి పంట కొనుగోలు విషయంలోకేంద్ర ప్రభుత్వంపై  యుద్ధం ప్రకటించడం, ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వెనక్కి రావడం,ఇప్పుడు మళ్ళీ మంత్రులనుఢిల్లీకి పంపి కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించడం, గతంలో కేంద్రంతో సంబంధం లేకుండ చివరి  గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ కొనదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కిలో ఒడ్లు కూడా కొనదని ప్రకటించడం, ఇలా దొడ్లో దూడని కట్టేసి సంతలో బేరం ఆడినట్లు, పొంత లేని ప్రకటనలు చేయడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వం మీద గుర్రుగ ఉన్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు.నిజానిజాలు ఎలా ఉన్నా  రైతులకు సమాదానం చెప్పుకోవలసింది, రాష్ట్ర ప్రభుత్వమే కానీ, కేంద్రం కాదని ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.    ఇదిలా ఉంటే ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్ల‌యినా ఏ కార్య‌క్ర‌మం కూడా స‌రిగ్గా అమ‌లు కాక‌పోవ‌డం.. ముఖ్యంగా దళితబందు అమ‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డి మాదిరిగానే ఉండ‌డంతో జ‌నాల్లో తిరిగేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారని అంటున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి రాజకీయ ఎత్తుగడలు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ఎలుకకు ప్రాణ సంకటంగా మారిందని అంటున్నారు.

జగన్ ఓడిపోతారన్న వైసీపీ నేత మిస్సింగ్! ఒంగోలులో కలకలం...

ఆ ముగ్గురి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు లాస్.. ఇలాగైతే జగన్ గెలవడం కష్టమంటూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వైసీపీ నేత సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం సుబ్బారావు ఆచూకీ లభ్యం కావటం లేదు. కుటుంబ సభ్యులు సుబ్బారావుకు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. తమ కుటుంబానికి సుబ్బారావు ఒక్కరే ఆధారమని ఆయన భార్య గుప్తా నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు ఏమైందోనని ఆందోళన చెందుతోంది. తన భర్త ఆచూకీ కోసం ఎదురు చూస్తోంది. మంత్రి కొడాలినానిపై సుబ్బారావు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. రాత్రి వైసీపీ కార్యకర్తలు సుబ్బారావు ఇంటిపైదాడికి సైతం పాల్పడ్డారు. ఆ సమయంలో సుబ్బారావు ఇంట్లో లేకపోవటంతో బైకు తదితర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం సుబ్బారావు కుటుంబ సభ్యులను దుర్బాషలడుతు వారిని భయబ్రాంతులకు గురిచేశారు. కొడాలి నానిని విమర్శించే స్థాయి మీకెక్కిడిదంటూ దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వైసీపీ నేతలే ఆయన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారా లేక దాడులు చేస్తారామోనని భయపడి సుబ్బారావే ఎక్కడైనా దాక్కున్నారా అన్నది తెలియడం లేదు.  ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు’’ అని సుబ్బారావు వ్యాఖ్యానించారు.

ఒమిక్రాన్, డెల్టా కలిస్తే సూపర్ వేరియంట్‌! అదే జరిగితే పెను విలయమే?

