జగన్ జైల్లో ఎందుకున్నారో షర్మిల చెప్పాలి: యనమల
posted on Oct 12, 2012 @ 11:03AM
వైకాపా అధ్యక్షుడు జగన్ జైల్లో ఎందుకున్నారో షర్మిల రాష్ట్ర ప్రజలకు చెప్పాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. పాదయాత్రకు రిలే మహాప్రస్థానం పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. మూడు వేళ కిలోమీటర్లలో ఎవరెంత నడుస్తారో ప్రజలకు ముందు తెలియజేయాలని కోరారు. రిలే మహాప్రస్థానం ప్రజల కోస౦ కాదని తన అన్న జగన్ కోసమే అని ఆయన విమర్శించారు.
మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని సిబిఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ అన్నారు. కోర్టు ఆదేశం మేరకు వైయస్ జగన్ ఆస్తుల కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ఈ కేసులో విదేశాల నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారమే కేసులో అత్యంత ప్రధానమైందని ఆయన అన్నారు. దర్యాప్తు పలు కోణాల్లో జరుగుతోందని చెప్పారు. ఓ కేసులో ఇలాంటి దర్యాప్తు సాగడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.