జేసీతో జగన్ కి చెక్!
posted on Aug 24, 2012 @ 9:18PM
ఏపీలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై వై.ఎస్ మార్క్ ని తొలగించేందుకు ఆమె విశ్వప్రయత్నం చేస్తున్నారు. కిందటి ఉపఎన్నికల్లో వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనంలో
దక్కిన ఆదరణ చూశాక సోనియాకి కంటిమీద కునుకురావడంలేదు. ఎలాగైనా ఏపీలో జగన్ కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిని మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో అధిష్ఠానం పరిశీలనలో ఉన్న పోటీదారుల లిస్ట్ లో రాయలసీమ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ పార్టీకి , జగన్ వర్గానికి చెక్ పెట్టాలంటే కాస్త గట్టి ప్రత్యర్థినే ఎంపికచేయాల్సుంటుందని సోనియా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో కిరణ్ కుమార్ రెడ్డి జరుపుతున్న సీరియస్ చర్చలు ప్రచారంలో ఉన్న ఊహలకు రెక్కలు మొలిపిస్తున్నాయి. ఏదెలా ఉన్నా..జగన్ వర్గాన్ని గట్టిగా ఎదుర్కోవడానికే అధిష్ఠానం ఇష్టపడుతుందని పార్టీలో సీనియర్లు అంటున్నారు.