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.  ప్రపంచంలోని 89 దేశాలకు పాకేసింది.  కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కారణంగా ఒమిక్రాన్  కేసులు 1.5 నుండి 3 రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈ సమాచారాన్ని వెల్లడించింది. డెల్టా కంటే ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందనడానికి ఆధారాలు ఉన్నాయని సభ్య దేశాలకు ఇచ్చిన సాంకేతిక సమాచారంలో తెలిపింది. అలాగే జనాభాలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది.  ఒమిక్రాన్, డెల్టా స్ట్రెయిన్ ఎవరికైనా సోకితే, కరోనా కొత్త సూపర్-వేరియంట్ ఏర్పడుతుందని మోడర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాల్ బర్టన్ చెప్పారు. యూకేలో డెల్టా, ఓమిక్రాన్ వ్యాప్తి వేగం సూపర్-వేరియంట్ భయాలను పెంచింది. రెండు వైరస్‌లు కలిసి జన్యువులను పంచుకోగలవని, మార్పిడి చేయగలవని ఆయన చెప్పారు. డాక్టర్ బర్టన్ మాట్లాడుతూ, సాధారణంగా మానవులకు కరోనా ఒక ఉత్పరివర్తన జాతి మాత్రమే సోకుతుందని.. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో, రోగికి ఒకేసారి రెండు జాతులు సోకుతాయని చెప్పారు. డెల్టా, ఒమిక్రాన్ రెండూ ఒకే కణానికి సోకినట్లయితే, అవి ఒకదానితో ఒకటి డీఎన్ఏ మార్పిడి చేసుకోవచ్చు. ఈ రెండూ కలిస్తే, కరోనా కొత్త సూపర్ స్ట్రెయిన్ ఏర్పడే ఆవకాశాలు ఉంటాయని డాక్టర్ బర్టన్ వివరించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు మధ్య భారతదేశంలో మూడో వేవ్‌కు దారి తీస్తుందనే షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ ప్యానెల్ ప్రకారం, ఫిబ్రవరి నాటికి దేశంలో మూడవ కరోనా వేవ్‌ను Omicron రూపంలో చూడొచ్చని తెలుస్తోంది. ఈ నెలలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరిలో దేశంలో కరోనా మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్యానల్ హెడ్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ చెప్పారు. అయితే, ఇది రెండో వేవ్ కంటే ఎక్కువ ప్రమాదకరం మాత్రం కాదన్నారు. ఫిబ్రవరిలో కొత్త రోగులు రెండవ వేవ్ సమయంలో కంటే తక్కువగా ఉంటారని తెలిపారు. నవంబర్ 26న  ఒమిక్రాన్ ను ఆందోళనకర వైవిధ్య స్థితిగా డబ్ల్యుహెచ్‌ ప్రకటించింది. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రస్తుతానికి ఇంకా తెలియదని డబ్ల్యుహెచ్‌వో చెబుతోంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ గురించి చాలా తక్కువ డేటా అందుబాటులో ఉందనీ, దాని ప్రకారం ఏదైనా చెప్పడం కష్టమనీ డబ్ల్యుహెచ్‌వో అంటోంది. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ ప్రభావానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రాలేదు. కరోనా మునుపటి వేరియంట్‌ల వలె ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదనే విషయం ఒక్కటే ఏకైక ఉపశమనం అని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. అయితే ఇది వ్యాప్తి చెందుతున్న వేగాన్ని బట్టి, మాస్క్‌లు, శానిటైజేషన్ సోషల్ డిస్టెన్స్ చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందని డబ్ల్యుహెచ్‌వో చెబుతోంది. 

మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. హాట్ హాట్ గా విశాఖ జడ్పీ మీటింగ్ 

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. అసమ్మతి స్వరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత.. మంత్రి బాలినేని ముందే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతల తీరు బాగా లేదని చెప్పారు. ఇలాగైతే పార్టీ మరోసారి గెలవడం అసాధ్యమని చెప్పారు. కర్నూల్ జిల్లాలో ఏకంగా జడ్పీ చైర్మెనే రాజీనామా చేశాడు. తన భావమరిదికి పదవి కోసం ఎమ్మెల్యే ఒత్తిడి చేయడం వల్లే జడ్పీ చైర్మెన్ సుబ్బారెడ్డి రాజీనామా చేశారనే ప్రచారం జరగుతోంది. ఈ ఘటనలు వైసీపీలో కలవరం రేపుతుండగానే.. తాజాగా విశాఖ జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.  విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఫైరయ్యారు. సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ జెల్లి సుభద్ర అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.అయితే వైస్ చైర్మన్లను వేదికపైకి ఆహ్వానించడంపై ఎమ్మెల్యే కన్నబాబు రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టం లేకపోతే వెళ్లి పోతామని మంత్రి వంతిపై  ఫైర్ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీలకు ప్రత్యేక చా౦బర్లు కేటాయించాలని ఎమ్మెల్యే కన్నబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటన సమావేశంలో కాక రేపింది. ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్సే కన్నబాబురాజును ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూల్ చేసే ప్రయత్నం చేశారు.    

