పాదయాత్రలో చంద్రబాబు డబుల్ సెంచరి
posted on Oct 13, 2012 @ 10:24AM
చంద్రబాబు పాదయాత్రలో డబుల్ సెంచరి పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో బాబు 200 కిలోమీటర్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రేణుమాకులపల్లిలో ఆయన ఈ మైలురాయిని అధిగమించారు. ”వస్తున్నా మీకోసం” అంటూ భద్రత గురించి కూడా భయం లేకుండా చంద్రబాబు అందరితో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ జిల్లాలో హిందూపురం, పెనుగొండ, రాప్తాడు, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సుమారు 90 గ్రామాలు సందర్శించారు. రేణుమాకులపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచిత విద్యుత్ పేరిట కాంగ్రెస్ మోసం చేస్తు౦దని, వ్యవసాయానికి 9గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. సంచార జాతుల వారు రాజకీయంగా ఎదిగేందుకు టిడిపి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. చేనేత వర్గాల వారు కాంగ్రెస్ హయంలో ఆత్మహత్యలు చేసుకు౦టున్నారని, తమ హయంలో రాజికీయంగా న్యాయం చేసిన విషయం చంద్రబాబు వారికి గుర్తు చేశారు.