శంకర్రావుకి సంకెళ్లు తప్పవా?
posted on Oct 12, 2012 @ 3:47PM
కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావుకి కూడా త్వరలోనే కారాగారవాసం పట్టే యోగం కనిపిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరన్న పై ఉన్న అరెస్ట్ వారెంట్ లపై ఉన్న స్టేని హైకోర్ట్ ఎత్తేసింది. అల్వాల్ మునిసిపాలిటీ పరిధిలోఉన్న కనాజీగూడ గ్రామంలో 875 ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విషయంలో శంకరన్న చేతివాటం ప్రదర్శించే ప్రయత్నం చేశాడని ఆయనపై అభియోగం. గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ అసోసియేషన్ కి చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు శంకర్రావు ప్రయత్నించారంటూ గతంలో సైబారాబాద్ పోలీస్టేషన్ పరిధిలో ఆయనపై ఓ కేసు నమోదయ్యింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే నేరంపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. శంకర్రావు అప్పట్లో హైకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్ట్ పునఃసమీక్ష జరిపి వారెంట్ ని ఎత్తేయడంతో మాజీమంత్రివర్యులు శంకర్రావుని, ఆయన కొడుకు దయానంద్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. విచారణలో సహకరించకపోతే వెంటనే సైబారాబాద్ పోలీసులు వాళ్లని అరెస్ట్ చేయొచ్చు. ఈ కేసునుంచి బైటపడేందుకు శంకర్రావు సుప్రీంకోర్ట్ గడపతొక్కబోతున్నారని సమాచారం.