కేసీఆర్ ను టార్గెట్ చేసిన జై భీమ్ చంద్రు.. ఏమన్నారంటే? 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జై భీమ్ ఫేమ్ జస్టిస్ చంద్రు.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పాలన, కేసీఆర్ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్‌ని హెచ్చరించారు జస్టిస్ చంద్రు. అలాంటి వాళ్లకే ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.  ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందన్నారు జస్టిస్ చంద్రు. సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించారని చెప్పారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ప్రశ్నించారు.కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలన్నారు. జలహక్కులకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని జస్టిస్ చంద్రు చెప్పారు.  జై భీమ్ సినిమా  తనకు ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందని, ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో గజగజ.. హైదరాబాద్ లో 10 ఏళ్ల కనిష్ట టెంపరేచర్ 

తెలుగు రాష్ట్రాలను చలి గజ గజ వణికిస్తుంది చలి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్యం నుంచి చలిగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో వచ్చే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్న ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.  హైదరాబాద్‌లో శనివారం దశాబ్దంలోనే డిసెంబర్‌ నెలలో అత్యంత చలిరోజుగా రికార్డయింది. సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉదయం అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కి.మీ. ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. దీంతో రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. విశాఖ మన్యంలో వారం రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 4.1 డిగ్రీలు, చింతపల్లిలో 5.8, మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రోడ్లపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్ రేచుక్క రేవంత్.. ‘కారు’ ప్రత్యాన్మాయం చెయ్యే..

రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్ష  బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ‘దూకుడు’ కు పర్యాయ పదంగా, బ్రాండ్ అంబాసిడర్’గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సారధ్యంలో గడచిన ఐదారు నెలల్లో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అందులో సందేహం లేదు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసకు  అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను తీసుకోవడంలో అయితే నేమి, జాతీయ పార్టీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అయితే నేమి, రేవంత్ రెడ్డి తమదైన ముద్రను వేశారు.  అందుకే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న చరిత్రను చూస్తే, రేవంత్ రెడ్డికి ముందు రేవంత్ రెడ్డి తర్వాత అనే విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులే కాదు, రాజకీయ ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తున్నారు.  అంత‌కు ముందు వ‌ర‌కు తాబేలు న‌డ‌క‌లా ఉన్న పార్టీ రేవంత్ వ‌చ్చిన త‌ర్వాత కుందేలు ప‌రుగులా మారింది. ఒక విధంగా చూస్తే  వ‌రుస స‌మావేశాలు.. స‌భ‌లు.. ర్యాలీల‌తో రేవంత్ రెడ్డి  వృద్ధ కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించి దూకుడు నేర్పించారు అనవచ్చును. పార్టీలో వచ్చిన మార్పును ప్రత్యక్ష్యంగా చూస్తున్నపార్టీ నాయకులు, మీడియా విశ్లేషకులు. నిజానికి, హుజూరాబాద్ ఘోర ఓటమి తర్వాత ఎదురైన చేదు అనుభవాల నేపధ్యంలో రేవంత్ రెడ్డి కాకుండా మరొకరు అయ్యుటే, కాడి వదిలి పరిపోయే వారని కూడా కొందరు పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే ఈ ఐదారు నెలల కాలంలోనే గిరిజన దళిత దండోరా, విద్యార్ధి, నిరుద్యోగ సైరన్ మొదలు అనేక వినూత్న ఆందోళన కార్యక్రమాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి, తాజాగా నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చేపట్టిన ఒకరోజు నిరసన పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మరోమారు విశ్వరూపాన్ని చూపారు. కేంద్ర, రాష్ర్ం ప్రభుత్వాలను తూర్పార పట్టారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ  తోడు దొంగలు. ఇద్దరూ  కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్నారు, అని ధ్వజ మెత్తారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు గడచిన ఎనిమిదేళ్ల పాలనలో రూ.32 లక్షల కోట్ల పన్నుల భారం మోపారని, 2014లో 60 రూపాయలు ఉన్నలీటరు పెట్రోలు ధర్ ఇప్పుడు రూ.110 దాటింది, గ్యాస్‌ సిలిండర్‌ రూ.450నుంచి వెయ్యి రూపాయలకు చేరిందని, ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించి, ప్రజలను ఆలోచింప చేస్తున్నారు.   మరోవంక క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ప్రత్యేక  దృష్టి నిలిపారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా డిసెంబ‌రు 9 నుంచి జాతీయ  స్థాయిలో చేపట్టిన పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంపై రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. జనవరి 26 నాటికీ 30 లక్షల సభ్యత్వం లక్ష్యంగా  డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్నిచేపట్టారు. ప్ర‌తీ బూత్‌లో 100 మందికి స‌భ్య‌త్వం అందించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న శ్రేణులు ఈ దిశ‌గా ముందుకు క‌దులుతున్నాయి.పీసీసీ చీఫ్ రేవంతే స్వ‌యంగా పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని స‌మీక్షిస్తున్నారు. పీసీసీ చీఫ్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా సభ్యత్వ లక్ష్యాలను అధిగమించి ముందుకు సాగుతున్నారు.  ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉట్నూర్ మండ‌లం దంత‌న్‌ప‌ల్లికి చెందిన బూత్ ఎన్‌రోల‌ర్ మ‌హ్మ‌ద్ మోబిన్ త‌న‌కు కేటాయించిన బూత్‌లో 251 స‌భ్య‌త్వాలు చేయించారు. అనుకున్న దానికంటే రెండొంతులు ఎక్కువ సభ్యత్వం చేయించిన మోబిన్ కి రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉన్నాయి అంటున్నారు. అయితే అన్నీ ఉన్న అల్లుడినోట్లో శని అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తున్న అంతర్గత కుమ్ములాటలు, సీనియర్, జూనియర్ తగవులు పార్టీకి కొంత తలనొప్పిగా మారాయని పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో కొందరు అధికార పార్టీకి కోవర్టులుగా మారి పార్టీకి నష్టం చేతున్నారని, అద్దంకి దయాకర్ వంటి కొందరు నాయకులు సైతం అవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే  ప్రజల్లో మాత్రం తెరాసకు ప్రత్యాన్మాయం అంటే కాంగ్రెస్సే అన్న అభిప్రాయం స్థిరంగా ఉందని అంటున్నారు.

