చంద్రబాబు ముందస్తు ఎన్నికల యాత్ర

 

చంద్రబాబు పాదయాత్ర పల్లెలగుండా సాగుతోంది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే చంద్రబాబు చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తున్నారు. ఎప్పుడూ విక్టరీ సింబల్ ని సూచించే రెండువేళ్లని చూపించే ఆయన ఇప్పుడు రెండు చేతులూ జోడించి నమ్రతగా తనని చూసేందుకొచ్చినవాళ్లకు నమస్కారం చేస్తున్నారు. చంద్రబాబులో చాలా మార్పు కనిపిస్తోంది. గ్రామీణుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకునేందుకు ఆయన చాలా కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందే చంద్రబాబు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, తనని చూడడానికి వచ్చేవాళ్లని ఎలా పలకరించాలి, ఏమేమి హామీలు ఇవ్వొచ్చు, ఎలా ప్రజాభామానాన్ని చూరగొనచ్చు అనే అంశాలమీద విస్తృత స్థాయిలో రీసెర్చ్ చేసినట్టు సమాచారం. గతంలో పార్టీ లీడర్లందరికీ వరసపెట్టి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పించిన చంద్రబాబు, తనుకూడా క్లాసులకు హాజరయ్యారు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకునేందుకు అప్పట్లో తహతహలాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సంపాదించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి బాబు ఏం చేసినా పక్కా ప్లాన్ తోనే చేస్తారు. కార్యరంగంలోకి దిగేముందు విషయంమీద గట్టి కసరత్తు చేస్తారు. నిపుణుల సలహాల్నికూడా జోడించి బాగా వర్కవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు పాదయాత్రకి వస్తున్న జనాన్ని చూస్తే చంద్రబాబు ఛరిష్మా ఇంకా తగ్గలేదనే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటుబ్యాంక్ బలపడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని పార్టీవర్గాల అంచనా...

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.