జగన్ గల్లంతే.. ఆ ముగ్గురితో 20 శాతం ఓట్లు లాస్! వైసీపీ నేత సంచలనం..

జగన్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టేనా? ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టేనా? అంటే వైసీపీ నేతలే అవునని చెబుతున్నారు. ఏదో అంతర్గత సమావేశాల్లో కాదు బహిరంగ సభల్లోనే ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు ఏమన్నారంటే.. ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద వీరుడంటారు. అప్పట్లో 35 వేలతో ఓడిపోయాడు. మొన్న జగనన్న వేవ్‌తో మళ్లీ గెలిచాడు. జనసేన పార్టీ ఆడవాళ్ల జోలికిపోయాడు. చివరకు విజయసాయిరెడ్డిని కొట్టేకాడికి జనసేన పార్టీ వాళ్లు వచ్చారంటే మనం చేసిన చెడ్డ పనులు వల్లనే. పార్టీలో ఉంటూ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పార్టీకి మిత్రులా, శత్రువులా, కోవర్టు ఆపరేషనా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పనిచేస్తే పార్టీతో పాటు అందరికీ మేలు జరుగుతుంది. ఇదేవిధంగా వ్యవహరిస్తే తీవ్ర నష్టం ఖాయం. ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు' అని సుబ్బారావు అన్నారు. " పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా నేను వాసన్న, జగనన్న అభిమానిగా ఉంటాను. నాలాగా అందరూ ఎందుకు ఉంటారు. సమర్థులకు పదవులు లేవు వాసన్నా (బాలినేని).. నీ చుట్టూ తిరుగుతూ పొగడేవాళ్లకే ఇస్తున్నారు. నీ వెంట ఉన్నవారినే నాయకులు, కార్యకర్తలుగా గుర్తిస్తున్నారు. నీకోసం కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తే భవిష్యత్‌ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉంటూ మీకు చెప్పేందుకు భయపడుతున్నారు. నాకు ఎలాంటి భయంలేదు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా తెలుసుకొని మేల్కోవాలి. ఓడిపోతే కార్యకర్తలు ఇబ్బందులు పడతారు. ఈసారి పాదయాత్ర కూడా చేయనివ్వరు. నాయకుల మాటలతో ఓట్లు పోతాయి. ఇక పార్టీలో ఎవరూ ఉండరు. ఈ విషయాలను చెప్పేందుకు అందరూ భయపడుతున్నారు. అయినా నేను ఈ వీడియోను ముఖ్యమంత్రి పేషీకి కూడా పంపుతాను. నాపై కాకుండా, తప్పు చేసే వాళ్లపై యాక్షన్‌ తీసుకుంటే పార్టీ బాగుపడుతుంది. పార్టీని కాపాడుకునేందుకు ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకొకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది’’ అని సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల వీడియో హల్‌చల్‌ చేస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ టెన్షన్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు? 

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఒక కేసు నమోదు కాగా.. తెలంగాణలో ఏకంగా 20 ఒమిక్రాన్ కేసులు నిర్దారణ అయ్యాయి. శనివారం ఒక్కరోజే తెలంగాణలో 12 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇందులో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారే 9 మంది ఉండటం మరింత ఆందోళన కల్గిస్తొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పండుగల సందడి కనిపిస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉండగా.. ప్రస్తుతం ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండనే ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి. ఈ పండుగల కోసం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు డిసెంబర్, జనవరిలో విదేశాల నుంచి వేలాది మంది వస్తారు. ఇదే ఇప్పడు వైద్య వర్గాల్లో ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోజు వేలాదిమంది విదేశీ యాత్రికులు వస్తుండటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది.  ఒమిక్రాన్​ ప్రబలుతున్న నేపథ్యంలో న్యూ ఇయర్​ వేడుకలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం ప్రారంభానికి ప్రతీ ఏడాది నిర్వహించే స్పెషల్​ ఈవెంట్స్​, పార్టీలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అని సర్కార్​ డైలమాలో ఉన్నది. పార్టీలు, బార్లు, పబ్ లు​, స్టార్​ హోటళ్లు, ఫంక్షన్​ హాల్స్​లో పెద్ద ఎత్తున ఏర్పడే జనసమూహాలతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులను గమనిస్తే కూడా మరో ముప్పు చూడాల్సి వస్తుందేమోనని ప్రజలతో పాటు అధికారులూ భయాందోళనకు గురవుతున్నారు.  ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్​వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అంతేగాక క్రిస్మస్, సంక్రాంతి​ పండుగ వేడుకలకూ గ్రూప్​ గేదర్స్​ కట్టడి చేసేందుకు ఫ్లాన్​ చేస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు, వైద్యశాఖ హెచ్​ఓడీలు, ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. వివిధ శాఖలు, విభాగాలు వారీగా కరోనా పరిస్థితులు, ముందస్తు, కట్టడి చర్యలు, ప్రజల నుంచి వచ్చే ఫీడ్​బ్యాక్​ ఆధారంగా ఒక్కో శాఖ నుంచి గవర్నమెంట్​కు నివేదిక వెళ్లనున్నది. దాని ఆధారంగా న్యూ ఇయర్​, ఇతర పార్టీలు, ఫంక్షన్లు, జనసముహాల కార్యక్రమాల నియంత్రణ దిశగా సర్కార్​ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.  గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం కరోనా కేసులు నిలకడగా ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చిన వేరియంట్​ ఒమిక్రాన్​ వ్యాప్తి ఏకంగా ఆరు రెట్లు అదనంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో గత ఏడాదిలానే ఆంక్షలు విధిస్తే బెటర్​ అని కొందరు ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అభిప్రాయాలను సర్కార్ కు వివరించినట్లు​ ఓ అధికారి తెలిపారు. గత సంవత్సరం లానే డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వకుండా కట్టడి చేస్తే వ్యాప్తిని తగ్గించవచ్చని సీనియర్​ డాక్టర్లు, సైంటిస్టులు కూడా ప్రభుత్వానికి అంతర్గతంగా చెప్పినట్లు తెలుస్తోన్నది. దీంతో  ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నది. మరోవైపు డిసెంబరు 31న రాత్రి మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపితే కూడా కొంతవరకు మేలు జరుగుతుందని మరి కొంతమంది అధికారులు ఇటీవల సెక్రటేరియట్​ లో జరిగిన ఉన్నతాధికారుల మీటింగ్​లో అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ప్రాథమికంగా ఆంక్షలు విధించే వైపే సర్కార్​ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మద్యపాన నిషేధం తూచ్! మడమ తిప్పడమే జగన్ రూట్

నేను విన్నాను.. నేను చూసాను.. నేను ఉన్నాను.. 2019 సార్వత్రిక ఎన్నికల్ల ప్రచారంలో జగన్ రాష్ట్ర మంతా చెప్పిన మాట ఇది. మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేది ఇది కూడా ఆయన ఊత పదం. ఈ ప్రచారమే ఆయనకు కలిసొచ్చిందని అంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా హామీలు ఇచ్చారు జగన్ రెడ్డి. అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. జగన్  ప్రదాన వాగ్దానం లొ మద్యపాన నిషేధం ఒకటి. అయితే అధికారంలోకి వచ్చాకా తానిచ్చిన హామీలపై ఒక్కొక్కటిగా మడమ తిప్పేస్తున్న జగన్,, తాజాగా మద్యపాన నిషేధం వాగ్దానాన్ని  పుర్తిగా గాల్లొ కలిపేశారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు భారిగా తగ్గే అవకాశం ఉంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్‌) రకం మద్యంపై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గేందుకు అవకాశాలు  ఉన్నాయి.మొత్తం మీద15 నుంచీ 20శాతం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యపాన నిషేదం ఎన్టీఆర్ తరహాలొ జరుగుతుందని చిన్న, మద్యతరగతి మహిళలు పుర్తిగా విశ్వసిసించారు. జగన్ భారీ మెజారిటీతో గెలవడానికి మద్యపాన నిషేధం ప్రదాన మని చెప్పవచ్చు. అనుకున్నట్టుగానే జగన్ ప్రభుత్వం వచ్చింది. తొలినాళ్ళలో మద్యపాన నిషేధం జరుగుతుందని అందరూ ఎదురు చూసారు. కాని జగన్ తెలివిగా అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అని ప్రకటించారు. మద్యపాన జరగాలంటే అధిక రేట్లు పెంచడం ఒక్కటే మార్గమని దాని వల్ల తాగేవారి సంఖ్య తగ్గుతుందని జనాన్బి నమ్మించారు. ఇలా కొంతకాలం అధిక దరలకు అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. కాలం గడిచేకొద్ది ప్రజలకు అనుమానం రాకుండా బెల్ట్ షాపులు తగ్గించారు.. మిల్లీ రేట్లు పెంచారు. రకరకాల బ్రాండ్లు మార్కెట్లోకి తెచ్చి విచ్చలవిడిగా విక్రయాలు చేసారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన నగరాల్లో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసారు. మద్యపాన నిషేధం సంగతి దేవుడెరుగు మద్యం అమ్మకాల వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసారు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ధరలు పెంచటమే కాకుండా ఎప్పుడూ విననీ చుడని బ్రాండ్లు దింపేసారు‌ దీంతో పక్క రాష్రమైన తెలంగాణ  మద్యం కు మంచి గిరాకీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లొ పొరుగు రారాప్టం మద్యం ఏరులై పరడంతొ ఇప్పుడు ఆ సాకు చూపి మద్యం రేట్లు తగ్గించే దిశగా అడుగులు వేసారు. దింతీ ఇక మద్యపాన నిషేధం  పుర్తిగా లేనట్టెనని చెప్పకనే చెప్పింది జగన్ సర్కార్. మద్యపాన నిషేదంపై ఆశలు పెట్టుకున్న మహిళలను ఇప్పటి వరకు కన్ఫ్యూష్ చేస్తూ కాలయాపన చేసి ఇప్పుడుయయ ఇక మద్యపాన నిషేధం లేదనే సంకేతాలు పంపింది జగన్ సర్కార్. దీంతో ఇంతన్నాడు జగనన్న నట్టేల్లొ ముంచేసాడు అని తెగ చెర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళామనులు. 

తెలంగాణలో డేంజర్ బెల్స్.. 20కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 12 ఒమిక్రాన్ కేసులు నిర్దారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి పెరిగింది. శనివారం ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారంతా విదేశాల నుంచి తెలంగాణ వచ్చినవారే.  తాజాగా ఒమిక్రాన్ సోకిన వారిలో తొమ్మిది మంది ఫారినర్స్ కాగా.. ముగ్గురు ఇండియన్స్. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించగా..మిగితా పది మంది నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్లు కావడం మరింత ఆందోళన కల్గిస్తోంది. శనివారం ఒమిక్రాన్ నిర్దారణ అయిన వారిలో కెన్యా నుంచి వచ్చిన వాళ్లు ఆరుగురు కాగా, సోమాలియా 2, యూఏఈ ఇద్దరు, ఘనా, టాంజానియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.  ఇక కెన్యా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ఒమిక్రాన్ రోగి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు చివరికి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాహి ఇబ్రహీం అనే 44 ఏళ్ల వ్యక్తి డిసెంబరు 14న హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్ పోర్టులో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అతడు టోలీచౌకిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి చూడగా, అతడు కనిపించలేదు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తీవ్రస్థాయిలో వేట సాగించిన పోలీసులు... అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ లో అతడిని పట్టుకున్నారు.అనంతరం ఆ కెన్యా దేశస్తుడిని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు.  

డిసెంబర్ 28 నుంచి రైతు బంధు.. దళిత బంధుకు నో ఫండ్స్! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెల 28 నుంచి రైతు బంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రారంభించిన పది రోజుల్లోనే అందరికీ నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో డిసెంబర్  28 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమకానున్నాయి. గతంలో మాదిరిగానే భూమి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ నగదు జమచేయనున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా జిల్లాల డేటాను ప్రభుత్వానికి అందజేశాయి. మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన ఉండాలన్నారు. నూతన జోనల్ వ్యవస్థతో ఇది అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ స్పష్టంచేశారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ... దళిత బంధుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధును ప్రవేశపెట్టారు. ఉప ఎన్నిక కోసమే తీసుకొచ్చారనే విమర్శలు రావడంతో  రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు. ఉప ఎన్నిక ముగియగానే నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. కాని ఆరు వారాలు గడిచినా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు. దీంతో కేసీఆర్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి అనుకున్నట్లే జరుగుతోందని, హుజురాబాద్ ఎన్నిక కోసమే దళిత బంధు ప్రకటించారని చెబుతున్నాయి. దళిత ఉప ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూ పంపిణి లాగే దళిత బంధు కూడా అటకెక్కుతుందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయని గ్రహించారో ఏమో కలెక్టర్ల సమావేశంలో దళిత బంధుపై మాట్లాడారు సీఎం కేసీఆర్. రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.10 లక్షల సాయం, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తుందన్నారు. దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే నిధుల విషయం మాత్రం చెప్పలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా వెల్లడించలేదు. దీంతో నిధులు లేకుండా దళిత బంధును ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న లిక్కర్ ధరలు

మద్యం విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిందివ్యాట్, ఎక్సైజ్ పన్ను, ప్రత్యేక మార్జిన్ ల అంశంలో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్లపై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గే అవకాశముంది. ఇతర అన్ని కేటగిరీలపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.  అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధరల తగ్గింపు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వచ్చేవారం నుంచి రాష్ట్రంలో ప్రముఖ సంస్థల బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం మద్యం వినియోగం తగ్గిందని రజత్ భార్గవ వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు